ప్రతిభ

ఎద్దూ నేనూ
తోడూ నీడగా జీవిస్తాం

ఎద్దూ నేనూ పడే కష్టం
పల్లె ప్రగతి చక్రం

నా వృత్తికి నా పశురమే దిక్కు
చచ్చి కూడా నన్ను నిలబెడుతదది

ఊర్ల చచ్చిన పశురాల తోలు ఒలిచి
కండ చెక్కి బొచ్చు గీకి లందలో తొక్కే తొలి
అనాటమిస్ట్ ని
ఏ అవయవం ఏడుంటదో విడమర్చి చెప్పే జీవశాస్త్రవేత్తని

తోలుకి సున్నం పూసి ఎండేసి
పెద్దతునకలు దండేలపై ఆరేసి
పనికి ముందర పండ్రాయికో దండమెట్టి
గూటంతో గుద్దుతుంటే ఒళ్ళంతా హూనం
తోలంతా మెత్తగా రంగుతేలు

దండెం పై వేలాడే తునకలు
కుండలో కుతకుత ఉడకగానే
అలసిన దేహం
కుతితో తిని కడుపు నింపుకుంటుంది

పశుకొవ్వు నూరినూరి మిగ్గుగా చేసుకున్న
తొలి కందెన ఇంజనీర్ ని
పశుకొమ్ముల్లో భద్రపరచుకున్న వస్తు వినియోగ నేర్పరిని

మిగ్గు లో ముంచిన ఆరె ఆగక సాగు తోలుకి రంధ్రాలు చేసుకుంటూ
సన్నగా తరిగిన తోలే కుట్టువారై ఆరెకుట్టులో
పాద రక్షణగా చెప్పులు తయారు
తీరొక్క పరిమాణాలు
తీరొక్క రీతులు ఆకారాలు రూపకల్పనలు
నా సృజనాత్మకతతో సృష్టించిన ఆది శాస్త్రవేత్తని

మరక మేకతోలు నానబెట్టి సున్నంబూసి ఆరేసి
రేల చండ్ర గంగరావి చెక్క కై అడవంతా చక్కర్లు
నా డప్పుకి సరైన కుదురుకై
జిట్రేగు పుల్లే నేనెంచుకున్న చిర్రపుల్ల
ప్రత్యామ్నాయం కందిపుల్ల తాటి ఈనె పుల్ల
నాకెవ్వడూ చెప్పలే నా అనుభవమే
నన్ను వృక్ష శాస్త్రవేత్తని జేసింది

బోటిలోని ఇచ్చోరపొరలనొలుస్తూ
పలుచటిపొరకై వెతుకులాడి
జమిడికని చేసిన నేను

నాకు ప్రతిభ లేదంటే
వాడ్ని నిలబెట్టి చీరి
ఒక్కోభాగాన్ని వేరు చేస్తా
నాకవసరమైన తోలుతో చెప్పులు కుడతా
నా ఆరెపై ఆన

నా డప్పుతో దరువులేసుకుంటా చైతన్యంతో
ఏ దరువు జాతికవసరమో నాకు తెల్సు
చాటింపుల్లో నాదే మెలితిరిగిన చేయి
గళం చించుకుంటే పొలిమేర దాటుతుంది

పుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. విద్యార్థి దశలో ఎస్. ఎఫ్. ఐ. లో పని చేశారు. సామాజిక ఆర్థిక సమస్యలను కవితా వస్తువులు గా తీసుకుని  కవిత్వం రాస్తున్నారు.  వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

Leave a Reply