పాట ఉరి పెట్టుకుంది

నా నేలకిప్పుడు
పురిటి నొప్పుల మీద కన్నా
పూట గడవడం మీదే దృష్టి
చేతిసంచి పట్టుకుని
ఖర్జూరపు చెట్ల నీడల్లో
ఊడిగానికి బయల్దేరింది

నదులు –
కోల్పోయిన గర్భసంచులతో
తెగిన పేగులతో
నెత్తురు ఇంకిన పొలాల్లో పొర్లాడుతున్నాయి

అమ్మ లాంగుల్య
నేత చీరలు కట్టడం మానేసి
ఆన్లైన్ లో కొత్త బట్టల కోసం ఆర్డర్ పెట్టుకుంది

రాజకీయం
సొంత రక్తం మధ్య మంట పెట్టింది
అన్నదమ్ములు పందెం కోళ్ళు

నా నేల ఇప్పుడు
రంగు జెండాల ప్రయోగశాల

పాటలు పుట్టిన కొండల్లో
మైనింగ్ పేలుళ్ళ జాతర

సీమ కొండకు
రాళ్ళు కొట్టీ దారులేసిన పాటగాడు
చీకట్లోకి వెళ్ళిపోయాడు
గాలి విసురుగా వీస్తున్నా
ఒక్కటంటే ఒక్క పాటా పుట్టింది లేదు

వలస పెట్టుబడిదారు
తన బిడ్డల్ని ఎత్తుకెళ్లిపోయాక
బెంగపడ్డ అడవిని రాబందు పలకరింపు కొచ్చింది
తూనీగలు ఎగిరే కాలాలు ఇగిరిపోయి
గద్దల తన్నుకులాటల రుతువు ప్రవేశించింది

ఇక పాట కోసం ఈ నేల వొంక చూడొద్దు
డప్పులు చల్లారిపోయాయి
పాటిప్పుడు
ఇల్లలుకుతూ పేరు మర్చిపోయిన ఈగ.

జననం: ఒంకులూరు, శ్రీకాకుళం జిల్లా. కవి, రచయిత, ఉపాధ్యాయుడు.  వివిధ పత్రికల్లో కవితలు, అభినయ గేయాలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

Leave a Reply