రోజూ ఒక భయానక బీభత్స దృశ్యం వెంటాడుతుంటుంది
స్వప్నాలు దగ్ధమౌతున్న కాలం ఇది
అంతటా ప్రశాంతంగా ఉన్నప్పుడే
మనం అత్యంత అప్రమత్తంగా ఉండాలి
వాడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నప్పుడే
మనం మౌనం మాటున జరిగే కుట్రలను కనిపెట్టాలి
మనమున్న చోట వానికి ప్రశాంతత ఉండదు
మానసిక మౌనమూ ఉండదన్న నిజాన్ని
మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి
ఎక్కడా ఏ అలికిడీ వినపడని వేళ
అంతా సద్దుమనిగిందని అనుకుంటున్న వేళ
కలలు రాలిపడుతున్న అడివంతటా
పరుచుకున్న నిశ్శబ్ధాన్ని బద్ధలు చేస్తూ
ఎక్కడిదో ఒక నెత్తుటి వరద తరగ
భళ్ళున ముఖం పై కొట్టి
తనువంతటినీ గాయపరుస్తుంది
కళ్ళు మసకబారి రెండు కన్నీటి ప్రవాహాలవుతాయి
గొంతు మూగవోతుంది
కడుపులో తన్లాడుతున్న దుఃఖం బయటికి రాదు
బాధ ఒళ్ళంతా జ్వరంలా పాకి
రోజంతటినీ విషాదంగా మార్చుతుంది
పేపర్లలో పేర్లు చూసి ఫోటోలు చూసి
గుర్తింప వీలు లేని ముఖాలను గుర్తుపట్టడానికి
గత ఙ్ఞాపకాలన్నింటిని మనసు వసారాపై పరుచుకొని
ఆనవాళ్ళు పట్టుకోవడానికి పడరాని పాట్లు పడతాను
నా వాళ్ళు!
తొలకరి వాన చినుకులాంటి వాళ్ళు
కొమ్మల చివరన పచ్చగా మెరిసే లేలేత చిగురులాంటి వాళ్ళు
తొలుచూరు బిడ్డలాంటి వాళ్ళు
తొట్టతొలిగా రాసిన కవితాక్షరాల లాంటి వాళ్ళు
పచ్చగా పరుచుకున్న పచ్చికపై
సప్త వర్ణాలతో జిగేలుమనే శీతాకాలపు ఉదయపు
మంచు బిందువుల ఇంద్రధనస్సులాంటి వాళ్ళు
అరచేతులలో మొట్టమొదటి స్నేహపు స్పర్శై
హృదయమంతటినీ పరిమళింపజేసే వాళ్ళు
అమరులై మరపురాని రూపాలే అయ్యారో
తొలిపొద్దు కిరణాలే అయ్యారో
కళ్ళు మూసుకుంటే
కనుపాపలపై సందడిచేసే మాటలే అయ్యారో
మనసు యవనికపై నిరంతరం కదలాడే ఙ్ఞాపకాలే అయ్యారోగానీ
నేనింకా లోకాన్ని పల్లెటూరి పసికళ్ళతో పరికిస్తున్నప్పుడు
నన్ను చేరదీసి నా కళ్ళకు ఒక నూతన
చైతన్య దృష్టిని అద్దిన వాళ్ళు
అమరజీవులై కళ్ళముందు కనపడితే
రోజులన్నీ ఆందోళనతో అశృపూరితమవుతాయి
వాడు మాట్లాడుతున్నప్పటికన్నా
మౌనంగా ఉన్నప్పుడే రాబోయే ప్రమాదాన్ని పసిగట్టాలి
ఎప్పుడూ ఊహించని ఆయువుపట్టుపై
దెబ్బకొట్టడం వానికలవాటైన విద్య
వాని మౌనాన్ని బద్దలు కొట్టి
వాని బుర్రలో తిరుగుతున్న పాముల్లాంటి విషపు కుట్రలను
బహిర్గతం చేయవలసిన కాలం ఇది
భద్రంగా ఉండవలసిన కాలం ఇది