ప్రపంచమంతా మార్మోగుతున్న మృత్యుగీతం
చావుతో సహవాసం చేసుకొంటూ
ఎవడి సమాధిని వాడే తవ్వుకుంటూ
ఒకడు ఉరితాళ్లు అమ్మకాల్లో బిజీ బిజీ లాభాల్లో
‘చివరి చితిమంటలు’ పబ్లిక్ స్కీంలో రేషన్‌గా కట్టెలు
అంతా విధిరాతంటూ చేతులు కట్టేసుకున్న రాజ్యాలు
చావులోనూ చిల్లర లాభాలు పోగుచేసుకుంటూ !
కల్పనలకి కనువిందైన కవిత్వాలంకరణ
శక్తిహీనులైనా దేవుళ్ళకి నిత్య నైవేధ్యం
ప్రపంచాన్ని పీల్చి పిప్పిచేస్తున్న
పెట్టుబడి దేవతకు ఆగని పూజలు
అనునిత్యం అబద్ధాల ఆవిష్కరణలు
అద్భుత ప్రపంచాన్ని అరచేతిలో చూపిస్తూ !
బడులు గుడులు ఆసుపత్రులు
సమస్త సౌకర్యాలు
ఖరీదయిన మార్కెట్ క్రీడా నీడలో
మనిషితనాన్ని ఎవడో బలవంతంగా లాక్కెళ్లినట్టు
మనం బతికే హక్కులన్నీ వాడికే రాసిచ్చిన రాజ్యం
మార్కెట్ కాపలా కుక్కలా
వాడిసిరే బిస్కెట్లు చప్పరిస్తూ రాజుగారి భాగవతాలు
మృత్యుగీతానికి దేశీయ సంగీతాన్ని సమకూరుస్తూ
పీల్చటానికి గాలి దొరకదు
తాగటానికి నీళ్లు దొరకవు
కాళ్ళకింద నేల ఖాళీ చేయాల్సొచ్చి
తరతరాల సంఘటిత జీవన హక్కులన్నీ
తరిగిపోయి కరిగిపోతున్న సహజ వనరులు
దేశాల్ని దేశప్రజల్ని అమ్మకానికి పెట్టిన రాజ్యాలు
విలవిలలాడుతున్న ప్రజల ప్రాణాలూ మార్కెట్ సరుకై
రాజుగారు కూడా మార్కెట్ నిలబెట్టిన తోలుబొమ్మై !
జనం డబ్బంతా ఖర్చుచేసి కొనుక్కున్న
అణ్వస్త్రాలు అధునాతన ఆయుధాలూ
ఆత్మ రక్షణ ఇవ్వలేని అంబులపొదిలోనే
ప్రపంచాన్నంతా ఆక్రమించుకున్న మృత్యు వైరస్
మరొకరి దురాక్రమణకి చోటివ్వక !
బతకటం మన హక్కు
ఆత్మగౌరవం మన ఆస్తి
మనం మార్కెట్ బలిపశువులం కాదు
రాజ్యాల స్వారీ మనపై చెల్లదిక
మృత్యు గీతంలో మనో విజ్ఞాన వికాసమిది
మార్కెట్లూ మధ్యవర్తులూ లేకుండా
మనల్ని మనమే పాలించుకుందాం
ఓ నిండైన బతుకుమీద ఆశనిస్తూ !
చాలా బాగుంది
Congrats for capturing our everyday life.