పులి బొబ్బరించింది?!

అది జనారణ్యానికి వచ్చిన మొదటి పులి కాదు. అలాగని చివరి పులి కూడా కాదు.

ఆ చిరుత తాతలు తండ్రుల్లో బంధువుల్లో యెవరైనా నగరానికి వచ్చి వెళ్ళిన విషయమూ అనుభవమూ దానికి తెలుసో లేదో మనకు తెలీదు. కాని అది రోడ్డుపక్కనున్న స్తంభమెక్కి రెండుగంటలు అయ్యింది. అయినా యెవరూ పట్టించుకోలేదు. అంటే కన్నెత్తి చూడలేదు. రోడ్డు మీద వాహనదారులే కాదు పాదచారులూ పరుగులు తీస్తున్నారు. ఎవరూ యెవర్నీ పట్టించుకొనే పరిస్థితీ లేదు. ఆగే సమయం అంతకన్నాలేదు.

ఎండలకు పులి సొమ్మసిల్లి పిల్లిలా చూస్తోంది. దానికి దాహం అంతకంతకూ యెక్కువవుతున్నట్టుగా వుంది. నోరు తెరచి నాలుక అల్లాడించేకొద్దీ పొడిబారుతోంది. అందుకని అది అరవలేదు. మూగగా చూస్తోంది.

అనుకోకుండా ఆకాశంకేసి తలెత్తి చూసిన వో పిల్లాడు నోరు తెరచి అలాగే క్షణకాలం వుండిపోయాడు. తరువాత తేరుకొని “అమ్మా… పులి” అని అరచి చెయ్యి పైకెత్తి చూపించాడు. ఆ పిల్లాడి అడుగులు నేలకు ఆనీ ఆనకుండానే యీడ్చుకుపోతూ వేగంగా నడిపిస్తున్నానని అనుకున్న తల్లి “ఆ?” అంది, యే లోకానో వున్నట్టు. “అమ్మా పులి వచ్చె” మళ్ళీ అన్నాడు పిల్లాడు. “పులీ లేదు, గిలీ లేదు. అన్నీ నీ వేషాలు” అమ్మ అన్నదే తప్ప పిల్లాడి మాటలు నమ్మలేదు. పిల్లాడు చూపిస్తున్నవైపు చూడలేదు. మూడోసారి కూడా “అమ్మా పులి వచ్చె” అన్నాడు, వెనకటి కథలోలా పిల్లాడు వొక్కసారి కూడా అబద్దం ఆడలేదు. నిజమే చెప్పాడు. వెనుకటి నాన్నలా అమ్మ కూడా కొడుకు అబద్దమే చెపుతున్నాడని అనుకుంది. పైగా పైకి చెయ్యి చూపించడం చూసి చూడకుండానే “పులి కాదు, జాబిలి…” అని అన్నదే తప్ప తలపైకెత్తలేదు. “మ్మా” పిల్లాడు అనడం పూర్తికాలేదు. పులి గాండ్రుమంటూ వచ్చి పిల్లాణ్ణి నోటకరచుకు పారిపోయింది.

పిల్లాడు వూహించినట్టు కథ నడవలేదు. పులి స్తంభంమీది నుండి కిందికి దిగనేలేదు.

తలెత్తి చూస్తూ పిల్లాడు వాడి వూహల్లో వాడుండగా “దిక్కులు చూస్తావేరా?” అని వీపు వంచి దబదబా రెండు దెబ్బలు వేసింది తల్లి. “నీకు పగలు చందమామ కావాలి, మీ నాయనకు రాత్రికి చుక్కలు కావాలి…” అంటూ పైకి చూసి అలానే నోరు వెళ్ళబెట్టి ఆగిపోయింది, రోడ్డు మధ్యలో వున్నానని కూడా చూడకుండా. సడన్ బ్రేక్‌తో కారు ఆగింది. వెనుక వచ్చిన వేన్ కారుని గుద్దింది. టూవీలర్లవాళ్ళు సడన్ బ్రేకులు వేసి కిందపడ్డారు. అలా యిలా అటూ యిటూ మొత్తానికి ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎక్కడివాళ్ళక్కడే గప్‌చిప్ అన్నట్టు ఆగిపోయారు.

తల్లీ కొడుకులు చూస్తున్న వంక వొకరొకరూ చూసి అందరికీ విషయం తెలిసిపోయింది. కొందరు నెమ్మదిగా వెనక్కి అడుగులేసి అక్కడి నుండి పారిపోవడం మొదలు పెట్టారు. మరికొందరు సేఫ్‌గా తమ ఫోర్ వీలర్లలో వుండి మిర్రర్లు కాస్త దించి చూస్తున్నారు. అంతా తమతమ సెల్ ఫోన్స్ తీసి వీడియోలు తియ్యడం అప్‌‌లోడ్ చెయ్యడం మొదలు పెట్టారు.

జనాల చేష్టలన్నీ చూస్తూ చేష్టలుడిగిన దాన్లా పులి చూస్తోంది.

అంతమంది జనం మధ్యలో వుండడం వల్లనేమో పిల్లాడికి పులంటే భయంపోయి ధైర్యం వచ్చినట్టుంది. అంతకన్నా ఆనందం వచ్చినట్టుంది. అది ముఖంలో కనిపిస్తోంది.

“పులిని నేనే ముందు చూశానోచ్…” పిల్లాడు గంతులు వెయ్యబోతే తల్లి వాడి టెంకిమీద వొక్కటిచ్చింది. “వుష్” అంది. ఆమె నెమ్మదిగా వెనక్కి అడుగుతీసి వెళ్ళబోతుంటే, వెళ్ళడం యిష్టం లేనట్టు పిల్లాడు మొండిగా కదలడంలేదు. ఈండ్రబడుతూ “జూకి తీసుకెళ్ళలేదు, యిక్కడైనా నన్ను చూడనివ్వవా?” అని తిరిగి మంకుగా అడిగాడు. ఏం చెయ్యాలో తెలీనట్టు తల్లి చుట్టూ చూసింది. అప్పటికే గుంపులు గుంపులుగా జనం వాహనాల చాటుగా నక్కి నిలబడ్డారు.

“ఎక్కడా చోటు లేనట్టు చూడండి మాస్టారు, యెక్కడికి యెక్కి కూర్చుందో?” నమ్మలేనట్టు చూస్తూ అన్నాడో పెద్దమనిషి. “కలికాలం” అని మళ్ళీ తనకు తానే సమాధానం చెప్పుకున్నాడు.

“గర్రా అండీ గర్రా. పొగరు. జాతీయ జంతువునని పొగరు” అన్నాడు మరో పెద్దమనిషి.

“జాతీయ జంతువు పులి, యిది చిరుత పులి” తేడా వుందన్నట్టు చూశాడో కుర్రాడు. “పులి జాతే కదా?” అన్నాడు యిందాకటి పెద్దమనిషి.

“మనుషులందరూ వొకటే అన్నట్టుంది, కుడి చెయ్యకీ యెడమ చెయ్యకీ తేడా లేదుటండీ…” వో పక్క టెన్షన్ పడుతూ వత్తాసుగా తన అభిప్రాయం చెప్పకుండా ఆగలేకపోయాడు పంతులు. కుర్రాడికి మండినట్టే వుంది. తనని సపోర్టు చేశాడని కూడా ఆగలేదు. “ఔనండి యీ కుడిది చెయ్యి, యెడమది చెయ్యి కాదు, కాలు” చాలా సౌమ్యంగా అన్నాడు. ఆ వెటకారానికి పంతులు కొరకొరా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

ఈ మాటలన్నీ విన్న పిల్లాడు “అమ్మా… పులి జాతీయ జంతువు యెందుకయ్యింది?” అని అడిగాడు. “నోర్మూసుకో” అంది తల్లి. “పులి వింటుందనా?” తిరిగి అడిగాడు పిల్లాడు. “బలం, దయ, అద్భుతశక్తికి ప్రతీకగా వుంటుందని…” యిందాకటి కుర్రాడు చెప్పాడు, నవ్వుతూ చూస్తూ. వెంటనే “పులికి దయ కూడా వుంటుందా?” అన్నాడు యిందాకటి పంతులు, వెళ్ళిపోయినవాడు మళ్ళీ యెప్పుడు తిరిగొచ్చాడో మరి. “మనలా కాదు, కడుపు నిండాక అది తినదు, అదీ దయే” అన్నాడు కుర్రాడు. ఈసారి పంతులు యెందుకో యేమీ అనలేదు.

ఇంతలో చిరుత నోరు బాగా తెరచి గాండ్రించింది.

ఎక్కడెక్కడ నక్కిన వాళ్ళంతా గుండెలు గుభిల్లుమనగా మరింత వెనక్కి నక్కారు. చాలా మంది దేవుణ్ణి తలచుకున్నారు. “దుర్గామాతా, నీ వాహనాన్ని నీ దగ్గరకు రప్పించుకో తల్లీ” మరి కొందరు మొక్కులు మొక్కారు. “దుర్గాదేవి వాహనం పులా? చిరుత పులా?” పిల్లాడి అనుమానానికి “నోర్మూసుకో” అని తల్లి సమాధానం యిచ్చింది. “ఏదైనా పులే కదా?” అన్నాడు పంతులు. కుర్రాడూ పంతులూ వొకర్ని వొకరు చూసుకున్నారు. ఆపై తలలెత్తి స్తంభంపైకి చూశారు.

పులి కిందికి చూస్తోంది.

“నీకు కళ్ళు తిరగవా?” అమ్మని అడిగితే మళ్ళీ యెక్కడ ‘నోర్మూసుకో’ అంటుందనో నేరుగా పులినే అరిచిమరీ అడిగాడు పిల్లాడు.

“నాకు యెత్తైన చెట్లెక్కడం అలవాటే కదా?” చిరుత పులి నవ్వింది. అచ్చం కార్టూన్ పులిలా. చాలా గమ్మత్తుగా అనిపించింది పిల్లాడికి. దాంతో హుషారుగా మళ్ళీ అడిగాడు “నువ్వు మరి చెట్లెక్కకుండా కరెంటు పోల్ యెందుకు యెక్కావ్?”

“చెట్లెక్కడున్నాయ్?” పులి విచారంగా చూసింది.

“ఔను, చెట్లు లేకే కదా… పాపం పక్షులు ఎలక్ట్రికల్ పోల్స్‌మీద గూళ్ళు కట్టుకుంటున్నాయి…” అంతే విచారంగా ముఖం పెట్టాడు పిల్లాడు.

పిల్లాడు చిరుత పులి కళ్ళనీ మీసాల్నీ వూపుతున్న తోకనీ దాని వొంటిమీది మచ్చల్నీ పరిశీలనగా చూస్తున్నాడు, తన స్కూలు బ్యాగులోంచి భూతద్దం తీసిమరీ.

“చెట్లు నరికేస్తే యేమవుతుంది? ప్రతీ యేడువందల మంది మనుషులకు వొకే చెట్టు వుందని న్యూస్‌లో చూశా” లెక్కలు చెప్పాడు వో టక్కాయన.

కార్లో కూర్చొని కూర్చొని బోరు కొట్టిందేమో వో ఫైనాన్సియల్ ఎంటర్‌ప్రెన్యూర్ కారు దిగాడు. పులిని చూస్తూ “యీ చూసేవాళ్ళందరికీ టికెట్ పెడితే?” తనలో తను అనుకున్నట్టు పైకే అన్నాడు. నవ్వలేదు. అతను సీరియస్‌గానే అన్నాడు. “దానికి కూడా జియ్యస్టీ వుంటుందండోయ్” అన్నాడు కారు చాటుగా నిలబడ్డవాడు. “వొక జియ్యస్టీ వేస్తే పరవాలేదు, స్టేట్ జియ్యస్టీ సెంట్రల్ జియ్యస్టీ డబల్ ధమాకా వుంటుంది” అన్నాడు పక్కనున్న మరో ఆయన. ‘వెటకరించడం తప్ప ఫైనాన్షియల్ పరస్పెక్టీవ్ వుండదు, వేస్ట్ ఫెలోస్’ లోలోపల తిట్టుకున్నాడు ఎంటర్‌ప్రెన్యూర్.

‘అసలు యీ పులి గనక మన చేతికి దొరికితే, సామిరంగ… దాని చర్మం వొలిచేస్తే, బ్లాకులో అమ్మేస్తే చర్మం కాదు, అసలు పులి గోళ్ళు అమ్మేస్తే? యెంతొస్తాది? అసలు పులి మాంసం తింటారా? ఎందుకు తినరు, తింటారు, బాగా డిమాండ్ వుంటాది, అమ్మితే చైనాకి అమ్మాల. పులి దొరికితే లైఫ్ సెట్లయిపోతాది’ అని వో దొంగ వువ్విళ్ళూరుతూ గాల్లో పిల్లర్లు వేసి మేడలు లేపాడు. 

అప్పడే అక్కడకు మీడియా చేరిపోయింది. కెమెరాలు జనం మీదుగా పులి వేపు తిరిగాయి. జూమ్ చేశాయి. ఛానెళ్ళు లైవ్ ప్రసారాలు మొదలు పెట్టేశాయి.

“చెట్టనుకుందేమో కరెంటు పోల్ యెక్కిందో చిరుత. చిరుతను చూస్తూ ట్రాఫిక్ స్తంభించిపోయింది. రెండు గంటలుగా పులి పోల్ మీద వున్నట్టు తెలుస్తోంది. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌వాళ్ళు యింకా రాలేదు…” రిపోర్టర్ చెప్పుకుపోతున్నాడు. నోటికి వచ్చింది మాట్లాడాక తన నోరు నొప్పెట్టిందేమో పక్కనున్న ఆసామి నోటిముందు మైక్‌పెట్టి “చిరుత చెట్టెక్కడాన్ని మీరెలా చూస్తున్నారు?” అడిగాడు. “నాకిప్పుడు అశోక చక్రవర్తి గుర్తుకు వస్తున్నాడు…” చెప్పి పెదాలు తడుపుకున్నాడు ఆసామి. “ఎందుకు?” తిరిగి రిపోర్టర్ అడిగాడు. “చిరుతలు యిలా కరెంటు పోల్స్ యెక్కుతాయని తెలిసే, ప్రమాదం పసిగట్టే రోడ్డుకు యిరువైపులా చెట్లు నాటించమని అశోకుడు ముందే చెప్పాడు” చెప్పాడు ఆసామి. మరో వుద్యోగి నోటిముందు మైక్‌పెట్టి “ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌వాళ్ళు యింకా రాకపోవడాన్ని యెలా భావిస్తున్నారు?” అని రిపోర్టర్ అడిగాడు. “చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఫారెస్టులు లేని కాలంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌వాళ్ళు వుండడం ముదావహం. వాళ్ళు యెప్పుడైనా రానీ రాకపోనీ…” అన్నాడు ఆ వుద్యోగి.

లైవ్‌ యిస్తూనే అప్పటికప్పుడు డిబేట్ కూడా పెట్టేసినట్టుందో ఛానెల్. పోల్ మీదున్న చిరుత దూకుతుందా దూకదా? దూకుతుంది అయితే ‘A’ అని, దూకదు అయితే ‘B’ అని వోట్ చెయ్యమని. పోటీపడ్డ మరో ఛానెల్ ‘బిగ్ బ్రేకింగ్ న్యూస్’ అని యిస్తూనే ‘పోల్ మీదనుండి చిరుత దూకితే చిరుతకి ప్రమాదమా? జనాలకి ప్రమాదమా? చిరుతకి ప్రమాదం అయితే ‘A’ అని, జనాలకి ప్రమాదం అయితే ‘B’ అని వోట్ చెయ్యమని. పోలింగ్ పోటాపోటీగా జరుగుతోంది.

ఒక స్వతంత్ర యూట్యూబ్ ఛానల్ ఆవిడ చిరుత న్యూస్‌ని కవరు చేస్తూ “యిటీవల మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఏనుగులూ పులులూ జనావాసాలలోకి రావడం సర్వసాధారణం అయిపోయింది. ఆపద యెటునుంచి వస్తుందో మనం చెప్పలేం. ఇప్పుడు హఠాత్తుగా పోల్ మీదనుండి పులి దూకవచ్చు. దాడి చెయ్యవచ్చు. ప్రాణాలు కూడా పోవచ్చు. గాయపడితే ఆసుపత్రి ఖర్చులూ ప్రాణం పోతే ఆ కుటుంబానికి భీమా అందాలి అంటే ఇన్సూరెన్స్ వున్నవాళ్ళకే ఆ అద్భుత అవకాశం. సో, నే కామెంటులో లింక్ పిన్ చేశాను. ఇప్పుడే ఆలస్యం చేయకుండా ఇన్సూరెన్స్ చేయించుకోండి. ధైర్యంగా చిరుతకు యెదురువెళ్ళండి!” చెప్పుకుపోతోంది.

మీడియావాళ్ళ గోలకు చికాకుపడుతూ పిల్లాడు చిరుతవంక తలెత్తి చూశాడు.

“ఏయ్ పులీ… నీ అడవికి నువ్వు వెళ్ళవా?” అరుస్తూ అడిగాడు. పిల్లాడి నోటిని గట్టిగా మూసేసింది వాడి తల్లి.

“అడవా… అదెక్కడుంది?” పోల్ మీద క్కూర్చున్న పులి వెతుకుతున్నట్టు తలతిప్పి చుట్టూ చూసింది.

“మరి నువ్వెక్కడి నుంచి వచ్చావ్?” పిల్లాడు తల్లిచేతిని పక్కకు తప్పించి మరీ అరిచాడు.

“అడవులు యిప్పుడు మావి కావు” పులి బాధతోనో కోపంతోనో యేమో గాల్లోకి పంజాలేపి కొట్టింది.

“మరెవరివి?” పిల్లాడు అడిగాడు.

“కార్పోరేట్ వాళ్ళవి. ప్రభుత్వం వాళ్ళకు రాసిచ్చేసింది. అందుకే చెట్లు కొట్టేస్తున్నారు. ప్రొక్లయిన్లు పెట్టి కొండలూ గుట్టలూ తవ్వేస్తున్నారు. అడవే కాదు, అడవి అడుగున వున్న వనరులూ వాళ్ళవేనట. మమ్మల్ని అడవుల్లోంచి తరిమేస్తున్నారు. ఇక్కడికొస్తే మీరు తరిమేస్తున్నారు. అందుకే యెక్కడా చోటు లేకే చెట్టు లేకే కరెంటు పోల్ యెక్కాను…” యెక్కడికి పోను అన్నట్టు చూసింది పులి.

ఇదంతా జనంలో వున్న వొక కవి వూహిస్తున్నాడు. అతని వూహలు అక్కడితో ఆగలేదు. పోలెక్కిన పులిని చూస్తే అంతకు మునుపు తమ డిమాండ్లకోసం పోల్లూ టవర్లూ యెక్కిన యెంతోమంది మనుషులు కళ్ళముందు కదలాడారు. ‘పులి కూడా మనిషే’ అని అనుకున్నాడు. అనుకున్నదే తడవు ఆ చిరుత వొంటిమీదికి గుడ్డా గోచీ వచ్చేసింది. అచ్చం అంతరించిపోతున్న ఆదివాసీలా తోచింది. ఆపరేషన్ గ్రీన్ హంట్‌లో బాంబులు పడుతుంటే తప్పించుకు బయటపడ్డ ఆదివాసీయే ప్రాణభయంతో పులి వేషం కట్టి పోలెక్కాడేమో? లేకపోతే పులి మాట్లాడడమేమిటి?

“నీ డిమాండ్లు యేమిటి?” మీడియా మైకులు పైకి లేచాయి.

“మా అడవిలోంచి కార్పోరేట్లూ సైన్యాలూ బయటికి వస్తే, నేనూ మా అడవి వాసులూ అంతా తిరిగి మా అడవిలోకి వెళ్ళిపోతాం” అంది పులి.

పాపం దానికి తెలీదుమరి… దొరికితే తన మీద కేసులు పెడతారని. అండా సెల్‌లో వేసి బంధిస్తారని. అడవిలోకి తిరిగివెళ్తే ఎన్కౌంటర్ చేస్తారని!

పుట్టింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. నివాసం హైదరాబాద్. చదివింది ఎం.ఏ తెలుగు, ఎం.ఏ పాలిటిక్స్. వృత్తి -ప్రవృత్తి రచనే. అయిదు వందల కథలు, వంద జానపద కథలు, పాతిక వరకూ పిల్లల కథలు రాశారు. కథా సంపుటాలు: రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టితీగలు, హింసపాదు, రణస్థలి, మనువాచకం. జానపద కథా సంపుటాలు: అమ్మ చెప్పిన కథలు, అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, అనగా వినగా చెప్పగా, ఊకొడదాం. పిల్లల కథా సంపుటం: అల్లిబిల్లి కథలు. ఒక్కో కథా ఒక్కో పుస్తకంగా వచ్చిన మరో పన్నెండు పుస్తకాలూ- యింకా జాతీయాల మీద వచ్చిన ‘పురాణ పద బంధాలు’, పిల్లల సమస్యల మీద వచ్చిన ‘ఈ పెద్దాళ్ళున్నారే’, మంచిపుస్తకం తానా ప్రచురణ ‘నువ్వేమిస్తావు?’ తో కలిపి మొత్తం యిరవైతొమ్మిది వచ్చాయి. కొన్ని కథలు హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.

బాసలో ‘కతలు కతలు’, మాతృకలో ‘కతలు వెతలు’, సారంగలో ‘మహారాజశ్రీ’ ‘కరోనా కహానీలు’, విరసం డాట్ ఆర్గ్‌లో ‘మెయిల్ బాక్స్’ ‘బుర్ర తిరుగుడు కథలు’, మనంలో ‘వాట్సప్ కథలు’, రస్తాలో ‘ఈ పెద్దాళ్ళున్నారే’, ప్రజాతంత్ర ‘శోభ’లో ‘మెరుపు తీగెలు’ కాలమ్స్‌కు తోడుగా ‘కాదేదీ కథకనర్హం’ కొలిమి కోసం ప్రత్యేకం.

Leave a Reply