ప్రేమంటే ఇదేనా…

చీకటి రేఖలు విచ్చుకుని వెలుతురు పరుచుకుంటోంది. పక్షుల కిచకిచలు ఆగిపోయి, గూళ్ల నుంచి ఎగిరిపోతున్నవి.

‘‘పోలీసులు ఈ ఇంటికి కూడా వచ్చి చెక్‌చేస్తే…’’ కొద్దిసేపు ఆగింది కమాండర్‌ సుగుణ.

సుగుణ ఏమి చెప్తె అది చెయ్యడానికి సిద్ధంగా ఉన్న దళసభ్యులు ఊపిరి బిగపట్టి వింటోంది.

డిప్యూటీ కమాండర్‌మల్లేష్‌, తాను కలిసి తీసుకున్న నిర్ణయాన్ని గుండెల నిండా గాలి పీల్చుకుని చెప్పింది సుగుణ, ‘‘మన దగ్గర ఉన్న మైన్‌ను గోడకు పెట్టి పేల్చుదాం. అలా పేల్చుతాం అని పోలీసులు ఊహించరు. వాళ్లు తేరుకునేలోగా మనం ర్యాపిడ్‌ఫైర్‌చేస్తూ కూలిన గోడలోంచి వెళ్లిపోవాలి. ఇది తప్ప మన దగ్గర ఇంకో మార్గం లేదు’’.

బీఎస్‌ఎఫ్‌ జవాన్లు అప్పటికే ఊరంతటిని చుట్టు ముట్టారు. ఊరి నిండా పోలీసులే. దళం ఊర్లోకి వచ్చిన సమాచారం ఎవరు అందించారో తెలియదు. ప్రస్తుతం వారు ఉన్న ఇంటి యజమాని సిద్ధయ్య కూడా పోలీసుల దగ్గరే ఉన్నడు.

స్కూల్‌ దగ్గర సిద్ధయ్యను పోలీసులు విపరీతంగా కొడుతున్నారు. అయినప్పటికీ దళం సంగతి తనకు తెలియదనే చెప్తున్నాడు సిద్ధయ్య. దెబ్బలతో వీపుపై రక్తం ధారలుకట్టింది. బహుశా ఎడమ చెయ్యి విరిగి ఉండవచ్చు, వేలాడుతోంది. దళం వెంట సిద్ధయ్య ఉన్నాడనే పక్కా సమాచారం పోలీసులకు ఉంది. అందుకే ఆ విధంగా హింసిస్తున్నారు. సామాన్యంగా తెచ్చిన వ్యక్తి, అందునా సంఘనాయకుడు అయితే తన ఇంట్లనే దళానికి షెల్టర్‌ఇవ్వడు. అందుకే పోలీసులు అతని ఇంటిని సోదా చేయాలనుకోలేదు. దళం ఉన్న సమాచారం చెప్పమని హింసిస్తున్నరు.

ఊరి బయటకు చెంబట్కకు పోయినోళ్లను పోయినట్టే పట్టుకున్నరు. ఒకరిద్దరు దూరం నుంచే జవాన్లను పసిగట్టి వచ్చి ఊర్ల చెప్పారు. కుక్కపిల్లను కూడా ఊరు దాటిపోనివ్వడం లేదు వందలాది బీఎస్‌ఎఫ్‌జవాన్లు. గొడ్లను, గొర్లను కూడా మేతకు తోల్కపోనిస్తలేరు.

బడి దగ్గర తండ్రిని కొడుతున్న విషయాన్ని సిద్ధయ్య కొడుకు పన్నేండ్ల శంకర్‌వచ్చి చెప్పిండు దళానికి.

‘‘నువ్వు బడి దగ్గరికే వెళ్లు. ఏం జరుగుతుందో చూడు’’ అని శంకర్‌ను పంపింది సుగుణ, చిన్న పిల్లవాడు కాబట్టి అంతగా పట్టించుకోరు అని.

సిద్ధయ్య ఎకరం పొలంలో వరి పండిస్తడు. మిగతా సమయంలో కూలికి పోతడు. సిద్ధయ్యకు ఐదవ తరగతి చదువుతున్న ఒక కొడుకు, మూడో తరగతి చదువుతున్న బిడ్డ ఉన్నరు. సిద్ధయ్య భార్య పుల్లమ్మ రెండు బర్లను సాదుతుంది. వాటి పాలను అమ్ముతది. బర్లను కాసుకొస్తది. సిద్ధయ్య తల్లి రుక్కమ్మ పిల్లలను పట్టుకుని ఇంటికాడ ఉంటది.

సిద్ధయ్య భార్య, తల్లికి చాలా ఆందోళనగా ఉన్నది ఒకవైపు సిద్ధయ్యను పోలీసులు ఏమన్న చేస్తరేమో అని, మరోవైపు దళాన్ని ఎట్లా తప్పించాలి? వారికి ఏమన్న అయితదేమోనని.

ఆందోళన పడుతూనే సిద్ధయ్య భార్య పుల్లమ్మ వంట చేస్తున్నది. సుగుణ సైగచేసి పిలిచింది పుల్లమ్మను. అప్పటికే సిద్ధయ్య తల్లి కూడా ఆ అర్రల ఉన్నది.

‘‘అమ్మా, అక్కా! సిద్ధన్న ప్రాణం పోయినా మేము ఇంట్ల ఉన్నట్టు చెప్పడు. అన్న సంగతి మాకు తెలుసు. మీరూ చాలా ధైర్యంగనే ఉన్నరు. మీ ధైర్యమే ఇప్పుడు మమ్మల్ని కాపాడ్తది. పోలీసులు పక్కా సమాచారంతోనే వచ్చినట్టున్నరు. మేము బయటికి కూడా వెళ్లలేని స్థితి. బయటకు వెళ్తే పోలీసులు చూస్తరు. ఒకవేళ పోలీసులు ఊరి చివరన వున్న మీ ఇంటి వరకు రాకుండా పోతే మంచిదే. మనం బయటపడ్డట్టే. కానీ పరిస్థితి అట్లా కనిపిస్తలేదు. చెయ్యిదాటి పోయింది.’’ సుగుణ చెప్తున్నది.

‘‘మరి ఎట్ల అక్క’’ ఏం చెయ్యాలో తెలియక అడిగింది పుల్లమ్మ.

‘‘ఈ గోడకు మైన్‌పెట్టి పేల్చి, మేము బయటకు పోదామనుకుంటున్నమమ్మా. అదీ తప్పని పరిస్థితి అయితేనే. మీ ఇల్లు కూలి పోవచ్చు. మీ గురించి పార్టీ తప్పక పట్టించుకుంటది’’ పుల్లమ్మను కౌగిలించుకుంది సుగణ.

‘‘బిడ్డా! ఇల్లు కూలితే మళ్ల కట్టించుకుంటం. పాణం పోతే… పాణం వస్తదా’’ కండ్లనీళ్లు పెట్టుకుంది సిద్ధయ్య తల్లి.

అమ్మ రెండు చేతులను పట్టుకుని, ‘‘సిద్ధన్న గురించా అమ్మ? మీ గురించి పార్టీ తప్పక పట్టించుకుంటది’’ సుగుణ.

‘‘వానిదేనా పాణం? మీది కాదా బిడ్డ! ఏ తల్లి కన్నబిడ్డలో మా గురించి ఇట్ల తిరుగబడ్తిరి. మీరు సల్లగుండాలి’’ అన్నది అమ్మ.

***

దళసభ్యులు మైన్‌ఏర్పాట్లలో మునిగిపోయిండ్రు. అప్పటికే కిట్లన్ని సర్దుకున్నరు.

తాము చనిపోతామేమో అనే ఆందోళన వారిలో ఏ కోశాన లేదు. జరుగనున్న ఘటనను ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతున్నరు. ప్రాణంతో ఉండాలంటే తెగించకతప్పని స్థితి.

***

‘‘అమ్మా!’’ చేతులెత్తి నమస్కరించింది సుగుణ.

‘‘బిడ్డా!’’ సుగుణ రెండు చేతులను పట్టుకుంది అమ్మ.

‘‘ఏం చెయ్యమంటవు? చెప్పు బిడ్డ. నువ్వు ఎట్ల చెప్తె అట్ల చేస్తం’’ అన్నది అమ్మ.

అమ్మ ధైర్యానికి మనసులోనే మరోసారి దండం పెట్టుకుని, కౌగిలించుకుంది సుగుణ.

‘‘అమ్మా! ముందు దర్వాజ తలుపులు ఇట్లనే తెరిచి ఉంచురి. ఎవరికీ మన ఇంటి మీద అనుమానం రావద్దు. నువ్వు బయట అరుగు మీద కూసో. అన్నీ గమనిస్తూ వుండు. ఏదైనా కొత్త విషయం కనిపిస్తే నీ మనవరాలికి చెప్పి మా దగ్గరికి పంపు. నీ మొఖంలో అస్సలు భయం కనిపించవద్దమ్మ’’ మరోసారి గుర్తుచేసింది సుగుణ.

‘‘అట్లనే బిడ్డ’’ అని కర్ర తీసుకుని ఇంటి ముందర అరుగు దగ్గరికి పోయింది అమ్మ.

‘‘పుల్లమ్మ! వంట చేసుకుంట నువ్వూ ఓ కంట కనిపెట్టుకుని ఉండు’’ అన్నది సుగుణ

‘‘అట్లనే అక్క’’ అన్నది పుల్లమ్మ.

కొడుకును పోలీసులు ఎంత కొడ్తున్నరో… తల్సుకుంటెనే కడుపుల పేగులు కదులుతున్నయి అమ్మకు. ఈ బిడ్డలు… మా కోసం కన్నకష్టాలు పడుతున్నరు కదా. ఎట్ల కాపాడుకోవాలి? అమ్మకు మనసు కలిపెడుతున్నది. పుల్లమ్మ పరిస్థితి అట్లనే వున్నది.

పుల్లమ్మ, అమ్మ ధైర్యానికి దళమంతా మనసులోనే నమస్కరించుకున్నరు.

అరుగు మీద కూసొని పండ్ల పుల్లతోటి పండ్లు తోముకుంట అమ్మ వచ్చే, పోయేటోళ్లతో ముచ్చట పెట్టుకుంట ఊర్ల పోలీసుల సంగతి తెలుసుకుంటున్నది.

‘‘దళమెప్పుడు వచ్చిందో, మాకు గింత దెల్వకపాయె. పోలీసోళ్లకు ఎట్ల తెలిసె’’

‘‘గా రంగమ్మోళ్ల ఇంటిదాన్క వచ్చిండ్రు పోలీసులు. ఇల్లిళ్లు దోలాడుతున్నరు’’

‘‘వామ్మో, ఏ ఇంట్ల ఉన్నరో ఏమో.’’

‘‘ఈ ఆపతి తప్పితె బాగుండు’’

రకరకాలుగా అమ్మతో మాట్లాడుతున్నరు. ‘అయ్యో బిడ్డా! అవునా కొడ్కా’ అని వారితో మాట్లాడుకుంట అరుగు మీదనే కూసున్నది అమ్మ. పండ్లపుల్ల వేసుకుని, మొఖం కడుక్కునే వరకు రోజూ ఆ అరుగు మీదనే కూసుంటది. ఇయ్యాళ కూడ అట్లనే కూసున్నది.

అది సెమీమైదాన ప్రాంతం. పోలీసులు విపరీతంగా గాలిస్తున్నరు. అందునా ఎండాకాలం. చెట్ల ఆకులన్నీ రాలిపోవడం, చిన్నా చితకా ఎండిపోవడంతో అడవిలో వున్నప్పటికీ చాలా దూరం వరకు కనిపిస్తున్నరు. కాబట్టి ఇండ్లళ్లనే షెల్టర్‌తీసుకోవాలని, చాలా జాగ్రత్తలతో ఉండాలని పార్టీ నిర్ణయించింది.

ఏ అర్ధరాత్రో ఊర్లోకి రావడం. ఆ గ్రామంలో సంఘ నాయకులను మాత్రమే పిలుపించుకుని మాట్లాడటం. తప్పనిసరి అయితే గ్రామం చుట్టూ సెంట్రీలను, మైన్లను ఏర్పాటు చేసుకుని మీటింగ్‌ నిర్వహిస్తోంది దళం.

ఏ ఇంట్లో షెల్టర్‌ తీసుకున్నారో చుట్టుపక్కల ఇళ్లవారికి కూడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది దళం. మోరీల నుంచి ఎక్కువ నీరు బయటకు వస్తే అనుమానం వస్తదని వెంట వెంట స్నానం చెయ్యకపోయేవారు. బయటి వారికి వినిపించకుండా చాలా నెమ్మదిగా మాట్లాడుకునే వారు. లెట్రిన్‌లు ఉండవు కాబట్టి గదిలోనే ఓ మూలకు దుప్పటి కట్టి దొడ్డికి పోయి, కుండలో వేసి మూత పెట్టేవారు. ఒకోసారి కడుపు పాడైన వారు వెళ్లినప్పుడు వచ్చే వాసనకు మిగతావారు ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. వెళ్లినవారూ ఇబ్బందులు పడేవారు. ఏమీ చేయలేని పరిస్థితి. దళం ఆ ఇల్లు విడిచి వెళ్లేటప్పుడు ఆ కుండను మోసుకుని వెళ్లి, ఊరి బయట ఎక్కడో పడేసేవారు.

ఇన్‌ఫార్మర్లను పోలీసులు రోజురోజుకు పెంచుకుంటున్నరు. ఇన్ఫార్మర్ల పనంతా ప్రతి ఇల్లును, మనుషుల కదలికలను గమనించడమే. వారూ బీదవారే అనే అవగాహన పార్టీకున్నది. కానీ కఠినంగా ఉండకపోతే తీవ్రనష్టం జరుగుతున్న పరిస్థితి కూడా వుండిరది.

ఇండ్లళ్ల షెల్టర్‌తీసుకుంటున్న మొదట్లో నీళ్లు ఎక్కువ రావడం వంటి విషయాలను గమనించి కూడా పోలీసులకు సమాచారం వెళ్లేది. కాకపోతే పోలీసులు వచ్చేటప్పటికే దళం వెళ్లిపోవడం లేదా ఇల్లు మారడంతో ఎన్‌కౌంటర్లు తప్పినయి.

ఈ రోజు మాత్రం తెల్లవారే లోపలే పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టారు. వాహనాల శబ్దానికి దళం అలర్ట్‌అవుతదని వాటిని ఊరికి చాలా దూరంగా ఆపి, నడిచి వచ్చారు. దళం, లేదంటే సంఘం వారు, ఎవరూ దొరకకపోతే అమాయకులను తీసుకెళ్లి ఎన్‌కౌంటర్‌ చేస్తున్నారు పోలీసులు. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు టార్గెట్‌లు, అందుకు తగిన ఇనామ్‌లు ఇస్తున్న రోజులు.

పార్టీ బలంగా వున్న ఏరియాలో పోలీసులకు ఈ పని తప్పితే ఇంకో విధి ఉండేది కాదు. ఆడవారిని వేధింపులకు గురిచేయడం, అత్యాచారం చేయడం పోలీసులు తప్ప ఇతరులెవరూ చేయని రోజులు. మరోవైపు, పోలీసుల ఆగడాలను నివారించలేక పోవడంతప్ప మిగతా ప్రజల సమస్యలన్నిటిని పార్టీ పరిష్కరిస్తున్నది.

***

‘‘అక్కా, ఇంత అన్నం తినురి. మళ్ల ఏ యాళ్లకు తింటరో’’ అని అన్నం, కూర గిన్నె తెచ్చి అర్రల పెట్టి పోయింది పుల్లమ్మ.

ఇంత ఆపతిలోనూ తమ కడుపును చూసిన అక్కను చూసి సుగుణ కండ్లల్ల నీళ్లు తిరిగినయి.

‘‘కామ్రేడ్స్‌, మల్లేష్‌తో పాటు మీరు ఐదుగురు తొందరగా… కానీ నెమ్మదిగా తినండి. మేము నలుగురం తర్వాత తింటాం’’ అన్నది సుగుణ.

‘‘అక్క నువ్వు చెప్పేది ఎట్లుందంటే… నిప్పులల్ల దూకిరి కానీ కాలకుండ్రి అన్నట్టుంది. తొందరగంటె తొందరగనే, నెమ్మదిగ అంటే నెమ్మదే కదా’’ అన్నడు ప్రకాశ్‌.

ఇంటర్‌సె కండియర్‌ అయిపోగానే దళంలోకి వచ్చిండు. వచ్చి మూడు నెలలే అవుతుంది. కానీ శ్రద్ధతో అన్నీ నేర్చుకున్నడు. అందరికంటే చిన్నవాడని ప్రకాశ్‌ని కొంచెం గారాభం చేస్తుంది సుగుణ. ఆ చనువుతోనే సుగుణక్క మీద జోక్స్‌వేస్తుంటాడు ప్రకాశ్‌.

అందరు కిసకిస నవ్విండ్రు. సుగుణక్క కూడా నవ్వుని ఆపుకుని ‘‘ఆ… సరే. గొంతు పడకుండ తినండి’’ అన్నది.

వెంటనే కిట్ల నుంచి ప్లేట్స్‌తీసి అన్నం పెట్టుకుని తినడం మొదలు పెట్టిండ్రు. తినకుండా ఉన్న నలుగురిలో ఒకరు మైన్‌ దగ్గర ఉంటే, మిగతా ముగ్గురు పొజిషన్‌ తీసుకున్నారు.

డిప్యూటీ మల్లేష్‌వచ్చి ‘‘మీరూ తినండి’’ అన్నడు సుగుణతో.

సుగుణతో పాటు మిగతా ముగ్గురు తినడం ఇంకా పూర్తి కాలేదు. ఆందోళనగా అర్రలకు వచ్చిన పుల్లమ్మ, ‘‘మా ఇంటికి రెండ్లిండ్ల అవతలి వరకు పోలీసులు వచ్చిండ్రక్కా’’ అని చెప్పింది.

‘‘సరే అక్క. ఏం జరిగినా ధైర్యం జెడకుండ్రి’’ అని,

‘‘కామ్రేడ్స్‌! అందరూ బాటిళ్లల్ల మంచినీళ్లు నింపుకున్నరు కదా’’ మళ్లోసారి గుర్తు చేసింది సుగుణ.

నింపుకున్నమన్నట్టుగా తలలు ఊపిండ్రు.

‘‘కిట్లు వేసుకోండి. నేను కాషన్‌ఇవ్వగానే మైన్‌ను పేల్చాలి. సరేనా’’ నెమ్మదిగా చెప్పింది సుగుణ. అప్పటికే కడగని ప్లేటును కిట్‌లో పెట్టుకుంది. చెయ్యి కడుక్కునే టైమ్‌లేదు. ప్యాంట్‌కే తుడుచుకుంది.

అందరూ అలర్ట్‌ పొజిషన్‌లో తుపాకులు పట్టుకుని నిలబడ్డరు.

‘‘మైన్‌ పేల్చగానే నాతో పాటు మరో ఇద్దరు సభ్యులు… మొత్తం మేం ముగ్గురు ర్యాపిడ్‌ ఫైర్‌ చేసుకుంటూ ఇంట్ల నుంచి బయటికి పోతం. మా వెనకాలే సుగుణ, గార్డుతో పాటు మిగతా వారంతా ఫైరింగ్‌ చేసుకుంటూ బయటకు రావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం విడిపోకూడదు. విడిపోయామా… సంఖ్య తగ్గి బలహీనమైతం. ఫైరింగ్‌ చేసుకుంటూ బయటపడుడు తప్ప మరో దారి లేదు. ఒకరికి ఒకరం కవర్‌ ఫైరింగ్‌ ఇచ్చుకుంటూ… ఒకరి వీపులు ఒకరికి ఆనించుకుని ఫైరింగ్‌చేస్తూ ముందుకు సాగాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ ఫైరింగ్‌ ఆపకూడదు. ఏ మాత్రం తొట్రుపడ్డా, ఫైరింగ్‌ చెయ్యకపోయినా చనిపోవుడే అయితది. కామ్రేడ్స్‌, గుర్తుంది కదా’’ మరొకసారి కర్తవ్యాన్ని గుర్తు చేశాడు డిప్యూటీ కమాండర్‌ మల్లేష్‌.

ఎవరి వెనకాల ఎవరెవరు బయటకు రావాలో, వచ్చాక ఎట్లా ముందుకు సాగాల్నో డిప్యూటీ మల్లేష్‌ వివరించాడు.

అందరూ తలలు ఊపారు. మైన్‌ పేల్చడానికి ప్రకాశ్‌ సిద్ధంగా కూచున్నడు. వేరే వాళ్లను పెడతానన్నా వినలేదు, తనే వుంటానని పట్టుబట్టాడు ప్రకాశ్‌. ఏ తొట్రుపాటు లేకుండా మైన్‌ పేల్చగలడని డిప్యూటీ మల్లేష్‌కు కూడా ప్రకాశ్‌పై నమ్మకం వుంది.

గోడ కూలడమే ఆలస్యం… ఫైరింగ్‌తో ముందుకు దూకడానికి సిద్ధంగా కొద్ది దూరంలో నిలుచున్నరు డిప్యూటీ మల్లేష్‌, మరో ఇద్దరు.

పోలీసులు ఇంటి ముందుకు రానే వచ్చారు.

వాళ్లను చూడగానే, ‘‘సారూ, మా సిద్ధయ్య యేడ సారూ. ఏం చేస్తిరి సారూ’’ అంటూ పెద్దగా ఏడ్వడం మొదలుపెట్టింది అమ్మ.

పోలీసులు ఇంటి వరకు వచ్చారని దళానికి అర్థమైంది. సుగుణ కాషన్‌కోసం ఎదురు చూస్తున్నరు దళసభ్యులు. ఒకవేళ ఇంట్లకు రాకుండా పోతరేమో. తొందరపడవద్దని బయటివారి మాటలను అటెన్షన్‌తో వింటున్నరు.

‘‘ఊరంతా చెక్‌ చేసినం. ఇక మీ ఇల్లు ఒక్కటే ఉన్నది ముసల్దాన’’ అన్నడు పోలీసు అధికారి.

‘‘మా ఇంట్ల ఎందుకుంటరు సారు? నా కొడుకు ఏమైండు సారు’’ అంటూ అమ్మ వారిని ఆపే ప్రయత్నం చేస్తోంది.

నిజంగానే వీరి ఇంట్ల కూడా లేరా? ముసల్ది చాలా ధైర్యంగా ఉన్నది. తాము వచ్చేది కనిపెట్టి దళం వెళ్లిపోయిందేమో అనే సందేహం పోలీసు అధికారిలో కలిగింది. ఈ ఒక్క ఇల్లు చెక్‌చేస్తే సరిపోతది అనుకున్నడు. రాత్రంతా నిద్రలేక, పొద్దటి నుంచి చాయ్‌నీళ్లు కూడా లేక అలసిపోయి ఉన్న పోలీసులకు వెనక్కి పోతే బాగుండు అని వుంది. టైమ్‌ఉదయం పది గంటలు కావొస్తున్నది.

కానీ, ‘‘మీరు లోపలికి వెళ్లి చెక్‌ చేయండి’’ అని పోలీసులకు చెప్పి, అరుగు మీద కూచోబోయినడు పోలీసు అధికారి.

పెద్ద శబ్దం. ఆ శబ్దానికి అధికారి అట్లనే కింద కూలబడిపోయిండు.

గోడ ఇటుక పెళ్లలు వారి మీద ఎగిరి పడ్డాయి. తమ మీదనే మైన్‌ పేల్చారనుకుని జవాన్లు వెనక్కి పరుగు తీసారు. చెల్లాచెదురు అయ్యారు. ఇంటి ముందర ఉన్న పోలీసులు ఆ ఇంటికి దూరంగా ఊరివైపు ఉరికిండ్రు.

ఏం జరిగిందో వారు తెలుసుకునే లోపలనే డిప్యూటీ మల్లేష్‌టీం ఫైరింగ్‌చేస్తూ ముందుకు దూసుకుపోతున్నడు. అతడి వెనకాలే సుగుణ గార్డు, సుగుణతోపాటు దళమంతా ఇంట్ల నుంచి బయటికి వచ్చింది ఫైరింగ్‌చేస్తూ. రాపిడ్‌ఫైరింగ్‌చేస్తూ జవాన్లను దాటుకుని మూడు, నాలుగు వందల మీటర్ల దూరం వెళ్లిపోయింది దళమంతా.

బీఎస్‌ఎఫ్‌జవాన్లు, తేరుకుని ఫైరింగ్‌మొదలుపెట్టిండ్రు. కానీ దళం ఫైరింగ్‌రేంజ్‌ని దాటిపోయింది. అయినా బీఎస్‌ఎఫ్‌జవాన్లు వెంటపడ్డరు.

‘‘కామ్రేడ్స్‌, ఫైరింగ్‌ను ఆగి ఆగి చెయ్యండి. తూటాలను అయిపోగొట్టకండి. మా ముగ్గురి టీం ఫైరింగ్‌ చేస్తుంటది. మీరు రిట్రీట్‌ అవ్వండి’’ గట్టిగానే అరిచి చెప్పాడు మల్లేష్‌.

మల్లేష్‌ కాషన్స్‌ ఫాలో అవుతూ మిగతా టీమ్‌ను సుగుణ లీడ్‌ చేస్తున్నది.

జవాన్లు వెంటపడినప్పటికీ వారికి అందనంత దూరం వెళ్లిపోయింది దళం. దళం వారికి ఊర్లు, దారి కొట్టినపిండి.

***

కూలబడిపోయిన పోలీసు అధికారిని తీసుకుని పోలీసులు స్కూలు దగ్గరికి పొయ్యిండ్రు. పుల్లమ్మను, అమ్మను ఏమీ అనడానికి కూడా వారికి టైమ్‌లేదు.

బడి దగ్గర ఉన్న పోలీసులు స్పృహ తప్పిపడిపోయి ఉన్న సిద్ధయ్యను ‘‘ఇంట్ల దళాన్ని పెట్టి, మమ్ముల తిప్పల పెడ్తివి గదరా. నీ సంగతి తర్వాత చూస్తం’’ అంటూ మళ్లీ కొన్ని దెబ్బలు కొట్టి సర్దుకుని వెళ్లిపోయారు.

‘‘వెంట తీసుకుపోదాం’’ అన్నాడు ఎస్సై.

‘‘చెయ్యిరిగింది కదా. ఎక్కడికి పోతడు? మళ్ల వద్దాములే’’ అన్నాడు అధికారి.

అప్పటికే పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కి వాకీటాకీలతో ఇన్ఫర్మేషన్‌ పొయ్యింది.

చుట్టుపక్కల ఊర్లను చేరుకోవడానికి పోలీసు బ్యాచ్‌లు బయలుదేరినయి.

ఫైరింగ్‌ స్టార్ట్‌ అయ్యి గంట దాటిపోయింది.

‘‘కామ్రేడ్‌ మల్లేష్‌, ఓ ఐదు నిమిషాలు ఆగుదాం. కవర్స్‌ ఉన్న ఏరియా రాగానే చెప్పు’’ అన్నది సుగుణ.

మరో పది నిమిషాలు నడిచిన తర్వాత దళం ఆగింది.

‘‘కామ్రేడ్స్‌, మంచి నీళ్లు తాగండి. ఓ ఐదు నిమిషాలు ఆగుదాం. ఎవరూ కిట్లు దించకండి’’ చెప్పింది సుగుణ.

ఒంటి నిండా, తలనిండా దుమ్ము. ప్యాంటు, షర్టు చీర్క పోయినవి. పుల్లక్క అడిగి అన్నం పెట్టకపోతే కడుపుల ఈ ఆసారా కూడా ఉండేది కాదు అనుకున్నరు. అన్నం తిన్నరు గని నీళ్లు తాగే సమయం కూడా లేకపాయె. దానికి తోడు, ఈ ఫైరింగ్‌, నడక, పరుగు. గొంతు ఎండుక పొయ్యింది. గటగటా నీళ్లు తాగారు. దాహంతో ఉన్నప్పుడు అట్లా తాగకూడదని తెలుసు. అయినా కొద్దిసేపైనా ఆగే టైమ్‌తమ దగ్గర లేదు.

‘‘ఇట్లా నడుస్తూ వెళ్లడం కష్టం. ఇంతకుముందు లెక్క లేదు పరిస్థితి. పోలీసులు ఈ చుట్టుపక్కల ఊర్లల్లోనూ దిగవచ్చు’’ అన్నది సుగుణ నీళ్లు తాగి.

‘‘అవును. మరి ఎట్లా? ఏదైనా వెహికిల్‌మీద పోదామా?’’ డిప్యూటీ మల్లేష్‌అడిగిండు.

‘‘నేను అదే ఆలోచిస్తున్న. ఆ కనిపించే పొలంల ట్రాక్టర్‌ఉ న్నది. దాని మీద పోదాం. అది ఈ పక్కూరి వెంకట్‌రెడ్డిదే. ఆసామినే కానీ, వాళ్ల ట్రాక్టర్‌ను ఉపయోగించుకోక తప్పదు’’ చెప్పింది సుగుణ.

‘‘కామ్రేడ్స్‌, పదండి’’ అన్నాడు మల్లేష్‌.

పొలంలో ట్రాక్టర్‌ దగ్గరికి వచ్చేవరకూ డ్రైవర్‌ సైదులు వారిని చూడలేదు.

‘‘అన్న లాల్‌సలామ్‌’’ అన్నది సుగుణ.

అదాటున చూసి, తొట్రుపాటుతో ‘‘అక్కా మీరిక్కడికి ఎట్ల వచ్చిన్రు? పక్కూర్ల ఫైరింగ్‌ జరిగిందటగ. అందరు మంచిగనే ఉన్నరా?’’ అడిగిండు సైదులు.

‘‘అన్నా! అంతా మంచే గని. మేం చెప్పిన కాడ ట్రాక్టర్ల దింపాలె మమ్ముల’’ అన్నడు డిప్యూటీ మల్లేష్‌.

‘‘మా రెడ్డి ఏమంటడో’’ అని, కాసేపు ఆగి ‘‘పా అన్న, దింపుత’’ అని ట్రాక్టర్‌ స్టార్ట్‌ చేసిండ్రు సైదులు.

‘‘కామ్రేడ్స్‌, ట్రాక్టర్‌ గోడల వెంట అందరు వెల్లకిల పండుకోవాలి. ప్రకాశ్‌! నువ్వు సివిల్‌ డ్రెస్‌ వేసుకుని కూచుని ఉండు. చుట్టుపక్కల గమనిస్తూ ఉండూ’’ చెప్పిండు డిప్యూటీ మల్లేష్‌.

***

సిద్ధయ్యను ఇంటికి తీసుకొచ్చి చెయ్యికి కట్టు కట్టించిండ్రు. విపరీతమైన జ్వరంతో ఒళ్లు పేలిపోతోంది. ఆర్‌ఎంపీ డాక్టర్‌మందులు ఇచ్చి, సెలైన్‌ పెట్టిండు.

కొడుకు దగ్గర కూచుని గాలి ఊపుకుంటూ ఉన్న అమ్మ చెవుల ‘‘అయ్యో! వెంకట్‌రెడ్డి టాక్ట్రర్‌ డ్రైవర్‌ సైదులును పోలీసులు పట్కపోయిండ్రట గద’’ అనే మాట పడ్డది.

అయితే, దళం వాళ్లకు ఏమీ కానట్టే. ఏమన్నా అయితే… గా ముచ్చటనే మాట్లాడుకుందురు. అమ్మకు మనసులో సంతోషమైంది. పెద్ద గండం తప్పింది అనుకుంది. మనసులోనే దండం పెట్టుకున్నది. ఎందుకనో అమ్మ కండ్ల నుంచి కన్నీటి బొట్లు రాలినయి.

(సుగుణక్క, కౌముదిలకు…)

జ‌న‌నం: న‌ల్ల‌గొండ జిల్లా. అస‌లు పేరు ప‌ద్మ మిర్యాల‌. బీఎస్సీ(B.Z.C), PG Diploma in Journalism. వృత్తి: జ‌ర్న‌లిస్టు. మొద‌ట్లో 'క‌రుణ' పేరుతో క‌థ‌లు రాశారు. 23ఏండ్ల వ‌య‌సులో 'తాయ‌మ్మ' క‌థ రాశారు. ఇది క‌రుణ‌ మొట్ట‌మొద‌టి క‌థ . రాసిన మూడేండ్ల త‌ర్వాత 1996లో 'మ‌హిళా మార్గం'లో అచ్చ‌యింది. ఈ క‌థ పేరుతో 'కరుణ' '- 'తాయ‌మ్మ క‌రుణ‌'గా మారింది. ఆంధ్రప్రభ, సాక్షి, ప్రస్తుతం 'నవతెలంగాణ'లో.  మొదటి కథల సంపుటి 'తాయమ్మ మరికొన్ని కథలు' 2009లో, 2వ కథల సంపుటి 'జీవితం' 2018లో ప్రచురితమయ్యాయి. కవితలు, వ్యాసాలు అచ్చయ్యాయి. 13 ఏండ్లు విప్లవోద్యమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పని చేశారు.

5 thoughts on “ప్రేమంటే ఇదేనా…

  1. ఎంత గొప్ప కథ. పోరాటం ప్రత్యేకంగా చూసిన అనుభూతి కలిగింది. కళ్ళకు కట్టినట్టు, నిజాన్ని కథగా మలిచిన “తాయ్యమ్మ కరుణ” గారికి ధన్యవాదాలు

    1. కమల్ గారికి, తమ్ముడు కుమారస్వామికి ధన్యవాదాలు.

  2. ఉత్కంఠ, ఉద్యమం పట్ల ప్రజల ప్రేమ, ఉద్యమకారుల సాహసాన్ని అద్భుతమైన రీతిలో చెప్పారు. అభినందనలు మేడం. మరిన్ని కథలు రావాలి కోరుతున్నాను

  3. గొప్ప కధ. ఉద్యమం గురించి బాగా రాసారు

Leave a Reply