బదిలీ

అప్పుడెప్పుడో
ఓడ తీరం దాటినట్టు
ఊరు దాటిన
నేల చిటికెన వేలు పట్టుకుని
నీటిజాడ రక్తంలో నింపుకొని
గాలినలా దూరంచేసి

ఊర్లకు ఊళ్లు
ఎగురుతూనే ఉన్నాను

పుట్టిన ఊరి మధ్యలో నిల్చున్న
పెద్ద వేప చెట్టు గుర్తుకొస్తుంది
అక్కడ కూర్చున్న
మనుషులు వినిపిస్తారు
అది పాలు తాగిన నేల
మొదట కాళ్లు తాకిన మట్టి

పొలాలు జ్ఞప్తికొస్తాయి
బంగారు గొలుసు లాంటి
వడ్ల గింజలు పలకరిస్తాయి
పురిటి వాసన
తిరుగుతూనే ఉంటది

నులకమంచం అల్లుతున్న
పెద్దయ్య పెద్దమ్మ
ఎటుపోయారో
తెలియడం లేదు

రోలు, రోకలి మాటలు వింటున్న
ముసలమ్మ కనిపించడం లేదు
కిటికీలు కంటి ముందు
కనిపిస్తూ ఉంటాయ్
ఊరు నుండి
చాలా దూరం వచ్చేసాను

అక్కడ ఉండే వెన్నెల
ఇక్కడ కూడా ఉంది
ఉదయం ,సాయంకాలం
ఎండా వానా ఋతువు
అన్నీ ఉన్నాయ్

ఎండుగడ్డి వాసన కావాలి
మా ఊరి
మంచినీళ్లబావి
నీరు తాగాలి
చిట్టచివరి రైలు ఎక్కి
కిటికీ పక్కనే కూర్చోవాలి

పుట్టింది నెల్లూరు జిల్లా, ఓజిలి, రాచపాలెం. కాకినాడలోని పిఠాపురం రాజా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధిపతి. 'నీటిపూలవాన', 'గోరువంకల గానం' అనే రెండు పిల్లల కవితా సంకలనాలు వేశారు. ఎక్సరే, తానా, రంజని, కుందుర్తి వంటి పురస్కారాలు పొంది ఉన్నారు. రాధేయ కవితా పురస్కార నిర్వాహకులలో ఒకరు.

11 thoughts on “బదిలీ

  1. దేశ దిమ్మరుల దేవులాట …..సహజత్వం మీ కవితా లక్షణం

  2. మీ కవితా సౌరభం నా గుండెను మెత్తగా హత్తుకుంటున్నది…

  3. గురువుగారు మీ ఈ గొప్ప కావ్యానికి శతకోటి వందనాలు🙏🙏🙏

  4. ఇంకా ఇలాంటివి ఎన్నో మహా అద్భుతమైన రచనలు చేయాలని కోరుకుంటున్నాం…… గురువుగారు 🙏

  5. కోల్పోయిన జ్ణాపకాలు మీ కవితలో తచ్చాడుతున్నాయి.

  6. స్పందించిన అందరికి ధన్యవాదాలు సార్

Leave a Reply