పీడనావృతం

గుండెల్లో కొండ కోనల్లో
రవ రవ లాడే అశాంతిని
ఆర్ద్రంగా ఆలపిస్తున్ననందుకు
కంఠనాళమే ఇప్పుడు
పీడనావృతమైంది…

రక్తాశ్రిత చితుకు మంటల్ని
బహిర్వ్యాఖ్యానం చేస్తూ
నివురంటుకున్న
గాలిని, ధూళిని
నేలని, నీటిని
తీవ్రయుద్దమై కెలుకుతున్నందుకు
వేళ్ళమీదకే సంకెళ్లు నడిచొచ్చాయి…

భయపీడిత
భద్రతల విలాసాలకు
ఆవల
సూర్య గోళాల్ని
పండిస్తున్న కొత్త మానవుడ్ని
ధారగా అనువదిస్తున్న
ముసురు మబ్బుల మీద
బీభత్సమొకటి
సాధారణమై వాలిపడ్డది…

స్వేచ్ఛాకాశం కంటున్న
రక్త స్వప్నాన్ని
పురిట్లోనే ఉత్తరించే
వర్గపగ నీడ
నిరాకారమై ఎదుటనే
నిలబడ్డదదిగో

***

పీడితుడా…

జగిత్యాలదో
ఇంద్రవెల్లిదో
గోదావరి ఆవలిదో
ఇప్పటికిప్పుడే
ఓ రాయందుకో…

(విరసం పై నిషేధాన్ని ధిక్కరిస్తూ)

One thought on “పీడనావృతం

  1. పురిట్లోనే ఉత్తరించే వర్గ పగ నీడ

Leave a Reply