పొలిటికల్ టెర్రరిస్ట్

డెమోక్రసీని గాలికి వదిలి
నమోక్రసీలో సాగే గాలిమాటలై
సమూహాల మధ్యన గాజుపెంకులు నాటి

మనుషులు మనుషులుగా బతకనీక
మతానికి పుట్టిన పుట్టగొడుగులుగానో
కులం గొడ్డు ఈనిన బలిపశువులుగానో
రాజకీయ కంటికురుపు కళ్ళతో చూసేవాడు
వాడెవాడైనా గానీ పోటికల్ ఉగ్రవాదే.!

ఎక్కాల్సిన పదవీపీఠం కోసం
ఎగరాల్సిన పార్టీ జెండాకోసం
ఊరూరా తిరిగి
ప్రలోభాల ఊభిలోకి ప్రజల్ని నెట్టేవాడు
మనోభావాలు చాటు
మహకుట్రలనేకం మెల్లమెల్లగా పురిపేనేవాడు

ఏ దేశ రాజకీయ చరిత్రలోనైనా
మనిషిలో మనిషిని మాయంజేసి
రంగు పేరా
రూపు పేరా
జాతి పేరా మనుషుల్ని చీల్చి
కల్లోలపు కమురువాసన పొగ రాజేసేవాడు
ఎవడైనా గాని
అతను పోగేస్తున్నది పొలిటికల్ టెర్రరిజమే
అతను రాజేస్తున్నది దురహంకారపు నిప్పే

విద్వేషపు భాషలో
వీధివీధిన విషాన్ని హోరెత్తి పాడుతూ
మతానికోక ముఠా పెట్టి
కులానికొక కూటం కూర్చి
కుమ్ములాటలో వేడుక చూస్తూ
శాంతివైపు
క్రాంతి వైపు
సమూహాన్ని నడిపించాల్సిన దారినిండా
అశాంతికుంపట్లు రగిలించి అల్లకల్లోలం మండించి
బతుకులు బుగ్గిపాలు చేసేవాడు

అలజడి నదుల్ని పారించేవాడు
అభద్రతా తీరాలను పోటెత్తించే వాడు
అజ్ఞానపు సొరంగాలు తవ్వి
అంధకార గుహలోకి కాలాన్ని మళ్లించేవాడు
ఏ స్వతంత్ర దేశంలోనైనా
మనిషి మనుగడకే గండమై పాలించేవాడు
వాడు దేవుడైనా సరే రాజకీయ ఉగ్రవాదే.!

వాడొకదేశంలోనే కాదు
నవ్వుముఖం నటిస్తూ దేశదేశాలు తిరుగుతున్నాడు
నిండుజనం మధ్య
అభివాదం చేస్తున్న అతనికుడిచేయి
అచ్చం మతసర్పం పైకెత్తిన పడగలా వుంటుంది
మరిచిపోవద్దు
పడగెత్తిన పాముకి
విషం నిండిన కోరలు కూడా ఉంటాయి.!

(ప్రపంచ వ్యాప్త రాజకీయ విద్వేషాలు చూస్తూ…)

పూర్తిపేరు ప‌ల్లిప‌ట్టు నాగ‌రాజు. చిత్తూరు జిల్లా ‘అరవై నాలుగు పెద్దూరు’లో తెలుగు ఉపాధ్యాయుడు. శ్రీ వెంకటేశ్వర విశ్వ‌విద్యాల‌యంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆరువంద‌ల‌కు పైగా కవితలు, మినీ కవితలు, 6 కథలు రాశారు. చిత్తూరు జిల్లా ‘అభ్యుదయ రచయితల సంఘం’, ‘ఈ తరం కవితా వేదిక’లో కార్యవర్గ స‌భ్యుడిగా ప‌నిచేస్తున్నారు.

Leave a Reply