నీతో మాట చెప్పాలి
తలపోత చెరుగుల్లో
కళ్లవాగు
కొంగుపట్టే మాట
ఆకాశ గోడలపై
గతకాలపు పురిటి వాసనల్ని
పిండారబోసి
నిదురరాని కాలాల్లో
నన్ను నేను
నిబ్బరించుకున్న వెచ్చటి మాట
చిక్కటి చీకటి
తొరకలు తొరకలుగా జారుతూ
అమ్మకు బిందెనెత్తిన
ఊరిమొదలు మంచినూతిని
అమాంతం మింగేసే మాట
చెప్పాలనుకున్నపుడల్లా
ఒక్కోసారి అనుకుంటుంటాను
రాత్రి చెట్టుకు
వసంతాల ఊయలేసి
నేల పాటకు గజ్జెకట్టి
వంతపాడే పిట్ట రెక్కలకు
ముసురంటుకుంటుందేమోనని-
ఊపిరి సలపని
యుద్ధగాయల మధ్య
మబ్బుసంచులను చిదిమేసే
వడగాలుల సలపరింతకు
దారప్పోగులు
పెనుతిరుగుతాయోమోనని-
ఏదిఏమైనా
రెప్పవెంట్రుక ఆసరాతో
నిన్నరాత్రి
నే రాసిన దస్తూరి
బహుశా
నీదాకా చేరుండకపోవచ్చు
రాత్రిగడచి పొద్దుపోయ్యెంతలో
నేలసొరుగుల్ని తాకిన
రెండు కొబ్బరిచెట్ల దుఃఖ కంఠం
ఇంకా
నీ చెవికమ్మల్ని తాకుండకపోవచ్చు
అందుకే కాబోలు
అక్కడ వీచిన
అడవిపూల గాలి
నదీపాయల
సాయంత్ర సంగీతాన్ని
ఇక్కడకు వెంటేసుకొస్తుంది
గొంతునిలువు మట్టిలో
బాసాబట్టేసుక్కూర్చున్న
రెండు మగ్గంగుంజలతో
అనంత
మౌన సంభాషణ చేస్తుంటుంది
***
గుండెనిండా
గాలిపీల్చి వదిలే
కొన్ని వదులైన క్షణాల్లో
ఇప్పటికైనా
నీతో మాట చెప్పాలి
గోడపై ఒద్దికగా కూర్చున్న మాట
బియ్యండబ్బాలో
పేగు చివరి చరణం తన్నుకులాడిన
ప్రాచీన మాట
“దాన్ని చూడాలనుందిరా…
………………………………..”
చాలా బావుంది కవిత. కొత్త వ్యక్తీకరణలున్నాయి..