గుఱ్ఱం జాషువాకు సమకాలికులైన వినుకొండ కవులలో బీర్నీడి మోషే గురించి ఇదివరలో కొంత వ్రాసాను. ఆయన కొడుకులు ముగ్గురూ కవులే. వాళ్ళు కృపా వరదానం , విద్వాన్ ప్రసన్న, విజయదత్తు.బీర్నీడి సోదరకవులుగా పేరు గన్న వీళ్ళను కన్నతల్లి సంతోషమ్మ. ఈ నెల వాళ్ళగురించి.
“ఏ కవుఁ గింట మిట్టిపడియెన్ గవితా లలితాంగి గాన వి
ద్య కలశాబ్ధి నీదే నెవఁడట్టి విశేష మనీషి కాంధ్ర భా
షా కవిత కళార్చనకుఁ జక్కగ మువ్వురు మమ్ముఁ గన్న మో
షే కవికంజలించి మఱి చెప్పెద మత్కృతినాధు వంశమున్”
పృథ్వీ భాగవతము కావ్యానికి కృతిస్కంధము అనే శీర్షికతో వ్రాసిన అవతారికలో ప్రసన్న కవి తండ్రి గురించి వ్రాసిన పద్యం ఇది. కవిత అనే స్త్రీ తండ్రి కౌగిట గర్వపడిందట. ఆయన సంగీత జ్ఞానం ఉన్నవాడు, హరికథలు చెప్పేవాడు కనుక గాన విద్య అనే సముద్రాన్నిఈదినవాడు అయినాడు. అటువంటి బుద్ధిమంతుడు, ప్రతిభావంతుడు తెలుగు కవితాకళార్చనకు తమ ముగ్గురు అన్నదమ్ములను కన్నాడని తండ్రి మోషే కవికి నమస్కరించాడు.
కవితా లతాంగిని కౌగిట బట్టిన మోషే కవి వ్రాసిన కావ్యాలు ఏవీ ఆయన బతికి ఉండగా అచ్చు కాలేదు. పృథ్వీ భాగవతము కావ్యానికి వ్రాసుకొన్న కృతజ్ఞతా వాక్యాలలో ప్రసన్న కవి రసవత్కావ్యాలు రచించిన తండ్రి దాతలను ఆశ్రయించి వాటిని అచ్చువేసుకొని పేరు ప్రఖ్యాతులు పొందలేకపోయాడని చెప్పుకొన్నాడు. అందుకనే కొడుకులు పూనుకొని శ్రీకృష్ణదేవరాయలు ప్రబంధరాజము అచ్చువేయించారు. అచ్చునకు సిద్ధంగా ఉన్నదని బీర్నీడి ప్రసన్నగారి పృద్వీగీతము కవర్ పేజీ వెనుక ప్రకటించబడింది. ఈ కావ్యం 1967 జనవరిలో వచ్చింది కనుక శ్రీకృష్ణదేవరాయలు ప్రబంధం కూడా 1967 లో వచ్చి ఉంటుంది. కానీ 1975 లో ప్రచురించబడిన బీర్నీడి విజయదత్తు కావ్యానికి ముందుమాట వ్రాసిన సికింద్రాబాద్ లోని ఆంధ్ర క్రైస్తవ కళాశాల ఆంధ్రాధ్యాపకులు ఆర్ ఆర్ సుందరరావు దానిని అముద్రితంగానే పేర్కొనటం ఆశ్చర్యం. అయన ఆ ముందు మాటలోనే మోషే కవి నవ సంధ్య , హరిజనాభ్యుదయం వంటి చారిత్రక సాంఘిక కథావస్తువులతో ప్రబంధాలు వ్రాసాడని పేర్కొన్నాడు. పరాశ్రయ కాంక్ష లేకపోవటం వల్ల, కవిత్వ కళను కులం మతం తో కొలిచే పిదపకాలంలో పుట్టటం వల్ల కవిగా గుర్తింపు పొందలేకపోయాడని అభిప్రాయపడ్డాడు.
మోషే కవికృత నవ సంధ్య గురించి ఇప్పటికి సమాచారం ఏమీ లభించటం లేదుకానీ హరిజనాభ్యుదయము 1969 లో ప్రచురించబడింది. విశ్వనాథ సత్యనారాయణ ఈ కావ్యానికి పీఠిక వ్రాసాడు.(15-12-1969) మోషే తనకు తెలుసునని , ఒక సారి వినుకొండ వెళ్ళినప్పుడు కలిసాడని , మంచి కవి, స్వతంత్రమైన వూహ శక్తి కలవాడూ అని మెచ్చుకున్నాడు. హరిజనాభ్యుదయము కావ్యములో చీకటి కేక , వెలుగు వాక అని రెండు భాగాలు ఉన్నాయని కావ్య పరిచయం మొదలు పెట్టాడు. మాల మాదిగలు తమ దురవస్థలను చెప్పుకొంటే బ్రహ్మ పెడచెవిన పెట్టాడని భరతమాత ప్రత్యక్షమై భవిష్యత్తులో మంచిరోజులు ఉన్నాయని ఊరడించింది అని కొనసాగించాడు. శివరాత్రి ఉత్సవాల సమయంలో ఒక మాదిగ దేవాలయ ప్రవేశము చేయబోతే బ్రాహ్మణులు కొట్టి వీధిలోకి నెట్టగా నడివీధిలో శవమైనాడని అతని భార్య ఏడుస్తుండగా గాంధీ వచ్చి బ్రాహ్మణుల నిర్ణయాన్ని , కృత్యాన్ని విమర్శిస్తూ ఉపన్యాసం చేసాడని, మాలమాదిగలను హరిజనులుగా పేర్కొని చేరదీయవలసినవాళ్ళని చెప్పాడని ఆ రకంగా వాళ్ళ సమస్య తీరిందనీ ఈ కావ్య కథా సారాన్ని పేర్కొన్నాడు విశ్వనాథ. “ చీరికలు పడ్డ కులము పుంజాల నతికి / ఐక్యమను బట్ట నేసె నీ యమర శిల్పి” అని మోషే కవి గాంధీని నుతించటం ఈ కావ్యానికి ముక్తాయింపు.
విశ్వనాథ పీఠికను బట్టి, చీకటి కేక అనే భాగంలో 150 పద్యాలు ఉన్నాయి. పిల్లి శాంసన్ 155 పద్యాలు అన్నాడు. వెలుగు రేక లో మరొక ఎనభై పద్యాలు ఉన్నట్లు శాంసన్ వ్రాసాడు. మాలమాదిగల ఇక్కట్లు మొదటి భాగంలో వర్ణితం, కష్టం చేసి పడుకొన్న పంచ ముడు బ్రహ్మ దగ్గరకు వెళ్లి తమ ఇక్కట్లను గురించి మొరపెట్టుకొనటం, సవర్ణుల తో సమానంగా దళితులను చూడటానికి విధిని నిర్ణయించటానికి సృష్టికర్త బ్రహ్మ నిరాకరించటం భరతమాత కనబడి మంచి రోజులు వస్తాయని చెప్పటం మొదలైన వాటి గురించి కలకంటాడు. మెలుకువ వచ్చేసరికి ‘కనబడదు మరేమి చిల్లి కంచము తక్కన్’ దేవాలయ ప్రవేశం , బ్రాహ్మణుల అకృత్యం గాంధీరాక,పంచములకు ‘హరిజనులు’ అన్న నామం ఇయ్యటం వెలుగు రేకలో కథ. అంటరాని తనం నేరమని, అది స్వరాజ్య సాధనకు అవరోధం అని గాంధీ 1921 నుండే మాట్లాడుతున్నప్పటికీ పంచములను హరిజనులు అన్న పేరుతో వ్యవహరించాలన్న ఆలోచన 1931 కి గానీ రాలేదు.( యంగ్ ఇండియా 6-8-31) అందువల్ల ఈ కావ్యం 1931తరువాత వ్రాయబడినదై ఉంటుంది. వినుకొండ గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపాల్ రాఘవయ్య ముందు మాటలో ఈ కావ్యం నాలుగు దశాబ్దాల క్రితం వ్రాయబడింది అని చెప్పినదానికి ఇంచుమించు సరిపోతుంది.
విశ్వనాథ హరిజనాభ్యుదయము కావ్య పీఠికలో కవిత్వంలో రెండు విషయాలు ఉంటాయని అన్నాడు. మొదటిది వస్తువు , కవి వూహ , కవి అభిమానము రెండవది భాష పలుకుబడి భాషలోని జాతీయత , శబ్దములను కూర్చుటలో కవి శక్తి , పాండిత్యం , శైలి . రెండవ దాన్ని బట్టే కవి మంచి కవియో, చెడ్డ కవియో నిర్ణయమౌతుందని తీర్మానించాడు. అనేక పద్యపాదాలను ఉటంకిస్తూ తెలుగు పలుకుబడి తెలిసిన కవి అని నిర్ధారణ చేసి చెప్పాడు. పద్యరచన చక్కగా తీర్చినట్లు ఉంటుందని మెచ్చుకున్నాడు. ‘కవితా విషయము వ్రాయుచు మఱి యొండు వ్రాయరాదు’ అంటూనే ఇంగ్లీషువారి భూమి పట్టా విధానం, పారిశ్రామిక విధానం మాలమాదిగలను వ్యవసాయానికి , చెప్పులు కుట్టటం, నేత నేయటం మొదలైన వృత్తులకు దూరం చేసిందని నిర్ధారించాడు. ఆ రకంగా కవి పంచముల దురవస్థకు కారణంగా సవరణ హిందూ సమాజం వైపు చూపిన వేలును వలస ఆర్ధిక విధానం వైపు తిప్పాడు. ( విశ్వనాథ అసంకలిత సాహిత్యం – పీఠికలు -1995,పుట 271-273)
ప్రసన్న కవికన్నా పెద్దవాడు కృపా వరదానకవి. ఆయన గురించి కానీ ఆయన కావ్యాల గురించి కానీ సమాచారం ఏమీ లభించటం లేదు. పృథ్వీ భాగవతము వెనక కవర్ పేజీపై పేర్కొనబడిన అచ్చునకు సిద్ధముగా నున్న గ్రంథములలో ‘ ఆంధ్ర మేఘ మాఘములు’ ఒకటి బీర్నీడి సోదర కవుల రచనగా పేర్కొనబడింది. సోదర కవులు అన్నప్పుడు ముగ్గురూ అనే . కనుక ఈ గ్రంథ కర్తృత్వంలో కృపావరదానకవికి భాగం ఉంది. సంస్కృతభాషలోని కాళిదాసు మేఘదూత కావ్యానికి , మాఘుడి శిశుపాలవధ కావ్యానికి చేసిన తెలుగు అనువాదాలు కలిపి వేయతలపెట్టిన గ్రంధం అయివుంటుంది. అపూర్వ కావ్య సంపుటి అనటం దానినే సూచిస్తుంది. 1967 లోనో 1968 లోనో ఇది అచ్చయి ఉండాలి. కానీ లభించటం లేదు.
ఇక బీర్నీడి ప్రసన్నకవి సంగతి. ఆయన ఎప్పుడు పుట్టాడన్న సమాచారం లభించలేదు. తమ్ముడు బీర్నీడి విజయదత్తు 1934 జనవరిలో పుట్టాడు. బీర్నీడి ప్రసన్న కనీసం అతనికన్న ఒకటి రెండు సంవత్సరాలైనా పెద్దవాడై ఉంటాడు కనుక ఒకటి రెండేళ్లు ముందువెనుకలుగా 1931- 1932 లలో ఆయన పుట్టి ఉంటాడు.విద్వాన్ పట్టా పొందారు. జూనియర్ కళాశాల అధ్యాపకుడు గా పనిచేశారు. కవిత్వరచన ఎప్పటి నుండి ప్రారంభించారో తెలియదు కానీ 1964 లో మధుమాసం కావ్యం ప్రచురించారు. నరసరావుపేట వాణీ ముద్రాక్షర శాల లో ముద్రించబడింది. ఈ కావ్యం లభించలేదు కానీ దానికి విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన విపుల పీఠిక లభించింది. అది 1964 మే 30 న వ్రాసినది. ( విశ్వనాథ అసంకలిత సాహిత్యం- పీఠికలు -1995,పుట 232-241) అది ఆ కావ్య స్వరూప స్వభావాలు తెలుసుకొనటానికి చక్కగా ఉపకరిస్తుంది.
మధుమాసము కావ్యం కృష్ణపక్షము శుక్లపక్షము అని రెండు భాగాలు. ఇందులో కథ ఒక స్త్రీ తాను పెళ్లిచేసుకోదలచిన యువకుడికి తనమీద ఉన్న ప్రేమను పరీక్షించటానికి అతని తల్లి శిరస్సును కోసి తెమ్మంటుంది. అందుకు అతను తిరస్కరించి వెళ్ళిపోవటం మొదటి భాగం కథ. మళ్ళీ కొన్నాళ్ళకు అతను ఆమె వద్దకు వెళతాడు. ఆమె మళ్ళీ అదే కోరింది పదును కత్తి ఇచ్చి పంపింది. పంపిన తరువాత అతనిని ఆ కార్యం నుండి మరలించాలన్న తలపు కలిగి బయలుదేరింది. పెద్ద గాలివీచి పడిపోయింది. ఏదో మృగం కొమ్ముతో డొక్కలో పొడిచింది. తల్లి తలను తీసుకొని వస్తున్న భర్తకు అతనిని పరీక్షచేయటానికి ఆ పని చేసానని చెప్పి మరణిస్తుంది. ఒక భోగపు పడచు తల్లి గుండెకాయ తెమ్మని ప్రియుడిని కోరగా అతనలాగే చేసినట్లు , తల్లిగుండె అతనితో ప్రేమ వాక్యాలు మాట్లాడినట్లు ఠాకూర్ వ్రాసిన ఒక కథ ను అది పోలివుందని విశ్వనాథ అతని సాహిత్య మిత్రబృందం అనుకొన్నారు. తనా కథ చదవకుండానే ప్రసన్న ఈ కావ్య కథను కల్పించానని చెప్పుకొన్నాడు. చంపినవాడు కొడుకే అయినా తల్లికి ఆ కొడుకు మీద ప్రేమ పోదు అన్నది రెండు కథలలో ఒక సార్వజనీన సత్యం అని చెప్తూ ఈ కథలో ఆంధ్రభాష అయిన తల్లిని చంపమన్నభార్య ఇంగ్లీషు భాష అని ఒక సూచన ఉందంటాడు విశ్వనాథ. నాయకుడు మాతృభక్తి పరాయణుడు అయినా ప్రేయసికి ఇచ్చిన మాట తప్పకూడదన్న విలువ కారణంగా ఘర్షణకు లోనైనాడని కూడా వ్యాఖ్యానించాడు. తల్లిని చంపిన వాడికి భార్యకూడా దక్కని కథాంశాన్ని పట్టుకొని మాతృభాష చనిపోతే ఆంగ్ల భాష అక్కరకురానిదే అంటాడు విశ్వనాథ. ఠాగూర్ కథ తీసుకొనే కవి దీనిని వ్రాశాడన్నా వట్టి బొమిక లాంటి ఆ కథను రక్తమాంసనాడీ రమణీయంగా చేసాడు కవి అని విశ్వనాథ అభిప్రాయపడ్డాడు.
ప్రసన్న పద్యరచనాశక్తి ని గురించి విశ్వనాథ విస్తృతంగా చర్చించాడు ఈ పీఠికలో. వర్ణనా సందర్భం లో ఉత్తమమైన పద్య రచనా శక్తి గోచరిస్తుంది అని విశ్వనాథ అభిప్రాయం. మొదటి భాగంలోని మొదటి పదిహేను మధుమాసవర్ణనా పద్యాలు కాగా రెండవ భాగం లోని మొదటి పందొమ్మిది శరత్కాల వెన్నెల వర్ణన పద్యాలు , కావ్యంలో అక్కడక్కడా వర్ణన ప్రధానమైన మరొక పది పద్యాలూ , వాగ్దాన భంగభీతిచేత కళవళ పడే నాయకుడు పూర్వ దాతలను ప్రశంసిస్తూ వ్రాసిన పది పద్యాలు ప్రసన్నకవి పద్యరచనాశక్తికి మచ్చు తునకలు అని పేర్కొన్నాడు. విడివిడి శబ్దాల కూర్పుచేత, చెప్పిన వాక్య పద్ధతి చేత , మాటలను పొదిగే సొబగు చేత ప్రసన్నకవి పద్యాన్ని ప్రకాశవంతం చేస్తాడని విశ్వనాథ సోదాహరణంగా వివరించాడు. సామాన్యభావాన్ని పూర్వులు చెప్పినదానినే విలక్షణంగా చెప్పటంలో కూడా కవి శక్తి కనబడుతుందంటూ మరికొన్ని పద్యాలనూ ప్రస్తావిస్తూ వివరించాడు. సౌకుమార్యము, వూహా శాలిత్వము, తెలుగునుడికారాల పోసాగింపు , అర్ధాంతర న్యాస అలంకారాల కూర్పు, గడుసు కల్పనలు ఇతని కవితా గుణాలని మెచ్చుకున్నాడు. ఈ పీఠికలో విశ్వనాథ కావ్యమున గల వ్యంగ్య సౌందర్యములు , పదప్రయోగ రచనా పాటవములు ప్రదర్శించి కావ్య కర్త మహాకవి అని నిరూపించాడని పృథ్వీ భాగవతము కావ్యానికి వ్రాసిన ముందుమాటలో దివాకర్ల వెంకటావధాని పేర్కొన్నాడు.
“కవిత్వము మేమే వ్రాయవలయును, మరెవ్వరు వ్రాయగలరు” అని ప్రసన్న తనతో అన్న మాటను ప్రస్తావించి విశ్వనాథ మేము అంటే ఒకటి హరిజనులు, మరొకటి అంతకు మించి మా తండ్రీ కొడుకులు అని అర్ధం చెప్పాడు. ప్రసన్న కవిత్వం చదువుతున్నప్పుడు తనాకా మాట నిజమే అనిపించింది అన్నాడు. ఈ కవిత్వం వ్రాసినందుకు కనకాభిషేకాలు అందుకోవలసిన వాడైనా అతని కులానికి ఆ సామర్ధ్యం లేదని , పరులనాశ్రయించి బ్రతుకవలసిన కులమైనది, కర్మ అంటే అదే అని అనటంలో , ‘ఒక సంస్కారముచేత నింతకవి యైనాడు, ఇంకొక సంస్కారముచేత నా కులమందు పుట్టినాడు’ అనటంలో కులం పూర్వకర్మ ఫలం అన్నభావమే ధ్వనిస్తుంది.
ఇక ప్రసన్న రెండవ కావ్యం ‘పృథ్వీ భాగవతము’ 1967 మార్చ్ లో నర్సరావుపేట శర్వాణీ ప్రెస్సులో ప్రచురించబడింది. సంయుక్తా పృథ్వీరాజుల కథ ఈ కావ్య వస్తువు. పృథ్వీరాజు 12 వ శతాబ్ది రెండవ అర్ధ భాగంలో ఉత్తర భారతదేశాన్ని అజ్మీర్ , ఢిల్లీ రాజధానులుగా పరిపాలించిన రాజపుత్ర వీరుడు. రాజపుత్ర రాజులందరినీ కూడగట్టి మహ్మద్ ఘోరీ దండయాత్రలను ఎదుర్కొని దేశంలోకి అతని ప్రవేశాన్ని అడ్డుకున్నాడు. కనోజ్ ను పరిపాలిస్తున్న జయచంద్రుడి కూతురు సంయుక్త అతనిని ప్రేమించింది. అది ఇష్టంలేని తండ్రి కూతురికి స్వయంవరం ఏర్పాటు చేసాడు. పృథ్వీరాజు కు కబురు పెట్టలేదు. పైగా అతని మట్టివిగ్రహం తయారుచేయించి ద్వార పాలకుడి స్థానంలో ఉంచాడు. సంయుక్త స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ వదిలి ద్వారపాలకుడి స్థానంలో ఉన్న పృథ్వీరాజు విగ్రహానికి వరమాల వేసింది. పృథ్వీరాజు ఆమెను ఎత్తుకొని వెళ్లి పెళ్లి చేసుకొన్నాడు. జయచంద్రుడు పృథ్వీరాజు పై పగ సాధించటానికి మహమ్మద్ ఘోరీకి సహాయం చేసి పృథ్వీరాజు ఓటమికి కారకుడయ్యాడు. ఇది రూఢి కి ఎక్కినచరిత్ర . దీనినే ప్రసన్నకవి కావ్యవస్తువుగా స్వీకరించాడు. ఒకవైపు ప్రేమ కథ కావటం , మరొకవైపు వీరచరిత్ర కావటం కావ్య వస్తువుగా స్వీకరించటానికి అనువైనాయి. దేశభక్తి ప్రబోధానికి కలిసి వచ్చిన అవకాశం అయింది. కొంత కల్పన చేసి పృథ్వీ భాగవతము కావ్యం వ్రాసాడు.
కృతి స్కంధము,స్వరూప స్కంధము, చిత్రస్కంధము, స్వయంవర స్కంధము, ప్రణయ స్కంధము, రణ స్కంధము, నిర్యాణ స్కంధము అనే ఏడు స్కంధాలు ఇందులో ఉన్నాయి. పృథ్వీరాజు చరిత్ర అనకుండా పృథ్వీ భాగవతము అని తన కావ్యానికి పేరుపెట్టుకొన్న కవి భాగవతంలో వలెనే కథను స్కంధాలుగా విభజించాడు. కవి దీనిని పృథ్వీ భాగవతము అనటానికి కారణాన్నిదివాకర్ల వెంకటావధాని కావ్యానికి వ్రాసిన ‘పరిచయము’ లో కథాంతర్గత ఆధారాలను బట్టి నిర్ధారించి చెప్పాడు.
“ నీ దేహంబునఁ బుట్టి నీకు వ్యధగా నీ దాయనర్చించు ప్ర
హ్లాద న్నన్ను క్షమించి మద్విభవ సౌఖ్యాకాంక్షివై తొంటి నీ
యౌదాసీన్యము నీ హిరణ్యకశిపు వ్యాపారముల్ మాని స
మ్మోదాంతంబగు నూతన భాగవతమున్ బొల్పించి బుల్పించుమా”
అని సంయుక్త తండ్రితో పలికిన పలుకులు ప్రస్తావిస్తూ సంయుక్త ప్రహ్లాదుడి వంటిదని పృథ్వీ రాజు సాక్షాత్ విష్ణువే అని, అతని గొప్పతనం సంయుక్త గ్రహించగలిగినట్లు గ్రహించలేకపోయిన ఆమె తండ్రి హిరణ్యకశ్యపుడి వంటివాడని కవి అభిప్రాయం అని అయన వివరించాడు. పృథ్వీ రాజు సంయుక్తను తీసుకొనిపోవటం శ్రీకృష్ణుడు రుక్మిణి తీసుకొని పోయినట్లుగా ఉందని, ఘోరీతో యుద్ధం లో సంయుక్త పృథ్వీ రాజు కు తోడ్పడటం నరకాసురుడితో యుద్ధంలో శ్రీకృషుడికి సత్యభామ తోడ్పాటు లాగానే ఉందని కూడా ఆయన అన్నాడు. కథా సంవిధానం రమ్యంగా ఉన్నదని , వర్ణనలు కొత్తపాతల మేలు కలయికగా ఉన్నాయని, భావనా బలం అడగడునా కనిపిస్తుందని, పాత్రపోషణ , వీర కరుణ శృంగార రస నిర్వహణ బాగున్నావని సోదాహరణంగా వివరిస్తూ వ్రాసిన పీఠిక ఇది. సత్యసూక్తి అనే శీర్షికతో ముద్దులపల్లి సత్యనారాయణ శాస్త్రి వ్రాసిన మరొక విపుల పీఠిక కూడా ఈ కావ్యానికి ఉంది. ఆయన నరసారావు పేట ఎస్ ఎస్ ఎన్ కళాశాలలో ఆంధ్రాధ్యాపకుడు. కవితా సదస్సులలో తన కవితలను విని అభినందించి ఆదరించిన మొదటివాడు ఆయనే అని ప్రసన్న కృతజ్ఞతను ప్రకటించాడు.
ఈ కావ్యాన్ని ప్రసన్న కవి విశ్వనాథ సత్యనారాయణకు అంకితం ఇచ్చాడు. మధుమాసం కావ్యానికి వ్రాయించుకొన్నట్లే ఈ కావ్యానికి కూడా ముందుమాట వ్రాయించుకొందామని విశ్వనాథను కలిస్తే అయన అంకితం తీసుకొనటానికి సిద్ధపడ్డాడట.ఆ వివరాలు ఈ కావ్యానికి అవతరికా ప్రాయం అయిన కృతి స్కంధం లో వర్ణించబడ్డాయి.సంప్రదాయ పద్య కావ్యాలలో అవతారిక లో దైవస్తుతి, గురుస్తుతి, పూర్వకవిస్తుతి, స్వీయ వంశవర్ణన, కావ్యాన్ని అంకితం తీసుకొంటున్న వాళ్ళ వంశవర్ణన కావ్యరచనా సంకల్పం మొదలైన అంశాలు ఉంటాయి. పృథ్వీ భాగవతములో మొదటి ఏడు పద్యాలలో సీతాదేవితో కూడిన రాముడు , లక్ష్మి, సరస్వతి, శివుడు, బెజవాడ కనకదుర్గ, వినుకొండ గుంటి ఆంజనేయులు స్తుతించబడ్డారు. అయితే ఈ స్తుతి పద్యాలు ఆయా దైవాలు కృతిపతి అయిన విశ్వనాథ సత్యనారాయణకు శుభములు కలిగించాలని కోరటంగా ఉంటాయి. ఆశీ రూపకమైన ఈ విధమైన దైవ ప్రార్ధన పద్ధతి నాటకం లో ఉంటుంది. అక్కడ నాందీ పద్యం ఒకటే ఉంటుంది. ఇక్కడ ఏడు పద్యాలు ఆ పద్ధతిలో ఒక ప్రయోగంగా వ్రాసాడు కవి.
వినాయకుడిని ఒక పద్యంలో స్తుతించి ప్రాచీనులలో తిక్కనను, కృష్ణదేవరాయలను స్తుతించాడు. కాశీనాధుని నాగేశ్వర రావు , నీలం వెంకట శేషయ్య మొదలైన పత్రికాధిపతులను, యన్సీ ఆంజనేయ ప్రసాద్ వంటి కవి మిత్రులను, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ని ప్రస్తావించి ప్రాసలు , యతులు అలంకారాలు , రసము అంటూ కావ్యాన్ని శల్య పరీక్షకు గురిచేసి తప్పులు పట్టె పద్ధతిని నిరసించాడు. కుకవులను తిరస్కరించాడు. తన తండ్రి మోషే కవికి నమస్కరించి 29 పద్యాలలో విశ్వనాథ వంశాన్ని , గుణాలను, సాహిత్యాన్ని ప్రస్తుతించాడు. గంటలోపలే కావ్యం చదివి శహ భాస్ అని మెచ్చుకొని “ “సర్వాంగ శృంగారమై/ పొంగుల్ వాఱెడు దేశభక్తి “ అని చెప్పి పుస్తకం అంటే ఇదే అన్నాడట విశ్వనాథ. “ పూర్వ జన్మ సంస్కార సంభూతమైన /యొక రసస్పృష్టి పల్కులం దొఱసికొనుట / నన్ను నీ కైతవలపించినది ప్రసన్న / యన్ని గుణములఁ దగు సమాహారమొప్పి” అని చెప్పి అంకితం కోరాడట. విశ్వనాథ తన కావ్యాన్ని స్వీకరించటం లో కలిగిన సంరంభంలో కూడా ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని మరిచిపోక పోవటం ప్రసన్న కవి ప్రత్యేకత. ‘నా వ్రాత సామాన్యమే’ అన్న ధిషణాహంకారం అందుకు గుర్తు.
పూర్వపు అసామాన్య విశిష్ట రీతిలో ప్రతి ఆశ్వాస ప్రారంభంలో కృతిస్వామిని సంబోధిస్తూ ఒకపద్యం, ఆశ్వాసం చివరిలో కృతిస్వామికి సంబంధించిన విషయాలతో షష్ఠ్యంత పద్యాలు ఉండే పద్ధతిలో కావ్యం తనకు అంకితం చేయమని అడిగాడట విశ్వనాథ. ప్రసన్నకవి ఆ రీతిగానే కావ్యం మొత్తం రచించాడు. కృతిస్కంధము లోని ఒక సీసపద్యంలో కవి విశ్వనాధ తురుష్క, క్రైస్తవ, పంచమ కవుల కృతులకు పీఠికలు వ్రాసాడని చెప్తూ గతంలో ఎఱుకు వాడైన ఏకలవ్యుడికి విద్య చెప్ప నిరాకరించిన నింద పోగొట్టుకొనటానికి ద్రోణుడే విశ్వనాథగా పుట్టి ఉంటాడని అని ఒక కారణాన్ని ఊహించాడు. లేకపోతే “వేరె తెగలపై గలుగుటెట్లు / నట్టి బ్రాహ్మణాగ్రణికి నేడిట్టి నెనరు? అని దానిని సమర్ధించుకొన్నాడు. ఆరు షష్ఠ్యంత పద్యాలలో విశ్వనాథ కులాన్ని, వంశాన్ని,దానశీలతను, దయా స్వభావాన్ని, సాహిత్య శక్తిని, దైవభక్తిని, దేశభక్తిని ప్రస్తుతిస్తూ “హరిజన కవ్యుపకారి” అనే మాటతో సంబోధించాడు. హరిజన కవులకు ఉపకారం చేసే వాడని అర్ధం. విశ్వనాథకు ఆ రకంగా ‘సకల విభవ పరంపరలు’ కలగాలని ఆశిస్తూ “ బుధనుత మతినై / నే గల్పించిన పృథ్వీ/ భాగవత కృతికి గథా వివర మెట్టిదనన్” అని 89 పద్యాలతో కృతిస్కంధం ముగించాడు.
స్వరూపస్కంధంలో పద్యాలు 82. ఇందులో షష్ఠ్యంత పద్యాలు మూడు. వేదజ్ఞాననిధి గా చెప్పటంతో పాటు విశ్వనాథను ‘హరిజన కవ్యుద్ధారక’ అని సంబోధించాడు.
ఇక్కడి నుండి ఆశ్వాసాంత గద్య కూడా ఉంది.” ఇది బీర్నీడి వంశ సంజాత సంతోష మోషే కవి తనూభవ ప్రసన్న కవి ప్రణీతంబయిన పృథ్వీ భాగవత ప్రబంధంబు నందు” అన్నతవరకు అన్ని స్కంధాలకు సమానమే. దానికి ఆయా స్కంధాల పేర్లను కలిపి చెప్పటమే ప్రత్యేకత.
చిత్ర స్కంధము లో పద్యాలు 102. విశ్వనాథను సంబోధించి కథ చెప్పటానికి ఉపక్రమిం చటం ఇక్కడి నుండి ప్రతి స్కంధములోఉంది.ఇందులోనూ షష్ఠ్యంత పద్యాలు మూడే. విశ్వనాథను కవన వీరుడిగా ప్రస్తుతించటం వీటి సారాంశం. స్వయంవర స్కంధములో పద్యాలు 108. షష్ఠ్యంత పద్యాలలో ‘ గద్యపద్యయుత దృశ్యశ్రవ్య ప్రపంచ వినిర్మాణ విధాతగా’ విశ్వనాథ కీర్తించబడ్డాడు. ప్రణయస్కంధములో పద్యాలు 91. షష్ఠ్యంత పద్యాలలో విశ్వనాథ వినూతన విశిష్ట ఆంగ్లాంధ్ర గీర్వాణ భాషా చాతుర్యం ప్రస్తావించబడింది. రణస్కంధములో పద్యాలు 86. నిర్యాణ స్కంధములో పద్యాలు 91. షష్ఠ్యంత పద్యాలలో విశ్వనాథను ‘దీనకవి లోకోచిత సహకార కార్య’ అని సంబోధించటం చూస్తాం. మొత్తం 739 పద్యాల కావ్యం పృథ్వీ భాగవతము.
స్వరూప స్కంధము వీర రసావతారులుగా ప్రసిద్ధికెక్కిన రాజ పుత్ర రాజుల వర్ణనతో మొదలుపెట్టి ప్రారంభంలోనే అనైక్యత వాళ్ళ స్వభావంగా స్థాపించి తరువాతి కథకు రంగం సిద్ధం చేసాడు కవి. భిన్న భిన్న చిన్న చిన్న రాజ్య పాలకుల మధ్య అనైక్యత భారతదేశాన్ని విదేశీ పాలకుల ప్రవేశానికి , ఆక్రమణకు కారణమైందన్నది జాతీయోద్యమ కాలపు భావన. జాతులమధ్య ఐక్యతను ప్రబోధించటం ఆనాటి రాజకీయ సాహిత్య సాంస్కృతిక కర్తవ్యాలు అయినాయి. పృథ్వీ భాగవతము స్వభావం రీత్యా జాతీయోద్యమ కాలపు కావ్యం అనిపిస్తుంది. “ దేవలోకమ్ము దాఁక కీర్తిగల సుతులఁ /గనియు నవతార పురుషుల గనియు సుంత /యైకమత్యమ్మునకు నోచుకోకపోయె /పేరికైనను భారత వీరమాత” వంటి పద్యాలు అలా అనిపింప చేస్తాయి. పృథ్వీ రాజు జయచంద్రుల మధ్య వైరం, పృథ్వీ రాజు సంయుక్తల మధ్య ప్రేమ, విరహం , జలక్రీడలు మొదలైన ప్రబంధ ఫక్కీ వర్ణన లతో ఈ స్కంధంలో కథ నడుస్తుంది.
చిత్ర స్కంధము అంతా సంయుక్తకు ఆంతరంగిక సఖి అయిన చిత్ర విచిత్ర కార్యకలాప కథనం. చిత్ర ప్రబంధాలలోని శుచిముఖి, మంజువాణి వంటి పాత్ర. కవి కల్పితం. సంయుక్త హృదయ గత ప్రేమను పృథ్వీ రాజుకు తెలియపరచటం, సంయుక్తపట్ల ఆయన హృదయంలోని ప్రేమను బహిర్గతం చేయించటం కథలో తరువాతి కదలికకు చోదకశక్తి కావటం చిత్ర చేసిన పని. భాగవతంలో రుక్మిణి సందేశాన్ని తీసుకొనిపోయిన అగ్నిద్యోతనుఁడు నిర్వహించిన పాత్ర ఈ కావ్యం లో చిత్ర నిర్వహించినట్లు వాచ్యంగానే చెప్పబడింది. అట్లే పృథ్వీ రాజును అభినవ కృష్ణుడుగా పేర్కొ నటం జరిగింది. ఇక సంయుక్త రుక్మిణి అన్నట్లే. ఆ రకంగా ఈ కావ్యాన్ని కవి భాగవత సమం చేసాడు.
స్వయంవర స్కంధము లో జయచంద్రుడు కూతురి స్వయంవరానికి పృథ్వీ రాజును ఆహ్వానించకపోవటమే గాక అతని మట్టిబొమ్మను చేసి ద్వారపాలకుడి స్థానంలో నిలబెడితే సంయుక్త ఆ మట్టివిగ్రహం మేడలో స్వయంవర మాల వేసి తన ధిక్కారాన్ని ప్రకటించింది. ఆ సందర్భంలో తండ్రీ కూతుళ్ళ మధ్య జరిగిన వాదంలో ‘ బిడ్డ సౌఖ్యమునకై పెండ్లియో !నీ మాట నడుపగా బేరమో?’ ఆలోచించమని సరైన ప్రశ్న ను తండ్రికి సవాలుగా విసిరిన సంయుక్త ముఖంగా “పుత్రులకు బితృభక్తియుఁ / బత్రికలకు భర్తృ భక్తి ముఖ్యం ..” అని, ఈడువచ్చినదాకనే ఆడుది ఈడది అవుతుంది , తండ్రి అదుపులో పుట్టింట ఉంటుంది , ఈడు వచ్చాక ఆడుది ఆడది అవుతూ భర్త అదుపులో అత్తింట ఉంటుంది అని చెప్పించటం 1967 నాటికి స్త్రీలు వేస్తున్న ప్రశ్నలను ఏవీ పట్టించుకోకపోవటమే అవుతుంది. ప్రణయ స్కంధము లో తండ్రి చెర నుండి విడిపించి పృథ్వీ రాజు తీసుకొనిపోయేటప్పుడు సహకరించిన చిత్ర స్నేహితురాలికి పతిభక్తిని బోధించటం గమనించ వచ్చు.
రణ స్కంధము లో దేశీయుడైన పృథ్వీ రాజును ఓడించటానికి పరదేశ పతిని రమ్మని లేఖ వ్రాసిన తండ్రితో మాట్లాడటానికి సంయుక్త మగవేషంలో వెళ్లినట్లుగా కల్పన చేసాడు కవి. తండ్రికి దేశీయుల మధ్య ఐకమత్యం అవసరాన్ని గురించి సుదీర్ఘ ఉపన్యాసం చేస్తుంది. “నీ హిరణ్యకశిపు వ్యాపారముల్ మాని సమ్మోదాంతంబగు నూతన భాగవతమున్” రచించమని కోరుతుంది. అయన వినకపోవటం యొక్క పర్యవసానం యుద్ధం. యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకొంటున్న వీరులు ప్రాణాలు పోతున్నందుకు కాక , ఐకమత్యం లేకపోవటం గురించి దుఃఖపడినట్లు కవి వ్రాస్తాడు. ఆ రకంగా ఈ కావ్యం ఆద్యంతాలను ఐకమత్యం గురించిన ఆకాంక్షా సూత్రం చేత నిబద్ధించటం, అట్లే భాగవతంలోని ప్రహ్లాద వృత్తాంతం, రుక్మిణీ కల్యాణ ఘట్టం రెండింటినీ కలిపి పృథ్వీ రాజు సంయుక్త జయచంద్రుడి మధ్య నడిచిన అభినవ భాగవతం అన్న స్ఫురణ కలిగిస్తూ కథను నడపటం ప్రసన్న కావ్య నిర్మాణ విలక్షణత. ఈ విలక్షణతే విశ్వనాథకు నచ్చి ఉంటుంది.
(ఇంకా ఉంది …)