ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక(తెలంగాణ శాఖ), కాకతీయ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు విభాగంతో కలిసి 2019 మే 11న వరంగల్లో కథావిమర్శ కార్యశాలను నిర్వహించింది. తెలుగులో సాహిత్య విమర్శ తగినంత లేదంటూ తరచూ వినబడే ఆరోపణకు సమాధానంగా మహిళల్లో సాహిత్య విమర్శ నైపుణ్యాలను అభివృద్ధి పరిచే లక్ష్యంతో ఈ కథావిమర్శ కార్యశాలను ఏర్పాటుచేయడం జరిగింది. పొట్లపల్లి రామారావు ‘విముక్తి’, యశోదారెడ్డి కథ ‘ఎదురుకోళ్లు’, కొలకలూరి ఇనాక్ ‘ఊరబావి’ విమర్శకు లక్ష్య కథలు. తెలంగాణ దళిత, మహిళా అస్తిత్వాలకు ప్రాతినిధ్యం వహించేవి, వర్తమాన సామాజిక రాజకీయ సందర్భాల నుండి అధ్యయనానికి అవసరమైనవి కావటంవల్ల ఈ కథలు పాఠ్యాంశాలు అయ్యాయి. వీటిలో ఏ ఒక దానినైనా ఎంచుకొని విమర్శ వ్యాసం రాసే అవకాశం పాల్గొనే వాళ్లకు ఇయ్యబడింది. తెలుగు ఎమ్.ఏ చేసిన వాళ్ళు ,సాహిత్య పరిశోధనలు చేసినవాళ్లు, కథా రచయితలు, కవులు సాహిత్య ఆసక్తులు కల ఔత్సాహికులు 40 మంది ఈ కథావిమర్శ కార్యశాలకు తమ అభిరుచికి తగిన కథను ఎన్నుకొని వ్యాసాలు రాసుకొని వచ్చి పాల్గొన్నారు.
అంతకంటే ముందు ఉదయం 10 గంటల నుండి 11.45 వరకు తెలంగాణ ప్రరవే అధ్యక్షురాలు తిరునగరి దేవకీ దేవి అధ్యక్షతన ప్రారంభ సమావేశం జరిగింది. ఎండ్లూరి మానస సమన్వయకర్తగా వ్యవహరించారు. తిరునగరి దేవకీ దేవి తన తొలిపలుకులలో 2019 ఫిబ్రవరి లో విశాఖలో జరిగిన పదేళ్ల ప్రరవే సభల సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలకు అనుగుణంగా తెలంగాణ శాఖ చేపట్టిన తొలి కార్యక్రమం కథావిమర్శ కార్యశాల అని పేర్కొన్నారు. కార్యదర్శి కాత్యాయనీ విద్మహే కథావిమర్శ కార్యశాల లక్ష్యాలను, ప్రణాళిక ను వివరించారు. ప్రసిద్ధ విమర్శకుడు ఎకె ప్రభాకర్ ప్రారంభోపన్యాసం చేశారు. రచయితకు పాఠకులకు మధ్య విమర్శకుల అవసరం లేదన్న ఒక అభిప్రాయాన్ని ప్రస్తావిస్తూ ఆయన తన ఉపన్యాసం ప్రారంభించారు. విమర్శకులు కూడా పాఠకులేనని అంటూ సృజనాత్మక రచయితకు జీవితానుభవం ముఖ్యం అయితే విమర్శకులకు అధ్యయనం ప్రధానం అని పేర్కొన్నారు. కథలో రూపానికి సారానికి మధ్యవుండే ఆధార ఆధేయ సంబంధాలగురించి సోదాహరణంగా వివరించారు. రూపం శిల్పానికి సంబంధించినది కాగా సారం వస్తువు అని, సారానికి రుచిని కలిగించేది దృక్పథం అని స్పష్టం చేశారు. అది ఎవరికీ ఏ రకంగా ప్రయోజనకారి అనేది అంతిమంగా కథకు విలువను సమకూర్చే ప్రమేయం అని అభిప్రాయ పడ్డారు. వస్తు శిల్ప దృక్పథా లకు, ప్రయోజనానికి ఉండే గతితార్కిక సంబంధాన్ని వివరిస్తూ.. అనేక పొరలలో ఉండే కథలలోని వస్తు శిల్ప దృక్పథ ప్రయోజనాల సమన్వయాన్ని, రచయిత కంఠ స్వరాన్ని, ప్రజాస్వామిక చింతనను గుర్తిస్తూ అర్ధం చేసుకొనే క్రమంలో చేసే విశేషమైన కసరత్తే విమర్శ అని నిర్ధారిస్తూ ఉపన్యాసాన్ని ముగించారు.
ఆత్మీయ అతిథి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత సందేశం ఇస్తూ విమర్శ లక్షణాలను, ప్రయోజనాలను ప్రస్తావించారు. ఎదురు కోళ్లు కథ ప్రాసంగికతను పేర్కొన్నారు. మరొక ఆత్మీయ అతిథి కాకతీయ ప్రభుత్వకళాశాల తెలుగు విభాగం అధ్యక్షులు ఎం. సాంసన్ మాట్లాడుతూ మహిళా రచయితలతో కలిసి కథా విమర్శ కార్యశాల నిర్వహించటం గొప్ప అనుభవం అని, ఇది తమ కాలేజీ తెలుగు అధ్యాపకులకు, విద్యార్థులకు కూడా ప్రయోజనకరమైనదని అభిప్రాయపడ్డారు. ముఖ్య అతిథి కాకతీయ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ పాము వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యారంగానికి సామాజిక సాంస్కృతిక వ్యవస్థలకు మధ్య ఇలాంటి కార్యశాలలు వారధి వంటివి అని, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏ లక్ష్యంతో ఈ కథావిమర్శ కార్యశాలను ఏర్పాటు చేసిందో అది తమ కళాశాల విద్యావిషయక ప్రయోజనాలను కూడా ఈడేర్చేదనని పేర్కొన్నారు.
ప్రారంభ సమావేశం తరువాత కథావిమర్శ కార్యశాలలో పాల్గొంటున్న అందరికి వ్యాసాలు చదవటానికి చర్చకు తగిన సమయం వచ్చే విధంగా వారిని అయిదు సమూహాలుగా చేసి అయిదు సమాంతర సమావేశాలను నిర్వహించటం జరిగింది. ‘ధనత్రయోదశి’ (భండారు అచ్చమాంబ) ‘పరిగె’ (వట్టికోట ఆళ్వారు స్వామి) ‘ముక్కోటి బలగమోయి’ (సురమౌళి ) ‘కొండమల్లెలు’ (ఇల్లిందల సరస్వతీ దేవి) ‘హక్కు’ (మాదిరెడ్డి సులోచన) అనే అయిదు కథల పేర్లతో ఈ సమూహాలు వ్యవహరించబడ్డాయి. మూడు కథల పై చర్చగా సాగే కార్యశాలలో ఈ రకంగా మరొక అయిదు తెలంగాణ కథలను కూడా ప్రస్తావించుకొనటం కథా సాహిత్య అధ్యయనం పట్ల ఒక కుతూహలాన్ని రెచ్చగొట్టటానికే.
ధనత్రయోదశి కథా సమూహానికి డాక్టర్ విద్యావతి, పరిగె కథా సమూహానికి డాక్టర్ సీతారాం, ముక్కోటి బలగమోయి కథా సమూహానికి డాక్టర్ మాధురి, కొండమల్లెలు కథా సమూహానికి డాక్టర్ రజని, హక్కు కథా సమూహానికి డాక్టర్ సుహాసిని పరిశీలకులుగా వుండి చర్చను నిర్వహించారు. కథావిమర్శ పద్ధతులను, మెళకువలను సూచించారు. భోజన విరామం ఒక గంట మినహాయించి మధ్యాహ్నం 12 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు ఉత్సాహపూరిత వాతావరణంలో ఈ సమాంతర సమూహ సమావేశాలు జరిగాయి.
సాయంత్రం అయిదుగంటలకు ప్రరవే తెలంగాణ శాఖ సమన్వయకర్త కొమర్రాజు రామలక్ష్మి అధ్యక్షతన ముగింపు సమావేశం జరిగింది. రామలక్ష్మి ఈ కథా విమర్శ కార్యశాలలో ఎక్కువమంది ఊరబావి కథను ఎంచుకొని విమర్శ రాయటం సమకాలీన దళిత చైతన్యానికి, ఆ తరువాత ఎదురుకోళ్లు కథను ఎంచుకొనటం తెలంగాణ అస్తిత్వ చైతన్యానికి నిదర్శనం గా ఉన్నాయని చెప్తూ సభను ప్రారంభించారు. కథా విమర్శ పరిశీలకులుగా అయిదు సమూహాల సాహిత్య విమర్శ గోష్ఠిని నడిపించిన విద్యావతి, సీతారాం, మాధురి, రజని, సుహాసిని అలా ఒక చిన్న సమూహంతో కూర్చొని చేసిన సంభాషణ ఎంతో సంతోషాన్ని కలిగించిందని, ఒకరి నుండి ఒకరు నేర్చుకొనటానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగ పడతాయని చెప్తూ, తమ సమూహంలో పాల్గొన్నవారి వ్యాసాలలోని బలాలను, బలహీనతలను ప్రస్తావిస్తూ, వాళ్ళు మరింత నేర్చుకొనటానికి ఉన్న అవకాశాలను గురించి సూచనలు చేశారు. గట్టు రాధిక, శ్రీలక్ష్మి, సుజాత మొదలైన వాళ్ళు కథావిమర్శ వ్యాసం రాసి ఈ కార్యశాలలో పాల్గొనటం వల్ల కలిగిన ఉత్తేజకర అనుభవం గురించి మాట్లాడారు.
ఆత్మీయ అతిథి , ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ కార్యదర్శి కె ఎన్. మల్లీశ్వరి మాట్లాడుతూ అయిదు సమూహాలలో పత్ర సమర్పణలను, చర్చలను గమనించిన మీదట కార్య శాల లక్ష్య సాధన దిశగానే నడిచిందని, భేషజాలు లేని అధ్యయనం, ఒకరినుండి ఒకరం నేర్చుకొనటం ప్రజా స్వామిక సంస్కృతి అభివృద్ధికి తోడ్పడతాయని ఈ సందర్భంగా మరొక సారి రుజువైందని అన్నారు.సమూహంలో జరిగిన చర్చలు, పరిశీలకులు చేసిన సూచనలు దృష్టిలో పెట్టుకొని అందరూ తమ వ్యాసాలను తిరిగి రాస్తే విమర్శవ్యాస సంకలనం ప్రచురించుకోవచ్చని సూచించారు. సమన్వయ కర్త చంద్రకళ వందన సమర్పణతో ఒకరోజు కథావిమర్శ కార్యశాల ముగిసింది.
కాత్యాయనీ విద్మహే, కార్యదర్శి, ప్రరవే, తెలంగాణ
కొమర్రాజు రామలక్ష్మి, సమన్వయకర్త, ప్రరవే, తెలంగాణ