“టెక్ సేవీ”
ఇదే ఆమెను నేను ముద్దుగా పిలుచుకునే పేరు!
ఎవరితోనైనా ఆమె గురించి మాట్లాడినపుడు మాత్రం “పుట్ల” మేడం అనేదాన్ని.
“ఎలా నేర్చుకున్నారు ఇంత టెక్నాలజీ?” అని నేను ఆశ్చర్యంగా అడిగితే….
కంప్యూటర్ ముందు కూర్చుని ఏదో ఒకటి చేస్తుంటే చాలు భానూ…అదే వచ్చేస్తుంది” అనేవారు.
ప్రరవే!
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక…
ఆవిర్భావం… నడకలో వేగం పెరిగిన తర్వాత వివిధ ప్రదేశాల్లో, వివిధ యూనివర్సిటీస్ లో జరిగిన సెమినార్స్…
అలా మొదలైంది మా ఇద్దరి ప్రయాణం… నెమ్మదిగానే అయినా గాఢంగా పెరిగింది స్నేహం.
సెమినార్ కి నేను వచ్చానో లేదో ఆమెకు ఇట్టే తెలిసిపోయేది…
నా నవ్వు వినిపిస్తున్న చోటికి వచ్చేసేవారు ఆమె.
అప్పటికి ముప్పైల్లోనే ఉన్నా… నాకు ఏవో అనారోగ్య సమస్యలు… ఆమెకు కూడా…
మొదట్లో ఒకరి సమస్యలు ఒకరం చెప్పుకుని సేదదీరేవాళ్ళం… కొన్ని రోజులకు మాకు ఇది ఇష్టపడలేదు…
ఇక అప్పటినుండి మా ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్ అంటే ఇంట్లో వాళ్ళు భయపడే రోజులు వచ్చాయి.
మా సమస్యలు మాకు జోక్స్ అయ్యి కూర్చున్నాయి.
గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్ళం. దేవుడిని మా మాటల్లో ఆడేసుకునేవాళ్ళం.
“దేవుడు కాస్త ఆరోగ్యం ఇస్తే ఇంకా ఎక్కువ పనులు చేసేవాళ్ళం కదా భానూ?” అని మొదట్లో అనేవారు ఆమె.
“అయ్యో ‘టెక్ సేవీ’… మనకి ఆరోగ్యం ఇస్తే భూమ్మీద నిలబడమని దేవునికి తెలుసు. అందుకే మరీ ఎగిరేస్తాం అని భయపడి ఇలా భూమ్మీద ఉండేలా చేస్తూ ఉండేది,” అనేదాన్ని నేను.
“మనిద్దరికీ ఆరోగ్యం ఉంటే ఎలా ఉండేది భానూ?” అనేవారు అప్పుడప్పుడూ.
“మనిద్దరికీ మంచి ఆరోగ్యం ఉంటే సుఖంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చునే వాళ్ళం మేడం, ఉద్యోగం చేసేసాం చాలు అనుకుని తీరిగ్గా లైఫ్ ఎంజాయ్ చేసేవాళ్ళం,” అనేదాన్ని.
“నిజమే భానూ,” అనేవారు.
కొన్నాళ్ళకు మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చేసాం. రాత్రీ పగలూ మేము పని ఎందుకు చేస్తాం అంటే…
“Escape from pain”
“A positive alternative to forget pain”
ఈ విషయం మీద థీసిస్ రాయాలి అనుకునేవాళ్ళం కూడా!
ఆమె ఏమి చేసినా, “భానూ, ఇలా చేసాను. నువ్వేమంటావ్?” అని అడిగేవారు. ఆమె “భానూ” అనే తీరు నా చెవుల్లో ఇంకా తియ్యగా పలకరిస్తూనే ఉంది.
నేను ఏదో పెద్ద ఆరిందాలాగా నా అభిప్రాయాలు చెప్పేదాన్ని. అంతేనా? “ఇలా చెయ్యొచ్చు… అలా చెయ్యొచ్చు…”అంటూ తెగ సలహాలు చెప్పేదాన్ని.
విని, తను అనుకున్నది చెయ్యొచ్చు కదా…
నాకు తర్వాత ఫోన్ చేసి, “నువ్వు చెప్పినట్టే చేసాను. చూడు ఎలా ఉందో” అనేవారు.
ఏ సెమినార్ అయినా, conference అయినా, ఫోన్ వచ్చేది ఆమె నుండి. “నువ్వు వస్తున్నావా?” అంటూ.
ఆమెకు అప్పుడప్పుడూ షుగర్ డౌన్ అయ్యేది. అందుకోసం ఆమెతో ఉన్న ప్రతిసారీ నా బ్యాగ్ లో ఒక బిస్కట్ ప్యాకెట్ తప్పనిసరిగా ఉండేది.
ఆమెలో నాకు బాగా ఇష్టమైనవి:
ప్రేమ:
తన కుటుంబంలోని వారితో ఎలా మెలగుతారో, బయటివారితో కూడా అలానే మెలగుతారు. ప్రేమగా పలకరిస్తారు. ఆ స్వఛ్చమైన చిరునవ్వులోనే ఉంటుంది ప్రేమంతా…
పలకరింపు:
ఎవరు ఎదురుపడినా ఆప్యాయంగా పలకరిస్తారు. ఎప్పటి విషయాలో గుర్తు పెట్టుకుని మరీ వివరాలు అడుగుతారు. మనకి చాలా సంతోషం అనిపిస్తుంది ఆమె మన గురించి గుర్తు పెట్టుకున్నందుకు. అందరికీ అంత సమానంగా ప్రాముఖ్యత ఎలా ఇస్తారా అనుకునేదాన్ని.
సాంకేతికత వాడకం:
మా ‘టెక్ సేవీ’ సాంకేతికతను వాడడంలో శిక్షణలేవీ పొందలేదు. ఆమె self learner. ఎలా అయినా నేర్చుకోవాలి అనుకునేవారు… అనుకోవడమే తడవు… నేర్చేసుకోవడమే! ఆమెకు సహకరించిన కుటుంబసభ్యులు, స్నేహితులు, ఆమె శిష్యులు ఆమె లోటును పూడ్చుకోలేరు… జీవితంలో అది ఎప్పటికీ తీరని వెలితిలా మిగిలిపోతుంది. నా జీవితంలో భాగమైన వారిలో నాకు నచ్చిన వారి నుండి ఒక్క విషయాన్ని అయినా నేను నేర్చుకుంటూ ఉంటాను. మా ‘టెక్ సేవీ’ నుండి నేను టెక్నాలజీపై పట్టు సాధించే లక్షణాన్ని నేర్చుకున్నాను. అలా ఆమె నాలో జీవించే ఉంటారు!
సంకల్పబలం:
“విహంగ” లో రాసేప్పుడు మా మధ్య ఎక్కువగా ఫోన్ సంభాషణలు నడిచేవి. ఆ వెబ్ మ్యాగజైన్ నిర్వహణ అప్పట్లో ఒక గొప్ప కార్యం. రాత్రుళ్ళు నిద్రపోయేవారు కాదు. అందరినీ కలుపుకుని, అందరితో కాస్తో కూస్తో పని చేయించినా, భారం మొత్తం ఆమె పైనే ఉండేది. పైపెచ్చు తరచూ ఏదో ఒక సాంకేతిక ఇబ్బంది ఎదురయేది. ఒక్కోసారి చాలా రోజులు శ్రమించాల్సి వచ్చేది. అయినా ఆమె ఓపికకు జోహార్లు చెప్పాలి. ఎలా అయినా ఆ సమస్యను పరిష్కరించేవారు. చాలా పట్టుదల, సంకల్పబలం కల మనిషి.
ఆమె చేసిన పనులు:
కవిత్వం, కథలు, పుస్తకాల సంపాదకత్వం, ప్రజాస్వామిక రచయిత్రుల వేదికలో నిర్వహించిన గురుతర బాధ్యతలు, మనోజ్ఞ సాహిత్య అకాడమీ నిర్వహణ, తల్లిగా ఇద్దరు పిల్లల అద్భుత పెంపకం, తన శిష్యులను తీర్చిదిద్దడం, ఆమె ఉద్యోగం… ఇలా ఎన్నో పనులు… ఎన్నో బాధ్యతలు… అన్నింట్లో విజయం… చెక్కు చెదరని ఆత్మ విశ్వాసం… చెక్కు చెదరని దరహాసం…
ఆమెలో నాకు తెలిసి ఉన్న ఒకే ఒక్క బలహీనత:
మొహమాటం:
ఎవరైనా ఏదైనా అడిగితే తనకు కష్టం అని తెలిసినా ఆ పని చెయ్యడం ఒక్కటే నాకు కోపం రప్పించేది. ఒక్కోసారి పెద్దవారు అని కూడా చూడకుండా తిట్టేదాన్ని. “ఏమో భానూ… కాదనలేకపోయాను,” అనేవారు. “ఊయల సినిమాలో హీరో శ్రీకాంత్ లాంటి వారు మీరు,” అని ఏడిపించేదాన్ని. ఆ మొహమాటం వల్ల కూడా ఆమెకు కష్టం అయినా చాలా పనులు చేసారు.
విహంగ:
ఆమె సృజనాత్మకతకు, మేధస్సుకు, భవిష్యత్తు పట్ల ఆమెకున్న శ్రద్దకు తార్కాణం “విహంగ” మహిళా సాహిత్య పత్రిక. (వెబ్ మ్యాగజైన్) ఆమె ఈ పత్రికను మలచిన తీరు అద్భుతం. పత్రిక నిర్వహణలో సహకరించిన, సహకరిస్తూ ఉన్న లక్ష్మణ్ మా ఇద్దరికీ చాలా ఇష్టమైన మనిషి. నేను ఆ అబ్బాయిని “అరసి” అని పిలుస్తూ ఉంటాను. ఆమె శిష్యరికంలో గొప్ప విజయాలు చవిచూసిన అరసికి ఆమె మరణం ఒక తీరని లోటు. విహంగలో రచనలు చేసిన ప్రతి రచయితకు ఆమెతో ఆప్యాయమైన సంబంధం ఉంది. అలా ఆమె అందరితో ఒక అనుబంధాన్ని ఏర్పరిచేవారు.
నా కుటుంబంతో అనుబంధం:
ఆమె నాకు ఒక్కదానికే ఆత్మీయురాలు అనడానికి వీలు లేదు. రాజు బావ( నా సహచరుడు), బడ్డీ (నా బిడ్డ) లకు కూడా ఆమె ఆత్మీయురాలే. నా బిడ్డ అప్పటికి ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కథలు, వ్యాసాలూ రాస్తాడని ఆమెకు తెలుసు. ఎప్పుడూ వాడి భవిష్యత్తు పట్ల తన ఆశలను చెప్పేవారు. ఆమె వేసిన రీసర్చ్ పేపర్స్ పుస్తకం “అంతర్జాలం- సాహిత్య దర్శనం” పుస్తకంలో బడ్డీ రీసర్చ్ పేపర్ కూడా పబ్లిష్ చేసారు. చిన్న రీసర్చ్ స్కాలర్ నా బడ్డీ అనేవారు. ఆమె నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి బడ్డీ కూడా బాగానే ఆ పేపర్ రాసాడు. అంత విశాల హృదయం ఆమెది.
అనారోగ్యంతో ఎప్పుడూ ఎడతెగని పోరాటం:
అనారోగ్యం ఆమెను ఎన్నో సార్లు ఇబ్బంది పెట్టింది. తానే గెలుస్తానని కొన్ని సార్లు విర్రవీగింది. మా ‘టెక్ సేవీ’ నిరంతరం ఆ అనారోగ్యంతో పోరాడింది. ఎప్పటికప్పుడు తాత్కాలికంగా అయినా గెలుస్తూనే వచ్చింది. చివరికి మరణానికి ఎలా తల ఒగ్గిందో నాకు అర్థం కాలేదు. హాస్పటల్ కి వెళ్ళడం, తిరిగి రావడం మాకు మామూలే! ధైర్యం సన్నగిల్లితే తప్ప ఆ యోధురాలు తల ఒగ్గదు. శరీరం సహకరించలేదేమో… వరుస పోరాటాలతో అలసిపోయిందేమో…
ఫోన్ వచ్చినపుడు నేను బెడ్ రెస్ట్ లో ఉన్నాను. కదలలేని పరిస్థితి. కదిలే పరిస్థితి ఉన్నా వెళ్ళనేమో… ఎందుకంటే నాకు తెలుసు… ఆమె తిరిగి వచ్చేస్తారని… అంత ధైర్యం! ఇప్పుడు కూడా అంతే అనుకున్నాను. మల్లి (కే.ఎన్.మల్లీశ్వరి) చెప్పింది రెండో రోజు… బ్రతికే అవకాశాలు తక్కువని. అయినా నా మనసు ఒప్పుకోలేదు. మరణించారని వాట్స్ ఆప్ మెసేజ్ వచ్చింది. అయినా నేను ఆ మెసేజ్ ని స్వీకరించలేకపోయాను. వీళ్ళందరూ పిచ్చివాళ్ళు… ఆమె సంకల్పబలం ముందు మరణం తునాతునకలు అయిపోతుంది అని విశ్వసించాను. అదే విశ్వాసంతో ఆమె వాట్స్ ఆప్ నంబర్ కి మెసేజ్ పెట్టాను. “మీరు తిరిగి వచ్చేస్తారు కదూ?” అని.
ఆమెకు మరణం లేదు:
ఆమె గురించి రాయమని అడిగితే చాలా రాయొచ్చు. కానీ ఆమె మరణించారు కనుక ఆమెను జ్ఞాపకం చేసుకోవడానికి రాయమంటే నా మెదడు సహకరించదు. ఎందుకంటే ఆమె నా ప్రపంచంలో ఇంకా బ్రతికే ఉన్నారు. మనందరి ప్రపంచంలో కూడా తాను చేసిన వర్క్ లో, ప్రచురించిన పుస్తకాలలో, రాసిన సాహిత్యంలో… ముఖ్యంగా “విహంగ” లో, ఎండ్లూరి సుధాకర్ గారి కవిత్వంలో, మానస రాస్తున్న కథల్లో, మనోజ్ఞ చేస్తున్న పనుల్లో, మనందరిలో శ్వాసిస్తూనే ఉంటారు!!!
Vijaya Bhanu అక్కా చదువుతున్నంత సేపూ గుండె చెప్పలేని ఆవేదనకు లోనైందని చెప్పాల్సిన పని లేదు. ఎన్నో జ్ఞాపకాలు పంచుకున్నారు. గుర్తుచేశారు. అమ్మ గొప్ప స్నేహితురాలు. ఆమెలోని మేధస్సు రవ్వైంతైనా నాకు ఉంటే బావుణ్ణు.
కొలిమి పత్రిక ఈ సంచిక మొత్తం ఇప్పుడే చూసాను. రచనలు అన్నీ బావున్నాయి. పత్రిక భవిష్యత్తు కు భరోసానిస్తున్నాయి. పత్రిక బృందానికి నా అభినందనలు విజయక్కకు నా ఆత్మీయ ఆలింగననాలు.