పాలస్తీనా మహాకవి మహమూద్ దార్విష్ కవితలు కొన్ని

చంద్రుడు బావిలో పడిపోలేదు

  • యేమి చేస్తున్నావు నాన్నా?
  • నిన్న రాత్రి పడిపోయిన నా హృదయం కోసం వెతుకుతున్నా
  • ఇక్కడ దొరుకుతుందనుకుంటున్నావా?
  • ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ దొరుకుతుంది? ఇక్కడే నేలమీద వొంగి యేరుకుంటాను ఒక్కొక్క ముక్కా – నా రైతుకూలీ తల్లులు రాలిపోయిన పండ్లనేరుకున్నట్టు, ఒక్కొక్క పండునేరుకుంటాను
  • కానీ నువ్వు గులక రాళ్ళ నేరుకుంటున్నావు
  • నిజమే – గులకరాళ్లను యేరుకోవడం జ్ఞాపకశక్తికీ, జ్ఞానానికీ మంచిది. యెవరికి తెలుసు ఈ గులకరాళ్ళు దశాబ్దాల భయాలతో ఘనీభవించిన నా హృదయపు ముక్కలేనేమో?

ప్రేమ, భావం లాగా…

ప్రేమ, ఒక తెలిసిన భావం లా బహిరంగ రహదారి మీద పడి ఉంటుంది కానీ, నిజానికి కవిత్వం లా క్లిష్టమైనది. దానికి అనేక స్థావరాలుంటాయి. అందుకే ప్రేమించడానికి ప్రతిభా సామర్థ్యాలు కావాలి, బోలెడంత ఓర్పు కావాలి, తెలివైన వ్యూహాలు కావాలి. ఊరికే ప్రేమిస్తే సరిపోదు. ప్రేమ వర్షం లాగా ఉరుములు మెరుపుల్లాగా ఒకానొక ప్రకృతి ఇంద్రజాలం. ప్రేమ నిన్ను నీలోంచి తీసేసి వేరేవాళ్ళ కక్ష్యలో ప్రవేశపెడుతుంది. ఇక నిన్ను నీవు కాచుకోవాలి. ప్రేమించడం సరిపోదు యెట్లా ప్రేమించాలో తెలవాలి. నీకు యెట్లనో తెలుసా?

కవితమీది నుంచి గుర్రం పడిపోయింది

మనం అమితంగా ప్రేమించేవాటిని
సంబరాలు చేసుకోవడానికి
ఆధునిక భాషలో అంచులు లేవు
ఎందుకంటే ఇంక మిగలబోయేదల్లా……
‘ఉండింది’ మాత్రమే!

రెండవ ఆలివ్ చెట్టు

గుర్రాలతో ఆలివ్ చెట్లు:
ఆలివ్ చెట్టు యేడవదూ నవ్వదూ.
ఆలివ్ చెట్టు
గుట్ట పక్కన నిరాడంబరమైన స్త్రీ
నీడ ఆమె ఒక కాలును కప్పుతుంది.
ఆమె తుపాను ముందు ఆకుల్ని రాల్చేసుకోదు.
నిలబడి కూర్చుంటుంది
కూర్చునే నిలబడి ఉంటుంది.

నా వీలునామా యేది?

నా వీలునామా యేది?

అక్కడే ఆగిపోయిందది, సామూహిక గళాలకు అవతలివైపు.

నాకిప్పుడు యేమీ వద్దు
నా అద్భుతమైన కాఫీ పరిమళాలు తప్ప

నాకు చాలా సిగ్గుగా ఉంది
నా అనేకానేక భయాలతో చాలా సిగ్గుగా ఉంది, అవమానంగా ఉంది.

ఆ నేల మీద పుట్టకపోయినా,
తామెప్పుడూ ఆఘ్రాణించలేకపోయిన
సుదూర సువాసనలని ప్రేమిస్తూ
మాతృభూమికోసం స్వప్నిస్తున్న నా వాళ్ళు
నన్ను సిగ్గుపడేలా చేస్తున్నారు

నా తల్లి వాళ్ళను కన్నా,
ఆమె నుండి దూరంగా జన్మించారు వాళ్ళు.

ఆమెను నిరంతరం కలగన్నారు,
ఆమెనే తమ ఆలోచనల నిండా
విసుగూ విరామం లేకుండా నింపుకున్నారు.

తమని నిరంతరం గెలిచే ఆమె జ్ఞాపకాలతో,
ఆమెకోసం నిరంతరాన్వేషణ తో
తమ తల్లికి చెందడం అంటే యేమిటో నేర్చుకున్నారు.

“మీరిక్కడ పరదేశీలు” అక్కడ వాళ్ళతో అంటారు వాళ్ళు.

“మీరిక్కడ పరదేశీలు” ఇక్కడ వాళ్ళతో అంటారు వాళ్ళు.

అల్-బీర్వే శిథిలాల ముందు నిలబడి

పక్షుల్లా,
అతి జాగ్రత్తగా
భూమి శరీరం మీద నడుస్తాను నేను
చనిపోయిన వాళ్ళకు మెలకువ రాకుండా.
నా ఉద్వేగాలన్నిటికీ తలుపులు మూసేసి
ఇంకెవరో అయిపోతాను
మేఘం కోసం ఎదిరిచూస్తూ
నిట్టూర్పులు విడిచే
రాయి లా కూడా
ఉన్నాననుకోను నేను.

పుట్టింది సిద్ధిపేట‌, చదివింది జిల్లా ప‌రిష‌త్‌ హై స్కూల్ లచ్చపేట, స‌ర్వేల్‌, హైద‌రాబాద్‌ పబ్లిక్ స్కూల్, జేఎన్‌టీయూ, ఓ యూ. వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో పదకొండేళ్లు అధ్యాపకునిగా, అమెరికాలో గత 20 ఏండ్లుగా ఐటీలో, 14 ఏండ్లు విరసం సభ్యుడు. మూడు కవితా సంకలనాలు 'కల్లోల కలల మేఘం', 'సందుక', 'వానొస్తదా'?,  ఒక కవితా ప్రయాణ జ్ఞాపకాలు 'నడిసొచ్చిన తొవ్వ' – ఇప్పటిదాకా ప్రచురణలు. 'ప్రజాకళ', 'ప్రాణహిత'లతో సన్నిహిత సంబంధం.

2 thoughts on “పాలస్తీనా మహాకవి మహమూద్ దార్విష్ కవితలు కొన్ని

Leave a Reply