పిల్లల హక్కులు-పెద్ద సవాళ్లు

పదేళ్ళ పాప ఓ కథ రాసిందంటే అందులో సబ్జెక్ట్ ఏమైవుంటుందని ఊహిస్తాం? పువ్వులూ ,పిట్టలూ ,ఆటపాటలూ, అద్భుతాలూ , సాహసాలూ… ఇంతకంటే ఏముంటుందని కదా! కానీ సైరా రాసిన కథలో అవేమీ లేవు. డివోర్స్, సెపరేషన్, భయం, డిప్రెషన్… ఇవే మాటలు నిండా అరవై పేజీలు లేని ఈ చిన్ని నవలలో అడుగడుగునా ఎదురై మనల్ని అతలాకుతలం చేస్తాయి.

గత ఏడాది అన్వీక్షికి ప్రచురణల ద్వారా ‘బటర్ ఫ్లై’ అనే ఈ ఇంగ్లిష్ నవలిక ప్రచురితమైనప్పుడు దాన్ని రాసిన సైరా ఖైషగి వయసు పదమూడేళ్లు. తను ఈ నవల రాసి అప్పటికే మూడేళ్ళయిందట . అంటే పదేళ్ళ వయసులో రాసింది. అమ్మ రచయిత్రి, నాన్న మంచి చదువరి కావటంతో సైరాకు బాల్యంలోనే సాహిత్యంపై అభిరుచి, రచన చెయ్యాలనే ఆసక్తి కలగటంలో ఆశ్చర్యం లేదు. కానీ ఈ సబ్జెక్ట్ ను ఎంచుకోవటం మాత్రం అసాధారణమే. “నేను చూసిన జీవితాలే నా కథావస్తువులు,” అని సైరా అమాయకంగా చెప్పేస్తుంది కానీ, ఇంత చిన్న పిల్లలను కూడా కలవర పరిచేంత సంక్షోభం కుటుంబాల్లో ఏర్పడిన వాస్తవం భయపెడుతుంది.

కుటుంబ వ్యవస్థపై ఎంతోకొంత విశ్లేషణ చెయ్యని తత్త్వశాస్త్రాలు అరుదు. అది రాజ్యానికి మీనియేచర్ నమూనా అని మార్క్సిజం, ఫెమినిజం ఎప్పటినుండో చెబుతూనే ఉన్నాయి. అయినా ఆ రాజ్యహింస, అణచివేత ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ, మార్మికతల ముసుగులు తొడుక్కుంటూ మన అవగాహనలకు కొత్త సవాళ్ళను విసురుతూనే ఉన్నాయి. బోలెడన్ని చర్చలూ, సంస్కరణలూ, ఉద్యమాలూ సాగిన ఇన్ని తరాల తరువాత – ఫ్యూడల్ కుటుంబ చట్రం నుండి లివిన్ రిలేషన్స్ దాకా రూపంలో మార్పు తప్ప స్త్రీపురుష సంబంధాల్లో సమాజం పెద్దగా సాధించింది ఏముందని?
ఒక సమూహంగా స్త్రీలు అనుభవించిన నిస్సహాయత పునాదిగా చిరకాలం వర్ధిల్లిన కుటుంబ సౌధానికి ఆధునిక యుగంలో పగుళ్లు మొదలయ్యాయి. సామాజిక జీవితం , ఆర్థికస్వాతంత్య్రం కొంతవరకైనా అందుబాటులోకి రావడం స్త్రీల కాళ్లకున్న సంకెళ్లను కాస్త వదులు చేసింది. దుర్భరమైన కుటుంబాల నుండి విడిపోయే హక్కు గురించి ధైర్యంగా, బహిరంగంగా మాట్లాడగల వెసులుబాటు చట్టపరంగానూ, సాంస్కృతికంగానూ ఏర్పడింది. ఈ ప్రాసెస్ లో ఇప్పటికీ ఒక ప్రత్యేక అంశంగా గుర్తింపు పొందని అంశం పిల్లల హక్కులు.

తల్లిదండ్రులు విడిపోయినప్పుడు పిల్లల పరిస్థితి ఏమిటి? సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా వాళ్లపై పడే ప్రభావాలేమిటి? ఈ విషయాలను ఏ కుటుంబానికి అదిగా నిర్ణయించుకోవడమో, కోర్టుల పరిథిలో సెటిలయ్యే హక్కుల వ్యవహారమోతప్ప సున్నితంగా, మానవీయంగా ఆలోచించే పద్ధతి ఏర్పడనే లేదు. మార్కెట్ ఎకానమీ, వినియోగదారీ సంస్కృతి సర్వవ్యాప్తమై అన్ని మానవ సంబంధాలనూ అచ్చమైన ఆర్థిక బంధాలుగా కుదించిన ఫలితం మనుషుల శారీరక, మానసిక స్థితులనూ, ప్రవర్తనలనూ ధ్వంసం చేసింది. ప్రతి ఒక్కరూ ఒక ప్రపంచమైన తరువాత ఇద్దరు వ్యక్తులు స్నేహంగా, ప్రేమగా కలిసి బతకటమే కష్టంగా మారింది. ఆ ఇద్దరూ స్త్రీపురుషులైతే , అందులోనూ భార్యాభర్తలు అయితే అది అసాధ్యం కూడా అయింది. ఇవి మిత్ర వైరుధ్యాలా? శత్రు వైరుధ్యాలా? అనే సిద్ధాంత చర్చను అలా ఉంచితే ఏ ఒక్కరో వ్యక్తిత్వాన్ని కోల్పోతే తప్ప కుటుంబాలు నిలిచే పరిస్థితి దాదాపుగా అంతరించింది. సామాజిక, ఆర్థిక కారణాల రీత్యా మెజారిటీ కేసుల్లో ఆ లూజర్స్ స్త్రీలే అవుతారు. ప్రబలమైన కన్స్యూమర్ కల్చర్ కు స్త్రీలు కూడా ప్రభావితులే కనుక కొన్నిసందర్భాల్లోబాధితులు పురుషులు కూడా కావచ్చు. ఇలా జంటలు విడిపోయిన ఇళ్ళలో పిల్లల తరఫున సైరా విప్పిన గొంతుక ఈ ‘బటర్ ఫ్లై’ నవల.

Butterfly-2

సైరా రెండవ తరగతిలో ఉన్నప్పుడు ఒక స్నేహితురాలి తల్లిదండ్రులు విడిపోయారు. దాన్ని తట్టుకోలేని ఆ పాప క్లాసులో రోజూ ఏడ్చేది. కొన్నాళ్ళకు డిప్రెషన్ కు లోనై జబ్బుపడింది. స్కూల్లో మరికొందరు పిల్లలు కూడా ఇదే సమస్యలో ఉండటం ఆమెను కలత పెట్టింది. ఆ పిల్లల వేదనను కథగా రాయాలనే తపన తనతో ఈ రచన చేయించింది. ఈ కథలో ప్రధాన పాత్రగా పిల్లల హక్కులపై మాట్లాడే ‘రూమీ’, ఆ పిల్లల ప్రతినిధి. రూమీ అమ్మానాన్నలు విద్యావంతులు, సంస్కారవంతులు కనుక విడాకులు తీసుకున్నా, కూతురికి అందుబాటులో ఉండాలని, ఆమెకు ఇష్టమైన వారితో ఉండే అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. రూమీ మిత్రులు టియా, తాన్యా లకు ఆ వెసులుబాటు కూడా దొరకలేదు. ఆ కుటుంబాల్లో పిల్లలను అమ్మానాన్నలు పంచుకున్నారు. తోబుట్టువుల్లో ఒకరు ఈ దేశంలో, మరొకరు విదేశాల్లో బతకాల్సిన స్థితి ఏర్పడింది.

ఎలా చూడాలి ఈ పిల్లల సమస్యను? ఎక్కువ సందర్భాల్లో ఈ బాధ్యతను తల్లులే స్వీకరించటం ఇప్పటికీ కనబడుతోంది. ఎన్నో తరాల స్త్రీలు పోరాడి సాధించుకున్న విడాకుల హక్కులకు ఆ విధంగా అది విఘాతమే. నిజానికి ఇది హక్కుల పరిభాషలో మాట్లాడగలిగే విషయం కాదు. బహుశా ఈ సమస్య చలాన్ని కూడా కలవరపరిచిందేమో! కుటుంబాల పెత్తనం నుండి స్త్రీల స్వేచ్ఛకూ, పిల్లల నిస్సహాయతకూ వైరుధ్యం ఏర్పడినప్పుడు ఏం చెయ్యాలో; రాజేశ్వరికి, అరుణకు, లాలసకు పిల్లలుంటే ఆ కథలను ఎలా ముగించాలో పిల్లలకోసం ప్రాణాలిచ్చే ఆయనకు తోచనేలేదేమో! పిల్లలకోసం తమ స్వేచ్ఛను, సుఖాన్ని త్యాగం చెయ్యగలమో లేదో కనేముందే తల్లిదండ్రులు ఆలోచించా లంటాడు. అదీ కాకపోతే, “ఎవరూ పిల్లల్ని కనకపోతే లోకమెట్లానండీ, అంటారు” …”పుడితే ఈ సమస్యలుగానీ, పుట్టకుండానే వుంటే? అంటున్నాము, జన్మనిచ్చే శక్తిని అధీనంలోకి తెచ్చుకుని” అనేస్తాడు మరోమార్గం తోచక.

చలం చేసిన ఆ ప్రతిపాదనకు ఆ రోజుల్లో ఎంత అవకాశం ఉండిందో తెలియదు. కానీ, కుటుంబ నిర్మాణాలలోని పరిస్థితులకు నిరసనగా పెళ్ళిని వద్దనుకుంటున్నవాళ్లూ, సొంత అభిరుచుల సాధనకోసం పిల్లలను కనవద్దని నిర్ణయించుకునే వాళ్లూ కనబడుతున్న కొత్తతరంలో ఈ ఆలోచన అవసరం ఉందనిపిస్తుంది .

ఇంత లోతైన విషయాన్నిగురించి సైరా చేసిన ఆలోచన ఆశ్చర్యం గొలుపుతుంది. “అమ్మ, నాన్న విడిపోతున్నారని బాధపడకుండా…వాళ్లకు విడాకులు తీసుకునే హక్కు ఉందని పిల్లలు తెలుసుకోవాలి … ఒక షూలో రెండు కాళ్ళు ఉంచలేమని గుర్తించాలి … సింగిల్ పేరెంట్ తో ఆనందంగా జీవించడాన్ని పిల్లలు అలవరచుకోవాలి”, అని రూమీ పాత్రతో పలికిస్తుంది సైరా. పదేళ్ళ పాపాయి లేత మెదడుపై ఇంత మెచ్యూరిటీ భారాన్ని చూసి సంతోషంకన్నా ఎక్కువగా భయం వేస్తుంది. ఇది సాధ్యం కావాలంటే సమాజం అంతటిలోనూ ఎంత మార్పు రావాలి? ఈ చిన్ని సీతాకోకచిలుకల పసి రెక్కలను ప్రేమతో, సహానుభూతితో హత్తుకునేందుకు మనుషుల్లో ఎంత ఎక్సర్సైజ్ జరగాలి? ఏ సంబంధంలోనూ స్థిరత్వాన్ని ఆశించే కాలం కాదని గ్రహించగల స్త్రీ పురుషులు సాహచర్యంలోకి ప్రవేశించే ముందు ఎంత బాధ్యతతో అడుగులు వేయాలి? ఇలా ఒక ప్రయత్నం మొదలైతే అది పిల్లల హక్కులనే కాదు, స్త్రీపురుష సంబంధాల పునాదినే కొత్తగా నిర్వచిస్తుంది.
“Children have the right to get love from both the parents. But why do parents hurt their children and hurt themselves? Why should kids face injustice? When parents get separated, why should the children bear so much of suffering? Every child experiences some sort of punishment when the parents are divorced…How can parents be so indecisive?”, అని సైరా అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పనిదే సమాజానికి భవిష్యత్ ఉంటుందా?

Butterfly_ A novel by Saira Khaishagi
Anvishiki publishers, Hyderabad .Price- 150/-

నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో పిఎచ్.డి చేశారు. సాహిత్యం, సామాజిక శాస్త్రాల అధ్యయనంలో, ముఖ్యంగా సాహిత్య విమర్శలో ఆసక్తి. మిత్రులతో కలిసి "చూపు" పత్రికను కొంతకాలం నిర్వహించారు. సాహిత్య, సాహిత్యేతర గ్రంథాల అనువాదం, రచన వంటి అంశాల్లో కృషి చేస్తున్నారు.

Leave a Reply