పునాది భావనలు – నిర్మాణ కళ

జీవితంలో గానీ సమాజంలో గానీ కొన్ని పాఠాలు ఆలస్యంగా అందివస్తాయి. మరికొన్ని మరింత ఆలస్యంగా అర్థమౌతాయి. సంస్కృత సాహిత్య అలంకార శాస్త్రం చదువుకున్న నాకు మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతం ఆలస్యంగా అందివచ్చింది. ఆరో తరగతి పాఠాలు ఏడో తరగతిలో అర్థమౌతాయి అన్నట్టు `దాన్ని అర్థం చేసుకోవడం కూడా ఆలస్యమైంది. అందుకు కారణం: విషయంలోని సంక్లిష్టత కావొచ్చు, దాన్ని మరింత అస్పష్టతకు గురి చేసినవారి రచనా సంవిధానం కావొచ్చు, శుష్క ఆలోచనలు పంచుతూ ఆచరణకు ఆమడ దూరం వుండేవారి కపటత్వం కావొచ్చు, నినాదాల్ని సొంత ప్రయోజనాల కోసం వుద్దేశించి వ్యూహాత్మకంగా వ్యవహరించే వ్యక్తుల నిజాయితీ రాహిత్యం కావొచ్చు, అది కాలం చెల్లిన ఆలోచన అని పాలకవర్గాల తొత్తులు చేసే ప్రచారం వల్ల యేర్పడ్డ గందరగోళం కావొచ్చు, విషయ పరిగ్రహణలో స్వీయ అసమర్థత కావొచ్చు లేదా వీటన్నిటి సమాహారం కావొచ్చు. అలాంటి సందర్భాల్లో కొకు కెవిఆర్ మధుసూదనరావు సురా కెకెఆర్ వంటి విమర్శకులు సాహిత్య విద్యార్థిగా నాకొక మార్గాన్ని చూపారు. స్పష్టమైన చూపునిచ్చారు. అయినా సాహిత్య శిల్ప సమీక్ష గురించి సాహిత్య సౌందర్యానికి సంబంధించి కొన్ని రహస్యపు అరలు ఖాళీలు అప్పుడప్పుడూ చిరాకుపెడుతూనే వున్నాయి. వాటిని అధిగమించే క్రమంలో వస్తు రూప దృక్పథాల మధ్య వుండాల్సిన సంబంధం గురించి అల్లం రాజయ్య చేసే విమర్శనాత్మక చర్చలకూ ‘సాహిత్య విమర్శ కూడా వర్గపోరాటంలో భాగమే’ అన్న టియమ్మెస్ ఆలోచనను సానపెట్టే పాణి సైద్ధాంతిక రచనలకూ దగ్గరయ్యాను. పాణి సృజనాత్మక రచనలతో పాటు అతని విమర్శ కూడా నన్ను ఆత్మీయంగా పలకరించింది.
నేరుగా పునాది నుంచి నిర్మితమయ్యే భావనలతో నిండిన పాణి సాహిత్య విమర్శ మౌలికమైనదీ గతిశీలమైనదీ అని అతను యింతకు మునుపు ప్రకటించిన గ్రంథాలు నిరూపించాయి. ఆ ప్రస్థానంలో ‘వాస్తవికత కాల్పనికత’ మరొక మేలి మలుపు. ఇందులోని వ్యాసాలు విడిగా చదివినప్పుడు వేటికవే ప్రత్యేకంగా అనిపించాయి, కానీ అన్నిటినీ వొకచోట చూసినప్పుడు సారంలో వాటిలో యేకసూత్రత గోచరించింది. తెలుగు సాహిత్య ప్రపంచంలో మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంత పరికల్పన దిశగా సారించిన నిశితమైన చూపు కనిపించింది. పాణికి పాఠకుడిగా నాలో రేకెత్తిన ఆలోచనల్ని మీతో పంచుకోడానికే యీ నాలుగు మాటలు ..

***

సాధారణంగా ప్రతి రచనకూ targeted readers వుంటారు. దానికి అనుగుణంగా రూప సారాల నిర్మాణం వుంటుంది. సంవాదం వుంటుంది. సంవిధానం రూపొందుతుంది. పాణి యెవరిని వుద్దేశించి యీ వ్యాసాలు రాశాడు .. రచయితలనా విమర్శకులనా పాఠకులనా పరిశోధకులనా చరిత్రకారులనా సామాజిక శాస్త్రజ్ఞులనా? అని ప్రశ్నించుకుంటే అందరినీ అని ప్రతి పఠనంలోనూ అనుభవంలోకి వచ్చింది.

స్వీయ అనుభవాలను యథాతథంగా చిత్రించడం దగ్గర ఆగిపోయి ఖాళీగా మిగిలిపోయే రచయితలకు వస్తు స్వీకరణ దశ నుంచి యితివృత్త నిర్వహణ వరకు లోచూపును వెలిచూపునూ విస్తృతపరచుకోడానికి కాల్పనిక శక్తి, దృక్పథ పటుత్వం అనివార్యమైనా అవసరాలని పాణి యీ వ్యాసాల్లో నొక్కిచెప్పాడు. అక్కడితో విమర్శకుడిగా తన బాధ్యతని ముగించలేదు; రచన లోని వాచకం చుట్టూ మాత్రమే గిరికీలు కొడుతూనో రచయితల సామాజిక నేపథ్యాల దగ్గర తచ్చాడుతూనో సమాజం లోతుల్లోకి చూడడానికి అంతగా ఆసక్తి చూపనివారి కోసం కూడా అతనీ రచనను వుద్దేశించాడు. అలాగే వొక దృక్పథానికి కట్టుబడి వుండటం సాహిత్యంలో కళాత్మక విలువలకు ఆటంకం అవుతుందని ఆరోపించేవారికీ రచనలో మొనాటనీకి కారణమౌతుందని అనుమానించేవారికీ రచయిత సృజనాత్మకతలో వైవిధ్యం లోపిస్తుందని ఆక్షేపించేవారికీ దృక్పథ రాహిత్యమే స్వేచ్ఛ అని పనిగట్టుకొని ప్రచారం చేసేవారికీ యీ సంపుటిలోని వ్యాసాల్లో స్పష్టమైన సమాధానం లభిస్తుంది. దృక్పథం పట్ల నిబద్ధత రచయితకు గుణమే కానీ దోషం కాదని అనేక సందర్భాల్లో నిరూపణలు దొరుకుతాయి.

పునాదిలో వుత్పత్తి సంబంధాల్లో చోటు చేసుకునే ఘర్షణ గురించి అందుమూలంగా వచ్చిన మార్పుల గురించి తెలుసుకోకుండా సామాజిక చరిత్రనే కాదు వుపరితలంలోని సాహిత్య సాంస్కృతిక చరిత్రను కూడా నిర్మించలేము. అందువల్ల కులం మతం జెండర్ మొదలైన సామాజిక అస్తిత్వ నేపథ్యాల నుంచి చరిత్ర రచనకు పూనుకొనే వారికీ వుత్పత్తి శక్తుల కేంద్రకంగా చరిత్రని పునర్నిర్మించ తలపెట్టేవారికీ మధ్య సమన్వయాత్మకమైన వుమ్మడి కార్యక్షేత్రం నిర్మించుకోవాల్సిన అనివార్యతను యీ చిరు పొత్తం తెలియజేస్తుంది. అంతేకాదు; పునాదిని విస్మరించి వుపరితలం దగ్గరే కుస్తీ పట్టే సంస్కృతి ప్రేమికులకు కనువిప్పు కలిగిస్తుంది. నేల విడిచి చేసే సాము ప్రదర్శన కూడా లోపభూయిష్టంగా వుంటుందని హెచ్చరిస్తుంది. దృక్పథాల ఘర్షణలో గందరగోళానికి గురయ్యేవారికి సరైన మార్గదర్శనం చేస్తుంది. విమర్శ కేవలం అదొక సాహిత్య ప్రక్రియ మాత్రమే కాదు. సామాజిక క్షేత్రంలో పనిచేసే కార్యకర్తలు తమ ప్రతి అడుగునూ నిశితంగా పరిశీలించుకుని దిద్దుకొనే నిరంతర ప్రక్రియ అనీ క్రియాశీల బౌద్ధిక ఆచరణ అనీ విశదపరుస్తుంది.

మరింత సూక్ష్మగా చెప్పాలంటే.. విమర్శ వర్గపోరాటంలో భాగమే అని అర్థం చేసుకోవడం కోసం సామాజిక అస్తిత్వాల కోణం నుంచి నిర్మించే చరిత్రని శకలాలుగా గాక చారిత్రిక భౌతికవాద దృక్పథంతో మొత్తంలో భాగంగా చూసే వివేచన పెంపొందించుకోడానికి సాహిత్య చరిత్రలో విస్మృతికి గురైన/ గురిచేసిన వర్గాల స్థానాన్నీ /పాత్రనూ తెలుసుకొని లోపాల్ని సరిదిద్దుకోడానికి సాహిత్యంలో కళాత్మక విలువల్ని అంచనా వేయడానికి మార్క్సిస్టు సాహిత్య విమర్శలో పరిమితులున్నాయని చెప్పి రూప చర్చకు అది దోహదం చేయదు అనే వాదాన్ని పరాస్తం చేసేందుకు సాహిత్య విమర్శలో బాలగోపాల్ వంటి మేధావులు పేర్కొన్న ఖాళీలను పూరించుకోడానికి ఉత్పత్తి సంబంధాల్లోంచి సాహిత్యాన్ని విశ్లేషించే సామాజిక వర్గవాదులకూ సామాజిక సంబంధాల నుంచి పరిశీలించే అస్తిత్వవాదులకు మధ్య వైరుధ్యాల పరిష్కారం కోసం దేశీ జానపద సాహిత్యంలోని భావవాద పోకడల్ని నిరసిస్తూనే శ్రమ శక్తితో ముడివడి వున్న భౌతికవాద భావనల్ని ట్రేస్ చేస్తూ ప్రజా సాంస్కృతికోద్యమాన్ని నిర్మించుకోడానికి అవసరమైన సామాజిక సాధనాలను సమకూర్చుకోడానికి మానవోద్వేగాలను సృజనాత్మ సాహిత్యంలోకి అనువదించడానికి అవసరమైన హేతు చింతననీ సమ్యక్ దృష్టినీ అలవరచుకోడానికి భిన్న సామాజిక అస్తిత్వాల మధ్య వాటి వుప అస్తిత్వాల మధ్య నెలకొని వున్న వైరుధ్యాల్ని అవగాహన చేసుకొని ఐక్యతా ఘర్షణల సూత్రం ద్వారా సమన్వయాన్ని సాధించే దిశగా అనుకూలమైన సాంస్కృతిక వాతావరణం కల్పించుకోడానికి రచయితలకు సృజనాత్మక ప్రతిభను వెలికి తీయడానికి, విమర్శకులకు విమర్శనాత్మక నైపుణ్యాలను అభివృద్ధి పరచుకోడానికి అవసరమైన పరికరాలను తయారుచేసుకోడానికి ‘వాస్తవిక కాల్పనికత’ వ్యాసాల్ని తప్పనిసరిగా అధ్యయనం చేయాలి.

ఎందుకంటే, విమర్శను పుస్తక పరిచయానికి పరామర్శకు సమీక్షకు కుదించిన పిదప కాలంలో విమర్శ కార్య క్షేత్రాన్ని నిర్వచించి దాని విస్తృతిని తెలియజేసే యిటువంటి అధ్యయనం చాలా అవసరం. నా మట్టుకు నాకు విమర్శ అంటే అదొక నిర్మాణ కళ అనీ నూతన మానవ నిర్మితి అనీ మానవ సంబంధాల వున్నతీకరణ అనీ విమర్శ అంతిమ లక్ష్యం అదే కావాలి అనీ వొక గొప్ప యెరుకను యీ పుస్తకం అందించింది. కర్తవ్యం నిర్దేశించింది. ఒక సంవిధానాన్ని విప్పి చెప్పింది.

మెథడాలజీ రచనా పద్ధతి మాత్రమే కాదు. భావాల ఉత్పత్తి, వికాసం, వినిమయం కూడా సంవిధానంలో భాగమే. భావాల పుట్టుక నుంచి ప్రసారం వరకూ జరిగే ప్రక్రియకి వొక క్రమం ఉంటుంది. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న విమర్శలో దాన్ని దృక్పథం నడిపిస్తుంది. తన ఆలోచనాధారని సాధారణ పాఠకులకు చేరవేయడానికి విమర్శలో పాణి మార్క్సిస్టు తత్వశాస్త్రం నుంచి నేర్చుకున్న గతితార్కిక పరిభాషనీ సంవాదాన్నీ ఆశ్రయిస్తాడు. అందువల్ల అతని వచనం తర్కబద్ధంగా వుంటుంది. సూత్రీకరణలు చేస్తూనే ప్రశ్నకు అవకాశం కల్పిస్తాడు. అప్పటికే ప్రచారంలో వున్న వైరుధ్యాల్ని ప్రస్తావిస్తూ వాటిలోని పాజిటీవ్ అంశాల్ని అంగీకరిస్తూ తనదైన పరిష్కారాన్ని కనుగొంటాడు. చాలా సార్లు తానే స్వయంగా బలమైన పూర్వపక్షం ముందుకు తెచ్చి దానికి అంతే బలమైన సమాధానాలు యిస్తాడు. స్థల కాలాలను అనుసరించి మార్చుకోవాల్సిన కొత్త ప్రతిపాదనలను ప్రవేశపెట్టి వాటి మంచి చెడ్డల్ని విశ్లేషించి సిద్ధాంతం వైపు నడిపిస్తాడు. అయితే అదే అంతిమ తీర్పు అని ప్రకటించడు. మరిన్ని ఆలోచలకు తలుపులు తెరచి వుంచుతాడు. సున్నితంగా వుంటూనే స్థిరంగా వుండడటం వల్ల అతని వాక్యం కుదురుగా వుంటుంది. ఎక్కడా ఉద్వేగానికి గురి కాడు. సంయమనం అంతటా పరుచుకొని ఉంటుంది. ప్రజాస్వామిక స్థలానికి అవకాశం యివ్వడం వల్ల అది ఆత్మీయ సంభాషణకు పురిగొల్పుతుంది. దృక్పథపటుత్వమే విమర్శకు మూలస్థంభం అని పాణి ‘వాస్తవిక కాల్పనికత’ వ్యాసాల ద్వారా మరోసారి నిరూపిస్తున్నాడు.

***

ఈ సంపుటిలోని ఐదు వ్యాసాలూ ఐదు పాఠాలు. ‘భౌతిక సాంఘిక అంశాలు ప్రజల ఊహల్లోంచి, కళాత్మక రూపాల్లోంచి సాహిత్యంలోకి వస్తాయి’ అన్న మార్క్స్ అవగాహనను సాహిత్య చరిత్ర రచనకు సాహిత్య సిద్ధాంత పరికల్పనకూ అన్వయిస్తూ చెప్పిన పాఠాలివి. సమాజంలోకి చూడటానికి మార్క్సిజం వొక సూక్ష్మ దర్శినిగా మాత్రమే గాక సాహిత్య అధ్యయనంలో పనిముట్టుగా వుపయోగపడుతుందనీ మానవ సంబంధాలను వున్నతీకరించే పనిలో నిమగ్నమయ్యే రచయితలకూ విమర్శకులకూ అది కరదీపికగా తోడ్పడుతుందనీ యీ వ్యాసాలు నిర్ధారిస్తాయి.

రచయితలు తమ సొంత అనుభవాలకూ జ్ఞాపకాలకూ పరిమితం కాకుండా సామాజిక చారిత్రిక వాస్తవికతలోకి చేసే ప్రయాణంలో తర్కబద్ధమైన వూహాశాలీనతనూ, కాల్పనిక శక్తినీ, సృజనాత్మకతనూ మెరుగుపరచుకోడానికి స్వీయ జీవితానుభవ పరిధిని అధిగమించాల్సి వుంటుంద‌ని పాణి యీ వ్యాసాల్లో బలంగా ముందుకు తీసుకొచ్చాడు. అందుకు అవ‌స‌ర‌న‌మైన సంవిధానాన్ని అల‌వ‌చ్చుకోడానికి చారిత్రిక భౌతిక వాదం దారి చూపుతుందని వివ‌రిస్తాడు.

భిన్న సామాజిక అస్తిత్వాల ఆలోచన ధారాల్ని కలుపుకుపోతూ సాహిత్య సిద్ధాంతం రూపొందించుకోవడంలో, సాహిత్య చరిత్ర నిర్మాణంలో యింకా వెనుకబడి వున్నామని అంగీకరిస్తూనే అందుకు కారణాలను విశ్లేషిస్తూ వాటి పరిష్కారాలకు అవసరమైన దృక్పథాన్నీ ప్రణాళికనూ వివేచననూ ప‌ద్ధ‌తినీ అతను అందజేస్తున్నాడు. ఆ క్రమంలో దేశీ మౌఖిక సాహిత్య అధ్యయనంపై కొత్త వెలుగుని ప్రసరింపజేశాడు. విమర్శ కార్య క్షేత్రం రచనకూ రచయితకూ పాఠకులకూ కళాత్మక విలువల విశ్లేషణలకూ పరిమితం కాదనీ అది జీవితానికి చెందిన సమస్త పార్శ్వాలనూ సామాజిక చలనాలనూ సాంస్కృతిక రాజకీయ ఆర్ధిక పోరాటాలనూ మానవ ఉద్వేగాలనూ అవగాహన చేసుకొని గుణాత్మక పరిణామాలకు దోహదం చేసే దిశగా విస్తరించాలనీ ప్రతిపాదించాడు. సాహిత్య విమర్శలో కేవీయార్ టీయమ్మెస్ తర్వాత మార్క్సిజాన్ని వొక సాహిత్య సిద్ధాంతంగా అభివృద్ధి చేయడానికి నిర్మించిన అత్యుత్తమ సంవిధానాన్ని ప్రతి వ్యాసంలోనూ గమనించగలం.

విప్లవోద్యమం సంక్షోభంలో చిక్కుకున్న కాలంలో సాహిత్య సాంస్కృతిక రంగాల్లో పనిచేస్తున్న రచయితలకూ ప్రగతిశీల శక్తులకూ క్రియాశీలంగా వుండటానికి అవసరమైన సైద్ధాంతిక బలాన్నీ భరోసానూ అందిస్తున్న యీ విమర్శ పాఠాలను నిండుగుండెతో ఆహ్వానిస్తూ.. సామాజిక సాంస్కృతిక అనుభవ సారాన్ని వడబోసి చిక్కనైన నిర్దుష్టమైన సాహిత్య సిద్ధాంతంగా అందిస్తున్న మిత్రుడు పాణిని అభినందిస్తూ …

హైదరాబాద్ ప్రేమాలింగనాలతో
డిసెంబర్ 15, 2025 ఎ. కె. ప్రభాకర్

సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.

Leave a Reply