ప్రేమ చాల సహజమైన సింపుల్ యిమోషన్. కానీ మనసులే కాంప్లికేటెడ్. అయితే యే ప్రేమ సహజమైనది లేదా వుదాత్తమైనది లేదా నీచమైనది అనేటటువంటి విషయాలని నిర్ణయించే సమాజం మన చుట్టూ వుంటుంది. వారే మనమన ప్రేమలకి తీర్పులు చెపుతుంటారు.
ప్రేమ చుట్టూ పూల తీగెలే కాదు ముళ్ళ కంచెలూ వున్నాయి.
యెందుకని?!
మనకి యెటువంటి ప్రేమ కావాలి.. అంటే మనకి యెటువంటి జీవిత సహచర్యం కావాలి?!
యీ విషయం అర్ధం కావాలంటే ముందు మనకి మనం కొంతైనా అర్ధం కావాలి. యిష్టమై రంగు, యిష్టమై ఆహారం, యిష్టమైన ఆట యిలా యిష్టమైన మానసికమైన స్నేహితురాలు, స్నేహితుడు, సహచర్యం వెంటనే తట్టదు. యెందుకంటే మన ఆలోచనలని, అభిరుచులని, ఆసక్తులని, ఆశయాలని, ఆకాంక్షలని, చదువుని, వృత్తిని పూర్తిగా డిజైన్ చేసే మార్కెట్ మన చుట్టూ దొంతర్లుగా ఆవరించి వున్నప్పుడు మనదైన ఆంతరంగం యేమిటో చుట్టూ వున్న మార్కెట్ మనలోకి వొంపుతున్నదేమిటో పట్టుకోవటం కష్టమే.
మనం చేస్తున్న ప్రతీ పనీ వొక ప్రాజెక్ట్ లా మన ముందుకు వచ్చి చాల యేళ్ళు అయింది. మనం మన వృత్తినే కాదు మన వ్యక్తిగత జీవితాల్ని ప్రాజెక్ట్ లానే చూడటానికి అలవాటు పడిపోయాం. అలాగే కొందరికి ప్రేమని కూడా వో ప్రాజెక్ట్ గా చూడడానికి అలవాటు పడిపోయారు. అలా కాకుండా మన ఆంతరంగిక జీవితాన్ని సుసంపన్నం చేసే ప్రేమని మనం హృదయమంతా విప్పి ఆహ్వానించాలంటే మనకి మనమేమిటో కొంతైనా అర్ధం కావాలి. మనల్ని మనం అర్ధం చేసుకోవటం యెలా?! మనలోకి మనం యెలా తొంగిచూసుకోడానికి మనకి కాస్త ధైర్యం కావాలి. తీరుబాటూ కావాలి. నిజాయితీ కావాలి. ముఖ్యంగా మన మీద మనకి ప్రేమ వుండాలి.
ప్రపంచం సాహిత్యంలో యెన్నెన్నో ప్రేమ కథలు, నవలలు, కవిత్వం నిండుగానే వున్నాయి. సినిమాలకి ప్రేమే ప్రధాన కథ. ప్రేమ కథల్లో కాన్ఫ్లిక్ట్ అమిరినవి వున్నాయి. ఫోర్సెఫుల్ గా వున్నవి వున్నాయి.
ప్రేమ ప్రధానాంశంగా అనగానే జమీల్యా నీలి ఆకాశం, సైఫ్ మైదానాలు, ధనియార్ గొంతు అలాఅలా మనసంతా చుట్టుకుంటుంది. గాన్ విత్ ద విండ్ యుద్ధం వొక క్యారెక్టరై ఆయా సమయాల్లో ప్రేమ యెలా వలయాలువలయాలుగా తిరిగిపోతోందో హృదయాన్ని మెలివేస్తుంది. బోలెడంత సాహిత్యం, సినిమాలు యెన్నెన్నో గుర్తొస్తూనే వున్నాయి. సంతోషాన్ని.. దిగులుని.. దుఃఖాన్ని జలపాతంలా కురిపించేవి.
అయితే వ్యక్తి కేంద్రంగా పాపులర్ సాహిత్యం వచ్చిన 80 ల నుంచి చూస్తే యిప్పుడు ఆ ధోరణి జీవన విధానంగా స్థిరమైపోవటం చూస్తున్నాం. స్త్రీపురుష సంబంధాల్లో అనేక మార్పులు వచ్చిన కాలమిది.
ప్రేమల చుట్టూ వ్యక్తిగత కారణాలు కంటే సామాజిక, రాజకీయ, సాంఘీక, వర్గ కారణాలు కొన్ని సార్లు ప్రేమ ని హింసాత్మకంగా నిర్మూలించటం చూస్తున్నాం. యిది విపరీతమైన ఆందోళన కలిగించే విషయం. యిటువంటి ధోరణులను వీలైనంత త్వరగా అణిచివేయ్యటం, అలాంటి ఆలోచనలే రానివ్వని సమాజాన్ని మనం వెంటనే తెచ్చుకోవాలి.
అది యెలా సాధ్యమవుతుందని మనమంతా ఆలోచిస్తున్నాం. రాస్తున్నాం. చెపుతున్నాం. సినిమాలూ వస్తున్నాయి. సమాజంపై ప్రేమ వున్నవాళ్ళమంతా మనమన పరిధిలో మనుషులను ప్రేమించడానికి కావల్సినవన్నీ చేస్తున్నాం.
అక్టోబర్ 29 న సతీష్ చంద్రగారి కొత్త కథల పుస్తకం ” లవ్ ఎట్ డస్ట్ సైట్” పుస్తకావిష్కరణ సభలో ఆ పుస్తకంని పరిచయం చేశాను. ఆ పుస్తకం లో 101 ప్రేమకథలు వున్నాయి. అన్నీ సింగిల్ పేజ్ లేదా పేజీన్నర వున్న ఆ కథలని మార్కెట్ సైట్, క్రైమ్ సైట్, క్యాస్ట్ సైట్, డస్ట్ సైట్, వెడ్డింగ్ సైట్, ఆఫీస్ సైట్, పబ్ సైట్, బ్రేకప్ సైట్ .. యిలా తొమ్మిది సైట్స్ గా విభజించారు.
సున్నితమైన హాస్యం.. స్పష్టమైన వ్యంగ్యం తో మిళితమైన యీ కథలన్నీ కాంటెంపరరీ సొసైటీ టెంప్లెట్ యీ “లవ్ ఎట్ డస్ట్ సైట్”.
“ప్రేమను గుర్తించేలా చెయ్యాలంటే ఒకటే మార్గం: ప్రేమ కానిదేదో చూపించాలి..” అంటున్నారు రచయిత.
ప్రేమ రాజకీయాలు.. సామాజికం.. నిండైన తాత్వికత వున్న యీ పుస్తకంలో వొక్కో సైట్ లో ప్రేమలు యెక్కడ యెలా పుడతాయి? యెలా అంతమైపోతాయి?! చిన్ని లేతచిగురాకు లాంటి ప్రేమ గా వున్నప్పుడే యే దుమ్మూ ధూళీ ప్రేమల్ని కప్పేసి వికసింప చెయ్యనివ్వదో యిలా ప్రేమకి సంబంధించిన అనేక కోణాలని వివరించిన యీ కథల పుస్తకం నిండుగా హాస్యం.. వ్యంగ్యం చదువుతున్నంత సేపు పాఠకులను నవ్విస్తూనే వుంటుంది. ఆ నవ్వులు వూరికే నవ్వించవు. ఆలోచనలనిస్తాయి. బాధపెడతాయి. నడుస్తోన్న సమాజపు పోకడలను యెత్తి చూపిస్తాయి.
మార్కెట్ సైట్:
ఇవ్వాలి, పుచ్చుకోవాలి కాదు. అమ్మాలి, కొనాలి. అదే మార్కెట్. బోడి హృదయాలు ఎవరికయినా వుంటాయి. ఉత్తినే ఇచ్చేస్తానని తిరిగితే ఎవరూ కొనరు. మార్కెట్ లేకుండా ఒక్క మనసూ అమ్మడు పోదు.
యీ మార్కెట్ సైట్ లో “ద్వేష ప్రేమ” లో ఒకే రోజు వందకు పైగా మగ పురుగులు, పేరాపేరాలు లవ్ ప్రపోజల్స్ ను టెక్స్ట్ చేస్తుంటే ఏం చెయ్యాలి? ప్రేమ సందేశాలనే చదవాలా? క్లాస్ పుస్తకాలనే చదవాలా?!
సోషల్ మీడియాలో ప్రేమల మీద, పరిశీలనలో వున్న ప్రేమలు యెలా వుంటాయో యిలా ప్రేమ మార్కెట్ సైట్ లో ప్రేమని వో సరుకుగా చూస్తారో చూపించే కథలున్నాయి.
క్రైమ్ సైట్ :
ఆపండి కథ లో మొగుడంటూ వచ్చిన వాడు పిరికి వాడు. ప్రియడేమో గుండా. ఎవర్ని చేసుకోవాలి?
‘పాత్ర’లు తోమితే, ప్రేమ దక్కింది లో “మగవాడు అంట్లు తోమినంత మాత్రాన, ఆడదాన్ని గౌరవిస్తాడనన్న హామీ లేదు.
క్యాస్ట్ సైట్ :
ప్రేమలో కులాలు కలవకపోతే యెలాంటి దాడులు జరుగుతాయో, ఆ పర్యవసానాలు యెలా వుంటాయో యీ క్యాస్ట్ సైట్ లో వున్న కథల్లో కనిపిస్తాయి.
డస్ట్ సైట్:
పంట కోసుకుని, పరిగె వదిలేసినట్లు, పెద్ద బేరాలూ, పెద్ద నేరాలూ పెట్టి పుట్టిన వాళ్ళు కొట్టేసి, చిల్లర బేరాలూ, చీప్ నేరాలూ దరిద్రులకొది లేస్తారు.
మనసులోని ప్రేమ వొక పొరగా కూడా వికసింప చెయ్యకుండా మసక బారింపచేసే పరిస్థితులని యీ డస్ట్ సైట్ లో చూస్తాం.
క్యాంపస్ సైట్ :
క్యాంపస్ ప్లేస్ మెంట్ కు పేరొందిన కంపెనీలే రానక్కరలేదు. ఆ మాటకొస్తే లైఫ్ లో సెటిలవ్వటానికి ప్లేస్ మెంటే అక్కరలేదు. చిన్ని స్టేట్ మెంట్ చాలు. ఐ లవ్యూ’ అని. మంచి ర్యాంకున్న అమ్మాయి ఆ మాట అంటే చాలు. నడిచే బ్యాంక్ దొరికినట్లే.
క్యాంపస్ ప్రేమల్లో క్యాలిక్యులేషన్స్ ని పట్టి యిచ్చే కథలు యీ సైట్ లో వున్నాయి.
వెడ్డింగ్ సైట్:
పెళ్ళి ముందా? ప్రేమ ముందా? అబ్బే ఇంత ఆలోచించుకునే టైమ్ వుంటుందేమిటీ? వివాహం వచ్చినా, వీసా వచ్చినా ఆగదు అంటాడు – పెళ్ళి చూపులకు అమెరికా నుంచి వచ్చిన కుర్రాడు.
హడావిడి గా పెళ్ళి అయిపోతుంది.
ఫ్లయిట్ మిస్సవుతానన్న హడావిడి లో ప్రేమని మిస్స య్యానని పెళ్ళి అయ్యాక పెళ్ళికూతురికి తెలుస్తుంది.
యిలాంటి యీ నాటి పెళ్ళుళ్ళ గురించి యీ మ్యారేజ్ సైట్ విభాగంలో వున్నాయి.
ఆఫీస్ సైట్:
ఉద్యోగం వచ్చాక సగం జీవితం చల్లారిపోతుంది. చల్లగానూ వుండదు. వెచ్చగానూ వుండదు. లంచ్ బాక్సుల్లోని అన్నం లాగా.
ప్రేమల్లోకి పేస్కేలూ, కటింగులూ చూసుకొని ప్రేమించటంలోని లెక్కల్లో లేని ప్రేమల్ని చెపుతాయి యీ సైట్ లోని కథలు.
పబ్ సైట్:
వారమంతా సిస్టమ్ ముందు కూర్చొని కూర్చొని వారాంతంలో పబ్బుల్లో క్షణం లో పుట్టిన ప్రేమలు, క్షణంలో మాయమయ్యే తీరుని యీ పబ్ సైట్ లోని కథల్లో కనిపిస్తాయి.
బ్రేకప్ సైట్:
ప్రతీ ప్రేమా శుభలేఖ వరకూ రావాలనే రూలు లేదు. కొందరు ప్రేమికులు బ్రేకప్ కోసమే యెలా ఎదురు చూస్తుంటారో యీ బ్రేకప్ సైట్ కథల్లో చూడవొచ్చు.
యిలా తొమ్మిది సైట్స్ గా విభజించి యీ నాటి ప్రేమలు వాటిని చుట్టుముట్టి వున్న మార్కెట్, కులమతాలు, జెండర్ అసమానతల మీద పదునైన చూపున్న కథలు యిందులో వున్నాయి.
యేది ప్రేమకాదో గుర్తించే చూపునిచ్చే లోతున్న కథా సంకలనం “లవ్ ఎట్ డస్క్ సైట్”
ప్రేమ వొక్కటే అప్పుడూ యిప్పుడు యెప్పుడు.
కానీ ప్రేమ చుట్టూ అల్లుకొంటున్న చిక్కుముడుల్లోని సంక్లిష్టతని ప్రశ్నించకపోతే.. ప్రేమ పేరుతో జరుతోన్న హింస జరగకుండా వుండాలంటే యేది ప్రేమా యేది కాదో తెలుసుకొనే యెరుక చాల అవసరం.