ప్చ్‌…

క్యాంప్‌ అహ్లాదంగా, అందంగా ఉంది.
క్యాంపులో పచ్చటి పెద్ద పెద్ద మానులు. చిక్కటి నీడ.
క్యాంప్‌ వెనక వైపు, కుడివైపు గుట్టలు.
కుడివైపు గుట్ట మీదుగా పారుతూ వస్తున్న కాలువ…. క్యాంపు ముందర నుంచి వెళుతుంది. ఆ కాలువలో మోకాళ్ల లోతు వరకు నీళ్లు పారుతున్నాయి.
కాలువ దాటడానికి వెదురుతో చిన్న బ్రిడ్జిని తయారుచేసారు. దాన్ని మీదుగా క్యాంపులోకి రావాలి.
క్యాంపు మధ్యలో కిచెన్‌. కిచెన్‌ పక్కన చిన్న పిల్ల కాలువ. ఓ గుంట తీసి, అందులోని నీళ్ళనే వంటకు వాడుకుంటున్నారు.
క్యాంపు కుడిపక్కన, క్యాంపు మధ్యలో టెంట్లతో మీటింగ్‌ హాల్‌.
క్యాంపుకు ఎడమవైపు చివర ఎక్సర్‌సైజ్‌ చెయ్యడానికి పెద్ద గ్రౌండ్‌.
క్యాంపులో అక్కడక్కడ ఆయా బ్యాచీల వారీగా టెంట్లు.
పండగ వాతావరణం. కామ్రేడ్స్‌ అందరూ కలిస్తే అదే పెద్ద పండగ.
రెండు రోజుల కిందనే గరిజెలు, అరిసెలు, పూస కూడా ఓ ప్రాజెక్టు లాగా స్త్రీ, పురుష కామ్రేడ్స్‌ కూచుని చేసారు. దీనికి రోల్‌కాల్‌లో చెప్పారు ` ఫలానా ఫలానా కామ్రేడ్స్‌ ఈ రోజు వంటలో సాయంగా వుంటారు అని.
జనరల్‌గా క్యాంపుల్లో ఇలాంటివి చెయ్యరు. కానీ కిచెన్‌ బాధ్యురాలు జ్యోతి పూనుకోవడం వల్లనే అవి తయారయ్యాయి. ఓ వారం రోజుల వరకు సాయంత్రం టీ టైమ్‌లో కామ్రేడ్స్‌కి పెట్టొచ్చులే అనుకుంది జ్యోతి.
లోపలి వాళ్లకు చిరుతిండ్లు అంటూ ఏమీ వుండవు. జనం తెచ్చే తిండి, లేదంటే వాళ్లు వండుకునేది.
మాంసాహారం వండినప్పుడు అదే స్పెషల్‌. అప్పుడప్పుడు పూరీలు, సేమ్యా పాయసం. బయటి నుంచి కామ్రేడ్స్‌ ఎవరైనా ఏమన్నా పట్టుకొచ్చారూ అంటే చిన్న ముక్క అయినా సరే అందరూ పంచుకుని తింటారు.

*

మొదట ఎనిమిది మంది సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అప్పుడు అది కీకారణ్యం లాగా వుండింది. విపరీతమైన దోమలు. రోల్‌కాల్‌లో నిలబడిన ఆ కాసేపు కూడా కుడుతూనే వున్నాయి.
దాదాపు యాభై అరవై మంది కామ్రేడ్స్‌ రావచ్చని, కాబట్టి అందుకు తగినట్టు ఈ ప్రాంతాన్నంతా సాఫ్‌ చేస్తున్నామని ఆ దళం కమాండర్‌ చెప్పేవరకు తెలియదు చాలా మందికి. రాష్ట్రకమిటీ సమావేశం కొరకు ఆ క్యాంపు.
వారం రోజుల్లో దాదాపు పది ఎకరాల స్థలాన్ని సాఫ్‌ చేసారు. పెద్ద పెద్ద మానులు తప్ప ఒక్క చిన్న పొద కూడా లేదు. చిన్నపొదలను తీసెయ్యడంతోనే దోమలు కూడా మాయమయ్యాయి.
ఏడవ రోజు సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు బ్యాచీలన్నీ దిగిపోయాయి.
క్యాంపు స్టార్ట్‌ అయిన రోజు మహిళా కామ్రేడ్స్‌ గుట్ట మీద అంటే కుడివైపు స్నానానికి వెళతారని, జెంట్‌ కామ్రేడ్స్‌ ఎడమవైపు అంటే దిగువ వైపున స్నానానికి వెళతారని చెప్పారు. కొంతమంది పురుష కామ్రేడ్స్‌ తామే గుట్ట మీదకి స్నానానికి వెళతామన్నారు. కానీ క్యాంప్‌ ఇన్‌చార్జి చెప్పింది ఫాలో అవ్వాల్సిందే.
జ్యోతి సహచరుడు అనిల్‌ కూడా ఆ క్యాంపుకు వచ్చాడు. అతను రాష్ట్రకమిటీ సభ్యుడు.
ఎనిమిది నెలల తరువాత కలిసారు.
కానీ వాళ్ల బ్యాచ్‌…. క్యాంపు స్టార్ట్‌ అయిన రోజు రావడం, కొద్దిగా లేట్‌ అవ్వడంతో వచ్చీ రావడంతోనే మీటింగ్‌లో కూర్చున్నారు. లైన్‌లో నిలబడి చెయ్యి కలపడం తప్ప అతనికి, జ్యోతికి ఒక్క నిమిషం కూడా మాట్లాడటానికి కుదరలేదు.
తనకు చూపించిన ప్లేస్‌లో కిట్టు పెట్టుకుంటూ జ్యోతిని చూసాడు ` నీ ప్లేస్‌ ఎక్కడా అన్నట్టు? అనిల్‌ అసలే మొహమాటస్తుడు. సహచరితో నలుగురిలో మాట్లాడటానికి ఇబ్బంది పడతాడు.
వెనకటి రోజుల్లో తల్లిదండ్రుల ముందు భార్యలతో మాట్లాడకూడదనే అప్రకటిత నిషేధం లాగా పార్టీలో కూడా ఉందా అనిపించేది జ్యోతికి. పెళ్లి కాని కామ్రేడ్స్‌ వుంటారు కాబట్టి, వారి ముందర జంటలు మాట్లాడుకుంటే ఇబ్బందిపడతారనో లేక, ఉద్యమం ప్రధానం… మిగతా వాటికి ప్రాధాన్యం ఇవ్వకూడదనో తెలియదు. సహచరులిద్దరు మాట్లాడుకోవడం పార్టీలో ఒక రకమైన అప్రకటిత నిషేధంలాగా వుండేది. జ్యోతికి ఈ పరిస్థితి కొంత ఇబ్బందిగా వుండేది. అట్లని అందరూ అలా వుంటారా అంటే అదేం లేదు. కొందరు బాగానే మాట్లాడుకుంటూ వుంటారు. కొంతమంది విడిగా క్యాంపు వేసుకుని సహచరులిద్దరు అక్కడే వుంటారు కూడా. రాష్ట్రస్థాయి నాయకులు ఒకరిద్దరు సహచరిని గార్డుగానే పెట్టుకుంటారు. అంటే ఇరవై నాలుగు గంటలు ఒక్క దగ్గరే వుంటారు.
సాయంత్రం టీ టైంలో మాట్లాడొచ్చులే అనుకుంటే అప్పుడూ కుదరలేదు. మీటింగ్‌ నుంచి వాళ్లు వచ్చే టైమ్‌కి జ్యోతి సెంట్రీకి వెళ్లిపోయింది.
సెంట్రీ, సపోర్టు సెంట్రీ చేసి సాయంత్రం ఆరు గంటలకు వెళ్లిన జ్యోతి… రాత్రి పది గంటలకు కిందకు దిగింది.
అప్పటికే అందరూ భోజనాలు చేసి, ఎవరి టెంట్లలో వాళ్ళు పడుకున్నారు. జనరల్‌గా రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకల్లా భోజనాలకు విజిల్‌ వేస్తారు. దాదాపు గంట లోపే అందరూ తినేస్తారు. ముచ్చట్లు పెట్టుకుంటూ తినే ఒకరిద్దరు మాత్రం కిచెన్‌ దగ్గర కనిపిస్తారు.
జ్యోతి, మరో కామ్రేడ్‌ సెంట్రీ డ్యూటీ అయిపోగానే గుట్ట దిగి కిందికి వచ్చారు. డైరెక్టుగా కిచెన్‌ దగ్గరికి వచ్చి అన్నం తిన్నారు. తన మకాం దగ్గరికి వెళుతూ వెళుతూ అనిల్‌ కోసం వెతికింది. చీకట్లో కనిపించలేదు. పగలు తను కిట్టు పెట్టిన చోట టెంట్‌ వేసి వుంది. బహుశా టెంట్‌లో పడుకుని ఉంటాడు.
అనిల్‌ మెలకువతోనే వున్నట్టున్నాడు. జ్యోతి వెళుతుంటే చూసి, టెంట్‌లోంచి బయటకు వచ్చాడు. పిలిచాడు.
జ్యోతి ఆగింది.
‘‘సెంట్రీ అయిపోయిందా?’’ అనిల్‌.
‘‘ఆ… ఇప్పుడే’’ అని, ‘‘అన్నం తిన్నవా?’’ అడిగింది జ్యోతి.
‘‘తిన్నా’’ అని, ‘‘కాసేపు కూచుందామా ఇక్కడ’’ అడిగిండు అనిల్‌.
పరిస్థితి ఏంటో జ్యోతికి అర్థమైంది. ‘‘సరే’’ అంది.
అనిల్‌ ఓ చిన్న రాయి మీద కూచున్నాడు. జేబులోంచి చిన్నది, కూచునే పాలిథిన్‌ వేసుకుని జ్యోతి కూచుంది.
‘‘చెప్పు. ఎట్లున్నవు?’’ అనిల్‌.
‘‘నువ్వెట్లున్నవు?’’ జ్యోతి. ప్రశ్నకు ప్రశ్ననే జవాబు కావడంతో జ్యోతి కోపంగా వుందని అనిల్‌కు అర్థమవుతుంది.
‘‘బాగున్నా’’ అని, ‘‘ఈ రోజు మనం పక్కకు వెళ్లడం కుదరదు. బహుశా రేపు కూడా. కొత్త జంటలు రెండు వున్నాయి. చాలా కాలంగా కలవని జంటలు కూడా వున్నాయి’’ చెప్పాడు అనిల్‌.
‘‘నువ్వు కూచుందామా అన్నప్పుడే అర్థమైంది’’ అని, తనే మళ్ళీ అంది ‘‘మనం కలవక ఎనిమిది నెలలవు అవుతుంది తెలుసా’’ జ్యోతి.
కొన్నిసార్లు క్యాంపు బాధ్యుల నిర్లక్ష్యం, సాధింపు కూడా ఉంటుంది.
‘‘అవును. నీకు నేను చెప్పేదేముంది’’ అనిల్‌.
‘‘సరేలే. రేపు మాట్లాడటానికి నీకు కుదురుతుందా?’’ అంది జ్యోతి.
‘‘ఏమో. తెలియదు. నాకు కుదిరినప్పుడు నువ్వు సెంట్రీలో వుంటే?’’ అనిల్‌.
‘‘అన్నీ కుదిరితేనేలే’’ జ్యోతి.
‘‘సరే. మీ ఏరియా విశేషాలు ఏంటి? ఏం చేస్తున్నారు?’’ అడిగిండు అనిల్‌.
‘‘అబ్బ! ఇంత ఫార్మాలిటీగా మాట్లాడకు అనిల్‌. నాక్కోపం వస్తుంది’’ జ్యోతి.
‘‘నిజానికి మాట్లాడ్డానికి నాకేమీ తోచడం లేదు. నువ్వే మాట్లాడొచ్చుగా’’ ఎదురుగా కూచున్న జ్యోతి చేతిని తన చేతిలోకి తీసుకున్నడు అనిల్‌.
‘‘ఏముంది. అన్నీ మామూలే. నిజానికి ఈ క్యాంపులో నేనుంటాననే విషయం నాకు తెలియనే తెలియదు. బహుశా ఇది రామన్న ప్లాన్‌ అయ్యి వుంటది’’ అంది జ్యోతి.
‘‘అవునా. ఇక్కడికొచ్చే వరకు నాకూ తెలియదు, నువ్విక్కడ వుంటావని’’ అనిల్‌.
‘‘ఆరోగ్యం ఎలా వుంటుంది?’’ అతని చేతిని నిమురుతూ అడిగింది జ్యోతి.
‘‘బాగానే వుంటుందీ…’’ అనిల్‌.
‘‘ఏం దీర్ఘం తీస్తున్నం ‘వుంటుందీ’ అని. బాగా లేదా’’ గొంతులో ఒకింత తడితో జ్యోతి అడిగింది.
నిజంగానే అనిల్‌ చాలా బక్కగైండు. తనే పట్టించుకోలేదు అనుకుంది జ్యోతి.
‘‘ఏంది మాట్లాడవ్‌. బానే వున్నవా?’’ జ్యోతి మళ్లీ అడిగింది.
‘‘అదేం లేదు. బానే వున్న. తిరగడం కదా’’ అనిల్‌.
నిజానికి అనిల్‌కి బాగుండటం లేదు. గుట్టలు ఎక్కేటప్పుడు ఎందుకనో ఆయాసం వస్తూ వుంది. చెప్తే జ్యోతి కంగారు పడుతుంది. ఎందుకులే అని చెప్పడంలేదు. జ్యోతికే కాదు ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు అనిల్‌.
‘‘ఇంతకీ నువ్వెట్ల వున్నవ్‌’’ అడిగిండు మళ్ళీ తనే.
‘‘నేను బానే వున్న. ఆ మధ్య బాగా తిరుగుడైంది కని, ఇప్పుడు అంత లేదు. ఇగో ఈ క్యాంపుకోసం వచ్చినం కదా. కొద్ది రోజులు రెస్టేగా’’ జ్యోతి.
‘‘నీ కోసం రెండు కథల పుస్తకాలు తెచ్చిన. బయటి నుండి రాగానే తీసి పెట్టిన’’ అనిల్‌.
‘‘అవునా. ఇప్పుడు ఇస్తవా. రాత్రికి కాసేపు చదువుకోవచ్చు’’ జ్యోతి సంతోషంతో అంది.
‘‘ఇప్పుడా… వద్దులే. రేపిస్తా’’ అనిల్‌.
‘‘ఒక్కసారి నిన్ను పట్టుకుంటా’’ జ్యోతి కొంటెగా అంది.
‘‘ఎట్ల? వద్దు’’ కంగారు పడ్డడు అనిల్‌. ‘పక్కకు వెళ్లకుండా ఎలా కౌగిలించుకుంటావు?’ అని.
‘‘నాకు తెలుసులేవోయ్‌. ఊరికే అన్న. నీ మీద ఉడుకుమ్మోత్తనంతో’’ నవ్వి, తనే
‘‘సరేలే. వెళ్ళి పడుకో. ఇంకాసేపుంటే ఎవరన్న ఏమన్నా అనుకుంటారేమో అని నీకు టెన్షన్‌ పెరుగుద్ది’’ అంది జ్యోతి నవ్వుతూ.
నిజానికి జ్యోతికి కూడా టెన్షనే.
‘‘నువ్వో పెద్ద రాస్కెల్‌వి’’ తల మీద చిన్నగా తట్టి లేచాడు అనిల్‌.

*

ఎండ్రకాయలు లోకల్‌ కామ్రేడ్స్‌ చాలా ఈజీగా పడతారు. కిచెన్‌ పక్కనున్న కాల్వలోని ఎండ్రకాయలను తదేకంగా చూస్తూ నిలుచుంది జ్యోతి.
కాలకృత్యాలు తీర్చుకుని తన డేరాకు వెళుతున్న కేంద్రకమిటీ సభ్యుడు భాస్కరన్న చూసాడు.
‘‘ఏం కామ్రేడ్‌, ఏమో చూస్తున్నవు?’’ అని పలకరించిండు.
‘‘ఏం లేదన్నా. గీ ఎండ్రకాయల్ని ఎట్ల పట్టాల్నా అని’’ చెప్పింది జ్యోతి.
ఎలా పట్టాలో పట్టి చూపించిండు భాస్కరన్న. వెంటనే చిన్నచిన్న ఎండ్రకాయలు పట్టడం మొదలుపెట్టింది జ్యోతి. గబుక్కున వాటి మీద చెయ్యి పెట్టాలి. మీద ఏది పడినా ఎండ్రకాయలు కొండ్లున్న చేతులను పొట్ట కిందకు గుంజుకుంటాయి. అప్పుడు నెమ్మదిగా మన చేతులను పొట్టకిందికి పోనిచ్చి పట్టుకోవాలి. లూజుగా పట్టుకున్నమంటే కొండ్ల మధ్య మన వేళ్లను ఇరికించి నొక్కేస్తాయి అవి. కాబట్టి గట్టిగా పట్టుకోవాలి.
ఈ ఎండ్రకాయలు నీసు వాసన చూస్తే లోపల ఎక్కడో బొరియల్లో దాక్కున్నవి కూడా బయటకు వచ్చేస్తాయి. ప్రాణాలు పోతయనే సోయి కూడా వాటికి వుండదు. అందుకే కొన్నిసార్లు కోడి పేగులను కట్టెకు చుట్టి రంధ్రాల్లోకి పోనిచ్చి కట్టెను బయటకు తీస్తే కట్టె వెంట పడి వచ్చేస్తాయి. అట్లా సులువుగా పట్టుకుంటారు పెద్ద పెద్ద ఎండ్రకాయలను.
జ్యోతి ఎండ్రకాయలు పడుతున్నప్పుడే టిఫిన్‌ విజిల్‌ వేసారు. అందరూ లైన్లో నిలబడి టిఫిన్‌ పెట్టించుకుని వెళ్లి వీలున్నచోట కూచుని తింటున్నారు. అనిల్‌ కనిపిస్తాడేమో అని చూసింది. ఎక్కడా కనిపించలేదు. సరుకులు తీసుకు రావడానికి వెళ్లే బ్యాచ్‌లో తను కూడా వుండింది. గబగబా తిని వెళుతుండగా కిచెన్‌ దగ్గరికి వస్తూ అనిల్‌ కనిపించాడు. మాట్లాడదామని ఆగింది. ఈలోపల ఊర్లోకి వెళ్లే కామ్రేడ్‌ భీమన్న ‘‘జ్యోతక్కా, నీదే లేట్‌’’ అని కేక వేసాడు.
ఇక అక్కడి నుంచి కదిలింది జ్యోతి. తను వెళ్లడం అనిల్‌ కూడా చూసాడు. వేరే కామ్రేడ్‌ మాట్లాడుతుండటంతో టిఫిన్‌కి రావడం లేటయ్యింది అనిల్‌కు.
ఊర్లో వారితో మాట్లాడి, ఏమన్నా అనుమానాస్పదంగా ఉందా అని కనుక్కున్నారు. అంతా బాగానే వుందని ఊరివారు చెప్పారు. వేరే దళం కామ్రేడ్స్‌ చేరవేసిన సరుకులు తీసుకుని క్యాంపుకు వచ్చారు జ్యోతి, భీమన్న బ్యాచ్‌. అప్పటికి మధ్యాహ్నం దాటిపోయింది.
జ్యోతి లంచ్‌ చేసి తన మకాం దగ్గరికి వెళ్లింది. కథల పుస్తకం చదువుదామని తీసింది. నిద్ర ముంచుకురావడంతో పుస్తకం మీద పెట్టుకుని అట్లాగే నిద్రపోయింది. క్యాంపులో కునుకు తీసే అవకాశం వుంటుంది. రెగ్యులర్‌ దళంలో అస్సలుండదు.
‘‘కామ్రేడ్‌ సెంట్రీ’’ అని వచ్చి లేపాడు గోపాల్‌.
వాచీ చూసుకుని, ‘‘ఓ… టైమయ్యిందా’’ అని లేచి కూచుంది జ్యోతి. వాచీలు అందరు కామ్రేడ్స్‌ పెట్టుకోరు. ఎస్‌ఏసి (స్క్వాడ్‌ ఏరియా కమిటీ) స్థాయి నుంచి మాత్రమే వాచీలు పెట్టుకోవడానికి అనుమతి ఉంది. రేడియోను కమాండర్‌ స్థాయి నుంచి పైస్థాయి వరకు వాడతారు.
కిట్టు సర్దుకుని సెంట్రీకి వెళ్లిపోయింది జ్యోతి.
మహిళా కామ్రేడ్స్‌ స్నానాలు చేస్తున్నారు. వారిని దాటి కొద్దిగ ముందుకు వెళ్లి సెంట్రీ పోస్టు దగ్గర నిలబడింది జ్యోతి. సపోర్టు సెంట్రీగా అనిత వచ్చింది. అంతకు ముందు సెంట్రీ డ్యూటీలో వున్న కామ్రేడ్స్‌ రిలీవ్‌ అయ్యారు. ఇటువైపు మహిళా కామ్రేడ్స్‌ స్నానాలు చేస్తున్నారు కాబట్టి, మహిళా కామ్రేడ్స్‌నే సెంట్రీ డ్యూటీలు చేస్తున్నారు.
మహిళా కామ్రేడ్స్‌ అందరూ స్నానాలు చేసి వెళ్లిపోయారు. అంతా గప్‌చుప్‌గా వుంది. జ్యోతి చుట్టూ చూస్తూ నిలబడింది. సాయంత్రం ఐదున్నర గంటల సమయం కావస్తుంది. సూర్యుడు నెమ్మది నెమ్మదిగా కిందికి వంగుతున్నాడు.
సెంట్రీ పోస్టుకి ఓ మూడు, నాలుగు వందల గజాల దూరంలో ఏదో కదిలి వెళ్లిపోయింది. జ్యోతి అలర్ట్‌ అయ్యింది. లోడ్‌ చేసిన తుపాకిని చేతిలోకి తీసుకుంది.
చిరిగిన కిట్టును కుట్టుకుంటున్న అనిత… జ్యోతి అలర్ట్‌ అవడాన్ని చూసిన ‘ఏంటి?’ అని సైగ చేసింది.
‘ఏమీ లే’ అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. జ్యోతి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఇప్పుడు వెళ్లింది మనిషా, జంతువా? ఏ మాత్రం తొందరపడ్డా ప్రమాదం తప్పదు. ఆలోచిస్తూ అదే స్పాట్‌ను తీక్షణంగా చూస్తూ నిలుచుంది జ్యోతి. వెంట వెంట ఇద్దరు వ్యక్తులు దాటారు. డౌట్‌ లేదు. పోలీసులు క్యాంపును చుట్టుముడుతున్నారు.
అనితను తట్టి పోలీసులు దాటినవైపు చూపించింది జ్యోతి. కొద్దిసేపు ఇద్దరూ చూసారు. మళ్లీ ఎవరూ కనిపించలేదు.
‘‘ఇద్దరు పోలీసులు వెళ్లడం చూసాను’’ జ్యోతి గుసగుసగా చెప్పింది.
‘‘ఏం చేద్దాం?’’ అడిగింది అనిత.
‘‘ఫైరింగ్‌ చేద్దాం. క్యాంపులో వాళ్లు అలర్ట్‌ అవుతారు కదా’’ జ్యోతి.
‘‘ఒకవేళ పోలీసులు కాకపోతే… క్యాంప్‌ను ఖాళీ చెయ్యాల్సి వస్తది. మన మీద విమర్శ పెడతరు’’ అనిత.
‘‘నేను ఫైరింగ్‌ చేస్తున్న. కిట్‌ వేసుకో’’ తనూ కిట్‌ వేసుకుంటూ చెప్పింది జ్యోతి.
కింద పరుచుకుని కూచున్న పాలిథిన్‌ మడ్త పెట్టబోయింది అనిత. మడత పెడుతుంటే సౌండ్‌ వస్తదని వద్దని సైగచేసింది జ్యోతి.
పోలీసులకు సెంట్రీ పోస్టు అక్కడ వున్న విషయం తెలియకపోవడం వల్ల వారికి మేలైంది.
‘‘ఢాం… ఢాం’’ కొన్ని క్షణాల తేడాతో లోడ్‌ చేసి వున్న చెరో తూటాను పేల్చారు జ్యోతి, అనిత. వెంటనే మళ్లీ తుపాకులను లోడ్‌ చేసి పెట్టుకున్నారు.
ఒకటి…. రెండు… మూడు… నాలుగు… నిమిషాలు గడుస్తున్నాయి. చీమచిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం. అటు పోలీసుల నుంచి ఫైరింగ్‌ లేదు. ఇటు క్యాంపు నుంచి సెంట్రీకి సపోర్టుగా ఎవరూ రాలేదు.
జ్యోతికి ఒక్క క్షణం డౌట్‌ వచ్చింది. నిజంగా తను చూసింది పోలీసులనేనా? అని. ఒకతను వెళ్లి, రెండో అతను రమ్మని సైగ చెయ్యడం తను కళ్లారా చూసింది.
‘‘ఏం చేద్దాం అనిత?’’ పోలీసులు వెళ్లిన వైపే చూస్తూ అడిగింది జ్యోతి. చెట్టును కవర్‌ చేసుకుని నీలింగ్‌ పొజిషన్‌లో (మోకాళ్ల మీద) కూచుంది జ్యోతి. చిన్న రాయిని కవర్‌ చేసుకుంటూ అనిత అలాగే కూచుంది. ఇద్దరి చుట్టూ చిన్న చిన్న పొదలున్నాయి.
‘‘ఏం చేద్దాం? క్యాంపు నుంచి కూడా ఎవరూ రావడం లేదు కదా’’ అడిగింది అనిత.
‘‘క్యాంపులోకి రిట్రీట్‌ అవుదాం’’ జ్యోతి.
‘‘సెంట్రీ పోస్టు ఎందుకు వదిలారని అంటరేమో’’ అనిత.
‘‘మనం ఫైరింగ్‌ చేసి ఇప్పటికే ఆరేడు నిమిషాలు కావస్తుంది. ఎవరూ రావడం లేదు. ఇక్కడ వుండటం మాత్రం మంచిది కాదు. ఏదైతే అదైంది. వెళ్లిపోదాం’’ జ్యోతి.
‘‘సరే’’ అంది అనిత.
జనరల్‌గా పైకి ఎక్కే దారి కాకుండా కాలువ వెంబడి పెద్ద పెద్ద రాళ్ల మీది నుంచి దుంకుతూ కిందికి దిగారు. అంత పెద్ద రాళ్లను మామూలప్పుడు దిగడం అసాధ్యం జ్యోతికి.
వెదురు బ్రిడ్జి దాటి క్యాంపులోకి వెళ్లారు.
క్యాంపులో పిల్ల లేరు.
‘‘కామ్రేడ్స్‌, కామ్రేడ్స్‌’’ జ్యోతి, అనిత పిలుస్తూ క్యాంపులో అటిటు తిరిగారు.
ఒక్కరూ పలకడం లేదు. ఓ రెండు మూడు నిమిషాల తర్వాత చెట్ల చాటు నుంచి సుఖ్‌దేవ్‌, మరో కామ్రేడ్‌ వచ్చారు.
ఇద్దరిని చెట్ల కవర్‌లోకి తీసుకువెళ్లి, ‘‘ఏం జరిగింది?’’ అడిగాడు సుఖదేవ్‌.
తను చూసిన విషయం చెప్పింది జ్యోతి.
‘‘సెంట్రీకి సపోర్టుగా ఎవ్వరినీ పంపలేదు’’ జ్యోతి అడిగింది.
‘‘ఇందాకే అస్సాల్ట్‌ టీంను పంపాము’’ సుఖ్‌దేవ్‌.
చర్చించుకుని టీంను పంపేసరికి కొంత ఆలస్యం కూడా జరిగింది.
‘‘పది నిమిషాలు కావస్తుంది. ఏ సౌండూ లేదు. నిజంగా పోలీసు…’’ (లేనా..?) సుఖ్‌దేవ్‌ మాట పూర్తి కానేలేదు ఢాం… ఢాం… ఫైరింగ్‌తో అడవి దద్దరిల్లింది.
చెక్‌ చేసుకుంటూ సెంట్రీ పోస్టు వైపు వెళుతున్న అస్సాల్ట్‌ టీంకు…. కిందికి దిగుతూ పోలీసులు కనిపించారు. వెంటనే ఫైరింగ్‌ ఓపెన్‌ చేసింది అస్సాల్ట్‌ టీం.
రెండో ఫైరింగ్‌ స్టార్ట్‌ అయ్యేలోగా పది నిమిషాల గ్యాప్‌ దొరికింది. దీంతో ఏవైపు ఎలా రిట్రీట్‌ కావాలనే ప్లాన్‌ చేసుకున్నారు కామ్రేడ్స్‌.
మహిళా కామ్రేడ్స్‌ స్నానాలు చేసే కుడివైపు నుంచి, పురుష కామ్రేడ్స్‌ కాలకృత్యాలు తీర్చుకునే ఎడమ వైపు నుంచి పోలీస్‌ఫోర్స్‌ చుట్టుముట్టింది.
జ్యోతి, అనిత ఫైరింగ్‌ చేసిన సమయంలో అనిల్‌… బాత్రూమ్‌కి వెళ్లి వస్తున్నాడు. నిజానికి అక్కడంతా అప్పటికే పోలీసులు మోహరించి, కాషన్‌ కోసం ఎదురుచూస్తూ వున్నారు.
జ్యోతి వాళ్లు ముందు ఫైరింగ్‌ చేయబట్టి సరిపోయింది కానీ, లేకపోతే రెండువైపులా ఫైరింగ్‌ చేసుకుంటూ క్యాంపును పోలీసులు చుట్టుముడితే చాలా నష్టం జరిగేది. ముందువైపు ఎలాగూ కొద్దిదూరంలో పోలీసులు వున్నారు. వెనకవైపు గుట్ట. ఫైరింగ్‌ చేస్తూ గుట్ట ఎక్కడం అంటే ఆత్మహత్యా సదృశ్యమే. స్పీడ్‌గా ఎక్కలేరు కాబట్టి కింద వున్న పోలీసులకు ఈజీగా టార్గెట్‌ అవుతారు.
ఇది చాలా లోతట్టు అడవి కాబట్టి, పోలీసులు రాకపోవచ్చు అని ఇలాంటి ఏరియాను క్యాంపుకు సెలెక్ట్‌ చేసారు. ఫైరింగ్‌ జరిగితే తప్పించుకోవడానికి అనువైన టెర్రయిన్‌ కాదు ఇది.
అస్సాల్ట్‌ టీం ఫైరింగ్‌ చేయడంతో పోలీసులు కొంత వెనక్కి తగ్గారు.
అనుకున్న ప్రకారం జరగకపోవడంతో ఎడమవైపు వున్న పోలీస్‌ ఫోర్స్‌కు ఏం చెయ్యాలో కొద్దిసేపు అర్థం కాలేదు. తర్వాత వారు కూడా ఫైరింగ్‌ స్టార్ట్‌ చేసారు. కానీ అప్పటికే ఈ ఐదారు నిమిషాల గ్యాప్‌లో కామ్రేడ్స్‌ అందరూ గుట్ట ఎక్కారు. అస్సాల్ట్‌ టీం ఫైరింగ్‌తో కవర్‌ చేస్తుండటంతో వారికి ఆ అవకాశం దొరికింది. అప్పటికి సూర్యుడు వంగుతున్నాడు.
సాయంత్రం పావు తక్కువ ఆరుగంటల టైమ్‌లో నడక మొదలైతే దాదాపు రాత్రి తొమ్మిదిన్నర పదిగంటల వరకు సాగింది.
బాగా పట్టున్న గ్రామ పొలిమేరలో ఆగారు. ‘కవర్స్‌’ చూసుకున్నారు. వంట డ్యూటీ కామ్రేడ్స్‌ వంట పని మొదలుపెట్టారు. రాష్ట్రకమిటీ సభ్యులు ఓ చివర మీటింగ్‌కు కూర్చున్నారు.
కామ్రేడ్స్‌ తినకుండానే చేసిన అప్పచ్చీలన్నీ పొయినాయే జ్యోతి బాధపడింది.
గంట లోపల వంట అయిపోయింది.
భోజనాలకు చిన్నగా విజిల్‌ వేసారు. జ్యోతి అన్నం తిని కూచుంది. రాష్ట్రకమిటీ సభ్యులు కూడా పల్లాలు తీసుకుని కిచెన్‌ దగ్గరికి కొంచెం ఆలస్యంగా వచ్చారు.
అనిల్‌ ప్లేట్‌లో అన్నం పెట్టుకుని, జ్యోతిని వెతుకుతూ ఉన్నాడు. అతని కోసమే ఎదురుచూస్తూ వున్న జ్యోతి కిచెన్‌ దగ్గరికి వచ్చింది.
జ్యోతి రావడాన్ని చూసిన అనిల్‌ ఎదురువెళ్లి ‘‘ఇటు రా. కూచుందాం’’ అన్నాడు.
వెళ్లి ఇద్దరూ చెరో మొద్దు మీద కూచున్నారు.
‘‘నేను అన్నం తింటా. నువ్వే మాట్లాడు. పోలీసులను ఎట్లా చూసినవు? ఎట్లా ఫైరింగ్‌ చేసారు?’’ అడిగిండు అనిల్‌. అనిల్‌ పుట్టింది రాయలసీమ, టెన్త్‌ వరకు తెలంగాణ, ఇంటర్‌ ఆంధ్రలో చదువుకున్నాడు. అనిల్‌ తెలుగులో మాట్లాడితే ఏ ప్రాంతం వాడనేది గుర్తుపట్టడం కష్టం.
జ్యోతి పూసగుచ్చినట్టు చెప్పింది అనిల్‌కి. ఈలోగా అన్నం తిని, ప్లేట్‌ కడిగి కిట్‌లో పెట్టుకుని వచ్చాడు అనిల్‌. జ్యోతి కూర్చుని వున్న మొద్దు మీదనే కూర్చున్నాడు. అప్పటికి రాత్రి పదకొండు గంటలు దాటింది.
కొద్దిసేపు మౌనంగా కూచుని, ‘‘ఇప్పుడు డిస్‌పర్స్‌ అవుతున్నాం’’ చెప్పాడు అనిల్‌.
‘‘ఇప్పుడా?! ఈ రాత్రా?’’ అడిగింది జ్యోతి. గొంతులో చిన్న వణుకు, దుఃఖపు తెర.
‘‘ఆ… అవును. నువ్వు వెళ్లిపోతున్నావు. మేము ఈ రాత్రికి ఇక్కడే వుండి పొద్దుటే వెళ్లిపోతాము. క్యాంపు వేరే వైపు పెడుతున్నారు. మీ ఏరియాకి దూరం’’ నక్షత్రాల మసక వెలుతుర్లో జ్యోతి ముఖంలోకి సూటిగా చూస్తూ నెమ్మదిగా చెప్పాడు అనిల్‌.
జ్యోతి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా వుండిపోయింది. జ్యోతి చేతిని తన చేతిలోకి తీసుకుని నిమురుతూ కొద్దిసేపు అలాగే వుండిపోయాడు అనిల్‌.
లేచి నిలబడి ‘‘ఆరోగ్యం జాగ్రత్త. కథలు చదివి, ఉత్తరం రాయి. నేనూ రాస్తాను’’ నవ్వడానికి ప్రయత్నిస్తూ అనిల్‌ అన్నాడు. తను ఏమాత్రం బాధ వ్యక్తం చేసినా జ్యోతి మరింత బాధపడుతుందని అనిల్‌కు తెలుసు.
తాము ఎందుకోసం పని చేస్తున్నారో ఇద్దరికీ తెలుసు.
‘‘సరే మరి, వుండనా’’ జ్యోతి ఏమి మాట్లాడకపోవడంతో తనే మళ్లీ అన్నాడు.
‘సరే’ అన్నట్టుగా తల వూపుతూ చెయ్యి ముందుకు చాపింది జ్యోతి. అతనూ చెయ్యి కలిపాడు.
ఇంతలో డిస్‌పర్స్‌ అవ్వడానికి రోల్‌కాల్‌ విజిల్‌ వేసారు క్యాంపులో.

(కోపమనేదే తెలియని కామ్రేడ్‌ అనితక్క యాదిలో…)

జ‌న‌నం: న‌ల్ల‌గొండ జిల్లా. అస‌లు పేరు ప‌ద్మ మిర్యాల‌. బీఎస్సీ(B.Z.C), PG Diploma in Journalism. వృత్తి: జ‌ర్న‌లిస్టు. మొద‌ట్లో 'క‌రుణ' పేరుతో క‌థ‌లు రాశారు. 23ఏండ్ల వ‌య‌సులో 'తాయ‌మ్మ' క‌థ రాశారు. ఇది క‌రుణ‌ మొట్ట‌మొద‌టి క‌థ . రాసిన మూడేండ్ల త‌ర్వాత 1996లో 'మ‌హిళా మార్గం'లో అచ్చ‌యింది. ఈ క‌థ పేరుతో 'కరుణ' '- 'తాయ‌మ్మ క‌రుణ‌'గా మారింది. ఆంధ్రప్రభ, సాక్షి, ప్రస్తుతం 'నవతెలంగాణ'లో.  మొదటి కథల సంపుటి 'తాయమ్మ మరికొన్ని కథలు' 2009లో, 2వ కథల సంపుటి 'జీవితం' 2018లో ప్రచురితమయ్యాయి. కవితలు, వ్యాసాలు అచ్చయ్యాయి. 13 ఏండ్లు విప్లవోద్యమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పని చేశారు.

Leave a Reply