ఫిలిప్పీన్స్‌లోని పలావాన్ ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రాంతాల్లో ఒకటి. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, ప్రాచీన సముద్ర తీరాలు, గాఢ నీలి రంగు సముద్రజలాలతో విలసిల్లే పలావాన్‌ను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రకృతి ప్రేమికులు వస్తుంటారు.
ఫిలిప్పీన్స్‌లో అతి పెద్ద ప్రావిన్స్ పలావాన్ దట్టమైన అడవులు, ఎత్తయిన కొండలతో నిండి ఉంటుంది. నిజానికి చిన్నవీ, పెద్దవీ మొత్తం 1,780 దీవులతో కూడిన ఒక ద్వీపసమూహం ఇది. ప్రతి దీవికి తనదైన ఆకర్షణ, సౌందర్యం ఉంటాయి. ఈ ప్రావిన్స్ రాజధాని ప్యూర్టో ప్రిన్సెసా.
అయితే నేను అక్కడికి వెళ్లింది పర్యటన కోసం కాదు. బస్తర్ ప్రాంతంలోని ఓ చిన్న గ్రామానికి చెందిన నాకు ఫిలిప్పీన్స్‌కి రావాలనే అనూహ్యమైన ఆహ్వానం అందింది. అక్కడి మూలవాసుల కోసం పనిచేస్తున్న Asia Indigenous Peoples Network on Extractive Industries and Energy (AIPNEE) అనే సంస్థ నిర్వహించిన ఒక వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు నన్ను రమ్మని కోరారు. మొదట బస్తర్ నుంచి ఢిల్లీకి, ఆ తర్వాత ఢిల్లీ నుంచి మనీలా మీదుగా 2025 నవంబర్ 2న నేను ప్యూర్టో ప్రిన్సెసా నగరంలో అడుగు పెట్టేటప్పటికి ఉదయం ఏడు గంటలవుతోంది. సూర్యకాంతి ధగధగా వెలిగిపోతూ ఉంది. నిర్మలమైన నీలాకాశం, తేలికపాటి చలి… వాతావరణం ఎంతో హాయిగా అనిపించింది. విమానం ల్యాండింగ్‌కు కొద్దిసేపు ముందు కిటికీ నుంచి చూసినప్పుడే పై నుంచి ఆ దృశ్యం ఎంతో అద్భుతంగా అనిపించింది. చుట్టూ ముదురు నీలి రంగు సముద్రం, మధ్యలో పచ్చని పరుపులా పరుచుకుని ఉన్న నగరం! విమానాశ్రయంలో స్థానికుల కంటే విదేశీయులే ఎక్కువగా కనిపించారు. వారిలో ఎక్కువ మంది పర్యటకులే అనడంలో సందేహం లేదు.
బయటకి వచ్చాక రోడ్లన్నీ శుభ్రంగా, వెడల్పుగా కనిపించాయి. ట్రాఫిక్ పెద్దగా దాదాపు లేదు. చిన్న కార్లు, ట్రైసికిల్ రిక్షాలే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం నగరమంతా పచ్చదనంతో నిండిపోయి ఉంది. భవనాలన్నీ దూరదూరంగా విసిరేసినట్టుగా ఉన్నాయి. దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం, పొగతో నిండిపోయిన గాల్లోంచి ఈ నగరానికి వచ్చిన నాకు, ఇక్కడి స్వచ్ఛమైన గాలిని పీల్చడమే ఊపిరితిత్తులకు పెద్ద ఉపశమనంలా తోచింది.
ప్యూర్టో ప్రిన్సెసా నగరం.. 22,202 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న సబ్‌టెరేనియన్ రివర్ నేషనల్ పార్క్‌కి కూడా పేరుగాంచింది. అలాగే అది అడవులకు, వన్యప్రాణులకు ఆశ్రయస్థలం. ఈ పార్క్‌ను యునెస్కో 1999లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా, ప్రకృతి అద్భుతాల్లో ఒకటిగా ప్రకటించింది. ఇక్కడి ప్రాచీన సముద్ర తీరాలు, సున్నపు రాళ్ల గుహలు, వివిధ రకాల వన్యప్రాణులు ఇతర ఆకర్షణలు. ఎన్నో మూలవాసీ సముదాయాలు, చారిత్రక ప్రదేశాలతో కూడిన గొప్ప సాంస్కృతిక వారసత్వం ఈ నగరానికి ఉంది. స్వర్గం లాంటి ఈ నేల మీద బస్తర్ ప్రాంతంలోని ఆదివాసీల వంటి సాదాసీదా జీవితం గడిపే ప్రజలు కూడా ఉన్నారు. ఇక్కడి ఇండిజినస్ (మూలవాసీ) ప్రజల కథ కూడా దాదాపుగా మా కథ లాంటిదే. వీరి జీవితం కూడా మా జీవితంలాగే పోరాటాలతో నిండిపోయింది. వీరూ మా లాగే తమ జల్-జంగల్-జమీన్‌ను కాపాడుకోవడానికి పోరాడుతున్నారు. ఇక్కడ కూడా గనులు, పర్యటక పరిశ్రమ పేరుతో కార్పొరేట్ కంపెనీలు ప్రజల భూములను దోచుకున్నాయి.
మా వర్క్‌షాప్‌కు ఆసియా ఖండంలోని వివిధ దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. వారిలో కొందరు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి పోరాడుతున్నామని చెప్పారు. వారి ప్రభుత్వాలు వారిని మూలవాసులుగా గుర్తించడం లేదు. ఇక్కడి వచ్చిన వాళ్లందరి కథనాలు కూడా జల్-జంగల్-జమీన్‌తోనే ముడిపడి ఉన్నాయి.
మేము ప్యూర్టో ప్రిన్సెసా నుంచి 162 కిలోమీటర్ల దూరంలో, బరంగాయ్ సమీపంలోని మాసిన్ అనే గ్రామానికి వెళ్లాం. అక్కడ పలావాన్ ఆదివాసీ ప్రజలుంటారు. ఆ ప్రాంతంలో నికెల్ తవ్వకం జరుగుతోంది. లిథియం–అయాన్ బ్యాటరీల తయారీకి నికెల్ చాలా ముఖ్యమైన ముడి ఖనిజం. మేము ఆ మైనింగ్‌తో ప్రభావితులైన స్థానికులను కలిశాం.
నగరం నుంచి ఆ గ్రామానికి చేరుకోవడానికి మేము దట్టమైన అడవులను, కొండలను, నదులను దాటి వెళ్లాల్సి వచ్చింది. అనేక చిన్న, చిన్న గ్రామాలను దాటి అక్కడికి చేరుకున్నాం. ఈ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నప్పుడు నాకు బస్తర్‌లోని అబూజ్‌మాడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ గుర్తొచ్చాయి. పలావాన్ మూలవాసుల ఇళ్లు కూడా చిన్నవే. ఇళ్ల పైకప్పులు ఎక్కువగా రేకులు లేదా గడ్డితో కనిపించాయి. ఇళ్ల నిర్మాణంలో చెక్క, వెదురు వాడకం ఎక్కువ. వీళ్లు కూడా మధ్య భారత ఆదివాసీల్లాగానే ఉన్నారు.
ఇక్కడి ఆహారశైలిలో కూడా చాలా పోలికలు కనిపించాయి. బస్తర్ ఆదివాసీలు, ముఖ్యంగా నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో, వంటలో నూనె చాలా తక్కువ వాడతారు. ఇక్కడ కూడా నూనె వాడకం లేదు. కూరగాయలను ఉడకబెట్టి తింటారు. వరి అన్నం ప్రధాన ఆహారం. మా ప్రాంతంలో దొరికే చిన్న సైజు మిరపకాయ ఇక్కడ కూడా కనిపించింది. వరి గింజంత పరిమాణంలో ఉండే ఆ మిరపకాయను గోండీలో ‘చిచో మిరియా’ అని, ఛత్తీస్‌గఢీలో ‘ధాన్ మిరీ’ అంటారు.
మేము మాసిన్ గ్రామంలోని కమ్యూనిటీ హాల్‌కు చేరుకున్నాం. ఆ హాల్, భారతదేశపు ఆదివాసీ ప్రాంతాల్లో కనిపించే సాంప్రదాయిక సామూహిక నివాసంలా, అంటే బస్తర్ ప్రాంతంలోని గోటుల్ లేదా ఝార్ఖండ్ ప్రాంతంలోని ధుమ్కుడియాలా కనిపించింది. వెదురు, చెక్కతో నిర్మించిన ఒక పెద్ద హాల్ అది. పైకప్పుకు గడ్డికి బదులు రేకుల్ని వాడారు. నేల నుంచి పది, పన్నెండు అడుగుల ఎత్తులో లావాటి దూలాల ఆధారంగా ఒక మంచె లాంటిది నిర్మించారు. దానికి చుట్టూ వెదురు బద్దలతో మూసి ఉంది. పైకి ఎక్కడానికి కర్రలతో చేసిన మెట్లు ఉన్నాయి. లోపల వారి సాంప్రదాయ వాయిద్యాలున్నాయి. బస్తర్ ప్రాంతంలోని గోటుల్‌లో ఉండే విధంగానే, మేం డోల్ (నగారా), పర్రాయి, ఢప్లీ అని పిలిచేవన్నీ ఇక్కడ వేలాడుతున్నాయి. మాకు స్వాగతం పలుకుతూ పలావన్ మహిళలు సామూహిక నాట్యం చేశారు. మేమూ వారితో కలిశాం. దాన్ని చూస్తుంటే నాకు మా బస్తర్‌లోనే ఏదో ఒక గ్రామంలోని గోటుల్‌కు వచ్చినట్టు అనిపించింది.
ఈ గ్రామానికి కొద్ది దూరంలోనే నికెల్ మైనింగ్ జరుగుతోంది. రియో టుబా నికెల్ మైనింగ్ కార్పొరేషన్ (RTNMC)కు చెందిన ఈ గని పలావాన్ ప్రావిన్స్ దక్షిణ తీరంలోని బంతరాజా పట్టణంలోని బరంగాయ్ రియో టుబాలో ఉంది. గనుల ప్రదేశం చుట్టూ 48 మూలవాసీ సముదాయాలు ఉంటాయి. వీరిలో 11 సముదాయాలు ప్రభావిత ప్రాంతంలో నివసిస్తున్నాయి. ఈ ప్రజల ప్రధాన జీవనోపాధి వ్యవసాయం, చేపల వేట.
నికెల్ గనుల తవ్వకం దుష్ప్రభావాలను ఇక్కడి పలావాన్ మూలవాసులు, ఇతర సముదాయాలు చాలా కాలంగా చవి చూస్తున్నారు. వీరి అడవులు నాశనం అవుతున్నాయి. జీవనోపాధులు నశిస్తున్నాయి. వీరి నదులన్నీ కాలుష్యంతో నిండిపోతున్నాయి. గనుల్లోంచి వచ్చే కలుషిత నీరు సముద్రాన్ని కూడా కాలుష్యంతో నింపేస్తోంది. గనుల తవ్వకం, అడవుల నరికివేత ఈ ప్రాంత జీవ వైవిధ్యానికి పెద్ద ముప్పుగా మారాయి. పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోంది.
ప్రజలు చెబుతున్న దాని ప్రకారం, మైనింగ్ కారణంగా ఆరోగ్య సమస్యలు పెరిగాయి. నీటి నాణ్యత క్షీణించింది. అనేక తాగునీటి వనరులు ఇప్పుడు ఎరుపు, గోధుమ రంగులోకి మారాయి. దీంతో చేపల వేట ప్రభావితమైంది. పంట దిగుబడి తగ్గింది. గనుల దగ్గర నుంచి వచ్చే నీరు సముద్రంలో కలిసే చోట మేము ప్రత్యక్షంగా చూశాం. అక్కడి సముద్రపు నీరంతా ఎరుపు, గోధుమ రంగుల్లోకి మారింది. స్వర్గంలా కనిపించే ఆ అందమైన ప్రాంతానికున్న ఈ వికృత పార్శ్వాన్ని మేం మా కళ్లతో చూశాం.
గనుల తవ్వకానికి వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు చాలాకాలం నుంచి పోరాడుతున్నప్పటికీ, వారి మాటలను ఎవరూ వినడం లేదు. సరిగ్గా భారతదేశంలో లాగే. బహుశా ప్రపంచమంతా ఈ పరిస్థితేనేమో.
ఫిలిప్పీన్స్ ప్రపంచంలో రెండో అతిపెద్ద నికెల్ ఉత్పత్తిదారు. అతిపెద్ద ఎగుమతిదారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న ఈ ఖనిజాన్ని ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలలో ఉపయోగిస్తారు. పలావాన్‌లో పదకొండు యాక్టివ్ మైన్స్ ఉన్నాయి. వీటిలో మూడు భారీ నికెల్ గనులు నాలుగు పట్టణాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ మరికొన్ని కొత్త గనులు ప్రారంభించాలనే ప్రణాళికలు కూడా ఉన్నాయి. కానీ కంపెనీలకు స్థానిక ప్రభుత్వాల నుంచి అవసరమైన అనుమతులు లభించడం లేదు.
పలావాన్ దీవిలోని బ్రూక్స్ పాయింట్ నుంచి మేయర్‌గా ఎన్నికైన మేరీ జీన్ ఫెలిసియానో, ఇక్కడి ఆదివాసీలకు మద్దతుగా నిలిచినందుకు తన పదవిని కోల్పోయారు. ఫెలిసియానో మాతో పాటు మాసిన్ గ్రామానికి వచ్చారు. మే 2017లో బ్రూక్స్ పాయింట్ మున్సిపాలిటీ ప్రభుత్వం తవ్వకాలు నిలిపివేయాలని మైనింగ్ కంపెనీని ఆదేశించిందని ఆమె మాకు చెప్పారు. ఆ తర్వాత మేయర్ హోదాలో ఆమెకు దక్కే సౌకర్యాలన్నీ నిలిపివేశారు. ఫెలిసియానో చెప్పిన ప్రకారం, కంపెనీ దాదాపు 7,000 చెట్లు నరకడంతో, స్థానిక ప్రజల ఫిర్యాదుపై స్పందిస్తూ ఆమె ఆ ఆదేశం ఇచ్చారు. ప్రజలతో కలిసి మైనింగ్ సైట్‌కు మూడు సార్లు వెళ్లాలని ఆమె ప్రయత్నించినా వెళ్లకుండా అడ్డుకున్నారు.
అంతే కాకుండా, ఆమె తన పదవిని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు మైనింగ్ కంపెనీ ఆమెపై మోపింది. దాంతో 2021లో ఆమెను సస్పెండ్ చేశారు.
ఒక సంవత్సరం పాటు వేతనం లేని సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ తాను వెనక్కి తగ్గలేదని ఆమె మాతో చెప్పారు. “సస్పెన్షన్ సమయంలో నేను మళ్లీ న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించాను. ప్రజలతో కలిసి మైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాడాను” అని ఆమె అన్నారు. నేటికీ ఫెలిసియానో జల్-జంగల్-జమీన్ రక్షణ కోసం ప్రజల వైపే నిలబడ్డారు.
వర్క్‌షాప్ ముగిసిన తర్వాత, నేను బయల్దేరాల్సిన రోజు నాకు కొద్ది గంటల సమయం దొరికింది. దాంతో కొద్దిసేపు ప్యూర్టో ప్రిన్సెసా నగరంలో తిరగాలనుకున్నా. ఒక ట్రైసికిల్ డ్రైవర్‌తో మాట్లాడాను. ఆయన మొదట నాకు బటర్‌ఫ్లై ఈకో గార్డెన్–ట్రైబల్ విలేజ్ చూపించాడు. 60 పెసోలు (ఫిలిప్పీన్స్ కరెన్సీ) చెల్లించి లోపలికి వెళ్లాను. అక్కడ విదేశీ పర్యటకుల భారీ రద్దీ కనిపించింది. లోపలికెళ్లగానే అక్కడ ఆదివాసీ సంస్కృతికి సంబంధించిన అనేక చిత్రాలు, కళాకృతులు కనిపించాయి. మమ్మల్ని ఒక సన్నని మార్గం గుండా నడిపించి ఒక ఓపెన్ హాల్‌కి తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే అనేక విదేశీ పర్యటకులు కూర్చుని ఉన్నారు. ఆ హాల్ వెనుక ప్రదర్శన కోసం పలావాన్ ఆదివాసుల ఇళ్లు నిర్మించారు. ఆ ఇళ్ల ముందు ఆదివాసీ వేషధారణలో ఉన్న పిల్లలు, మహిళలు, పురుషులు పర్యటకుల వినోదం కోసం రకరకాల హావభావాలు ప్రదర్శిస్తున్నారు.
ఒక వ్యక్తి ఇంగ్లిష్‌లో విదేశీయులకు వారి చరిత్ర, జీవనపద్ధతుల గురించి చెప్తున్నాడు. అతనితో కలిసి ఆదివాసీ దుస్తులు వేసుకున్న పురుషులు, మహిళలు సంప్రదాయ ఆచారాలను, పనులను చేసి చూపిస్తున్నారు. ఉదాహరణకు, వారి వేట గురించి చెప్పినప్పుడు వారు సంప్రదాయ బల్లెం, బాణాలతో వేట చేస్తున్నట్టు అభినయిస్తున్నారు. వారి కమ్యూనికేషన్ పద్ధతుల గురించి చెప్పినప్పుడు వారు జంతువుల, పక్షుల శబ్దాలను వినిపిస్తున్నారు. నిప్పు మండించే పద్ధతి గురించి చెప్పినప్పుడు చెకుముక రాళ్లు, వెదురు కర్రలను రాకి నిప్పు రాజేస్తున్నారు. వారి నాట్యం, సంగీత రీతుల గురించి చెప్పినప్పుడు వాటిని నటించి చూపిస్తున్నారు. వివిధ రకాల వెదురు, చెక్క వాయిద్యాలను వాయిస్తున్నారు. చివరగా, విదేశీ పర్యటకులు ప్రదర్శన కోసం నిర్మించిన ఇళ్ల ముందు నిలబడి వారితో ఫోటోలు దిగుతున్నారు. అలా, వారిని సాటి మనుషులుగా కాకుండా, అడవుల్లోని వింత జీవుల్లా చూస్తున్నారు.
ఇదంతా నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే భారతదేశంలో కూడా ఆదివాసులు, వారి సంస్కృతి చాలా కాలం కిందే మ్యూజియాల్లో ప్రదర్శన వస్తువులుగా మారిపోయాయి. రెండు సంవత్సరాల కింద నేను ఆంధ్రప్రదేశ్‌లో అరకు లోయకు వెళ్లినపుడు అక్కడి ఆదివాసీ మ్యూజియం చూశాను. అక్కడ కూడా ఆదివాసులను షో–పీస్‌లుగా ప్రదర్శిస్తారు. పర్యటకులు కొంత డబ్బు చెల్లించి అక్కడి ఆదివాసీ మహిళలతో ధింసా నృత్యం చేస్తారు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దాదాపు 250 ఎకరాల భూమి విస్తరించిన ఒక మ్యూజియం ఉంది. అక్కడ దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసుల సంస్కృతిని, వేట, ఉత్పత్తి పద్ధతులను ప్రదర్శనకు ఉంచారు. రాయ్‌పూర్ విమానాశ్రయంలో కూడా బస్తర్ ఆదివాసుల ఆకృతులు కనిపిస్తాయి. ఏ రాజకీయ నాయకుడు ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించినా, వారి స్వాగతం కోసం అక్కడికి ఆదివాసీలను తీసుకొచ్చి, వారితో సంప్రదాయ వేషధారణలో నాట్యం చేయిస్తారు.
ఇదంతా చూసినపుడు.. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, కార్పొరేట్ కంపెనీలు ఆదివాసులను లేదా ఇండిజినస్ సముదాయాలను వారి జల్-జంగల్-జమీన్ నుంచి బేదఖలు చేయడానికి దాదాపు ఒకే రకమైన మోసకారీ, అణచివేత పద్ధతులను ప్రయత్నిస్తున్నాయి కదా అనిపించింది. ఓ రకంగా చెప్పాలంటే అలా అవి వారి అస్తిత్వాన్నే చెరిపివేయాలని చూస్తున్నాయి. వారి భాష, సంస్కృతి, ఆచారాలు అన్నింటినీ ప్రమాదంలో పడేస్తున్నాయి. అదే సమయంలో, ప్రజల వినోదం పేరుతో అదే మూలవాసుల జీవితం, సంస్కృతి, ఆచారవ్యవహరాల్లోని అంశాలను ప్రదర్శన వస్తువులుగా మార్చి, నగరాల్లోని మ్యూజియాల్లో పెట్టడం కూడా ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒకే రకంగా సాగిపోతోంది!
ఈ బటర్‌ఫ్లై ఈకో గార్డెన్–ట్రైబల్ విలేజ్ నుంచి 162 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలావాన్ మూలవాసుల మాసిన్ గ్రామంలో, దాని చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలు తమ భూములను, నీటిని, పంటలను రక్షించుకోవడానికి పోరాడుతున్నారు. కానీ ఇక్కడ ఈ మ్యూజియంలో మాత్రం.. వారి వాస్తవ పోరాటాల గురించి ఏ మాత్రం తెలియని లేదా వాటితో ఏ పట్టింపూ లేని విదేశీ పర్యటకులు మూలవాసుల కృత్రిమ ఇళ్లను, వారి నాట్య–సంగీత రీతుల అభినయాలను చూసి మురిసిపోతున్నారు. వారితో సెల్ఫీలు దిగుతున్నారు!
(మొదట ‘ద వైర్’లో వచ్చిన ఈ వ్యాసానికి తెలుగు అనువాదం: సాక్షి)
(Asia Indigenous Peoples Network on Extractive Industries and Energy ఆహ్వానం మేరకు రచయిత ఫిలిప్పీన్స్‌లో పర్యటించారు.)
Original link:
https://thewirehindi.com/316530/from-bastar-to-the-philippines-the-same-beautiful-forests-and-the-same-tribal-struggles/