పుటల నిండా

జీవిత పుటల నిండుగా
సాంద్రమైన కన్నీటిఉప్పదనం
తలపుల మూలమూలల్లోనూ
విచ్చుకున్న గాయాల వాసన
ఎక్కడనుండి తవ్వుకొస్తున్నాం
ఇన్ని కముకు దెబ్బలని
అనే విపరీతమైన ఆశ్చర్యం
మనసు లోపలకు జారేకొద్దీ
సలసల కాగిపోయేంత వేడి
క్షణం ఒకచోట ఆగితే
కలలు చిక్కని గుప్పెట్లోని
శూన్యపు కలవరింత
నదిలో దిగేకొద్దీ
లాగేస్తున్న సుడిగుండాల
ఊపిరాడనితనం
వలలో పడ్డ చేపపిల్ల
మొప్పలెగరేస్తూ
చిన్నశ్వాస కోసం
జాలి లేని గాలిని వేడుకోలు
సముద్రం వెయ్యి కెరటాల నోళ్ళతో
బాధను ఘోషిస్తూ ఉంది
లోకానికి ఎక్కడ తీరిక
జేబులోని గాజు తెరలోకి
మునివేళ్ళతో తొంగి చూడ్డానికే
దానికి సమయం లేదు
సూటిగా సూదులతో
పొడుచుకుతింటున్న రాకాసిఎండ
ఎండి నెర్రెలు విచ్చిన నేల
ఒక్క చినుకు కోసం
దేహాన్ని దోసిలి పడుతోంది
ఖాళీలన్నిటినీ పూరించుకోవడానికి
ఎవరినైనా కాస్త ఆప్యాయతను
అడిగి తేవాలి
ఆకుపచ్చదనం కోసం
ఎక్కడెక్కడో వెతుకులాట
ఇది ముక్కలై చిట్లుతున్న
బ్రతుకు తండ్లాట
కనురెప్పల తలుపులు మూయగానే
ఒక దృశ్యం కనబడింది
దాన్నిండా
అడ్డదిడ్డంగా అలుముకున్న
ఎన్నో దుఃఖపు రంగులు
దిగులు దిగబడిన మనసు
మబ్బుకమ్మి మసకబారిన ఆకాశం

ఊరు విశాఖపట్నం. కవయిత్రి. కథలు, కవిత్వం, నవలలు చదవడం ఇష్టం. కవిత్వమంటే మరింత మక్కువ. వివిధ పత్రికల్లో కవిత్వం ప్రచురితమైంది. త్వరలో ఓ కవిత సంకలనం రానుంది.

Leave a Reply