పసిపాప నవ్వులాంటి పిడికిలి
సమస్త మానవ సంచారత్వాన్ని
సంఘటిత విప్లవ వ్యక్తీకరణగా
నిబద్ధం చేసిన ఎర్రజెండా రెపరెపలాంటి పిడికిలి
శ్రీకాకుళం అరణ్య చైతన్యాన్ని
కాగడాగా రగిలించి దేశసరిహద్దుల
దాకా వెలుతురు చిమ్మిన
విప్లవగీతం లాంటి పిడికిలి
ముగింపులేని చెరలో దేశద్రోహ ముద్ర వేయబడ్డ
విప్లవకారుడి రెప్పల కింద సెదదీరడానికి చేరిపోయే జాబిలి లాంటి పిడికిలి
పిడికిలి ఒక పదం మాత్రమే కాదు ఒక పథం
పిడికిలి ఐక్యతా చిహ్నమే కాదు నిలువెత్తు నిగ్రహం
పిడికిలి ధిక్కారగీతమే కాదు నిర్భయ జననాయడి
ఉక్కు సంకల్ప సత్యం
లేచిని పిడికిలి సముద్రపు ఉపిరి మీద చేసే
కెరటపు సంతకం
మానవ మనుగడను జాగృతం చేసే సాయుధ స్వప్నం…
నిర్భంధాలకు చలించదు
పిడికిలెప్పుడూ మరణించదు
ఎత్తిన పిడికిలి ఎక్కుపెట్టిన ఆయుధం
పాత సమాజపు గర్భాన్ని చీల్చే శైశవ ఆక్రందనం
జన స్వప్నాలను హృదయం లో మోస్తూ
నిర్భంధం అనుభవిస్తున్న రాజకీయ ఖైదీల పిడికిళ్ళకు…