పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ లోని రమల్లా ఫ్రెండ్స్ స్కూల్ చిన్నారులు, క్రిస్టమస్ సందర్భంలో గాజా బాలల దుర్భరమైన పరిస్థితుల్ని ఒక విషాద మధుర గీతం ద్వారా వివరిస్తున్నారు. తమకు సంఘీభావం తెలపమని ప్రపంచ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. గాజాలోని పిల్లల భద్రత కోసం సంవేదనతో, సహానుభూతితో తాదాత్మ్యం చెందుతున్న ఆ బాల బాలికలు అంతులేని వేదనతో సామూహికంగా ప్రార్ధిస్తున్నారు. శాంతి కోసం, న్యాయం కోసం గొంతెత్తి అర్ధిస్తున్న వారికి సంఘీభావంగా మన భాగస్వామ్యాన్ని కోరుతున్నారు. పసిబిడ్డల్ని మట్టుబెడుతున్న ఇజ్రాయేల్ ఘోరకలికి వ్యతిరేకంగా అందరం కలిసి పెద్దపెట్టున ప్రతిఘటించాలని, అవి సరిహద్దులను చెరిపేసే ఆశల వస్త్రంగా ప్రతిధ్వనించాలని అభ్యర్ధిస్తున్నారు. మనందరికీ ప్రియమైన మహోన్నతమైన మానవత్వం వైపు బలంగా నిలబడమంటున్నారు.
వారి బాధని మనతో పంచుకోవడానికి విశ్వజనీనమైన “డోలు వాయించగల చిన్నారి” బాలుని కథనాన్ని ప్రేరణగా తీసుకున్నారు. బాల యేసు జన్మించినప్పుడు అందరూ ఖరీదైన బహుమతులు తీసుకెళ్తుండగా, అత్యంత పేదతనంతో నిస్సహాయుడైన పేద చిన్నారి గాయకుడు తన డోలు వాయిద్యంతో రాజును చూడటానికి వెళతాడు. మేరీ మాత అనుమతితో తన డోలుని వాయిస్తాడు. “నేను చాలా ఉత్తమంగా వాయించాను. యేసు నావైపు చూసి చిరునవ్వులు చిందించాడు” – అని ఆనందోత్సాహాలతో చెప్తాడు.
ఇది క్రిస్టమస్ సందర్భంలో జరిగింది కాబట్టి, ఈ పాట స్ఫూర్తితో మా గాజా బాలలకు కూడా శాంతితో కూడిన క్రిస్టమస్ పండగ కావాలని నినదిస్తూ తమ వేదనని ఎంతో హృద్యంగా పలికించారు రమల్లా ఫ్రెండ్స్ స్కూల్ చిన్నారి బాల బాలికలు. క్రిస్టమస్ పండగకి మూడు వారాల ముందే ఈ పాట పాడారు!
క్రిస్టమస్ సంబరాలు ముగిశాయి. ప్రపంచవ్యాప్తంగా అశేష ప్రజానీకం క్రిస్టమస్ సంబరాలను జరుపుకున్నారు. అయితే క్రీస్తు జన్మించిన బెత్లెహేంలో మాత్రం ఎటువంటి ఉత్సవాలూ జరగలేదు. అక్కడి ప్రజలు నిస్తేజంగా నిరాశా నిస్పృహల్లో మునిగిపోయి ఉన్నారు. ఇజ్రాయేల్ కిరాతక కృత్యాలలో చిన్నారుల మరణ ఘోష పోప్ మాటల్లో విషాదంగా ధ్వనించింది. “మానవత్వం సమసిపోలేదు. కనుకనే ఆ భీభత్స బాధితులకు సామాన్య క్రైస్తవులు సంఘీభావం వ్యక్తం చేశారు. పాలస్తీనా సాంప్రదాయక దుస్తులతో కప్పిన నవజాత శిశువును పోలిన బొమ్మను ఇంక్యుబేటర్ లో ఉంచడం ద్వారా తాము గాజాలోని నిస్సహాయుల పక్షానే ఉన్నామని చాటి చెప్పారు”- అని వాటికన్ సిటీ నుంచి పోప్ చెప్పారు.
సాధారణంగా యుద్ధాలలో మహిళల – పిల్లల మరణాలు 10 శాతంగా ఉంటాయి. కొన్నిసార్లు 5 శాతంగా మాత్రమే ఉంటాయి. గాజాలో వీరి మరణాలు 60 శాతంగా ఉన్నాయి. సంతానోత్పత్తి చేయగలిగిన మహిళల్ని, పదేళ్ళ పిల్లలతో పాటు పసికూనలు రాబోయే తరాలకు ప్రమాదకరంగా మారతారని జాతి ప్రక్షాళన కోసం పాపభీతి అనేది లేకుండా చేసే కుట్రపూరిత వ్యూహంలో భాగంగానే ఈ హననాలు జరుగుతున్నాయి. దీనినర్ధం చేసుకుని ఒక జాతిని మట్టుబెట్టే హక్కు మరొక జాతికి లేదని ఈ చిన్నారుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా ప్రపంచమంతా ఇజ్రాయేల్ కి వ్యతిరేకంగా ప్రతిఘటించాలి.
గాజా పిల్లలు హృదయవిదారకంగా రోదిస్తున్నారు చూడండి
గాజా పిల్లలు ప్రతిరోజూ వందలాదిగా యుద్ధంలో చనిపోతున్నారు
ప్రపంచమంతా గాజా పక్కన నిలబడి, విస్తుపోతూ చూస్తోంది
అది చూడగలదు కానీ వినడానికి ఇష్టపడదు
అది వింటుంది కానీ నోరు పెగిలించుకుని మాట్లాడదు.
ఈ ప్రపంచంలో న్యాయం హృదయం లేనిది.
కాబట్టి అది మాట్లాడదు.
భయం లేని ప్రపంచం గురించి నేను ఎప్పుడు కల కనగలను?
మాకు తుపాకుల శబ్దాలు వినిపించని లోకం ఎక్కడ ఉంటుంది?
బాంబులు హోరెత్తించని చోటు ఎక్కడ?
నేను ఒక చిన్నారిని
నేను పుట్టింది జీవించడానికి, చావడానికి కాదు
నేను ఒక చిన్నారిని
నేను పుట్టింది బతకడానికి, చావడానికి కాదు
మరణించడానికి కాదు
మరణించడానికి కాదు
నా ప్రియమైన చిన్నారుల్లారా అని గాజా తన పిల్లల్ని పిలుస్తోంది
మాకు ప్రేమ, అందమైన జీవితం, న్యాయం కావాలి
మేము దానిని మా స్వంత చేతులతో సృష్టిస్తాం,
విధ్వంసం తర్వాత మేము మా దేశాన్ని నిర్మిస్తాం
ఒక ఇంటి తర్వాత మరో ఇల్లు, నిర్మించాలని మేము నిర్ణయించుకున్నాం
ఎంత విధ్వంసం జరిగినా గాజా చాలా బలంగా ఉంది
మేము నిర్ణయించుకున్నాం
ఓ స్వర్గమా, మాకు పటిష్టమైన భద్రతనూ, శాంతినీ అనుమతించు.
ఈ రాబోయే క్రిస్టమస్ కి
న్యాయంతో కూడిన విస్తారమైన బహుమతులను మాకు ప్రసాదించు,
శాంతి, ఐక్యతల నివ్వు.
మానవత్వం ప్రబలంగా ఉండే భవిష్యత్తు వైపుకి
విశ్వమానవ ప్రేమతో మమ్మల్ని నడిపించు
రాబోయే ఋతువులు మిమ్మల్ని ఆశల హరివిల్లులతో నింపాలని
శాంతి నిండిన శాశ్వతమైన వెచ్చదనం ఇవ్వాలని కోరుకుంటున్నాం!
FRIENDS —I AM WITH YOU —
ALWAYS