రోజూలాగే అతడు కళ్లల్లో వత్తులేసుకొని
పిడికెడు మెతుకుల కోసం
ఊరపిచ్చుకై తిరిగి ఉంటాడు
ముక్కుపచ్చలారని పిల్లల
కడుపాకలి తీర్చడానికి
నిండు ప్రాణాన్ని తాకట్టుపెట్టాడు
పుట్టిపెరిగిన ఊరే కదా
అంతా మనవాళ్లే కదా
రెండు రాలిన పండ్లకు కొంపలంటుకపోతాయా?
పిడికెడు ధైర్యంతో ఆదమరిచి ఉంటాడు
మనుషుల రూపంలోని
మనువుల జాడను పసిగట్టలేకపోయాడు
కాయలు రాలినట్టే
ప్రాణాలు రాల్చగలరని గుర్తుపట్టలేకపోయాడు
తెలిసిన ఊరే కదా
క్షమించకపోతారా… అనుకున్నాడు
కులసర్పం బుసకొడుతుందని కనుగొనలేకపోయాడు
సారీ…బక్కి సీను
ఇది మూర్ఖుల దేశం !
కులం తప్ప కండ్లకు ఏదీ ఆనని ఆంబోతుల దేశం
నీకు తెలియదు కదూ
వాళ్ల దృష్టిలో నువ్వసలు మనిషివే కాదని
నీకు తెలియదు కదూ
మామిడి తోటకు కాదు… నీకూ కంచెలున్నాయని
నీకు తెలియదు కదూ
వాళ్ల మనుసుల్లో నీకు ఏ హక్కూ లేదని
ఓ నా బక్కి సీనూ…
ఇంతకాలం వాళ్లూ
నీ పాదముద్రల్లో మైలపడిపోయారని రగిలిపోయి ఉంటారు
నువ్వు వాళ్లు పుట్టిన నేలలోనే పుట్టినందుకు కసి పెంచుకుని ఉంటారు
ఎన్నో సందర్భాల్లో ఈసడించుకొని ఉంటారు
నిన్ను నిర్మూలించడానికి వారికొక సాకు కావాలి
అవకాశం చిక్కితే నిన్ను వదులుతారా?
ఏమనుకున్నావు బక్కి సీను…
మనుషుల ముఖాలతో తిరిగే మృగాలను గుర్తు పట్టలేకపోయావు
మూడు వేల యేండ్ల కులగజ్జికి పుట్టిన
బుల్షిట్ స్కౌండ్రల్స్ని కనుగొనలేకపోయావు
బక్కి సీనూ… బక్కి సీనూ…
బరితెగించిన కులోన్మాదానికి
బలైపోయిన కంచికచర్ల కోటేషు తమ్ముడా !
నీ పిల్లల ముందు
ఈ లోకం సిగ్గుతో తలవంచుకోవాలి
ఇలాంటి సమాజంలోనా
మనం బతుకుతున్నదని
బుద్ధి ఉన్నోడెవ్వడైనా కుమిలిపోవాలి
ఇంత కులపిచ్చిగాళ్లున్న నేల మీదా
మనం ఊపిరి పీలుస్తున్నదని అల్లాడిపోవాలి
కులం లేదని అంధుల్లా నటిస్తున్న
సోకాల్డ్ సొల్లు నాయాళ్ల ముఖాల మీద
కాండ్రించి ఉమ్మాలి
బక్కి సీనూ… ఎక్కెక్కి ఏడుస్తున్న
నీ ఆలీ కన్నీళ్లతో
మా రక్తం సలసలా మరిగిపోతున్నది
రాలిన కాయలకంటే ప్రాణం
ఎన్నో రెట్ల విలువైనదని
వీళ్ల తోలుమందం దేహాలకు
చెప్పులతో చెంపలు వాయించైనా చెప్పి తీరాలి !!
బాగుందన్నా~
superb mama…