బాల్యం బొమ్మ

కాళ్ళకు ఆకుల చెప్పులేసుకుని
చుర్రుమనే ఎండలకు అడ్డం పడి
బడికెళ్ళిన జ్ఞాపకం
తడిమే వాళ్ళెవరూ లేక
అలిగి.. మనసు మూలన కూర్చుంది

అర్ధరాత్రి నిద్ర మీదకి
హఠాత్తుగా దండెత్తిన వాన జల్లులు
నడిచొచ్చిన
పేదరికపు దారుల్ని
నీళ్ళు పోసి బతికిస్తూనే వున్నాయి

చేజారితే
భళ్ళున పగిలిపోయే మట్టిపలక
ప్రతి ముక్కమీదా
కన్నీటి బొమ్మా
కాసింత అలికిడికే తలెత్తి చూస్తోంది

అన్నకు బిగుతైపోతే
తమ్ముడికీ
తమ్ముడికి కురచైపోతే
చిన్న తమ్ముడి ఒంటిమీదకీ చేరిన
బట్టలపై
చెమట పరిమళం ఎంతగా చల్లినా
స్తోమతలేనితనం గుప్పుమంటూనే వుంది

రోజు మొలవక ముందే
కుటుంబం కోసం
రెండు కోడెద్దులయ్యే
నాన్న రెండు చేతులూ
నాన్న భుజాల్ని దాటి ఎదిగిన
అమ్మ రెక్కలూ
కళ్ళ ముందే కదలాడుతున్నాయి

గొప్పోళ్ళ కేనా
మ్యూజియం నిండా జ్ఞాపకాలుండేది?
నాలోనూ గుండె పట్టనన్ని
జ్ఞాపకాలు ఉన్నాయంటూ
నల్లముక్కు పెన్సిలొకటి
ఎంతో శ్రద్ధగా గీస్తోంది
నా బాల్యం బొమ్మను.

జననం: ఒంకులూరు, శ్రీకాకుళం జిల్లా. కవి, రచయిత, ఉపాధ్యాయుడు.  వివిధ పత్రికల్లో కవితలు, అభినయ గేయాలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

One thought on “బాల్యం బొమ్మ

  1. నల్ల ముక్కు పెన్సిల్

Leave a Reply