నీ అరికాలి కింద నా పాటింకా పాటగానే వుంది
కత్తిగా మారి నీ పాదాన్ని చీల్చకముందే నీ కాలుని మందలించు
***
ఒంటి కాలు మనిషి, ఒంటి కన్ను మనిషి
మొఖం నిండా ఇనుప మొలలు దించివున్న దేహంలో మాంసాన్ని ఖాళీ చేసి
నరాలను మొలలకు చుట్టి
అరికాలి దాకా వేలాడుతున్న నరాల చివర రెండు కనుగుడ్లను కట్టి
నా పాట కార్చే నెత్తురులో ముంచీ తీసి ముంచీ తీసి నేనో ఆటలాడుతాను
ఆడి ఆడి అలసి అలసి
పొద్దటి నుంచి చీకటేల దాకా చిల్లులు పడ్డ దేహంలోంచి
దుంకుతున్న వాడి ఎర్రటి జలపాతంలో
నా చెమటను కడిగేసుకుంటాను.
***
నేను వర్ణించిన ఈ పెయింటింగ్ లో
ఇనుప మొలలు దించివున్న మొఖం,
చిల్లులు పడ్డ దేహం, వేలాడుతున్న నరాలు, నరాల చివర కనుగుడ్లు
ఇవన్నీ నీవి కాకూడదని
నా ఊహల్లో ఉన్న పెయింటింగ్స్ అన్ని
నిజ జీవితంలో ఆచరణా రూపంలో జరగవద్దని
మిత్రమా…
నా పాట నెత్తుటేరులో తడిసిపోతున్న నీ కుడికాలుని మందలించు
లేదంటే.. గొంతు తెగిబడుతున్న నా పాట
తన కనుగుడ్లతోనే ఓ జానపదం పాడాల్సి వుంటుంది.
***
గొంతుతో పాడే పాట
కనుగుడ్లతో పాడే పాట
రెండు వేరువేరుగా వుంటాయని
చరిత్ర రాయాల్సిన పని పడుతుంది నాకు.
చప్పుళ్లు నిశ్శబ్ద రూపమెత్తితే భయపడతావు
నిశ్శబ్దం తూటాను ప్రసవిస్తుంది, కత్తిని సానబెడుతుంది
నా పాట నిశ్శబ్దమవొద్దని మనసారా కోరుకో మిత్రమా.
(పాట పాడే స్వేచ్ఛను రద్దు చేసిన టర్కీ ప్రభుత్వంపై ఆగ్రహంతో….)
తొవ్వలో తవ్వులాట
దుక్కించే దేహాల కన్నీరు
దుక్కాన్ని పదునుగా దున్నే గుండె నెత్తురు
నిత్యం శ్రమించే వాద్యాల చెమట
ఈ తొవ్వంతా పచ్చిదేనని అప్పట్లో తెలవక
భూమి కంట్లోకి జారిపోయిన చప్పుళ్ల కోసం
తవ్వులాట కోసమొచ్చి ఎండు గుండెను జారవేసుకున్నాను
ఇప్పుడా గుండె ఏ కన్నీటి సెలయేరులో తడిసిందో
ఎవరెవరి నెత్తుటి మడుగుల్లో మునిగిందో
తుడుం డోళ్లు నగారాల చెమట కాలువల్లో స్నానామాడిందో
ఏడవటం కూడా తెల్వని ఒట్టి గుండెను
ఎంతగా ఏడిపించిందో ఈ అడవి
దుఃఖం అంటే ఏమిటో తెల్వని నా గుండె నరాలకు
దుక్క సంద్రంలో ఈదులాటలు నేర్పసాగిందో
ఆకాశాన్ని చూస్తూ
ఒక్క నవ్వు కూడా సరిగ్గా నవ్వటంరాని గుండె పెదాలపై
ఎన్ని ఇప్ప సుక్కలు నక్షత్రాలై పూసినాయో
ఒడ్డున కూర్చొని
ఒచ్చి పోయే అలలను ప్రేమించడం రాని గుండె కండ్లకు
భూమి కంట్లోకి జారిపోయి
ఒక్కో చప్పుడు ఒక్కో అల’గా తాకుతుంటే
నా గుండెకనురెప్పలు ఎంత తడి బారిపోయాయో
***
ఇప్పుడు నేను కొనసాగిస్తున్న తవ్వులాట
నా కోసమో నా తడి గుండె కోసమో కాదు
మొలిచేటి పొద్దుకై పోరుజేస్తున్న మూలధ్వనుల కోసం.