ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో హిందూ మతోన్మాదం పెట్రేగిపోయింది. నివురుగప్పిన నిప్పులా రగులుకోవడానికి సిద్ధంగా వున్న బిజెపి, ఆర్.యస్.యస్ శక్తులు, నాస్తికులు అంబేద్కర్ వాదులైన బైరి నరేష్, రేజర్ల రాజేష్ అయ్యప్ప, సరస్వతిల పై చేసిన వ్యాఖ్యల గురించి, రెండు తెలుగు రాష్ట్రాలలోని హేతువాదులు, అంబేద్కరిస్టులపై మూకుమ్మడిగా దాడులు చేసి ఒక భయానక వాతావరణం సృష్టించారు. ఒక మీడియా చానల్ అదే పనిగా ప్రచారం చేస్తూ వివాదం చేస్తే, ఏ సంబంధం లేని “బాలరాజు” అనే వ్యక్తిపై దాడి చేయడం, అది బైరి నరేష్ పై దాడిగా పదే పదే ప్రసారం చేయడం, తద్వారా రాష్ట్రంలో కొందరు అయ్యప్ప మాల దారులే కాకుండా ఆర్.యస్.యస్. శక్తులు అయ్యప్పల వేషాల్లో నరేశ్, రాజేష్ ఇళ్ళకు వెళ్ళి, ఇళ్ళల్లో స్త్రీ మీద బూతులతో దూషించడం, దాడులు చేయడం జరిగింది. మరోవైపు టి.వి.లలో, సోషల్ మీడియా లో నాక్తికులకు, అంబేద్కర్ వాదులకు వార్నింగ్ ఇస్తూ బెదిరించడం, సోషల్ మీడియాలో నరేష్, రాజేష్ కి మద్దతుగా ఎవరు పోస్టులు పెట్టినా, వాళ్ళను దూషించడం, వాళ్ళ మీటింగులకు వెళ్ళిన వారి ఇళ్ళకు వెళ్ళి దాడులు చేయడం జరిగింది.
బైరి నరేష్ ను అరెస్టు చేసిన పోలీసులు, అతన్ని జైలుకు తరలించే క్రమంలో, తగినంత సెక్యూరిటీ ఇవ్వకపోవడంతో హిందూ మతోన్మాదుల దాడులనుండి రక్షించుకోవడం కోసం, జైలు లోపలకు పరుగులు తీసిన వైనాన్ని మీడియా ప్రత్యేకంగా చూపించింది. అంటే బైరి నరేష్ ఎప్పుడు అరెస్టు అవుతాడో, ఎప్పుడు జడ్జీ ముందు హాజరు పరుస్తారో, ఏ జైలుకు రిమాండ్ చేస్తారో మొత్తం మీడియాకు తెలుస్తుంది, అయ్యప్ప ముసుగులో మతోన్మాదులకు తెలుస్తుంది, బైరి నరేష్ మీద దాడి చేయబోతే వారినుంచి తప్పించుకోవడానికి నరేష్ పరుగులు తీయాల్సి వచ్చింది. ఇదీ హేతువాది బైరి నరేష్ కు పోలీసులు ఇచ్చిన రక్షణ.
ఎంతో చైతన్యం నిండిన పోరాటాల గడ్డ అయినా తెలంగాణ రాష్ట్రంలో నేడు ఈ దుస్థితి ఎందుకు దాపరించిందో చూడాలి.
బిజెపి తన అధికార కాంక్షలో భాగంగా, దేశంలో అన్ని రాష్ట్రాల్లో చేస్తున్న ఫార్ములానే దేశ వ్యాప్తంగా అమలు చేస్తుంది. “భారతదేశంలో హిందూ మతం ప్రమాదంలో వుంది. మనమంతా హిందువులం – సింధూనది బిందువులమని! భారత దేశం హిందూ దేశం, మనుస్మృతినే రాజ్యాంగంగా అమలు చేయబూనుతామంటుంది”
భారతదేశంలోని ఇతర మతాలన్ని హిందూ జీవన విధానంలో భాగం కావాలని, ప్రత్యేక హక్కులు, చట్టాలు, ఆహార నియమాలు ఉండకూడదని చెబుతూనే, మత ఘర్షణలను ప్రేరేపిస్తుంది. తామే నిజమైన హిందువులపార్టీ అనీ, ఇతర పార్టీలన్నీ ఓట్ల కోసమే లౌకికవాదం జపిస్తున్నాయని కొన్ని దశాబ్దాలుగా ప్రచారం చేస్తూ, 1992 లో బిజెపి రధయాత్రలు చేసి, బాబ్రిమసీదు కూల్చివేతకు కారణమైంది. సరిగ్గా దశాబ్ది కాలం తర్వాత 2002 గుజరాత్ లో మహా మారణహోమం సృష్టించి ముస్లిం ఊచకోతకు కారణమైంది. భారత్ మైనారిటీలకు ఎలాంటి భద్రత వుందో ప్రపంచానికి చాటింది. తద్వారా రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి బిజెపికి అనుకూలమైనది. ఇదే ఫార్ములాను దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది.
గుజరాత్ మారణహోమం విజయవంతం చేసిన అప్పటి ముఖ్యమంత్రి, దామోదర్ నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా లు ఇప్పుడు భారతదేశానికి ప్రధాని, హోంమంత్రులు కావడానికి అర్హత సంపాదించారు. దేశ వ్యాప్తంగా ముస్లిం, క్రిష్టియన్ల మీద విద్వేషాలు రెచ్చగొడుతూ హిందూ మతోన్మాదాన్ని ఉసిగొలుపుతున్నారు.
ఒక ప్రక్క రాష్ట్రాల హక్కులను హరిస్తూ, వారిని బెదిరిస్తూ, పార్లమెంటులో కావాల్సిన బిల్లులు చాలా తేలికగా పాస్ చేయించుకుంటున్నారు. రక్షణ, న్యాయ వ్యవస్థలలో మేనేజ్ చేస్తూ బిజెపికి అనుకూలంగా, తీర్పులు పొందుతున్నారు. ప్రతిఘటిస్తున్న హక్కుల సంఘాలు, మేధావులను, ప్రగతిశీల శక్తులు, ప్రజా సంఘాలను అర్బన్ మావోయిస్టులు అనే ముద్రలు వేసి, ఎలాంటి విచారణ కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా జైల్లో అక్రమంగా నిర్బంధంచారు. మరి కొందరిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.
స్కూల్లో పిల్లలకు శాస్త్రీయ విద్యావిధానం బోధిస్తున్నాడని, మూడు నమ్మకాల పట్ల అవగాహన కలిగిస్తున్నాడాని మల్లిఖార్జున్ అనే నాస్తిక టీచర్ మీద మతోన్మాదులు దాడికి దిగారు. తన విధులకు ఆటంకం కలిగిస్తూ వాగ్వివాదాం చేశారు. చివరికి బలవంతంగా క్షమాపణ చెప్పించి గుడిలో బొట్టు పెట్టి పంపించారు.
ఒక వైపు బిజెపి మోడీ ప్రభుత్వం, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మి ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారు. లాభాల్లో వున్నా బి.యస్.యన్.యల్., రైలు, ఆయిల్, ఎయిర్లైన్స్, ఎల్.ఐ.సి., గ్యాస్, పోర్టు, బ్యాంకు లాంటి తొమ్మిది ప్రభుత్వ రంగాలని ప్రైవేటు పెట్టుబడిదారులకు షేర్లు కల్పించడం ద్వారా ఆ రంగాలను ప్రైవేటుకు కట్టబెట్టుతుంది. మరోవైపు కార్పొరేట్ సంస్థలు బ్యాంకుల వేలకోట్లు రుణాలు ఎగవేస్తున్నారు. ప్రభుత్వమే వాళ్ళ రుణాలను మాఫీ చేస్తుంది. ఒక ప్రక్క దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో ఉంచుతూ, కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలను ఊడబీకుతుంది. అధిక ధరలు హద్దులేకుండా పోయింది. ప్రజలు ఉద్యమించకుండా, సంఘటితం గాకుండా మతాన్ని రెచ్చగొడుతుంది. మతం కల్లోలం సృష్టించి, ప్రజల దృష్టిని మరల్చుతుంది.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, బిజెపి అధికారంలోకి వస్తుంది. గవర్నర్ వ్యవస్థ ద్వారా స్థిరంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరం చేస్తుంది. ఇడి, సిబిఐని ఉపయోగించి, రాష్ట్ర ముఖ్యమంత్రులను తమ చెప్పుచేతల్లో ఉంచుకుంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లోనే తెలంగాణలో బిజెపి అధికారం కోసం ఆరాటపడుతుంది. మత ఘర్షణలు రేపి అల్లర్లు తెగపడుతుంది. అందులో భాగంగా ఏ చిన్న అవకాశం దొరికినా, బిజెపి వాడుకుంటుంది.
బైరి నరేష్, రేజర్ల రాజేష్ పై ఇతరులపై దాడులను ఎదుర్కొనడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యింది. ప్రజా లౌకిక పార్టీలు విఫలం చెందాయి. ముఖ్యంగా ఓట్లు పార్టీలైన కమ్యునిస్టు పార్టీలు వాళ్ళ మేధావులు, హిందూ మతోన్మాదులకు ఊతం ఇచ్చేలా మాట్లాడారు.
ఈ దాడులను ఎదుర్కోవడానికి ప్రజా సంఘాలు కూడా ప్రతిఘటనోద్యమాలు చేయలేపోయాయి. ప్రగతిశీల భావాలు కలిగినవాళ్ళు, చైతన్యవంతమైన విద్యార్ధి మేధావులు బలంగా మాట్లాడలేకపోయారు. మరోవైపు మార్క్సిస్టు మేధావులు ముసుగులో కొందరు దేవుళ్ళను కించపరుస్తూ మాట్లాడకూడదు. ఎవరి నమ్మకాలు వారివి, అసభ్య పదజాలం వాడకూడదు. భక్తుల భావాలను కించపరిచే హక్కులేదని కొన్ని మేధావి వర్గాలు మాట్లాడాయి. అయితే “కించపరుస్తూ మాట్లాడిన వారిమీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఆ పని చట్టం చేస్తుంది. మనోభావాల పేరుతో మూక దాడులు చేయకూడదు. ఇళ్ళకు వెళ్ళి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం, దాడి చేయడం, ఏదైనా వుంటే చట్టాలు, కోర్టులు ఉన్నాయి కదా!” అని చెప్పలేకపోయారు.
అంటే బిజెపి బలంగా వుంది, ఇప్పుడు దానిని ఎదుర్కొనే పరిస్థితి, శక్తి మనకు లేదు. అందరూ నోరు మూసుకొని ఉండండి! అని మరో మేధావి వర్గం చెబుతుంది. ఇలాంటి చారిత్రక తప్పిదాల వల్లే కమ్యునిస్టు పార్టీలు తమ ఉనికిని కోల్పోతున్నాయి. పైగా కమ్యునిస్టు పార్టీలు దేవుడు లేడని చెప్పలేదని, దేవుడు ఉనికిని గుర్తిస్తామని నిస్సిగ్గుగా ప్రకటించుకున్నాయి.
బైరి నరేష్ అరెస్టు, దాడులు జరిగిన తర్వాత ఒక్క అంబేద్కర్ సంఘం కూడా తమ ఆరాధ్య దేవుడు (అంబేద్కర్ విగ్రహం) దగ్గర నిరసన రూపం గానీ, ప్రకటన గానీ చేయలేదు. పైగా మేమంతా చర్చించుకోని త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని సమతా సైనిక్ దళ్ నాయకులు మాట్లాడడం బాధాకరం. ఘటనకు, ప్రతిఘటన తక్షణమే లేకపోవడంతో అయ్యప్ప స్వాముల ముసుగులో వున్న ఆర్.యస్.యస్ వాదులు బైరి నరేష్ మద్దతుగా మాట్లాడిన వారందరి మీద దాడులకు తెగబడ్డారు. అంబేద్కర్ సోషల్ మీడియా మేధావులు సైతం నేరుగా మాట్లాడ్డానికి జంకారు. దేశ వ్యాప్తంగా వున్న నిత్యం అంబేద్కర్ అభిమానులు వాళ్ళ దగ్గర అంబేద్కర్ బొమ్మ దగ్గర నిలబడి హిందూ మతోన్మాదులు దాడులను వ్యతిరేకంగా నినదించివుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు. మేము మాటలే కాదు, అవసరమైతే దాడికి, ప్రతి దాడి చేస్తామనే సందేశం ఇచ్చివుంటే, బాలరాజు, మల్లిఖార్జున్, రాజేష్ ఇంటి మీద దాడులు జరిగేవి కావు. అస్తిత్వవాదులు, అంబేద్కర్ వాదులు, ప్రగతిశీల ప్రజా సంఘాలు ఐక్యంగా లేకపోవడం వల్లే, ఇవ్వాళ హిందూ మత శక్తులు రెచ్చిపోతున్నాయి.
అయ్యప్ప స్వామి మీద కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తే, పోలీసు కేసు కావాలిగానీ, మూక్కుమ్మడి దాడులు చేయడం ఏమిటి? ఈ ప్రశ్నలు కారంచేడులో అడిగాము. చుండూరు లో అడిగాము. దాడులకు గురైన ప్రతి పల్లె ఊరిని అడిగింది. చెరువు గట్టు దగ్గర గొడవ జరిగితే, పల్లెల్లో వాళ్ళు ఎదురుతిరిగారనీ, మూకుమ్మడి దాడులు చేసి మాదిగల్ని హత్యలు ఎందుకు చేశారు. సినిమా హాలులో గొడవైతే పోలీసు స్టేషన్లో కేసు పెట్టకుండా ఎందుకు మాలల్ని హత్యలు చేసి తుంగభద్రలో విసిరేశారు. గోదావరి జిల్లాలో శిరోముండనం ఎందుకు చేశారు? మా భూములు మాకివ్వండి అన్నందుకు లక్ష్మంపేటలో ఎందుకు చంపారు?
అది కమ్మ, రెడ్డి కాపుల కులహంకారానికి నిదర్శనం. అది ఇప్పుడు హిందూ మత రూపంలోకి మారింది. అది ఏ రూపంలోకి మారినా తెగిపడాల్సింది, దళిత, బహుజన తలలే!
హిందూ మతం దుహంకారానికి ముస్లిం, క్రిష్టియన్లు, హేతువాదులు టార్గెట్ అవుతున్నారు. జ్ఞానం సమాధి చేయబడి, అజ్ఞానం రాజ్యమేలుతుంది. వాళ్ళు చేస్తున్న మతోన్మాద దాడుల్లో బాధితులే నేరస్తులవుతున్నారు. సోకాల్డ్ మీడియా మేధావులంతా “దేవుడ్ని అలా కించపరిచ కూడదు కదా! భక్తులకు మనోభావాలు ఉంటాయి కదా!” అని నంగి, నంగి మాటలు మాట్లాడుతున్నారు. సమస్యలో ఉపరితలాంశాలనే చూస్తున్నారు గానీ, అంతరంగంలో హిందూ ఫాసిజాన్ని ప్రజలకు అర్థం చేయించడంలో ఈ మేధావులు వెనకబడిపోయారు.
మతాన్ని కించపరుస్తూ మాట్లాడిన వారిమీద చట్టం చర్యలు తీసుకుంటుంది గానీ, మీరెవరు దాడులు చేయడానికి అని రాజ్యం అడగాలి! ముస్లిం, క్రిష్టియన్ల మనోభావాలు దెబ్బతినే విధంగా హిందు మతోన్మాదులు ఎంత నీచమైన, కించపరిచే వ్యాఖ్యలు చేసినా మాట్లాడనివాళ్ళు, హిందు మనోభావాల దగ్గర మాత్రమే రాజ్యం, ఈ మేధావులు మాట్లాడతంలోని ద్వంద్వ ప్రమాణాలను ప్రజలు అర్థం చేసుకోవాలి!
బిజెపి హిందూ మతం పేరుతో రాజకీయాలు చేస్తుంది. దీనిని ఎదుర్కోవడం ఎలానో, ప్రత్యమ్నాయం మార్గాలు ఏమిటో అందరూ ఆలోచించవలసి ఉన్నది. హిందూ ఫాసిస్టులను నుండి దేశాన్ని రక్షించండమే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం.