జలమ్మ చేస్తున్న పని ఆపి చేతిలో కొంకితోనే గబగబా తుమ్మచెట్టు దగ్గరున్న బిడ్డ దగ్గరకు చేరుకుంది. ఓ చేత్తో బిడ్డను అందుకుంటూనే మరో చేత్తో కొంకిని చెట్టుకు తగిలించింది.
తల్లి స్పర్శ తగలగానే ఆ పసి బిడ్డ ఏడుపాపి తల్లికేసి చూసింది బోసినవ్వులతో విప్పారిన మొహంలో తెచ్చిపెట్టుకున్న అలక.
నన్నొదిలి నువ్వెక్కడికెళ్లావ్ అన్నట్లుగా ఆ తల్లి బిడ్డను గట్టిగా గుండెలకదుముకుంది. బిడ్డ పాలకోసం తడుముకుంటూ బిగ్గరగా అరిచింది. తొందర పెట్టింది అక్కడే చతికిలబడ్డ జలమ్మ బిడ్డకు కొంగుకప్పి స్తన్యం అందించింది.
అదంతా చూస్తున్న కళావతి “అమ్మా నాకు చెల్లెనన్న, తమ్ముడన్న కావాల్నే ” గోముగా అన్నది తల్లి దగ్గొరకొచ్చి ఆమె చేయి పట్టుకొని
కళావతికి అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఎవరూ లేరు. ఒక్కతే కూతురు.
సుశీలమ్మ కళావతి మాటలకు ఫక్కున నవ్వింది
అదేమీ వినిపించుకోనట్టే “ఓ పోరి. నడు.” అంటూ కూతురు రెక్కపట్టుకుని లాక్కుపోయింది చిన్నమ్మ.
పాటలు పాడుకుంటూ కలసి పని చేయడంలోని సౌందర్యాన్ని అనుభవిస్తున్న వాళ్ళను చూస్తే చిన్నమ్మకు చాలా అసూయగా ఉంది.
గతంలో చాలా సార్లు సంఘంలో చేరమని ఆమెను అడిగారు. అప్పుడామె ఒప్పుకోలేదు సంఘంలో ఉన్న వాళ్ళని చాలా తక్కువ చేసి మాట్లాడింది ఎప్పుడూ ఏదో ఒక మీటింగ్ అంటూ ఇల్లూవాకిలి వదిలి తిరుగుతారు. తిరుగుపోతులంటూ నిందలేసింది. చిన్నచూపు చూసింది.
అందుకే ఇప్పుడు సంఘంలో చేరాలన్న కోరిక ఉన్నా అది వాళ్ళముందు వ్యక్తపరచలేకపోతున్నది. నోరు తెరిచి అడగలేకపోతున్నది.
సంఘం స్త్రీలు తన ఎకరం భూమి పక్కనే ఉన్న భూమిని కౌలుకు తీసుకున్నారని తెల్సిన తర్వాతే భర్తతో గొడవపడి పోరి బీడుపడి ఉన్న నేలను దున్నిపిచ్చింది. జొన్నలు వేసింది
చేన్లలో కలుపు తీసేటప్పుడు జాగ్రత్తగా తీస్తున్నారు వేసిన విత్తులే కాకుండా అనుకోని అతిథుల్లా మొలుసుకొచ్చిన తెల్ల గరిజ, ఎర్ర గరిజ కూర, దొగ్గలికూర, పిండి కూర, తుమ్మికూర వంటి రకరకాల ఆకు కూరల్ని తమ ఇంటికోసం ఏరుకుంటూ నడుముకు చుట్టిన కొంగు మడతల్లో పెడుతున్నారు
ఇంటికి వెళ్ళేటప్పుడు దార్లో కనిపించిన ఎండుపుల్లలు వంటకోసం ఏరుకొని మోపులు కట్టుకుని నెత్తిన పెట్టుకుపోతున్నారు వాటితో పాటు ఉదయం వచ్చేటప్పుడు తమ వెంట తీసుకొచ్చిన పిల్లల్ని చంకనేసుకునో, చేతపట్టుకునో గూటికి పోతున్నారు. అయినా వారికిప్పుడు అలసట తెలియడంలేదు
ఒకరొకరుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక్కటిగా పనిచేసుకుంటున్నారు. అది వాళ్లలో గొప్ప శక్తిని నింపుతున్నది.
వంతుల వారీగా వెళ్లి కలుపుతీస్తున్నారు చీడపీడలు ఏమైనా వచ్చాయేమోనని పరీక్షిస్తున్నారు మంచెవేసి పిట్టలకు కాపు కాస్తున్నారు రాత్రి పూట అడవిపందులొచ్చి పాడుచేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అనేక చేతుల అనేక స్వరాల ఉత్పత్తి పర్వాలేదు బాగానే వచ్చింది మూడుపూటలా తిండి కాదు కానీ ఒకపుటకైనా ఆరోగ్యకరమైన తిండి దొరికే పరిస్థితికి వచ్చినందుకు సంఘం పెద్దలు అభినందించారు. అది ఈ చిన్న మహిళలకు కొండెక్కినంత సంబరాన్నిచ్చింది.
తల్లులతోపాటే చేన్లకు పిల్లలను రోజు తీసుకెళ్లడం తల్లులకు ఇబ్బందిగానే ఉంది.
తల్లులు పనులలో ఉంటె పిల్లలు దెబ్బలు తగిలించుకోవడం, మట్టి తినడం చేస్తున్నారు. వాళ్ళ లేత శరీరాలకు ముళ్ళు గీరుకుపోతున్నాయి. కాళ్లలో గుచ్చుకుంటున్నాయి. అంతే కాకుండా చీమలు, తేళ్లు, జెర్రులు వంటి పురుగూ పుట్రా నుండీ కూడా కాపాడుకోవాలి. ఈ సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలో వాళ్ళకి అర్ధం కాలేదు.
ఈ విషయమే తమ గుంపు మీటింగ్ లో చర్చ చేసారు. ఆ తర్వాత సంఘం మీటింగ్ లో విషయాన్ని పెట్టారు.
అప్పటికే సంఘం పెద్దలు కూడా ఈ సమస్యని గుర్తించారు.
అందరూ వివిధ దఫాలుగా చర్చలు చేసిన తర్వాత తమ గ్రామాల్లో పిల్లలకోసం ఒక సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయానికొచ్చారు. అక్కడ ఆరునెలల నుండి ఏడేళ్ల పిల్లల వరకూ ఉండే ఏర్పాట్లు చేయాలని నిర్ణయం చేసుకున్నారు.
అలా సంఘం పని చేస్తున్న గ్రామాల్లో బాల్వాడి మొదలైంది.
అంతవరకూ తల్లి కొంగుపట్టుకు తిరిగిన ఏడేళ్లలోపు పిల్లలంతా బాల్వాడికి వెళ్లడం మొదలుపెట్టారు. మొదట్లో తమ చంటి పిల్లల్ని వదిలి వెళ్ళడానికి తల్లులు చాలా బెంగపడ్డారు, భయపడ్డారు నెమ్మదిగా అలవాటు పడ్డారు.
ఇప్పుడు తల్లులు పిల్లల్ని చంకనేసుకుని పనికిపోయే తిప్పలు తప్పిపోయాయి బాల్వాడి వయసుకన్నా పెద్దపిల్లలు ఇంట్లో ఉంటె వాళ్ళు చంకలో ఉండే చంటి పిల్లల్ని చూసుకుంటున్నారు లేదా తల్లులతో పాటే వెళ్లి తామూ పనీ పాట నేర్చుకుంటున్నారు.
మొగులమ్మ పెద్ద కూతురు పూలమ్మ చెల్లెను పెద్ద తమ్ముడిని బాల్వాడిలో వదిలేది. చిన్న తమ్ముడిని కూడా వదలమంటే వదలకుండా మొదట్లో చంకనేసుకుని తిరిగేది. ఆ తర్వాతర్వాత ఆ పిల్లాడిని కూడా అక్కడే వదిలేసేది తాను కూడా అక్కడే తచ్చాడుతూ ఉండేది.
పిల్లల ఏడ్పు విన్పిస్తే చాలు తన తమ్ముడేమోనని అటు పరిగెత్తెది. లేదంటే చెల్లి తమ్ముడు కూర్చున్న గది ముందు కిటికీలోంచి వాళ్ళను చూస్తునో, గడప దగ్గర నుంచుని లోపలికి తొంగి చూస్తునో ఉండేది.
బాల్వాడిలో పిల్లలకు నేర్పే వన్నీ తాను కూడా నేర్చుకునేది ఆ పిల్లల్ని ఆడిస్తుంటే తాను కూడా వాళ్ళతో కల్సి ఆడేది. బాల్వాడి పిల్లలకు పెట్టే ఆహరం చాలాసార్లు పూలమ్మకు కూడా పెట్టేవారు అక్కడి టీచర్. రూతమ్మ వండి పెట్టే తిండి అంటే పూలమ్మకెంతో ఇష్టం అందుకే బాల్వాడికి తమ్ముడు చెల్లెలు కంటే ముందు తాను సిద్దమయిపోయేది
** **
ఒక రోజు పొత్తికడుపు నొప్పితో మొగులమ్మ తీవ్రంగా బాధపడుతున్నది.
“మొగులా. పొద్దుమీకి బైండ్లోడు ఎల్లమ్మ కత జెప్తడట. పోదవాయే. ” తన దొడ్లో ఏదో పని చేసుకుంటూ అడిగింది సంతోషమ్మ.
మొగులమ్మ నుంచి జవాబు లేదు.
మళ్ళీ “మొగులా. మొగులా. ” అంటూ కేకేసింది.
అవతలివైపు నుండి ఎటువంటి జవాబూ లేదు.
ఏమైంది దీనికి సప్పుడు చెయ్యట్లేదనుకుంది సంతోషమ్మ.
పిల్లలు బాల్వాడికి వెళ్ళేటప్పుడు కూడా మొగులమ్మ కనిపించలేదు. మంచినీళ్ల కడవ తీస్కొని మంచినీటి బావి దగ్గరకు పోయిందేమో అనుకుంది. కొద్దిసేపాగి సంతోషమ్మ మొగులమ్మ ఇంటికొచ్చింది. ఇంటి ముందు తడక తలుపు బార్లా తెరిచే ఉంది అయ్యో. తలుపు వెయ్యకుండానే పిల్లలు బాల్వాడికి పోయినట్టున్నారు. గిన్నెలో ఉన్న బువ్వనో, గట్కనో కుక్క తినిపోతుందేమో అనుకుంటూ దగ్గరకు వెళ్లి తడక పెట్టబోయింది.
అప్పుడు వినిపించింది సన్నగా మూలిగిన శబ్దం.
గబగబా లోపలి నడిచింది సంతోషమ్మ.
పొత్తికడుపు నొప్పి తట్టుకోలేక పొట్టను పట్టుకొని లుంగచుట్టుకుపోతున్నది మొగులమ్మ. ఓ మూలకు ఈతాకుల చాపమీద అట్లా బాధపడుతున్న మొగులమ్మను చూసి సంతోషమ్మ మనసు విలవిలలాడింది.
“అయ్యో. మొగులా. ఏమయినదే.” గాభరా పడుతూ మొగులమ్మ చెయ్యి పట్టుకుంది.
“అప్పుడోపారి ఇప్పుడో పారి గిట్లనే కడుపుల నొస్తుండే.. ఈ పొద్దు నొప్పి వశంగాకొచ్చింది. మా లెస్స నొయ్యవట్టిందే సిన్నీ. ” సుడులు తిరుగుతున్న బాధను ఓర్చుకోవడానికి ప్రయత్నిస్తూ జవాబిచ్చింది మొగులమ్మ.
ఎంత బాధనైనా కడుపులో పెట్టుకుని తిరిగే మొగులమ్మను అట్లా చూడడం కష్టమనిపించింది సంతోషమ్మకు.
మొగులమ్మ భర్త చిన్నయ్యకు కబురు పెడదాం అనుకుంది మొదట కానీ అందువల్ల ఎలాంటి ఫలితమూ ఉండదు ఆ పటేల్ అతన్నిప్పుడు ఎట్లాగూ పంపివ్వడు కాబట్టి తానే ఆమెను జహీరాబాద్ తీసుకుపోవాలని నిర్ణయించుకుంది.
“మొగులా. సైసుండవే. తీరేమయితది. జయీరాబాదకు పోదం. ఇప్పుడే అస్త.” అని మొగులమ్మతో చెప్పి పనికి బయలుదేరుతున్న కోడలిని కేకేసి మొగులమ్మ దగ్గర ఉండమని పురమాయించింది.
సుశీలమ్మ అన్న దగ్గరున్న బండి ఎడ్లు అడిగి తీస్కరా పో. మొగులమ్మని జహీరాబాద్ సర్కారు దవాఖానకు తీసుకుపోవాల్నని కొడుక్కి చెప్పింది.
తాను పెద్ద పెద్ద అంగలేసుకుంటూ బాల్వాడికి వెళ్ళింది.
రూతమ్మను కలిసి పరిస్థితి వివరించింది మొగులమ్మను జహీరాబాద్ దవాఖానకు తీసుకుపోతున్న ఏమన్న పైసలున్నాయా అని అడిగింది
చీర చెంగు కింద బొడ్లో దోపుకున్న సంచీ తీసి అందులోంచి చిల్లర లెక్క పెట్టింది. ఎనిమిది రూపాయలున్నాయి. అవి సంతోషమ్మ చేతిలో పోసింది రూతమ్మ. అవి తన బొడ్లో ఉన్న సంచిలో పోసుకుంటూ మొగులమ్మ పిల్లలకు ఈ విషయం చెప్పకు బెంగటిల్లుతారని చెప్పి తన ఇంటికి వెళ్ళింది సంతోషమ్మ.
చూరులోంచి చిన్న పేపరు తీసింది. అందులో చుట్టి పెట్టిన రెండురూపాయల నోట్లు ఐదు, రూపాయి నోటు ఒకటి తీసుకొని బొడ్లో దోపిన సంచిలో పెట్టుకుని మొగులమ్మ ఇంటికేసి నడిచింది.
అంతలో సంతోషమ్మ కోడలు మొగులమ్మ చేత కొద్దిగా అంబలి తాగిచ్చింది. కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్నది.
సంతోషమ్మ హడావిడి చూసి “ఏంగాదే సిన్నీ. పరేషాన్ గాకు. అదే కమ్మయితది ” నొప్పిని ఓర్చుకుంటూ అన్నది మొగులమ్మ
“అయితే అయితది తీ. దవాఖానకు పోదం. గిట్ల ఎంతకని ఓపిక తింటవ్” సముదాయిస్తున్నట్లుగా అన్నది సంతోషమ్మ
వీళ్ళు వెళ్ళేటప్పటికి జహీరాబాదు సర్కారు దవాఖానలో డాక్టరు కోసం చెట్లకింద పడిగాపులతో ఎదురు చూస్తున్నారు జనం.
అప్పటికే రెండు గంటలు దాటింది పడిగాపులు పడడం మొదలు పెట్టి. అప్పటివరకూ డాక్టర్ వస్తాడని చెప్పిన నర్సులు పొద్దు పడమటి దిక్కుకు వాలుతున్న సమయంలో ఇవ్వాళ రాడని చెప్పడం మొదలు పెట్టారు.
నర్సులే తోచిన వైద్యం చేస్తూ జనాన్ని కసురుకుంటున్నారు. ఊరికే వచ్చి మా ప్రాణం తీసే బదులు ప్రవేటు హాస్పిటల్ కి పొమ్మని సలహా ఇస్తున్నారు.
అది నువ్వు చెప్పాలా. పైసలుంటే అక్కడికే పొయ్యేవాళ్ళం అవిలేక ఇక్కడికొస్తే నరకం చూపుతున్నారు. ఏం దావఖాననో ఏమో. డాక్టర్లుంటే మందులుండవు. మందులుంటే డాక్టర్లుండరు. డాక్టర్లకంటే ఈ నర్సులకే ఎక్కువ భయపడాల్సి వస్తున్నదని గొణుక్కుంటున్నారు పేషేంట్లు
సంతోషమ్మ వెళ్లి నర్సులను బతిమాలింది వాళ్ళు విసుక్కుంటూనే మొగులమ్మకు ఏవో టాబ్లెట్ లు ఇచ్చి పంపించేశారు. మొగులమ్మ మందులు వాడుతూనే ఉన్నది కానీ నొప్పి తగ్గలేదు. గతంలో కంటే ఎక్కువగా బాధపడుతున్నది.
ఇప్పుడు జహీరాబాద్ దవాఖానకు సంతోషమ్మతో కలసి ఆరుమైళ్ళు నడిచే పోతున్నది నడిచే వస్తున్నది మందులు వాడుతూనే ఉన్నది.
ఒకసారి మొగులమ్మ వాళ్ళు వెళ్లేసరికి డాక్టర్ ఉన్నారు.
గర్భసంచి పాడయిపోయిందని వెంటనే ఆపరేషన్ చేసి తీసెయ్యాలన్నారు ఆపరేషన్ కి తగిన వసతులు తమ వద్ద లేవనీ ఉస్మానియా దవాఖానకు వెళ్లి అక్కడ చేయించుకొమ్మని సలహా ఇచ్చారు.
అంత స్తోమతులేని మొగులమ్మకు దిగులు పుట్టింది. వెన్నులో చలి జరజరా పాకింది ఎట్లా ఏం చేయను చెరుకు పిప్పిలా తనలో తానే నలిగిపోతున్నది.
ఇంటికొచ్చి తడక జరిపింది లోపలంతా చీకటిగా. తన బతుకులాగే అనుకుంటూ అట్లాగే అక్కడే కూలబడింది.
చేతిలో గుడ్డి గవ్వ కూడా లేదే. పెద్దాపరేషన్ అంటున్నారు. అంటే చాలా ఖర్చవుతుంది. అంత పైసా ఎక్కడ తేవాలి ఇప్పటికే ఉన్న బాకీలు తీర్చలేని చేతగానితనంలో మగ్గుతున్నారు. నలుగురు పిల్లలను ఎట్లా కాపాడుకునేదని లోలోన మదనపడుతున్న ఆమె చూపుల్లో చిక్కిందిసంతోషమ్మ పెంచుకునే కోడి.
ఆకాశంలో తిరుగుతున్న కాకులను గద్దలను తల్లి కోడి గమనించినట్లుంది క్లక్ క్లక్ అంటూ పిల్లల్ని దగ్గరకు పిలుచుకుంది తన రెక్కల కింద పిల్లల్ని కాపాడుకుంటున్నది.
కళ్లెదుట కనిపిస్తున్న ఆ దృశ్యం ఆమెను మరింత దుఃఖపూరితం చేసింది తాము కోసుకుతినే ఆ కోడి తనకన్నా గొప్పగా కనిపించింది మొగులమ్మకు
బతుకు మీద తీపిలేదు ఎప్పుడైనా చచ్చిపోయేదే కానీ, పిల్లల కోసం వాళ్ళు ఆనాధలు కాకుండా ఉండడం కోసం తను బతకాలి తను బతుకాలి అనుకున్నది. కానీ అదే ఎట్లాగో పాలుపోవడం లేదు.
బల్వాడి దగ్గర ఆడుకున్న పిల్లలు వచ్చేశారు చంటివాడు పరుగు పరుగున వచ్చి తల్లి ఒళ్ళో చేరాడు లోపల చెలరేగుతున్న తుఫాను గాలుల్ని కప్పిపుచ్చుకుంటూ పిల్లలను దగ్గరకు తీసుకున్నది మొగులమ్మ.
చిన్నయ్య తనకొచ్చిన కష్టం సమయం చూసి భీంరావ్ పటేల్ తో చెప్పుకున్నాడు. మౌనంగా విన్నాడు కానీ అప్పుడతనేం మాట్లాడలేదు. చుట్టకాల్చుకుంటూ ఏటో చూస్తూ కూర్చున్నాడు. వినీ వినట్టే ఉన్నాడు.
పటేల్ తాను చెప్పింది విన్నాడో లేదోనని సందేహపడ్డ చిన్నయ్య “ఎట్లనన్న జేసి తవరే ఒడ్డుకుపడెయ్యాలె పటేలా. ” అంటూ వెళ్లి అతని కాళ్ళు పట్టుకున్నాడు.
“ఏందిరా. దిమాకున్నదా.
మీ అయ్య జేసిన బాకులే ఇంతదాన్క తెంపకపోతివి.
అవ్విగాక అప్పుడిన్ని ఇప్పుడిన్ని సొమ్ములు కొంటబోతనే ఉంటివి మల్లెట్ల ఇచ్చేదిరా.? ఏం జూస్కోని ఇవ్వుమంటావ్ రా. దిమాకున్నదా. లెవ్ ” కాళ్ళను దగ్గరకు లాక్కుని నోట్లో చుట్ట తీసి తుపుక్కున వూసి చుట్ట మళ్ళీ నోట్లోపెట్టుకోబోతూ జుగుప్స, కోపం, దర్పం ప్రదర్శిస్తూ అన్నాడు పటేల్.
చిన్నయ్యకి భార్యని ఎట్లా కాపాడుకోవాలో తెలియడం లేదు. ఊళ్ళో పుట్టి పెరిగిన వాడైనా ఎవరితోనూ సంబంధం లేదు అనుబంధం లేదు. బాకీ తెచ్చే పరపతి అంతకన్నా లేదు.
ఎప్పుడూ దేని గురించి ఆలోచించని చిన్నయ్య, ఎవరి గురించి పట్టించుకోని చిన్నయ్య నిమ్మళంగా ఉంటాడు కానీ ఇప్పుడతను ఎప్పటిలాగా నిమ్మళంగా ఉండలేకపోతున్నాడు అతని మనసు పరిపరివిధాల యాతన పడుతున్నది.
తన తండ్రి దగ్గరున్న నాలుగెకరాల చేను పటేల్ చేనులో ఎప్పుడో కలిసిపోయింది ఎడ్లు బండి, బర్రె, మ్యాకలు అన్ని పటేల్ కొట్టంలకే చేరినయి. తనకాడ ఏమున్నదని భార్యకు వైద్యం చేయించగలడు. బుద్దెరిగిన కాడినించి పటేల్ కు పనిచెయ్యడం తప్ప మరో పని తెలియదాయె. ఏం చేయను.
చిన్నప్పటి నుంచి పటేల్ పని చేపిచ్చుకుంటనే ఉన్నడు ఇంకా బాకి అంత అట్లనే ఉంది. ఆ బాకీ ఎప్పటికి తీరేను. కొత్త బాకీ ఎప్పుడిచ్చేనూ.
పాపం పటేల్ మాత్రం ఎంతకని ఇస్తాడు. ఎంతకని తమ అప్పులు నెత్తినేసుకుంటాడని అనుకున్నాడు అమాయకుడైన చిన్నయ్య.
తాను భార్యకు ఏమీ చేయలేనితనానికి దుఃఖం ముంచుకొచ్చింది చిన్నయ్యలో. లోలోపలే ఉప్పొంగుతున్న దుఃఖాన్ని అదిమి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.
కొద్ది క్షణాల మౌనం తర్వాత తనను తాను సముదాయించుకొని “అయ్యో.నీబాంచెన్. నువ్వే గట్లంటే ఎట్ల పటేలా. నీ ఇంటి గాయిదొన్నిగులాపొన్ని.. నిన్నే నమ్ముకొని బతుకుతున్నోన్ని. ఆపతిల నువ్వుగాక నాకింకెవరున్నరు పటేలా. ఎట్లనన్న నువ్వే కోషిష్ జెయ్యి పటేలా. ” లోపల్నించి తన్నుకొస్తున్న దుఃఖాన్ని అదిమిపెట్టుకుంటూ, అప్రయత్నంగా కారిపోతున్న కన్నీటిని తుడుచుకుంటూ బతిమాలుతూ మళ్ళీ పటేల్ కాళ్లకు చుట్టుకున్నాడు చిన్నయ్య.
షట్.. ఏందిర దేడ్ దిమాక్. అంటూ కాలితో ఒక్క తన్ను తన్నాడు పటేల్.
ఆ దెబ్బకు చిన్నయ్య ఫుట్ బాల్ అంత దూరాన పడ్డాడు.
కూర్చున్న చోటు నుండి లేచి అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు భీంరావు పటేల్.
లేచి బట్టలకు, వంటికి అంటిన దుమ్ము పట్టించుకోకుండా వంగి దణ్ణం పెట్టుకుంటూ ముందుకు రాబోతున్న చిన్నయ్యకి పటేల్ ని ప్రసన్నం చేసుకునే మార్గం తోచడం లేదు.
ఏదో ఉపాయం తట్టినట్టు పచార్లు చేయడం ఆపి చిన్నయ్యకేసి చూసాడు పటేల్. ఓ పక్కకు తుపుక్కున ఉమ్మి చేతిలోని చుట్ట కిందపడేసి కాలితో నలిపేసాడు.
చేత్తో చిన్నయ్యని రమ్మన్నట్టుగా సైగ చేసాడు.
“బాంచెన్ పటేలా. ” వెళ్లి వంగబడి చేతులుకట్టుకుని వినయంగా నించున్నాడు చిన్నయ్య.
“నీ పెద్ద బిడ్డను పటేలమ్మ చేతి కిందికి పంపు. ఏదోటి కోషిష్ జెసి ఇన్నూరు సర్దుబాటు చేస్తా తీ ” అంటూ తన ఉదారత ప్రకటించుకున్నాడు
తెరవెనుక తంత్రాలు నడుపుతూ పాచికలు వేసి పబ్బం గడుపుకోవడంలో దిట్ట అయినా పటేల్ బుద్ది తెలుసుకోలేని అమాయకుడు చిన్నయ్య
బిడ్డను పనిలో పెట్టడం మనసుకు కష్టంగానే ఉన్నా ఇష్టం లేకపోయినా తప్పదు, అంతకంటే మార్గం లేదనుకున్నాడు చిన్నయ్య. మొత్తానికి పటేల్ ను ఒప్పించుకోగలిగినందుకు ఆనందపడ్డాడు.
గండం గట్టెక్కగలనని పటేల్ కు దండం పెట్టి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు చిన్నయ్య విషయం మొగులమ్మతో చెప్పి అంతే వేగంతో వెళ్ళిపోయాడు.
ఆమెకు అస్సలు ఇష్టం లేదు. ఆ పటేలమ్మ కళ్ళు ఎప్పటినుండో పిల్లమీదే ఉన్నాయి. ఆమెను పటేల్ ఇంటికి పంపితే ఎట్లా.. చిన్నయ్యలాగే.జన్మనంతా వాళ్ళ చాకిరిలోనే గడిచిపోతుంది పిల్లను ఎట్లా కాపాడుకోవాలి ఆలోచనలో మొగులమ్మ సతమతమవుతున్నది.
మొగులమ్మ ఆరోగ్యం దెబ్బతిన్నప్పటినుండీ ఇంట్లోపని దాదాపుగా అంత పూలమ్మే చేస్తున్నది. మంచినీళ్ల బావికి పోయి నీళ్లు తెస్తున్నది. ఆ పిల్ల లేకపోతే ఇంటిదగ్గర ఎంత కష్టమో ఆలోచిస్తూ చేటతో బియ్యం చెరుగుతున్నది మొగులమ్మ. అక్కడక్కడా కనిపిస్తున్న మెరిగలు ఏరి అక్కడే తచ్చాడుతున్న కోళ్లకు వేసింది
నల్లకోడి పెట్ట, తెల్ల మచ్చల నల్లకోడి పెట్ట, ఎరుపునలుపుతో బలంగా ఎదిగిన పుంజు గబుక్కున పరిగెత్తుకొచ్చాయి. ఆ వెనకే నాలుగు పిల్లలతో క్లక్ క్లక్ అంటూ వచ్చింది మరో పెట్ట ఒక పుంజుపిల్ల వచ్చి చేరింది అన్నీ మెరిగలు విసిరే దిశకు పరుగెడుతూ. ఆత్రంగా అందుకోవాలని ప్రయత్నిస్తూ. ఒక్కోసారి గెలుస్తూ. ఒక్కోసారి ఓడిపోతూ. మళ్ళీ ప్రయత్నిస్తూ.
పొయ్యి ముట్టిచ్చి ఎసరుకు కుండలో నీళ్లు పెట్టి బియ్యం కడుగుతుంటే అప్పుడొచ్చింది సంతోషమ్మ.
ఇవ్వాళ సంఘం మీటింగ్ కి నువ్వు తప్పనిసరిగా రావాలని చెప్పింది ఆమె వెళ్ళడానికి ఆరోగ్యం సహకరించక పోయినా తప్పనిసరిగా రావాలని సంతోషమ్మ నొక్కి చెప్పడంతో బయలుదేరి వెళ్ళింది మొగులమ్మ.
ఆమెకు తమ గుంపు అంతా కలసి తమ నాయకురాలికి వైద్యానికి సహాయం చేయమని తీర్మానం చేసి సంఘం ఆఫీసుకు పంపారనీ, తీసుకున్న సొమ్ము నెమ్మదిగా వాయిదాల పద్దతిలో తీర్చే షరతు మీద సంఘం ఒప్పుకుందనీ మీటింగ్ కు వచ్చిన కార్యకర్త చెప్పింది అప్పటివరకూ సభ్యులందరిలోనూ ఒక దిగులు తమ నాయకురాలి ఆరోగ్యం గురించి, అందవలసిన ఆమె వైద్యం గురించి అందుకే ఆనందంతో అందరూ చప్పట్లు కొట్టారు
తనకు ఏమన్నా అయితే తన నలుగురు పిల్లల గతేమిటి అన్న ప్రశ్న మొగులమ్మను వణికిస్తున్నది. హృదయంలోపల గూడు కట్టుకున్న వేదన సుడులు తిరుగుతున్నది.
అటువంటి ఆ సమయంలో కార్యకర్త చెప్పిన మాటలు విన్న మొగులమ్మ కళ్ళలో నీళ్లూరి జలజలా కారి చెంపల్ని తడిపేశాయి. ఆపదలో ఆవేదనలో మేమున్నామన్న భరోసా కొండెక్కినంత సంబరాన్నిచ్చింది ఆగమై పోతుందనుకున్న బతుకు ఖాళీలను నింపే ప్రయత్నం చేస్తున్న అక్కచెల్లెళ్లకు మనసులోనే నమస్కరించింది.
తేలికైన ఆమె మనసు సంతోషంతో కేరింతలు కొడుతుండగా ఆనందంతో అక్కడున్నవారిని ఆత్మీయ ఆలింగనం చేసుకుంది. గుండెలమీద పెద్ద బరువు తీరినట్లయి శరీరపు బాధను మర్చిపోయింది.
సంఘంలో ఉండబట్టే.. ఎండుకట్టెకు ప్రాణం పోస్తున్నారు లేకపోతే ఎట్లా ఉండేదో.
చెట్టు పుట్ట లేక చెదపురుగు బతుకయ్యేదని తలపోసింది.
తోడబుట్టిన వాళ్ళని రూపాయి అడిగితే పైసా సాయం చేయలేని కాలంలో చేస్తున్న సాయమిది. అడగకుండానే ఆపదను గుర్తించి రెండువేలిచ్చి చేయూతనిచ్చిన తన సంఘపు అక్కాచెల్లెళ్ల రుణం నేనెట్లా తీర్చుకోగలను అని తనలో తాను చాలా సార్లు అనుకుంది మొగులమ్మ కనిపించని దేవుళ్ళకు మొక్కుకుంది.
అక్క పరిస్థితి తెల్సి చూడ్డానికి వచ్చిన పెద్ద చెల్లెలుకి పిల్లలను అప్పగించి ఆపరేషన్ కి హైదరాబాద్ వెళ్ళింది మొగులమ్మ. చిన్నయ్యతో పాటు సంతోషమ్మ కూడా ఆమె వెంట వెళ్లారు.
సంఘం ఆఫీసు ఇచ్చిన లేఖ పట్టుకుని ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లారు. ఆ హాస్పిటల్ లో గైనకాలజిస్ట్ బాల వీళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకుంది. మొగులమ్మకు అవసరమైన పరీక్షలు చేసింది. ఆమె గర్భసంచీ తప్పనిసరిగా తీసివేయాల్సిన స్థితి కావడంతో అది తొలగించివేశారు.
మంచి వైద్యం అందడంతో మొగులమ్మ త్వరగానే కోలుకుంది.
హైదరాబాదు దవాఖానకు వెళ్లడం అనగానే వాడలో అందరూ భయపడ్డారు. ఆమె తిరిగి వస్తుందన్న నమ్మకం వాళ్లలో ఏ కోశానా లేదు తమ వాడలో పట్నం దవాఖానకు వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్చిన దాఖలాలు వాళ్ళ ఎరుకలో లేకపోవడంతో అందుక్కారణం.
మొగులమ్మ వెళ్ళేటప్పుడు వాడ వాడంతా కంటనీటితో ఆమెను సాగనంపారు. లోపలెన్ని భయాలున్నా ఆరోగ్యంగా తిరిగిరావాలని కనిపించని దేవుళ్ళను వేడుకున్నారు.
చిన్నయ్య కూడా ఏడుపుమొహంతోనే వెళ్ళాడు. కానీ మొగులమ్మ భయపడలేదు. దిగులు పడలేదు. చాలా ధైర్యంగా ఉంది. ఆ ధైర్యం వెనుక సంఘం ఉంది అదే అసలు రహస్యం.
** **
ఆ సమయంలోనే గ్రూపు మీటింగుల్లో తమ ఆరోగ్యానికి సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. తమకు సమీపంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ మీద వాళ్ళకెన్నో ఫిర్యాదులున్నాయి.
అందుకే ప్రతి చిన్న సమస్యకు ఊరుదాటి మైళ్లకొద్దీ నడిచి సర్కారు దవాఖానకు పోకూడదని నిర్ణయించుకున్నారు.
గ్రామంలోనే తీర్చుకోగల ఆరోగ్య సమస్యల్ని, తీర్చుకోగలిగే మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టారు. తమ ముందు తరాలవారు ఏమి చేసేవారో తమకంటే పెద్దవాళ్ళను అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో దొరికే తమకు అందుబాటులో ఉండే ఆకులు, వేర్లు, కాయలు, పూవులు, గింజలు వంటి వాటితో కొన్ని రకాల మందులు తయారుచేసుకోవడం తెలిసిన పెద్ద మనుషుల సహాయం తీసుకోవాలని అనుకున్నారు. ఆ విషయం కార్యకర్త ద్వారా సంఘం ఆఫీసు దృష్టికి వెళ్ళింది.
తాము చేయాల్సిన ఆలోచన తమ సభ్యుల నుండే రావడం ఆఫీసు వాళ్ళను సంతోషపరిచింది. సంఘం పనిచేసే గ్రామాల్లోని సభ్యుల్లో ఎవరికైనా ఆకుమందుల పట్ల ఆసక్తి ఉంటే రమ్మని ఆఫీసుకు రావాల్సిందిగా పిలిపించారు.
సాంప్రదాయ వైద్యం లో అనుభవం ఉన్న అనుభవజ్ఞుల్ని పిలిపించి వాళ్ళతో శిక్షణ ఇప్పించారు అలా ప్రతి గ్రామం నుండి ఒకరిద్దరు ఆరోగ్య కార్యకర్తలుగా ముందుకొచ్చారు. వాళ్ళకి రోగాలు రాకుండా ఉండాలంటే తమకు అందుబాటులో ఉండేవి ఆహారంగా ఏ విధంగా తినాలో, ఏమి చెయ్యాలో పోషకాహార నిపుణుల చేత శిక్షణ ఇప్పించారు.
అలా బాలాపూర్ గ్రామంలో కూలీ పనులు చేసుకునే సంతోషమ్మ ఆరోగ్య కార్యకర్తగా మారింది.
ఆమెకు తొమిదేళ్ళ వయసులోనే పెళ్లయింది. పదిహేనేళ్ళు వచ్చేసరికి ఒక కొడుకు పుట్టాడు తర్వాత ఏడాదికి భర్త పాముకరిచి చనిపోయేనాటికి సంతోషమ్మ నాలుగు నెలల గర్భవతి.
భర్త మరణం తర్వాత కొన్నిరోజులు అత్తమామలతో ఉంది. ఆ తర్వాత తోడబుట్టిన వాళ్ళ ఆసరా ఉంటుందని పుట్టింటికి చేరింది.
కూలి పనులు చేసుకుని స్వతంత్రంగా బతకడం మొదలు పెట్టింది. మారు మనువు చేసుకుంటానని ఒకరిద్దరు ఆమె వెంటపడ్డప్పటికీ ఎందుకోగాని సంతోషమ్మ అందుకు సున్నితంగా తిరస్కరించింది తోడబుట్టిన వాళ్ళు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు ఆమె ఒప్పుకోలేదు. ఆమెకు పెళ్లిపై మనసు రాలేదు. అలా ఒంటరి జీవితం గడుపుకొస్తున్న సంతోషమ్మ ఆరోగ్య కార్యకర్తగా కొత్త బాధ్యత లోకి వచ్చింది.
కొత్తగా వచ్చిన బాధ్యతను చాలా ఇష్టంగా స్వీకరించిన సంతోషమ్మ ఇల్లిల్లూ తిరిగింది. పిల్లలకు పెద్దలకు ఏమి సమస్యలున్నాయో తెలుసుకున్నది. గజ్జి, కురుపులు వంటి చర్మసంబంధ సమస్యలు, నోటి మూలలు పగిలిపోయి కొందరు, బాన పొట్టలతో ఇంకొందరు పిల్లలు కనిపించారు యుక్తవయస్సొచ్చిన ఆడపిల్లల్లో రక్తలేమి బాగా ఎక్కువగా ఉన్నది.
ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కలిగించాలంటే మామూలు మాటల్లో చెప్పిన దానికంటే స్థానిక కళారూపాల్లో చెప్తే వాళ్ళ మెదళ్లలో బాగా ఇంకుతుందని నిర్ణయించుకున్నారు.
ఆరోగ్య జాతరలు నిర్వహించాలని అనుకున్నారు వీటన్నిటితో పాటు ఇంటింటికీ తిరిగి ఆరోగ్యం గురించి చెప్పడం అవసరం అని చెప్పుకున్నారు
గ్రామాల్లో ఆరోగ్యకార్యకర్తలుగా అవతారమెత్తిన వాళ్ళు ఉత్సాహంతో ముందుకుపోతున్నారు.
వాళ్ళు మందులు తాయారు చేద్దామంటే కొన్ని ఆకులు, కాయలు అందుబాటులో లేవు. అది సంతోషమ్మ ఒక్కదాని సమస్య మాత్రమే కాదు. దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఉన్న సమస్యే.
అక్కడక్కడా చిన్న చిన్న అవాంతరాలు వచ్చినా వాటిని ఎదుర్కోగల శక్తి వాళ్ళకుంది.
సంఘం అండదండలు పుష్కలంగా ఉండడం వారికి కొండంత బలం.
** **
ఆరోగ్య జాతర నుండి వచ్చిన మొగులమ్మ తన పిల్లలను ఉన్నంతలోనే ఆరోగ్యంగా పెంచాలని నిర్ణయించుకుంది.
తన చికిత్సకోసం తీసుకున్న అప్పు దగ్గరపడింది. ఆ అప్పు తీరగానే ఒక బర్రెను కొనాలని ముందుగానే నిర్ణయించుకుంది.
అనుకున్నట్టుగానే సూడి బర్రెను కొన్నది. చింత చెట్టు కింద ఒక కొయ్య పాతి అక్కడ కట్టేసింది.
పిల్లలు నలుగురూ ఆ బర్రె చుట్టూ మూగారు వారి కుటుంబంలోకి వచ్చిన కొత్త జీవాన్ని సంతోషంగా ఆహ్వానించారు పిల్లలు
వాళ్ళు పుట్టినప్పటినుండి మొదటిసారి తమ దొడ్లోకి బర్రె వచ్చిన సంబరం ఆ మొహాల్లో.
వాకిట్లో సానుపు వెయ్యడానికి పెండకోసం ఎక్కడికీ పోవాల్సిన అవసరం లేదని చెల్లితో తమ్ముళ్ళతో చెప్పింది పూలమ్మ.
తల ఎగిరిపోయి సగానికి మిగిలిన మట్టి కుండకు కింద మట్టితో మెత్తింది అది అటూ ఇటూ కదలకుండా చేసింది పూలమ్మ. అందులో నీళ్లు తెచ్చి పోసి అక్కడే గిన్నెలు కడిగేది ఇప్పుడు ఇంటికి కొత్తగా వచ్చిన బర్రెను అక్కడికే తెచ్చి దానికి నీళ్లు తాగించడం మొదలు పెట్టింది.
తల్లి చెప్పకుండానే తనకు తానుగా బర్రె పనులు ఇష్టంగా చేస్తున్నది. అది ఆమెకు చాలా ఆనందంగా ఉంది
పడుకుని నెమరువేస్తున్న బర్రె కళ్ళనుండి నీరు కారుతున్నాయి. అప్పుడప్పుడూ గట్టిగా అరుస్తున్నది అది చూసిన పూలమ్మకి బాధ కలిగింది
పక్క నున్న చెల్లెలి మొహంలోకి చూస్తూ ” ప్చ్ పాపం. ఈ బర్రె దోస్తులను, అమ్మ నాయినలను, చెల్లెను, తమ్ముండ్లను వదిలి మనకాడికచ్చింది కదా. గందుకే ఏడ్వవట్టింది ” అన్నది.
ఆ రోజు నుండి ఆ బర్రె మీద జాలి పెరిగింది. దాని అవసరాలన్నీ చాలా శ్రద్దగా చూసుకుంటున్నది.
మల్లేశం వెళ్లి బర్రె తోక పట్టి లాగుతుంటే వద్దని వారించింది.
ఇంటికి వచ్చిన రెండో రోజు బర్రె వెనక వైపు నుండి సన్నగా తీగలా కారుతున్న ద్రవాన్ని చూసి భయపడింది. చేన్లో పనికి వెళ్లిన తల్లి దగ్గరకి పరిగెత్తింది. బర్రెకు ఏదో అయిందని ఖంగారు పెట్టింది.
అదే రోజు రాత్రి బర్రె అరుపులు వినిపించి నిద్రలేచింది పూలమ్మ నెమ్మదిగా తలుపు తీసి బయటికొచ్చింది.
కొత్తగా వచ్చిన వీధి దీపం వెలగడం లేదు. ఏమైందో మరి.
ఆకాశం కేసి చూసింది నల్లటి చీకటి రాత్రి చుక్కలు తళుక్కున మెరుస్తున్నాయి.
మళ్ళీ బాధతో బర్రె అరుస్తున్నది అటుకేసి చూసింది పూలమ్మ చింత చెట్టు కింద ఉన్న చిన్న మొద్దుపై ఆముదపు దీపం బుడ్డి పట్టుకొని కూర్చుని ఉన్నది మొగులమ్మ. బర్రె దగ్గర ఎండుగడ్డి పరుస్తున్నాడు చిన్నయ్య.. ఆ రాత్రే బర్రె ఈనింది. వెళ్లి పడుకోమన్నా పడుకోకుండా తల్లిదండ్రులతో పాటు తానూ అక్కడే కూర్చుంది పూలమ్మ.
“పెయ్యిదుడ్డె ” అని తండ్రి తల్లితో చెబుతుంటే విని పెయ్యి దుడ్డె అంటే ఏంటని అడిగి విషయం తెలుసుకుంది.
గుడ్డి దీపం వెలుతురులో పుట్టిన దూడను తల్లి నాలుకతో నాకుతూ ఉంటే ఆశ్చర్యంగా చూసింది ఆ దృశ్యం అపురూపంగా అనిపించిందామెకు.
బొడ్డు దగ్గర కత్తితో కత్తిరించి ముడేస్తుంటే అయ్యో. ఏమి చేస్తున్నావంటూ తండ్రికేసి చూసి అరిచింది అక్కడ ఉన్న రక్తాన్ని చూసి భయపడింది
ఆ తర్వాత తడిచిన గడ్డిని తీసి తండ్రి శుభ్రం చేస్తుంటే తానూ వెళ్లి చెయ్యి వేయబోయింది.
తల్లి వారించడంతో ఆగి వాళ్ళు చేస్తున్న పనిని గమనించ సాగింది. ఇంట్లోకి వెళ్లి పడుకోమని చెప్పినా వెళ్ళలేదు.
ముద్దుగా ఉన్న ఆ దూడను పట్టుకోవాలని పూలమ్మ మనసు ఉబలాటపడుతున్నది.
కట్టు కొయ్య చుట్టూ అటూ ఇటూ తిరుగుతూ దూడను బర్రె నాకుతూనే ఉన్నది దగ్గరకు తీసుకుంటూనే ఉన్నది.
బర్రెకు కొద్దిగా జొన్నచొప్ప వేసింది మొగులమ్మ అది తినకుండా దూడను నాకుతూనే.
దూడను తల్లి పాలు తాగే విధంగా పాల పొదుగు దగ్గర చేర్చుతున్నది మొగులమ్మ.
దానికి అలవాటు లేక ఇబ్బంది పడుతున్నది కాసేపటికి కొన్ని పాలు తాగగలిగింది దూడ.
అప్పటికే అర్ధరాత్రి దాటి చాలా సేపయింది.
బయట చల్లగా ఉందని దూడను తీసుకొచ్చి ఇంట్లో తమకు దగ్గరలోనే గొనె తట్టుపై పడుకోబెట్టాడు చిన్నయ్య.
బర్రె దూడ కోసం గట్టిగా అరుస్తూ ఉన్నది.
పూలమ్మకి నిద్ర పట్టడంలేదు అయ్యో. అది వాళ్ళమ్మ దగ్గర ఉండాలి కదా. తన చిన్న తమ్ముడు ఇప్పటికీ అమ్మ పక్కనే పడుకుంటాడు ఇప్పుడే పుట్టిన దూడను తల్లికి దూరం చేశాడని అమ్మానాన్నలపై మనసులో కోపగించుకుంది దూడపరిస్థితికి జాలిపడింది.
అట్లా ఆలోచిస్తూ దూడను దాని తల్లి దగ్గర వదిలేద్దామని లేవబోయింది. గుడ్డి దీపం వెలగడం లేదు. పడుకునేటప్పుడు తల్లి దీపం అర్పిపడుకున్నది. ఎట్లా. ఏమిచేయాలని ఆలోచనలో కొద్దిసేపు గడిపింది బొంత కదిలే సరికి ఒంటికి చల్లగా, చలి తగిలింది.
ఊహూ.. వద్దు వద్దు బయట ఉంటే చలేస్తుంది కదా అందుకే అయ్య లోపల పడుకోబెట్టాడని తనకు తాను సర్ది చెప్పుకుంది.
తర్వాత నెమ్మదిగా తడుముకుంటూ వెళ్లి తన బొంత కప్పబోయింది. అది గమనించిన మొగులమ్మ వద్దని వారించడంతో ఊరుకుంది. బర్రె – దూడ గురించిన రకరకాల ఆలోచనలతోనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది పూలమ్మ.
తెల్లవారి లేచి చూసేసరికి దూడ రాత్రి పడుకోబెట్టిన దగ్గర గోనెసంచిపై కనిపించలేదు అయ్యో దూడ ఏదని అమ్మనడిగింది.
చెల్లిని, తమ్ముళ్లను లేపేసి బర్రె దగ్గరకు తీసుకుపోయింది.
దూడ తల్లి దగ్గర పాలు తాగినట్లుంది అటూ ఇటూ నడుస్తున్నది అది అలా కదులుతుంటే ముచ్చటపడిపోతున్నారు నలుగురూ పూలమ్మ వెళ్లి ఆ దూడను ఎత్తుకోవాలని చూసింది తల్లి బర్రె అరవడంతో భయమేసి వదిలేసింది.
ఆ దూడ ఎంత ముద్దుగా ఉందొ. ఎంత మెత్తగా ఉన్నదో. జుట్టు భలే మెరుస్తున్నది అనుకుంటూ అక్కడనించి కదలడం లేదు.
దూడ తల్లి ఒడికి చేరి పాలు కుడుస్తున్నది.
ఆ దృశ్యం మనోహరంగా ఉంది పూలమ్మకు తనకంటే చిన్న వాళ్లకు చూపుతూ చిన్న తమ్ముడు అమ్మ దగ్గర పాలు తాగిండు చూడు అట్లానే ఈ దుడ్డె తాగుతున్నది వివరించింది పూలమ్మ.
అవునన్నట్టు కళ్ళు పెద్దవి చేసి తలుపుతూ చూస్తున్నది మల్లమ్మ మల్లేశం దూడ తోకపట్టుకుని, చెవులు పట్టుకుని అటూ ఇటూ కదపలేని ప్రయత్నం చేస్తున్నాడు తల్లి బర్రె వాడికేసి గుర్రుగా చూస్తున్నది.
వేపపుల్లతో పళ్ళుతోమి మొఖం కడుక్కుంటూ వాళ్ళ మాటలను విన్న మొగులమ్మ నవ్వుకున్నది.
రెండుమూడు రోజులు అసలు పాలు పిండలేదు అన్నిపాలూ దూడ తాగలేదు ముర్రుపాలు నీ పిల్లలకు కూడా పట్టొచ్చు అని చెప్పింది కార్యకర్త
వారం రోజుల వరకూ పాలన్నీ దూడకు వదిలేస్తానని ఆ తర్వాతే పాలు పిండుతానని చెప్పింది మొగులమ్మ.
అన్నట్లుగానే వారందాటాక తన పిల్లలకు పాలు తాగించడం మొదలు పెట్టింది. వాళ్ళు పుట్టినప్పుడు తల్లి పాలు తప్ప పై పాలు ఎప్పుడూ తాగలేదు. అట్లా తాగుతారని ఆ పిల్లలకు తెలియదు.
బఱ్ఱె పాలు పిండి కాచి తల్లి సీమెండి పళ్లెంలోనో, గిన్నెలోనో పోస్తుంటే నూకల అంబలి తాగినట్టే తాగడం చాలా గొప్పగా ఉంది వాళ్ళకి.
అదో వింత అనుభూతి ఆ పిల్లలకు.
ఇళ్లలో పాలు తాగే పిల్లల్ని వాళ్లెప్పుడూ చూడలేదు చాయ్ దుకాణంలో చిన్న చిన్న గాజు గ్లాసుల్లో చాయ్ తాగే పెద్దలు కొందరు తెలుసు వాళ్ళ వెంట వెళ్లిన పిల్లలు పెద్దలతో పాటే ఆ గ్లాసులో చాయ్ ఒకటో రెండో చుక్కలు గొంతులో పోసుకోవడం తెలుసు కానీ తమలాగా పాలు తాగే పిల్లలు ఆ వాడలో ఎవరూ లేరు అందుకే పూలమ్మకి అది చాలా గర్వంగానూ, గొప్పగానూ ఉన్నది బల్వాడి దగ్గర కనిపించిన వాళ్ళఅందరికి తమ ఇంటికి బఱ్ఱె వచ్చాక తాము పాలుతాగుతున్న విషయం చెబుతూనే ఉంది ఆమె మాటలు కొందరు నమ్మారు కొందరు నమ్మలేదు.
బఱ్ఱె వచ్చిన దగ్గరనుండి పెరుగుతో చల్లచేసి తాగాలని ఆశ పడుతున్నది మొగులమ్మ.
పాలు తోడు వేయాలంటే ఎవరి ఇళ్లలో దొరకదు గొల్లోల్ల రామవ్వ ఇంట్లో దొరకొచ్చని పూలమ్మను అక్కడికి పంపింది.
తన దగ్గరలేదని బీరయ్య దగ్గర మేక పెరుగు ఉంటుందని చెప్పింది గొల్ల రామవ్వ. అక్కడికి పోయింది పూలమ్మ వాళ్ళు ఇప్పుడు లేదని చెప్పడంతో తిరిగి వచ్చింది.
పటేళ్ల ఇళ్లలో పాలు పెరుగు ఉంటుంది అడిగితే ఇస్తారో లేదోనని సంకోచించింది.
తోడుకు పెరుగు కావాలంటే ఎవరూ ఇవ్వరని, పావో, అర్ధపావో పైసలకైతే అమ్ముతారని అన్నది సంతోషమ్మ.
వాడలో ఎవరికైనా ఆరోగ్యం బాగుండనప్పుడు పెరుగు, చల్ల గొల్ల వాళ్ళ ఇళ్ళలోనో, కాపుదనం వాళ్ళ ఇళ్ళలోనో కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు.
అప్పుడు గుర్తొచ్చింది కాపోళ్ల వెంకన్న దగ్గర బర్రెలు ఉన్న విషయం వాళ్ళు పైసలకు చల్లపోస్తారన్న విషయం గతంలో విని వుంది మొగులమ్మ.
అందుకే పావుసేరు చల్లకోసం బిడ్డకు ముంత ఇచ్చింది పైసలిద్దామని బోడ్లొంచి సంచీ తీసేసరికి పూలమ్మ తుర్రుమంది మొగులమ్మ పిలిచే పిలుపు వినిపించుకోలేదు.
చారాణా తెచ్చావా అని అడిగారు వాళ్ళు లేదని బిక్క మొహంతో తల అడ్డంగా ఊపింది పూలమ్మ అయితే చల్ల లేదని చెప్పిందా ఇంటి ఇల్లాలు
వెళ్లినంత వేగంగా వెనుదిరిగింది పూలమ్మ.
వెనుదిరిగిపోతున్న పూలమ్మను చూసి ఆ ఇల్లాలు కళ్ళలో చిన్న ఆశ తళుక్కుమన్నది. ఆమె పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నది ఇంటిపనులు చేసుకోవడం చాలా కష్టంగా ఉన్నది ఆ రోజు చిన్న జీతగాడు రాలేదు కొండలా పేరుకుపోయిన గిన్నెలను తోమడం ఎట్లా అనుకుంటున్న ఆమెకు పూలమ్మ ను చూస్తే ఆ పిల్ల పనిచేస్తుందేమోనన్న చిన్న ఆశ కలిగింది.
ఆ వెంటనే, ఆ యిల్లాలు “ఓ పోరి. ఇగరా. చల్ల పోస్త తీ. గా బాసన్లు తోమి పో.” గట్టిగానే అన్నది.
తననేనా.. అని ఓసారి వెనుతిరిగి చూసింది పూలమ్మ.
నిన్నే అన్నట్లుగా చెయ్యి ఊపింది ఆ యిల్లాలు బిక్కు బిక్కుమంటూ బెరుకుగా దగ్గరకు వెళ్లిన పూలమ్మతో “ముంత ఆడ ఓరకు వెట్టి గా బాసన్లు తోమిపో. సల్ల వోస్త..తీ ” అన్నది నెలసరి నొప్పులతో బాధపడుతున్న యిల్లాలు.
ఒక మట్టి మూకుడులో ఇంత బూడిద, కొంచెం చిట్టు కలిపి గిన్నెలు తోముమని ముందు పెట్టింది ఇంటావిడ.
అది తీసుకుని ఎండుగడ్డిని చుట్టలాగా చుట్టి ఆ బూడిద కలిపిన చిట్టుతో గిన్నెలు బాగా తోమడం మొదలుపెట్టింది.
అవి తోముతున్నంత సేపూ ఇన్ని గిన్నెల్లో ఏమి ఒండుకుంటారో.ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారో.. అని రకరకాలుగా ఆలోచన చేసింది. గంపెడు బాసన్లు చకచకా తోమేసింది పూలమ్మ ఆ తర్వాత తోమిన వాటిని చేత్తో రుద్ది కడిగింది.
తోమిన గిన్నెలపై ఎండపొడ పడి తెల్లగా వెండి గిన్నెల్లాగా మెరుస్తున్నాయి.
జీవితంలో ఎప్పుడూ చల్ల రుచి ఎరుగని పూలమ్మ తల్లి చేసే చల్ల కోసం ఆత్రుత పడుతున్నది.
“ముత్తెమంత లేవు గనీ బాసన్లు మంచిగ తోమినవే పోరీ. ” మెచ్చుకోలుగా అన్న ఆ యిల్లాలు సల్ల తెచ్చి పూలమ్మ తెచ్చిన చెంబు నిండా ఎత్తి పోసింది బాగముగ్గి కమ్మటి వాసన వస్తున్న పసుపురంగు జామపండు తెచ్చి చెంబు పక్కనే పెట్టి తీసుకొమ్మని చెప్పింది.
ఎట్టకేలకు చల్ల సాధించానన్న విజయగర్వంతోనో. ఊహించని విధంగా దొరికిన పసిడి రంగులోని పండు వల్లనో గానీ పూలమ్మ ఆ మోహంలో వేయి చంద్రుళ్ల కాంతులు.
ఇంటికి చేరిన పూలమ్మ చేతిలో జామపండు కోసం చెల్లెలు, తమ్ముళ్లు ఎగబడ్డారు.
జామపండును తన లంగాలో పెట్టి కొరికి కాకెంగిలి ముక్కలు చేసింది. ఒక్కో ముక్క చెల్లెలుకు తమ్ముళ్లకు ఇచ్చింది ఇంతలో మల్లేశం తనకిచ్చిన ముక్క చటుక్కున నోట్లో కుక్కుకుని మళ్ళీ చెయ్యి చాచాడు.
ఊ. నేనియ్య పో. అని వాడిని కోప్పడింది వాడు ఏదుపందుకున్నాడు. పోనీలే. తమ్ముడిగా అని సర్దిచెప్పుకుని మళ్ళీ ఒక ముక్క వాడి చేతిలో పెట్టింది.
అది చూసిన మొగులమ్మ సంఘం ఇచ్చిన జామ, ఉసిరి, నేరేడు మొక్కలను చూపి వీటికి రోజూ నీళ్లు పోస్తే పెద్దగా అయినంక చాలా పండ్లు ఇస్తాయని, రోజూ తినొచ్చని చెప్పింది.
అవునా, అట్లయితే ఈ రోజు నుండి ఆ మొక్కలకు నీళ్లుపోసే బాధ్యత నాదే, జామపండ్లు అయినంక అన్నీ నేనే తింటా అన్నాడు మల్లేశం ఊ. అదేం కుదరదు నేనూ నీళ్ళుపోసి పెంచుతా పండ్లయినంక నేనూ తింటా వాదులాటకు వెళ్ళింది మల్లమ్మ.
మూడుచెట్లకు ముగ్గురూ నీళ్లుపోయ్యండన్నది మొగులమ్మ నేను జామచెట్టు తీసుకుంట అన్నాడు మల్లేశం నేరేడు మొక్క చెల్లెకిచ్చి ఉసిరిమొక్కకు నేను నీళ్లు పోస్తానని చెప్పింది పూలమ్మ పండ్లు అయినప్పుడు అందరం అన్నీ తిందాం అన్నది మల్లమ్మ,
ఇంట్లోకి చల్ల వచ్చింది మొదలు, ప్రతిరోజూ పెరుగు తోడు పెడుతున్నది మొగులమ్మ దాన్ని చేత్తోనే చిలికి చల్ల చేసుకుంటున్నారు తమ బర్రె ఇచ్చే మూఢులీటర్ల పాలలో లీటరున్నర ఇంటి అవసరాలకు ఉంచుకుని మిగతావి పాలు వాడకం పెట్టుకుంది.
అన్ని పాలు ఇంటికే అయితే బాకీ ఎట్లా తీరుస్తావ్ ఇంకో లీటరు వాడకం పెట్టుకొమ్మని సలహా ఇచ్చారు రూతమ్మ, సుశీలమ్మ లు
పిల్లలు తాగినంకనే మిగిలినవి బయటికి పొయ్యి అని చెప్పింది సంతోషమ్మ.
పూలమ్మ వెళ్లి ఆ ఊరి హోటలులో పాలు పోసి వస్తున్నది.
బర్రెకు నీళ్లు పెట్టడం, దాన్ని కాసేపు మేపుకురావడం, పేడతీసి కుడితిపెట్టడం, నీళ్లు పెట్టడం వంటి పనులన్నీ చేయడం పూలమ్మకు చాలా సరదాగా ఉంది. ఇష్టంగా చేస్తున్నది.
బఱ్ఱె మేతకు దిగులు లేదు, తాము చేసే చేలలోంచే గడ్డి గాదం తెచ్చి బఱ్ఱె ఆకలి తీరుస్తున్నది చొప్పకు తోడు పెసరపొట్టు, మినపపొట్టు లాంటివన్నీ పెడుతున్నది సంతోషమ్మ ఇంటిముందు ఒక కుండ పెట్టింది పూలమ్మ. వాళ్ళింట్లో మిగుళ్లు తగుళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళో, పప్పు కడిగిన నీళ్ళో ఆ కుండలోకి చేరుతున్నాయి వాటిని రోజూ తెచ్చి కుడితిలో పోస్తున్నది పూలమ్మ.
పాలమ్మకం ఆ కుటుంబానికి మంచి ఆదాయ మార్గమే అయింది వచ్చే ఆదాయాన్ని పొదుపుగా వాడుకుంటూ బర్రెకు చేసిన అప్పు తీరుస్తూ వస్తున్నది మొగులమ్మ.
మొగులమ్మను చూసి సంతోషమ్మ, సుశీలమ్మ, మల్లమ్మ, నర్సమ్మలు కూడా బర్రెలు తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకా కొందరు తీసుకున్నారు. అందరూ కలసి బర్రెలను మేపుకు రావడం కోసం ఒక మనిషిని పెట్టుకుంటే బాగుంటుందనుకున్నారు.
నీరడి సాయిలు జబ్బు చేసిన తర్వాత పనులకు పోవడంలేదు ఇప్పుడతని జబ్బు తగ్గినా పనిచేయడం లేదని బాధపడేది అతని భార్య. ఆ విషయం మదిలో ఉన్న మొగులమ్మ సాయిలుతో మాట్లాడింది బర్రెకు నెలకు ఐదు రూపాయలిస్తాం అని చెప్పింది. అట్లా బర్లు కాసే పనికి ఒప్పుకున్నాడు సాయిలు. పూలమ్మకు బర్రెను మేపే పని తప్పింది అందరి బర్లు అతనే మేతకు తోలుకుపోతున్నాడు.
పూలమ్మ మళ్ళీ బాల్వాడి దగ్గరకు అప్పుడప్పుడు పోయివస్తున్నది.
** **
ఆపరేషన్ అయ్యాక మొగులమ్మకు సహాయకారిగా పెద్ద చెల్లెలు ఒక నెలరోజులు ఉండి వెళ్ళింది. ఆ తర్వాత చిన్న చెల్లెలు ఓ పది రోజులు ఉండి వెళ్ళింది. ఎవరి సంసారాలు వారివి ఎవరి ఇబ్బందులు వారివి.
బావికి వెళ్లి నీళ్లు తేవడానికి చాలా ఇబ్బంది అవుతున్నది. పూలమ్మ వెళ్లి నీళ్లు తెస్తున్నది కానీ అవి ఆ కుటుంబానికి సరిపోవడం లేదు. పూలమ్మ పెద్ద కుండ మోయలేదు. తెచ్చే చిన్న కుండలో నీళ్లు పై నుండి ఎత్తి పోసేటప్పుడు సగం కిందపోతున్నాయి. వాటితో రోజంతా గడపడం కష్టమైపోతున్నది.
వేసవి వస్తే దాహం తీరక మంచినీళ్ల కోసం మరిన్ని తిప్పలు తప్పవు.
ఆ రోజు ఏడెనిమిది లీటర్లు పట్టే చిన్న కుండలో సగం నీళ్ళుకూడా ఇంటికి రాలేదు అందుకే రెండోసారి కుండ తీసుకొని మంచినీళ్లకు పోయింది పూలమ్మ. నీళ్లు చేదిపోస్తున్నతను తిట్టి వెనక్కి పంపించడంతో ఏడుస్తూ ఇంటికొచ్చింది పూలమ్మ.
ఏమిచేయాలో మొగులమ్మకు పాలుపోలేదు. గుక్కెడు గుక్కెడు నీళ్లతో నోరు తడుపుకుంటూ ఆ రోజు పగలు వెళ్లదీశారు.
రాత్రి అయ్యేసరికి ఒక్క చుక్క నీళ్లు మిగలక బోరింగ్ నుండి వచ్చే చప్పటి నీళ్లతోనే నోరు తడుపుకున్నారు అవి నోట్లో పోసుకుంటే నోరంతా ఎట్లాగో అయిపోతున్నది వికారంగా అనిపిస్తున్నది అయినా తప్పదు. నోట్లో పోసుకుని తడుపుకుని తర్వాత బయటికి ఊసేస్తూ ఆ పూట ఎట్లాగో గడిపేశారు.
కానీ ఇది ఒక్క రోజు పరిస్థితి కాదు ఇట్లా ఎన్ని దినాలు.? తనే పోదామంటే రెండుకోసుల దూరం పోయి తేవాలి పెద్దాపరేషన్ అయినా తను బరువుతో అంత దూరం నడవకూడదు ఎట్లా. మొగులమ్మ తనలో తానే తర్జన భర్జన పడుతున్నది.
చిన్నయ్య కుటుంబానికి ఏ విధంగానూ ఆసరా కాలేని పరిస్థితి. అతను చాలా సార్లు చుక్కపొద్దు పొడిచే సమయానికే పనిలోకి పోతాడు. లేకపోయినా మసక మసక చీకట్లోనే పనికి పోవాలి.
తెల్లారి బారెడు పొద్దు అయినతర్వాతనే నీళ్లు చేది పోస్తారు. ఒకోసారి ఇంకా ఆలస్యం అయినా నోరెత్తడానికి లేదు ఎన్ని గంటలయినా వాళ్ళకోసం ఎదురు చూడాల్సిందే.
ఒకప్పుడు అది తట్టుకోలేక కొందరు యువకులు బావిలో చేద వేయడానికి ప్రయత్నించారు కానీ మాదిగ పెద్ద బాలయ్య అందుకు ఒప్పుకోలేదు అది తప్పన్నాడు ఊరి రివాజు ఎట్లా ఉంటే అట్లానడవాలని లేకపోతే మనమే మట్టికరుచుకు పోతామని హితవు పలకడంతో ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు.
ముందు పోయినా వరుసలో కుండపెట్టుకుని నీళ్లు చేది పోసేవాళ్ళకోసం ఎదురుచూపులతో కూర్చోవలసిందే తప్ప మరో ప్రయోజనం లేదు. నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ఆ కుండెడు నీళ్ల కోసం సిగపట్లు పట్టుకున్న సందర్భాలెన్నో. బాలాపూర్ లో ఫర్వాలేదు నీటి ఎద్దడి రాలేదు.
కానీ ఎట్లా. అమ్మ పెట్టదు తిననివ్వదు అన్నట్లున్న పరిస్థితి. ఒకటి రెండు సార్లు పెర్క లింగం తో పోట్లాడింది బాలమ్మ కుండ నిండా సరిగ్గ నింపమని
మొగులమ్మ కుటుంబం నీళ్లకోసం పడుతున్న యాతన గమనించిన బాలమ్మ వాళ్ళ గుంపు మీటింగులో విషయం చర్చకు పెట్టింది.
ఆ తర్వాత ఈ విషయం సంఘం మీటింగులో చర్చకు వచ్చింది.
మంచినీళ్ళకోసం తాము ఎంత తిప్పలు పడుతున్నది అన్ని ఊళ్ళ వాళ్ళు గొంతెత్తి ఒకే కంఠంతో చెప్పారు కానీ బావిలోంచి చేదుకునే ధైర్యం చేయాలంటే మాత్రం అపరాధ భావనతో వణికిపోయారు.
ఏమి జరుగుతుందోనని అభద్రతాభావం వాళ్ళని చుట్టుముట్టింది. భయంతో ముడుచుకుపోయారు.
సంఘం ప్రోత్సాహంతో ఒకరిద్దరు సభ్యులు ఉత్సాహపడ్డారు పిరికితనం వదిలి మనతిప్పలు మనమే తీర్చుకుందాం అన్నారు.
వెలివాడల్లో యువత ముందువరస నిలిచి తమ అమ్మలు, అక్కచెల్లెళ్ళకు బాసటగా నిలిచారు. పటేల్ పట్వారీల ఇండ్లల్లో, కాపుదనం వాళ్ళ ఇండ్లల్లో తాము చేసినప్పుడు, వాళ్ళ గిన్నెలు తోమి బోర్లిచ్చినప్పుడు, వాకిళ్లు ఊడ్చి సానుపు చేసినప్పుడు, గోడలకు అలుకుపూత పెట్టినప్పుడు, బియ్యం పప్పులు చేసినప్పుడు లేని అంటుడు ముట్టుడు మనం చేద బాయిలో వేస్తే వచ్చిందా. అన్న ప్రశ్న వేశారు సంఘం సభ్యులలో కదలిక తెచ్చారు
మాదిగ పెద్ద బాలయ్య దగ్గరకు వెళ్లి ఈ విషయంలో తమను వెనక్కి లాగొద్దని విన్నవించా.రు
సంఘం పనిచేస్తున్న అన్ని గ్రామాల్లో ఒకే రోజు ఒకే సమయంలో మంచినీళ్ల బావిలోంచి వెలివాడల్లో మనుషులే చేదవేసి నీళ్లు చేదే కార్యక్రమం పెట్టుకున్నారు.
ఎప్పటిలాగే మాల మాదిగలకు నీళ్లు చేదిపోద్దామని వచ్చిన పెరక హనుమాండ్లు అప్పటికే నీళ్లు తోడుతున్న మహిళల్ని చూసి గాభరాపడ్డాడు.
బాయి మైల పడిందంటూ తీవ్రంగా దుయ్యబడుతూ అందరి మీదా అరిచాడు కొట్ట కొట్ట వచ్చాడు పిచ్చిపట్టిన కుక్కలాగా ప్రవర్తిస్తున్న అతన్ని చూసి ముసిముసి నవ్వులు చిందించారు ఈ ఆడవాళ్లు.
అది చూసిన అతను పుండుకి కారం రాసినట్టు భగభగ మండిపోయి ఆకాశం దద్దరిల్లేలా రంకెలేశాడు. చేద వేస్తున్న ఆడవాళ్లపైకి కొట్టకొట్ట వచ్చాడు
నదురు బెదురు లేక అట్లాగే బావికాడ నించున్న వాళ్ళను చూస్తుంటే అతనికి వెన్నులోంచి సన్నని వణుకు మొదలయింది. ఏంచేయాలో తోచక వెనుదిరిగి రంకెలేస్తూ ఊళ్లోకి పరిగెత్తాడు హన్మాండ్లు.
అతన్నలా చూస్తుంటే కట్లు తెంచుకున్న ఆంబోతు గుర్తొచ్చింది ఆ ఆడవాళ్ళకి.
(ఇంకా వుంది…)