తెల్లని మేఘాలను చీల్చుకుంటూ సూర్యుడు అప్పుడే బయటకు వస్తున్నాడు. కిటికి గుండా పచ్చని పంట పొలాలపై నుండి వీచే గాలి అతని మొహాన్ని తాకి ఓదార్చుతున్నట్లుగా ఉంది. అలసిపోయిన అతని కండ్లు ఆరిపోయిన కన్నీటి చారలను తడుముతూ భారంగా బయటకు చూస్తున్నాయి.
ఏదో స్టేషన్ వచ్చినట్టుగా ఉంది. ఎక్కే దిగే ప్రయాణికులతో ఆ ప్రాంగణం అంతా కోలాహలంగా ఉంది.
“సర్ చాయ్ కావాల్నా” అన్నాడు చాయ్ అమ్మే పిల్లవాడు. డబ్బులు అతని చేతిలో పెడుతూ ఇవ్వమన్నట్టుగా సైగ జేసిండు.
గ్లాస్ లోని పొగల లాగే తన మనసు అదుపు తప్పి ఆలోచనల చుట్టు తిరుగుతున్నట్టుగా ఉంది. స్కూలు టీచరుగా రిటైర్ అయిన నేను మా ఆవిడతో కలసి కాలక్షేపంకై హైదరాబాద్ లో వుంటున్న మా అబ్బాయి దగ్గరకు బోయి హన్మకొండకు తిరిగి వస్తున్నాం. ఈ అబ్బాయిని నేను ట్రేన్ ఎక్కిన కానుండి గమనిస్తునే ఉన్నాను. ఏదో తట్టుకోలేని బాధతో ఉన్నట్టుగా దీన వదనంతో ఉన్న తనను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.
“ఏమైంది బాబు? ఏమైన ప్రాబ్లమా….?” ఉండబట్టలేక అతని భుజం తట్టి అన్నాను.
ఆ.. అబ్బాయి చెప్పడానికి కాస్త తటపటాయిస్తునే….
“ఏం లేదు సర్ ! ” అంటూ మొహం కిటికి వైపు తిప్పుకున్నాడు, రైలు వేగంగా వెళ్థుంటే చెట్లు గుట్టలు వెనకకు పరుగెడుతున్నాయి.
“చెప్పు నాన్న మనసులో బాద చెప్పుకుంటేనే తగ్గుతుంది” మెల్లగా అంది మా అవిడ.
“గీ.. భూమ్మిదా లేనోళ్ళు బతుకకూడదంటయ్యా…! లేనోల్లు ఆసుపత్రులకు రాకూడదంటయ్యా..! ఉన్నోనికే రోగం వస్తదిగని లేనోనికి రాదా అయ్యా? సర్కారు దవాఖానకు బోతే సవితిలెక్క జూసుడాయే.. ప్రైవేటుకు బోతే ఉన్నది ఊడ్చిపంపబట్టే. ఇదెక్కడి అన్యాయమయ్యా..?” కండ్ల నీళ్ళు వట వట రాలుస్తూ ఎప్పటినుండో దాచుకున్న దుఃఖంలో నుండి ఈ ప్రశ్నలను వెల్లగక్కింది పక్కన కూర్చున్న వాళ్ళ అమ్మ.
“ఇప్పుడు లోకం తీరే గట్లున్నది ముందు మీరు ఆ చాయ్ తాగండి నెమ్మదిగా మాట్లాడుకుందాం” అన్నాను ఆమెను స్థిమిత పరుస్తూ.
నిజమే ఆ ప్రశ్నల్లో ఒక నిగూడమైన నిజం ఉంది. అది ప్రతి పేదవాడి జీవితంలో నిత్యం వేధించే సత్యమైన ప్రశ్నల సంఘర్షణలే.
ఇద్దరు చాయ్ తాగి డిస్పోజల్ గ్లాస్ భయటకు వేసి భారంగా ఏదో చెప్పడానికి నా వైపు చూశారు.
ఆ క్షణం వారి కండ్లు నిండు నీటి కుండను మోస్తున్న మేఘలలా ఉన్నాయి.
“ఇప్పుడు చెప్పండి అసలు విషయం ఏంటి ?” నా చేతిలోని న్యూస్ పేపర్ ను మడత పెట్టి పక్కన పెడుతు అడిగాను.
నాతో పాటు వంతగా మరో నలుగురు వారు ఏం చెబుతారోనని ఆసక్తిగా చెవులు రిక్కించినారు.
ఆమె వాళ్ళ కొడుకు వైపు చూసి చెప్పమన్నట్లుగా కండ్లతోనే సైగ చేసింది.
“సర్ నా పేరు ప్రసాద్, ఎదురు సీట్లో కూర్చున్న వ్యక్తి మా నాన్న గారు ఆయనకే ఆరోగ్యం బాగా లేక హైద్రాబాద్ వచ్చాం, పక్కనున్నామే మా అమ్మ, వాల్ల కుటుంబాన్ని పరిచయం చేస్తూ చూపించాడు.
‘నేను మా ఊరిలోని అగ్రికల్చర్ కో- ఆపరేటివ్ సొసైటీలో చిన్నపాటి జీతంతో క్లర్క్ గా ఉద్యోగం చేస్తున్నాను, మార్చి నెల క్లోజింగ్ అకౌంట్స్,ఆడిట్ రిపోర్ట్సు తయారు చేయటంలో బిజీగా ఉన్నాను.
“నాన్నకి వామిటింగ్స్ అయితానై కొడుకా హన్మకొండకు తీసుకవచ్చాం నగేష్ ఓ ఆసుపత్రిలో జేయిన్ చేశాడు” అంటూ అమ్మ ఆ రోజు మధ్యాహ్నం నాకు ఫోన్ చేసింది. నాకు కాళ్ళ క్రింది భూమి ఒక్కసారిగా కంపించినట్లు అయ్యింది.’
‘ఎలా ..? ఏం చేయాలి…? అన్న సందిగ్ధత. నాకు తెలియకుండానే కడలి కెరటమైన దు:ఖం నన్ను ఆవహించింది.
నేను సి.ఇ.ఒ చాంబర్ లోనికి నడిచాను. ఆయన తాపిగా సిగరెట్ త్రాగుతు పొగను గాలిలోనికి గింగిరాలు తిప్పుతూ వెగటుగా నా వైపు చూసిండు.
“సార్… మా నాన్న గారు బాగాలేడని ఫోన్ వచ్చింది. డాక్టర్స్ హైదరాబాద్ తీసుకుపోండ్రని చెప్పిండ్లట నాకు అర్జంటుగా లివ్ కావాలి” ముందుగానే ప్రిపేర్ చేసుకున్న లెటర్ ను ఆయన చేతికిస్తూ అన్నాను.
“లివ్ కావాల్నా బుద్దుందా! ఒక దిక్కు కలెక్షన్స్… మరో దిక్కు ఆడిట్ ఉంది, ఇప్పుడు లివ్ ఏంది, రేపు ఆడిటర్స్ వస్తే నేనేం సమాధానం జెప్పాలే. ఎప్పుడు ఏదో సాకు బట్టుకస్తవ్.. పో.. పోవయ్యా పనిగానియ్ చూద్దాం” అంటూ గుర్కాయించి లెటర్ చింపిండు సి.ఇ.ఒ.
“మిగతా స్టాఫ్ వుంది గద సర్ ” అన్నాను.
“అనవసరంగా విసిగించకు” కోపంగా చూస్తూ అనడంతో నేను బాధగా వచ్చి నా చైర్లో కూర్చున్నాను.
సెల్ తీసుకుని చైర్మన్ కు ఇన్ఫాం చేద్దామని కలిపాను.
“నీకు నౌకరి గావాల్నా? లేక మీ అయ్యగావాల్నా..? రెండిట్లో ఏం గావాల్నో నువ్వే తేల్చుకుని వెల్లమని కోపంగా ఫోన్ కట్ చేసినాడు. ఆల్రడి సి.ఇ.ఒ చెప్పిండు కావచ్చు అనుకున్నాను.
ఈ రోజుల్లో ఉద్యోగం దొరకడమే గండమైంది అట్లాంటిది ఇప్పుడు వెల్తే ఉద్యోగం తీసేస్తాము అంటాండ్లు, పద్నాలుగేండ్లుగా పర్మనెంట్ అవుతుందని ఆశగా చేస్తున్న పని తీసేస్తే నేనేం చేయాలి, ఒక వైపు నాతో పనిచేసిన వారికి Go.M.S No:151 తో స్కేల్ చేశారు, నన్ను మాత్రం రాజకియ కుట్రలతో అలానే దాటేస్తూ ఇగ చేస్తాం అగ జేస్తమంటూ ఇద్దరు నమ్మించడం మొదలు పెట్టారు.
వాళ్ళు అలా ఎందుకు ప్రవర్థిస్తున్నారో అర్థమయ్యేది కాదు, వారు పెట్టే టార్చర్ భరించలేక నా అంతట నేనే ఉద్యోగం మానాలన్న ఉద్దేశం వారి మాటల్లో కనిపించేది, నేను DLCO ,DCO ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూ సొసైటీ పని మొత్తం ఒక్కడినే భుజనేనుసుకుని చేసేవాడిని నాకు GO.M.S: 151 ద్వారా పర్మనెంట్ అవుతుందన్న ఆశ తప్ప ఏమీ లేకుండే వ్యవసాయం చేయగా ఏర్పడిన కరువుతో అప్పులపాలై ఉన్న భూమి పోయింది, వాళ్ళ వీళ్ళ చేన్లకు కలుపుకో, పత్తులేరనో వెళ్ళేది అమ్మ , అమాయకత్వమో, నా ఇంటి పరిస్థితులో నన్ను అక్కడే కట్టిపడేసివి.” అన్నాడు ప్రసాద్.
“నాన్న నేను వేరే జాబ్ చూసుకుంటాను” అంటే
“వద్దు బిడ్డా! ఇన్నేండ్లుజేసినవ్ నీకు స్కేల్ అయితే ఎవలన్నా పిల్లనిస్తరు, నీకు ఓ కుటుంబం ఏర్పడుతుంది, మనకు ఈ జనంలో విలువ వుంటది” అన్నాడు.
“బాబు నిన్ను హస్పటల్ కు వెళ్ళనిచ్చారా? లేదా?” మా అవిడ తెలుసుకోవాలన్న ఆరాటంతో అడిగింది.
అతను మళ్ళీ …
“ఏం చేయాల్రా దేవుడా అని తలపట్టుకుని కూర్చుని చాలా సేపు ఆలోచించాను గభ గభ రోడ్ మీదకు వచ్చి హన్మకొండ దిక్కు పోయే బస్సు ఎక్కాను.” అని చెప్పి గట్టిగా ఊపిరి పీల్చుకుని ఒదిలి కొద్ది సేపు వాళ్ల నాన్న వైపు నిశబ్దంగా చూస్తుండి పోయాడు.
“చూసిండ్రా సార్ మానవత్వం విలువలు ఎలా అడుగంటుతానయో. పాపం..! వాళ్ళ నాయిన బాగా లేదని జెప్పిన వాళ్ళు గట్ల మాట్లాడిండ్లంటే వాల్లేమన్న మనుషులా, రాక్షసులా ఇంకేమన్ననా” నా పక్కన కూర్చున్నాయన సానుభూతిని వ్యక్తం చేస్తూ అన్నాడు.
“నిజమే సార్ వెనుకటి రోజులే బాగుండేటీయ్ వాటితో పోలిస్తే ఈ రోజులెందుకు సార్. అప్పటి బంధాలు బంధుత్వం ఎంత బాగుండేటివి అవి పూర్తిగా మసిబారిపాయే, ఎనుకటా ఆపతి అంటే తలో చేయ్ ఏసి ఆసరబట్టెటోల్లు గదే ఇప్పుడు ఎంత దగ్గరోడైన సూసిసూడనట్లే పోబట్టిరి” ఇంకోగాయన ఇప్పటి పరిస్థితులను వివరించబట్టిండు.
“ఇంతకు నాన్నగారిని ఎక్కడ చూపించారు” అతని వైపు తిరిగి అన్నాను.
మహానగరం సికింద్రాబాద్ స్టేషన్లో దిగిన మాకు ఎక్కడికి పోవాల్నో ఎట్లా పోవాల్నో తెల్వక దిక్కుతోచని పరిస్థితి.
అసలే జనారణ్య పట్టణం. ఏ దారి ఎటెటుబోతదో తెల్వదు గదా! అని ఆలోచించాను. మా ఊళ్ళెకెల్లి శంకర్ అనేటోడు శాన ఏండ్ల క్రింద ఇక్కడికి వచ్చి ఏదో ఆసుపత్రిలో పనిజేస్తున్నాడని ఏదైన సలహా జెప్పుతడేమో అని ఫోన్ చేశాను.
ఓ రెండు గంటలు రైల్వే స్టేషన్లోనే వుండమని చెప్పాడు, ఒక గంట రెండు గంటలు, మూడు గంటలు సమయం గడుస్తూనే వుంది, రాత్రి ఎనిమిదింటికి వాడు మమ్మల్ని చాలా మర్యాదగా రిసీవ్ జేసుకుని తనకు తెలిసిన డాక్టర్ ఉన్నాడని జెప్పి ఆటోను బిలిచి మమ్మల్ని ఎక్కించిండు.
ఆటో సందు గొందులన్ని తిరిగింది. వచ్చేపోయే వాహానాలు రణ గొణ ధ్వనులను చీల్చుకుంటూ టాంక్ బండ్ ఎక్కి దిగి ఓ చిన్నగల్లిలోని ప్రైవేటు హాస్పిటల్ ముందు ఆగింది.
శంకర్ గాడు బోయి డాక్టర్తో మాట్లాడి మమ్ముల దీసుకొని పోయిండు. డాక్టర్ నాన్న గారిని పరీక్షించిండు. రిపోర్ట్స్ చూసి ఆయనకు రెండు కిడ్నిలలోను ప్రాబ్లం వుంది, డయాలసిస్ చేస్తూ ఆపరేషన్ జేయాలే” అని మా వైపు చూశాడు.
“ఎంతవుతది సార్ “అన్నాను.
“ఆపరేషన్ ప్యాకేజిలా మాట్లాడుకుందాం” అన్నాడు డాక్టర్ హిందిలో.
అట్లంటే ఏందో అర్ధం గాని నేను మా ఊరి శంకర్ గాని దిక్కు జూసినా.
డాక్టర్ వాడు చాలా సేపు డిస్కర్షన్ చేసుకుని నన్ను భయటకు తీసుకువచ్చాడు.
“ప్రసాద్ నాన్న ఆపరేషన్ కు ఒక లక్ష యాభై వేలు అయితయ్ అంటాండు రా ” అన్నాడు శంకర్.
“తగ్గించమను శంకర్ ” అన్నాను బతిమిలాడుతు.
“బిల్లు విషయం లాస్టుకు మాట్లాడచ్చు ముందు అడ్వన్స్ కట్టి జేన్ కాండ్లి” అని తొందర పెట్టిండు శంకర్ గాడు.
నేను కౌంటర్ లో డబ్బులు కట్టగానే కంఫ్యూటర్ బిల్ టక టక ఇచ్చింది రిసెప్షనిస్ట్.
వాడే దగ్గరుండి జేన్ చేసి టెస్టులని మెడిసిన్ అని తీసుకువచ్చిన డబ్బులన్ని ఒడగాయించాడు.
అక్కడి వాతావరణం అంతా ఠాగూర్ సినిమాలో జూపిచ్చినట్టుగానే అనిపియడంతో నేను మెల్లగా శంకర్ ను అడుగుదామనుకుంటుంటే వాడేదో ఫోన్ వచ్చినట్టు డాక్టర్ క్యాబిన్ లకు పోయిండు.
మా డౌట్ క్లియర్ చేయకుండానే మళ్ళీ వస్తానని వెల్లిన శంకర్ గాడు ఎంతకి ఫోన్ లిస్ట్ చేయలేదు. నా పరిస్థితిని గమనించిన ఓ సిస్టర్ అసలు విషయం మెల్లగా చెవిలో జెప్పింది.
నాకు దుఃఖం ఆగలేదు.
‘మనోడు అని నమ్మితే ఇలా జేస్తడా! వాని స్వార్థం కోసం మమ్మల్ని బలిజేస్తడా! వాడు బైట ఏదందాజేస్తే మా కేందిగని వాడి బ్రోకరిజం మాతోజేస్తే ఎట్లా! ఊరోళ్ళం మమ్మల్ని గూడా మోసం జేసే వాడికి పుట్టగతుంటదా!’ ఆవేశంతో నా ఆలోచనలు పరి పరివిధాలుగసాగాయి..
డాక్టర్సు ఆపరేషన్ జేసిండ్లు, కిడ్ని ఫంక్షనింగ్ జూడాలని మళ్ళీ పదిరోజులుంచుకుని రకరకాల టెస్టులు జేసిండ్లు.
ఆకలి – దుఃఖం – భయం అన్ని కలగలిసిన చీకటి పొరలు.
నిశబ్ద సంగ్రామంలో అనిశ్చిత్తమైన అంతర్మధనం, నాతోపాటు అలిసిపోయిందేమో గాలి వీచాల వద్దా అన్నట్లుగా చూస్తుంది.
“సర్ మిమ్మల్నీ బిల్లింగ్ సెక్షన్లోకి పిలుస్తున్నారు” వేయిటింగ్ హాల్లో కూర్చున్న నన్ను తట్టి పిలిచి చెప్పింది సిస్టర్.
నేను ఉలికిపాటుగా లేచాను భయం భయం గా బిల్లింగ్ సెక్షన్ కు వెళ్లాను.
అర్జంటుగా క్యాష్ పే చేయాలని కౌంటర్లో కూర్చున్నతను ఓ చీటి ప్రింట్ తీసి నాచేతికిచ్చిండు.
మూడులక్షల రూపాయాలు……!
ఒక్కసారిగా నాకు గుండె ఆగినంత పని అయ్యింది.
“అదేంది సార్ ముందు లక్ష యాభైయని ఇప్పుడు ఇంతేసిండ్లు.” జీరబోయిన గొంతుకతో అన్నాను.
“అవును ఇదేం మీ ఉర్లోని దవాఖాన అనుకుంటున్నావా..? డబ్బులు రడిజేసుకుని తొందరగాకట్టండి” అని దబాయిస్తు అన్నాడు కౌంటర్లో కూర్చున్న అతను.
నేను విసురుగా ఇంచార్జ్ దగ్గరకు వెళ్ళాను.
“ప్లీజ్..! సార్… మేం పేదవాళ్ళం ఏదో తెల్వక ఈ హాస్పిటల్ కు వచ్చినం. ముందు లక్ష యాభై అని ఇప్పుడు ఎక్కువేసిండ్రు దయచేసి కాస్త తగ్గించి కనికరం జూపండి” బ్రతిమిలాడుతు అన్నాను.
“డబ్బులు లేందే హాస్పిటల్ కు ఎందుకచ్చిండ్లు తమాషాలు జెస్తాండ్లా? పూర్తి డబ్బులు కట్టందే ఇక్కడి నుండి వెల్లనీయరు. ఎలా చేస్తరో మీ ఇష్టం బిల్లు పూర్తిగా కట్టాల్సిందే.అప్పటి వరకు ఈ గేట్ ఓపెన్ కాదు మిమ్మల్ని వెళ్ళనీయరు ” దబాయిస్తూ అన్నాడు.
“సెక్యురిటి అతను తన మెడలో ఉన్న సెన్సార్ ఐడి కార్డ్ చూపియగానే గేట్ లాక్ అయిపోయింది. ఇప్పుడు భయటకు వెళ్ళే పరిస్థితి లేదు.
అమ్మ ఇంచార్జి కాళ్ళు పట్టుకోబోయింది. వాడు కాళ్ళు విదిలించుకుని కోపంగా తోసివేసిండు. తప్పని పరిస్థితులలో డబ్బులు లేవని బాబాయ్ కి జెప్పి ఊర్లోని ఇరవై గుంటల చెల్కభూమి అమ్మీ డబ్బులు తెప్పించుకున్నాం.
బెడ్ దగ్గర కూర్చున్న అమ్మ తల పట్టుకుని బోరు మంటుంది, నేను అమ్మను వారించి ఉన్న డబ్బులు కట్టి హాల్లోనికి వచ్చాను.
డిశ్చార్డ్ సమ్మరి ఇవ్వడానికి డాక్టర్ పిలిచిండు.
“చూడు బాబు మాకు సాధ్యమైనంతవరకు మేం ప్రయత్నం జేసినమ్, కాని ఆయన రెండు కిడ్నీలు పని జేస్తలేవు. ఉన్నంత వరకు డయాలసిస్ చేయిస్తూ బ్రతికించవల్సిందే..! ఇక అంతా పై వాడి దయే..!” అంటూ చీటి నా చేతిలో పెట్టిండు.
మరో డాక్టర్ ప్రిస్కిప్షన్ పై రాస్తూ హిందిలో ఏదో చెప్పాడు.
నా మస్తిష్కం పూర్తిగా స్తంభించింది. క్యాలెండర్లోని దేవుడి ఫోటోను చూస్తు నేను బరువుగా నేలపై కూలబడ్డాను.
***
“ఎంత ఘోరం సిటీలో దవాఖాన్లు గిట్లుంటాయా ఒకటిజెప్పి ఒకటి జేస్తరా..! అమ్మ అయ్యకు బుట్టలేదా వాల్లు, పాపం! వీళ్ళ మొహం జూస్తేనన్న దయగల్గలేదా ” కోపంగా అంది మా ఆవిడ జానకి.
“వైద్యోనారాయణ హరి అంటారు ,డాక్టర్లు అంటే దేవుడితో సమానం అంటారు. కాని ఇప్పుడు అంతా డబ్బుకు అలవాటు పడి కొందరు వారి వృత్తికే కలంకం దెస్తాండ్లు బాధపడకండ్లి మంచి వాళ్ళకు ఎప్పుడు మంచే జరుగుతుంది” అతని దగ్గరకు తీసుకుని అన్నాను అతని కళ్ళల్లోంచి నీటిబొట్లు నా చేతులపై పడ్డాయి.
“ఈ సమాజం ఇంకా ఎప్పుడు మారుతుందో ఏమో.. ఒక వైపు బ్రోకర్లు మరోవైపు డబ్బుకు కక్కుర్తి పడి జలగల్లా రక్తం పీల్చుకుతాగే ఆసుపత్రులు మధ్యలో నలిగే పేదవాళ్ళు ఇకనైన ఈ వ్యవస్థ మారితే బాగుండు కోపంగా అన్నాను.
“సూర్యుడు చుట్టు భూమి తిరిగినట్లు డబ్బు చుట్టూ మనిషి తిరుగుతాండు ఎలా మారుతుంది సర్” పక్క అతను బ్యాగు సర్ధుకుంటూ అన్నాడు.
“మన భయమే వాళ్ళ ఆయుధం, ముందు మనం వెళ్ళగానే సామరస్యంగా బుజ్జగిస్తూ చెబుతునే మన ఆర్ధిక స్థితిని గమనించి, సడేన్ గా ఓ గుది బండ మీదేస్తారు, దాంతో ప్రాణ భయంతో మనం ఉక్కిరి భిక్కిరై పోతాం చివరకు మీరెలా చెబితే అలా వింటాం అంటూ కాళ్ళ వేళ్ళ పడుతాం అందుకే మనము జాగ్రత్తగా ఆచి తూచి అడుగేయాలి” నేను చెప్పే విషయం ఆసక్తిగా వింటున్నారు అందరు.
ట్రేన్ మమ్ములను కాజీపేటలో దింపి కూతవేస్తు తన గమ్యస్తానాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది.
“ప్రసాద్ బాబు నాన్న జాగ్రత్త, అమ్మ రంది బెట్టుకోకుండా చూసుకో, నీకేమైన అవసరం పడితే ఇది నా ఫోన్ నెంబర్ కాల్ చేయి ” విసిటింగ్ కార్డ్ అతని చేతిలో పెట్టాను.
“కలుస్తాను సర్ ” అంటూ దీనవదనంతో అర్ధతైన కండ్లను తుడుచుకుంటూ వాళ్ళు బస్టాండు వైపు వెళ్ళే ఆటో ఎక్కారు, మేము మా లగేజ్ తీసుకుని అటు ఇటు చూస్తూ రోడ్ దాటీ మా ఇంటి వైపు వెళ్ళే ఆటో ఎక్కాము.
ఆ రాత్రి నేను నా డైరి తెరిచి “ప్రయాణంలో ఒక రోజు…” అన్న నా అనుభవాన్ని రాయడానికి కలం తీసుకుని హెడింగ్ పెట్టాను, మనసులో ఏదో తెలియని బాధ వెంటాడుతుంది.
నిశబ్ధం ఆవరించిన నా గదిలోకి గాలి మెల్లగా చొరబడి డైరీలోని పేజీలు అటూ ఇటూ తిరగేస్తుంది. నేను కిటికిలో నుండి ఎదురుగా కనిపించే ప్రైవేట్ హాస్పిటల్ బిల్డింగ్ వైపు చూశాను.అది మనుషుల నెత్తురు పులుముకున్న భూతంలా కనిపించింది.