పాటల ఊట చెలిమె – గాజోజు

తండ్రి కళాపిపాసను పుణికిపుచ్చుకున్న వారసుడు. జగిత్యాల జైత్రయాత్ర సాలువడ్డ గాయకుడు. అలిశెట్టి అగ్ని గీతాలను ఎదలకదుముకున్న సృజనకారుడు. కన్నతల్లి కన్నీటి దగ్ధగేయాలను ఆలపించిన గేయకుడు. నెత్తుటి మడుగుల్లో మొలకలెత్తిన ఉద్యమకారుడు. ప్రజాకవుల బాటకు ప్రాణంపోసిన తిరుగుబాటుదారుడు. గోదావరీ లోయ పోరాటాలను ప్రసరించిన వాహకుడు. తెలంగాణ ఎతకతలను పొత్తాల్లో పొదువుకున్న కథకుడు. ఉద్యమ గీతాలతో రాగమెత్తిన గానభూషణుడు. తెలంగాణ జనజీవితాన్ని కైగట్టిన పాటకుడు. తెలంగాణ సాంస్కృతికవైభవాన్ని చాటిచెప్పిన వాగ్గేయకారుడు.రచయితలను సమన్వయపరుస్తూ, తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తెవవే నాయకుడు. రాతకూతల్లో రాటుదేలిన మాంత్రికుడు. కోట్లాది జన హృదయ తంత్రులను మీటిన సహృదయుడు. పోటెత్తిన జనప్రవాహ అలుగులకు కవన ఊయలలూపిన కవికుల తిలకుడు. పిల్లలను పిడుగుల్లా తీర్చిదిద్దిన ఉత్తమ ఉపాధ్యాయుడు. పాఠశాలను ప్రకృతి ఒడిలా మార్చిన ఆదర్శ ప్రధానోపాధ్యాయుడు. ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసిన ప్రతిభావంతుడు. ఆత్మగల్ల మనిషి గాజోజు రాగభూషణుడు. నాగభూషణుడు బహురూపాల్లో ఆరితేరిన వాడు, అయినప్పటికీ ఈ వ్యాసంలో “పాటల ఊట చెలిమె” యైన నాగభూషణ గాణుడు కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను.

ప్రపంచ భాషల్లో ప్రప్రథమంగా ప్రభవించింది పాట. మొట్టమొదట ఆదిమ మానవుడు కైగట్టింది జానపదమే. ఆ తర్వాతే ఇతర సాహిత్య రూపాలు అవతరించాయి. ఆకలి, దాహం, సంతోషం, విషాదం, ఆందోళన, ఆవేశం, కోపం, భయం, వినోదం, విభ్రమం ఇలా ఏ భావం కలిగినా మానవుడు కూనిరాగాలు తీసేవాడు. రానురాను ఆ కూనిరాగాలే పదాల రూపాన్ని సంతరించుకున్నాయి. అలా అల్లుకున్న అనుభవాలే, అల్లిబిల్లి పాటలై పరుగులు పెట్టాయి. పనీపాట అనే మాట మనం తరచూ వింటుంటాం. పనిచేసేటప్పుడు శ్రమను పోగొట్టుకోవడానికి పాడుకుంటాం. పాట నిత్యజీవన వ్యవహారంలో పందిరి మల్లెతీగలా విడదీయరానంతగా పెనవేసుకుపోయింది. పాట లేకుండా పని ముందుకు సాగదు. బరువులెత్తినా, బండ్లు లాగినా, నాగలి దున్నినా, నాట్లేసినా, మోటగొట్టినా, తౌటంబెట్టినా, కలుపు తీసినా, కోత కోసినా, ఇసుర్రాయి తిప్పినా, వడ్లు దంచినా, ఏతమెత్తినా, బట్టలుదికినా పాడుకోవడం పరిపాటయిపోయింది. “టప… టప… టప… టప…/టప… టప… టప… టప…/చెమట బొట్లు తాళాలైపడుతుంటే/కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే/పాటా పనితో పాటే పుట్టిందీ/పనీ పాటతోనే జత కట్టింది” ఇలా పాట పుట్టుక నేపథ్యాన్ని సశాస్త్రీయంగా చెబుతాడు సుద్దాల అశోక్ తేజ. కన్నీళ్లు, కడగండ్ల నుండి తెలంగాణ బడుగుల పాట పుట్టింది. నెత్తుటి మడుగుల నుండి పాట ప్రాణం పోసుకున్నది. తెలంగాణ బతుకులకు పర్యాయపదమే పాట, కాబట్టి తెలంగాణ పాటకు ఒక ప్రత్యేకత ఉంది. గుండె గొంతుకలో పుట్టిన బతుకు పాట, జనం నాలుకలపై నాట్యమాడింది. భావజాలాన్ని పదునెక్కించింది పాట. ఉద్యమాలను ఉర్రూతలూగించింది పాట. పేదలకు పెన్నిధైంది పాట.

“గీయతి ఇతి గీతం”-పాడేది పాట, గీతం లేదా గేయం. “గాతుమర్హంతు గేయం”- గానయోగ్యమైన రచన గేయం. మాటలను అందంగా రాగతాళ యుక్తంగా వినిపించడాన్ని పాట అంటాం. పాటలో మొదటి భాగం పల్లవి. ఇది ప్రతి చరణం తర్వాత మళ్ళీ పాడవలసి వుంటుంది. పల్లవి తర్వాత పాడే మొదటి చరణం అనుపల్లవి. చరణాలు పల్లవి తర్వాత పాడే భాగం. ఇవి సామాన్యంగా మూడు నుంచి ఐదు ఉంటాయి. పల్లవికి ముందు సాకీని పెట్టుకోవచ్చు. పాటకు లయ జీవం. లయ పాట సౌష్ఠవాన్ని తెలుపుతుంది. గానంలో చేరిన హెచ్చు తగ్గులు లేక నడిచేది లయ. తాళం నడుమ నడిచే కాలం లయ. లయ సహజసిద్ధమైనది. రానురాను తాళాన్ని శాస్త్రీయంగా అభివృద్ధి పరిచారు. కాబట్టి పాటకు లయతో పాటు తాళం కూడా తప్పనిసరి. శృతి కూడా అవసరమే. శృతి అంటే వినబడేది. అందుకే పాట వీనుల విందుచేస్తుంది. ఆలోచింప జేస్తుంది, ఆత్మగౌరవాన్ని పాదుకొల్పుతుంది. గేయం, గీతం, లలిత గీతం, పాట, కీర్తన, సంకీర్తన, పదం, కృతులు ఇవన్నీ పాడుకోవడానికి అనువుగా ఉండేవే. వీటిని మాత్ర గణాలతో రాస్తారు. పాటలో పాడుకోవడానికి అనువుగా మాత్రలు లోపించవచ్చు. అట్లాగే అక్షరాలను సాగదీసో, కుదించో పాడుకోవచ్చు. పాటకు పల్లవి తప్పనిసరి. పల్లవి అంటే పాటకు మొదటున్న ఒకటి రెండు మూడు పాదాలను తిరిగి పాడడం. సాధారణంగా పాట పల్లవి తర్వాత ఒకటి నుంచి నాలుగు ఐదు చరణాలు ఉంటాయి. చరణం అంటే కొన్ని పాదాలు. చరణం పాడిన తర్వాత మళ్లీ పల్లవిని అందుకుంటారు. ఇట్లా ఒక్కొక్క చరణం పాడిన తర్వాత పల్లవిని మాటిమాటికి పాడుకుంటాం. అందుకే పాటకు పల్లవి ప్రాణం అంటారు. పాట మానవ జీవితంలోని అన్ని దశల్లో భాగమైంది. పాట మానవ జీవితాన్ని పెనవేసుకున్నది. అందుకే మనిషి పాటను ప్రాణప్రదంగా భావించాడు.

పసితనం నుంచే గాజోజు నాగభూషణం విరివిగా పాటలు పాడాడు. అనేక వేదికలపై ఉత్తమ గాయకుడిగా బహుమతులు పొందాడు. పాటే ప్రాణంగా ముందుకు నడిచాడు. నాగభూషణం కంఠస్వరం సంగీత స్వరానికి దగ్గరగా ఉంటుంది. ఆయన భాష సంగీత మయంగా పలుకుతుంది. ఆయన ఏది మాట్లాడినా, పాటతీరులోనే లయాత్మకంగా వినబడుతుంది. ఇలా మాటలను పాటమయం చేయడం ఆయనకు పెన్నుతో పెట్టిన విద్య. అందుకే గాజోజు పాటల అల్లిక, ఆలాపన గురించి రాయడమంటే; అద్దంలో కొండను చూపెట్టడం లాంటిదే అవుతుందని నా భావన. ఆయన విద్యార్థి దశలోనే; భూస్వామ్య పెత్తందారీతనానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు వైపు ఆకర్షితుడయ్యాడు. ఆ వేదికలపైన పాటలు పాడి మెప్పించాడు. ఉద్యమాల పురిటిగడ్డ జగిత్యాల మట్టిలో పుట్టిన బిడ్డ. జగిత్యాల జైత్రయాత్ర దుమ్ము సోకి కవిత్వాన్ని రాసిన అలిశెట్టి ప్రభాకర్ వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నాడు. ఆయన కవిత్వాన్ని గోడలపై జాజుపూతలతో జాలు పారించాడు. ఆయన బాల్యంలోనే తండ్రి బ్రహ్మయ్య అనారోగ్యంతో అకాల మరణం చెందారు. పోరుబిడ్డల మీద రాజ్యహింస పెరిగిపోయిన సందర్భం. దాంతో పాఠశాల విద్యాభ్యాసాన్ని మధ్యలోనే విడిచిపెట్టాడు. ఆ నిర్బంధాలను తప్పించుకోవడానికి బొంబాయికి వలసపోయాడు.

కొందరు పాటలు రాస్తారు, కానీ కమ్మగా పాడలేరు. కొందరు పాడతారు, కానీ రాయలేరు. ఈ రెండింటిలోనూ సమాన సామర్థ్యమున్న వారిని వాగ్గేయకారులని, లయకారులని అంటాం. ప్రాచీనులలో అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య వంటి వారు వాగ్గేయకారులు. నేటి తరంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పి.బి.శ్రీనివాస్, సినారె, గద్దర్, వంగపండు, గోరటి వెంకన్న, అందెశ్రీ మొదలగు వారిని లయకారులుగా పేర్కొంటాం. గాజోజు నాగభూషణం సైతం అదే కోవకు చెందుతాడు. తెలుగు సాహిత్యంలో పాట ఒక పాల కడలి వంటిది. తెలంగాణ సాహిత్యంలో పాట అన్ని సందర్భాలకు, అన్ని అనుభూతులకు, అన్ని ఉద్యమాలకు సరైన వాహికగా నిలిచింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోను, ప్రత్యేక తెలంగాణోద్యమంలోను, ప్రజా పోరాటాల్లోను పాట పరవళ్ళు తొక్కింది. విప్లవ సాహిత్యంలోను, దళిత సాహిత్యమంలోను పాటకే ప్రథమ స్థానమున్నది. తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమంలో పాట దిక్కులు పిక్కటిల్లేలా మార్మోగింది. పాట ఎంత ప్రాచీనమో అంత నవీనమైనది కూడా. సంప్రదాయం, సమన్వయం, అభ్యుదయం, విప్లవం, దళిత వాదాల వంటి వాటినెన్నిటినో ఇముడ్చుకున్న గొప్ప కవితారూపం పాట.

తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం హుస్నాబాద్ లో విద్యావంతుల వేదిక సభ పెట్టిన మలిదశ ఉద్యమ కాలం. ఆ సమావేశానికి తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ వేదికపై గాజోజు నాగభూషణం గానభూషణుడైనాడు. “తల్లడిల్లుతున్నది నా తల్లి తెలంగాణా/ఘొల్లుమంటున్నది ప్రతి పల్లె టిఖానా/కోటి రతనాల వీణ నాటి తెలంగాణ/తీగ తెగిన హృదయ వీణ నేటి తెలంగాణ… ఈనాటి తెలంగాణ/రెక్కాడితే డొక్కాడని బక్క రైతులిక్కడ/పచ్చళ్ళతో పుట్ల డబ్బు దండు బాబులక్కడ/తరతరాల అణచివేత భరిస్తున్నరిక్కడ/అధికార మదాంధకార దగాకోరులక్కడ” ఆంధ్రా తెలంగాణకు ఉన్న వ్యత్యాసాన్ని ఈ పాటలో తులనాత్మకంగా చెప్పాడు. వలసాధిపత్యాన్ని నిరసిస్తూ, సహేతుకంగా గొంతు విప్పాడు. దోపిడీని కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఇక ముఖ్య అతిథి వంతు వచ్చింది. గాజోజు నోట వచ్చిన పాటతోనే జయశంకర్ ఉపన్యాసాన్ని మొదలుపెట్టాడు. తెలంగాణ గోసను గాజోజు పాట రూపంలో ఎంత ఆర్ద్రంగా కైగట్టిండో ఈ సంఘటనే తేటతెల్లం చేస్తున్నది. ఆయన ఉద్యమ మనస్తత్త్వాన్ని బోధపరుస్తున్నది. తెలంగాణ భాష, తెలంగాణ సాహిత్యం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చరిత్రల పునర్వికాసం కోసం పనిచేయాలన్న సంకల్పాన్ని ఎరుకపరుస్తున్నది. తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల అవకతవకలపై స్పందించడం, వనరుల విధ్వంసాన్ని ఎదుర్కోవడం, తెలంగాణ సమకాలీన సమస్యలపై పోరాడడం, ఆ సమస్యల పరిష్కారం కోసం ఆనాటి నుంచి ఈనాటి దాక అలుపెరుగని కలం యోధునిగా నిలబడుతునే ఉన్నాడు. కలబడుతూనే ఉన్నాడు. ఉద్యమకారులను కూడగడుతూ, స్ఫూర్తిని నింపుతునూ ఉన్నాడు.

ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ ఉద్యమం ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. విద్యార్థులు నెత్తుటి మడుగుల్లో ఎత్తిన పిడికిళ్ళను చూసిన లోకం కంటతడిపెట్టింది. నిర్బంధాలకు కలవరపడింది. ఉద్యమకారులు నేల రాలినప్పుడల్లా!అమరవీరుల స్థూపాల వద్దనో, కాగడాలతో ఊరేగింపుల్లోనో, కొవ్వొత్తులతో నివాళులర్పించేకాడనో, వేదికల మీదనో… “వీరులారా వందనం! విద్యార్థి అమరులారా వందనం! పాదాలకు/మా త్యాగధనులారా మరచీపోమూ మేమూ/గుండెల్లో గుడి కడుతం పోరూ దండం బెడుతం” పిల్లల బలిదానాల వలపోతలకు కన్నీరు కాలువలై పారింది. అదే సందర్భంలో నాగభూషణం పాటలతో ఊరట చెందేవాళ్ళం. మరలా ఉత్సాహాన్ని నింపుకునే వాళ్ళం. సభలూ సమావేశాల కోసం సాగిపోయే వాళ్ళం. ఆయనతో గొంతు కలిపే వాళ్ళం. ప్రజా పోరాటంలో అసువులు బాసిన అమరులను తలుసుకుంటే రోమరోమం నిక్కబొడిచేది. “నెత్తుటి త్యాగాల రుణం తీర్చుకుందమా/కత్తుల వంతెనలు దాటి కదలిపోదమా/కణకణ మండే నిప్పు కణికలవుదమా/తెలంగాణ వచ్చేదాక తెగించి కొట్లాడుదమా” తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన అనేక పాటల్లో ఈ పాట కరీంనగర్ గడ్డ మీద, గాజోజు కలం నుంచి జాలువారడం గర్వకారణం. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాడుతూ ఉంటే వెనకాల మిగతా రచయితలం వంత పాడడం గొప్ప అనుభూతి.

పిల్లలు పిట్టల్లారాలిపోయారు. తెలంగాణలోని సబ్బండ వర్ణాలు నిలువెత్తు త్యాగాలు చేశాయి. కవులు, రచయితలు, కళాకారులు, మేథావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వృత్తికారులు, సబ్బండ కులాలు అందరూ ఏకత్రాటిపై నడిచారు. సకల జనులు ప్రత్యేక రాష్ట్రం కోసం పాటుపడ్డారు. విద్యార్థి అమరుల త్యాగాలను తలచుకుంటూ, వాళ్ల బలిదానానికి నివాళులు అర్పిస్తూ, అనేక స్మృతి గీతాలు వచ్చాయి. “జోహారులు జోహారులు/అమరులకు జోహార్ వీరులకు జోహార్/మావుళ్ళ రేవుల్ల మట్టి పొత్తిళ్లల్ల/తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు” అంటూ సిధారెడ్డి శిగమూగితే… “ఎందుకు రాలిపోతరు, మీరెందుకు కూలిపోతరు” అని మిత్ర మనోనిబ్బరాన్ని నింపారు. ఇంకా అనేక నివాళి గీతాలు తెలంగాణ నేలన కన్నీళ్లను జూలు వారించాయి. బతుకాల్సిన యువతరం అర్ధాంతరంగా బతుకు చాలించిన తీరుకు కంటనీరు పెట్టని వారెవరుండరు. ఉద్యమకారులు బెదిరిపోవద్దు, చెదిరిపోవద్దు, చనిపోవద్దని, సాధించుకున్న తెలంగాణలో పిల్లలందరూ ఉండాలంటూ, గాజోజు గళం మేలుకొలుపు పాడింది. “నూనూగు మీసాల లేలేత వయస్సు బిడ్డలారో/విలువైన ప్రాణాల నిలువెత్తు త్యాగాలు ఎందుకయ్యో/కన్నవారికి కడుపు కోతలు వద్దురయ్యో/కదనాన మీరు ఎదురొడ్డి నిలిచితే ముద్దురయ్యో/….చందమామ లాంటి మోములు/చుక్కలంటి చిరు నవ్వులు/కళ్ళల్లో సూర్యుని కాంతులు/మీరు కదిలేటి చైతన్య దీప్తులు/కోటి ఆశల బ్రతుకు వీడి బిడ్డలారో/కాటికేగుట న్యాయమా చిట్టి తండ్రులారా” అని ఉద్బోధించారు. తెలంగాణ రాదేమోననే భయంతో, బెంగతో, నిరాశా నిస్పృహలతో చనిపోతున్నా, చనిపోవడానికి సిద్ధపడుతున్న పిల్లల్లో మనోస్థైర్యాన్ని నింపిన ప్రబోధ గీతం. ఉద్యమకారులు సాధించవలసిన లక్ష్యాన్ని గుర్తు చేసిన గేయం. తెలంగాణ ప్రజలందరి హృదయాలను పిండి చేసిన పాట. కంటతడి పెట్టించిన పాట. ఈ పాటకు ఆచార్య గోపి, అందెశ్రీ, నలిమెల వంటి వారెందరో చలించిపోయిన సందర్భాలు.

తెలంగాణ మూడు దశల ప్రజా పోరాటాలకు గవాయి. తెలంగాణ మలిదశ ఉద్యమానికి సిపాయి, తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర సాక్షాత్కారాన్ని కళ్ళారా చూడకుండానే కనుమూయడం పెను విషాదం. 2011జూన్21న తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కాంతిపుంజం కనుమరుగవడంతో ఉద్యమకారుల్లో తీవ్ర అలజడి రేగింది. “తెలంగాణ చెరువు తీరు/మన జయశంకరు సారు/అలుగుదుంకి పారు పదునైన మాట జోరు/పాలువోసుకున్న పజ్జొన్నకంకులల్ల/పైకి పైకి ఎగిరే ఆ పాలపిట్టలల్ల” అంటూ దేశపతి వలపోసిండు. తల్లడిల్లిన గాజోజు కవి హృదయం జయశంకరుని అంతిమ యాత్రలో… “మాటమూగబోయింది నేడూ/పోరుబాట సడలి తడబడింది చూడూ/తెలంగాణ తల్లి పొగిలి తల్లడిల్లెనా/పల్లెపల్లెలో శోకం వెల్లువెత్తెనా…” పోటెత్తిన శోకసంద్రాన్ని ఆవిష్కరించాడు. స్వయం పాలన కోసం కొట్లాడిన పెద్దకొడుకు నేలరాలడాన్ని తల్లి తెలంగాణ జీర్ణించుకోలేక కాకిశోకం తీసింది. తెలంగాణ నేల స్వేచ్ఛా వాయువులు పీల్చేదాక, తెలంగాణ బిడ్డలు పాలపిట్టలై ఆకాశంలో ఎగిరేదాకా తన ముద్దుబిడ్డడు వుండకపాయెనని, మాయిల్లమే నేలకూలిండని తల్లి తెలంగాణ పెట్టిన తలపోతకు శత్రువులు సైతం కంటతడి పెట్టారు. దోపిడీదారులూ గడగడ వణికిపోయారు. తెలంగాణలో ఉద్యమమేదైనా, జనులందరిని గూడేసింది పాట. తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కింది పాట. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదింది పాట. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది పాట. ఇట్లాంటి పాటలనెన్నింటికో నాగభూషణం కలం పురుడు పోసింది. ఆయన గళం ప్రాణం పోసింది. ఉద్యమాన్ని ముందుకు నడిపించింది.

పాల్కురికి సోమన్న, బమ్మెర పోతన్నల కాలం నుండి తెలంగాణ నేలలో ధిక్కార కవుల పరంపర కొనసాగుతున్నది. ఈ వారసత్వంలో నుంచి గాజోజు నాగభూషణం సెప్టెంబరు 16, 1964న జగిత్యాలలో జన్మించాడు. మూడు నాలుగేళ్ల వయసప్పుడే ఆయన తండ్రి అనారోగ్యంతో మరణించారు. కుటుంబ భారమంతా తల్లి లక్ష్మీబాయి మీదనే పడింది. అక్క శ్యామల, అన్న శివకుమార్, చెల్లె సరోజ, భూషణం తోబుట్టువులు. తండ్రి బ్రహ్మయ్య ఉపాధ్యాయుడు, గాయకుడు, కళాకారుడు, నాటికలు, బుర్రకథలు, బాలగేయాలు రాశాడు. వాటిని పిల్లల చేత ప్రదర్శింపజేశాడు. పలువురి ప్రశంసలందుకున్నాడు. నాగభూషణుడికి తండ్రి నుంచే గానకళ వారసత్వంగా వచ్చిందేమో. చిన్నప్పుడే గాజోజు గాయకుడిగా ఏ దారిన నడవాలో ఆ దారినే ఎంచుకున్నాడు. వ్యాపార ధోరణిని అసలే దరిచేరనివ్వలేదు. పాట ప్రజలపక్షం ఉండాలనే భావనకు కట్టుబడినవాడు. పాట ప్రజల కన్నీళ్లను తుడవాలనే స్పష్టత కలవాడు. చిన్నతనంలోనే గాజోజు భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకు ఆకర్షితుడైనాడు.  పాట ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతుందని నమ్మినాడు. ప్రజలను చైతన్య పరచే పనిముట్టుగా పాటను వాడుకున్నాడు. అమరత్వాన్ని కీర్తించిన ప్రజా వాగ్గేయకారుడు గాజోజు. నాగభూషణం డిసెంబరు 17, 1996లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియామకమైనారు. ప్రధానోపాధ్యాయుడిగా 2010లో పదోన్నతి పొందారు. ఆయన సతీమణి శోభారాణి గెజిటెడ్ హెడ్మాస్టర్ గా రాణించారు. కొడుకు అక్షయ్ కపిల్ ను ఇంజనీర్, కూతురు ప్రత్యూషను డాక్టరు చేశారు. కుటుంబ విజయాల పట్ల తృప్తిని పొందినా, సమాజంలోని అంతరాల వల్ల అసంతృప్తుడుగానే మిగిలాడు. పోరు దారిలో నడిచాడు. సమాజానికి మేలుకొలుపును పాడాడు. గాజోజు ప్రవృత్తి రీత్యా పాటగానిగా రాణించాడు. ఇప్పటికీ ఆయనలో నడిచివచ్చిన తొవ్వను మరువని మంకుతనం ఉంటుంది. బాల్యంలో రూపుదిద్దుతున్న భావజాలం, జీవిత పర్యంతం కొనసాగుతుందనడానికి గాజోజు నాగభూషణం జీవితాన్నే నిదర్శనంగా చూపించవచ్చు.

ఈతాకేసి తాటాకు దొబ్బే సీమాంధ్రుల రాకడతో తెలంగాణలో ఉడుముజొచ్చినట్టే అయింది. ఆధిపత్య పాలనలో “అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుని నోట్లో శనివున్నట్లు” అన్న చందంగా మారింది తెలంగాణ పరిస్థితి. సహజ వనరుల దోపిడీ మూలంగా తెలంగాణలో తరచూ కరువులు సంభవించాయి. ప్రజలు ఉపాధిని కోల్పోయారు. తెలంగాణకు వలసలే దిక్కైనాయి. అణిచివేతలను భరించలేక, నిర్బంధాలను తట్టుకోలేక, పుట్టిన చోటనే బతుకలేక తెలంగాణ పల్లెలు బొగ్గుబాయి, బొంబాయి, దుబాయికి వలస పోయినయి. ఇల్లును విడిచి సంపాదించడానికి వలసబోయిన కుటుంబ యజమాని ఆకస్మిక మరణం చెందితే; దాని ప్రభావం కుటుంబంలోని మహిళలపైన పిల్లలపైన తీవ్రంగా పడింది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక గల్ఫ్ బాధితుల గ్రామంగా రుద్రంగి అవతరించింది. అక్కడి బాధిత కుటుంబాల అధ్యయన కోసం తెరవే యాత్రను చేట్టింది. పరాయి దేశానికి వెళ్లిన వాళ్లు వెళ్లినట్టే, మళ్లీ తిరిగి రాని దుస్థితి దాపురించింది. ఏ ఇంటి తలుపు తట్టినా కన్నీరు వరదలై పారింది. బాధిత కుటుంబాల దీన గాథలకు కవిగా కదిలిపోయిన నాగభూషణం రాసిన పాట “మస్కట్ మనకొద్దు/దుబాయి వోవద్దు/కలిసుండే మనము కలోగంజో తాగుదము/కష్టాలు సుఖాలైన కలిసె పంచుకుందాము” అంటూ బాధితుల పక్షం నిలిచాడు. వలసలు వద్దని నినదించాడు. దుబాయి వలస బాధితుల యెతల తడియారని గాథలను పాటలో చెప్పాడు. మానవత్వం కన్నీటి పర్యంతమయ్యే దుస్థితిని కళ్లకు కట్టాడు. ఉన్నంతలోనే సర్దుకొని, కుటుంబమంతా కలిసి మెలిసి బతుకాలని ఉపదేశించాడు. ఇట్లా ఆర్తిని కురిపించిన కలం, గళం గాజోజు సొంతం. ఇలాంటి సందేశాత్మకమైన, సామాజికోపయోగమైన ఎన్నో పాటలు రాసిన లయకారుడు భూషణం.

తొలి తెలుగు కందపద్య శాసనాన్ని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని బొమ్మలమ్మ గుట్టపైన జినవల్లభుడు తెలుగు, కన్నడం, సంస్కృతంలో చెక్కించాడు. తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి ప్రధానమైన ఆధారాల్లో ఇదొకది. ఇంతటి చారిత్రక నేపథ్యమున్న బొమ్మలమ్మగుట్టను, ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం గ్రానైట్ క్వారీ కాంట్రాక్టర్ కు ధారాదత్తం చేసింది. అపుడు ఈ శాసనాన్ని రక్షించడానికి ప్రజా సంఘాలు కదం తొక్కినాయి. తెలంగాణ రచయిన వేదిక, బొమ్మలమ్మ గుట్ట పరిరక్షణ సమితి కలిసి ఉద్యమించాయి. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాల తీవ్రతకు తలొగ్గింది. ఆ కాంట్రాక్టును రద్దు చేసింది. ఆ పోరాట సందర్భంలో వనరుల విధ్వంసాన్ని నిరసిస్తూ, గాజోజు రాసిన పాట “కొండలెవడివిరా/ఈ బండ లెవడివిరా/చెట్టు చేమా అడవి సంపద హక్కులెవడివిరా” అని గట్టిగా గద్దిస్తూ, ధిక్కార స్వరాన్ని వినిపించాడు. స్వార్థ పాలకుల సంకుచితత్వాన్ని ప్రశ్నించాడు. ప్రకృతి ప్రసాదించిన సంపదను వ్యాపార వస్తువుగా మార్చడం, విదేశాలకు ఎగుమతి చేయడం హేయమైన చర్యగా నిరసించాడు. భావితరాలకు అందించాల్సింది బొందల గడ్డ తెలంగాణ కాదని నినదించాడు. కలమెత్తి పాటను కైగట్టి, గళమెత్తాడు. చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన కొండల్ని పిండి చేయడమేంటని ధిక్కరించాడు. భావితరాలకు ధ్వంసమైన చరిత్రను, విధ్వంసమైన ప్రకృతిని ఇవ్వకూడదని గర్జించాడు. తెలంగాణ ఉద్యమ కాలంలో, ప్రత్యేక రాష్ట్రంలోనూ గర్జించిన గళం గాజోజు భూషణం. ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం కవులు, కళాకారులు, రచయితలు, మేథావులను ఏకం చేసిన ఉద్యమ నాయకుడు గాజోజు.

ఏ వ్యక్తైనా తన మాతృభాషను గౌరవించాలి. అన్యభాషలను ఆదరించాలి. అమ్మ భాషను బాగా ప్రేమించాలి. అక్కున చేర్చుకోవాలి. “మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశం సర్వదా వందనీయాలు” అన్నారు మన పెద్దలు. ఎవరి తల్లిభాష వాళ్లకు ముద్దు. ఎవరి తల్లి భాషలో వాళ్ళ బతుకున్నది. అందుట్లనే వాళ్ల జీవితమున్నది. వాళ్ళ సంస్కృతున్నది. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. దినదినం ప్రపంచీకరణ ప్రభావం వల్ల మాతృభాషాభిమానం మంటగలుస్తున్నది. మాతృభాష మృతభాషగా మారుతున్నది. భాషను బతికించుకుంటేనే సంస్కృతి బతికి ఉంటది. సంస్కృతి మనగలిగితేనే మనిషికి అస్తిత్వం ఉంటది. భాషతోనే సాహిత్యం బతుకుతదని, మాతృభాష మాధుర్యాన్ని ఒలికిస్తూ భూషణం రాసిన పాట “అమ్మ కడుపులోన ఉండి విన్న భాషరా/నాన్న చేయి పట్టి నేర్చుకున్న భాషరా/పలుకు పలుకు తేనెలలుకు మధురభాషరా/బ్రతుకంతా పరిమళించు మాతృభాషరా” ఏ భాషా మాధ్యమంలో చదువుకున్నను కూడా మాతృభాషలోనే అర్థం చేసుకుంటారు. మాతృభాషా మాధ్యమాన్ని కనీసం ప్రాథమిక స్థాయి వరకన్నా కొనసాగించాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగంలో కూడా ఈ విషయాన్ని పొందుపరచుకున్నాం. కాని ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడమే బాధాకరం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ఏడు మండలాల భూభాగాన్ని ఆరమిచ్చినం. ఆదివాసీ జీవితాలను జడత బట్టినం. పోలవరంలో నిలువునా ముంచేసినం. పాపికొండల ప్రకృతి సౌందర్యాన్ని నీళ్ల పాలు చేసినం. అలనాటి పాలకుల ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని నిరసిస్తూ, నిర్వాసితుల మనోభావాలను తెలుసుకోవడానికి తెలంగాణ రచయితల వేదిక పాపికొండల అధ్యయన యాత్ర నిర్వహించింది. అపుడు గాజోజు “పాపికొండల నడుమ పారేటి గోదారి/ఒడిలోన పయనిస్తూ పాడుతా/తెలగాణ ఇమ్మని వేడుతా/మా తెలగాణ తెమ్మని పాడుతా” తెలంగాణ తెమ్మని గోదారి తల్లికి మొరపెట్టుకున్నాడు. గోదావరి నీళ్లను తన కన్నీళ్ళతో అభిషేకించాడు. తెలంగాణ ఆజాది కోసం ఈ కవి పడే ఆరాటం, ఈ గాయకుడు చేసిన పోరాటం కనబడుతుంది. ఇలాంటి పాటలను కొన్నింటిని కలిపి “నెత్తుటి గాయాలు” ఉద్యమ గేయాలు సిడి రూపంలో వెలువరించారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో షాయరీ ఏ ఇంక్విలాబ్ మగ్దుం మోహియొద్దీన్ రాసిన “ఏ జంగ్ హై జంగ్ ఆజాది” లాంటి పాటలను తలపించే రీతిలో గాజోజు నాగభూషణం తన పాటల సృజన చేశాడు. కవి గాయకుడిగా తెలంగాణ మలిదశ పోరాటానికి ఊతమిచ్చాడు.

జీవితాన్నంతటిని జనం కోసం ధారబోసిన ప్రజా గాయకుడు అరుణోదయ రామారావు. కళ కళ కోసం కాదు. జనం కోసమన్న నానుడిని నిజం చేసిన ప్రజావాగ్గేయకారుడు నేలరాలినప్పుడు గాజోజు స్మృతి గీతమైనాడు. రామన్న తాడిత పీడిత జనం గుండెల్లో కొలువైన గాయకుడు. కాసుల వర్షం కురిపించడానికి పాటను వాడుకోలేదు. దీనజనులను మేలుకొల్పడానికి పాట పాడుకున్నాడు. మట్టి పరిమళాలను వెదజల్లిన ఉద్యమకారుడు. మట్టి మనుషులకు ఆసరాగా నిలుచున్న గేయకుడు. పాటకు ప్రాణం పోసిన గాయకుడు. అరుణోదయ రామన్న పోరుతారగా నింగికెగిసినప్పుడు, ఆయనను తలచుకుంటూ, పాట ఏడ్చిందని గాజోజు పాటై ఏడ్చాడు. “పాట ఏడ్చిందీ రామన్న ఏడని పాట ఏడ్చిందీ/ప్రతీపల్లె ప్రతీ ఇల్లు పారెవాగు ఊగె చేలు/రగిలిరగిలి పొగిలిపొగిలి ఘొల్లుమన్నాయా/ఘొల్లు ఘొల్లుమన్నాయా/పీడితుల పిడికిళ్ళు జేసి/దీన జనులకు దారి జూపి/గొంతులేని వాళ్ల గొంతై/గరీబుల గళ గర్జనై/పోరుదారిలో ప్రజల నడిపాడా/ఆ దారిలోనే నేలకొరిగాడా…” బీద బిక్కి జనం కోసం పాటను ఆయుధంగా మలుచుకొని, పోరాటం చేసిన యోధుడు రామన్నకు అక్షరాంజలి ఘటించింది గాజోజు పాట. విప్లవ గాయకుని త్యాగాలను తలపోసిందీ పాట. ఇట్లా పీడిత బతుకుల పక్షం వహించిన అమర గాయకులను కీర్తించిన వసదాగిన పాటల పిట్ట గాజోజు నాగభూషణం.

పునాదిరాళ్లు ఎప్పుడూ భవన సౌందర్యాన్ని చూడలేవంటారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సౌధాన్ని వెలుగు జిలుగులతో నిర్మించుకుంటున్నం, కానీ ఆ భవనం పునాదిలో  నిక్షిప్తమైన, నిగూఢమైన త్యాగాలను స్మరించుకోకపోవడం బాధాకరం. తెలంగాణ మలిదశ పోరాటానికి పురుడు పోసిన మారోజు వీరన్న, బెల్లి లలితక్క తదితరులు, తెలంగాణ జనసభ, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నిర్వహించిన పాత్ర అనిర్వచనీయమైనది. ఆనాటి వలసాధిపత్యాన్ని ఎదిరించిన పునాదిరాళ్లను ఇప్పుడు మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, బెల్లి లలిత అమరత్వాన్ని కీర్తించింది గాజోజు కలం. ఆమె త్యాగాన్ని తలచుకుని వలపోసింది గాజోజు గళం. ఆమె ఆశయాన్ని తలకెత్తుకున్నది ఆయన పాట. సీమాంధ్ర ఆధిపత్యాన్ని ప్రశ్నించిన వాళ్లందరిని అంతమొందించిన ఆటవికం. తెలంగాణ వనరుల నిలువు దోపిడీని ధిక్కరించిన పౌరహక్కుల నాయకులను, పాత్రికేయులను రోడ్లమీదనే ముక్కలు చేసిన కిరాయి హంతక మూకలు. ప్రశ్నించిన గొంతుకలనుత్తరించిన పాడు కాలం. కోయిలమ్మ దేహాన్ని పదిహేడు ముక్కలు చేసిన పాపాత్ములు. ఇది, భాషొక్కటని వచ్చినవాళ్ళ నీచపు పాలన! ఎంతటి అణచివేత! ఎంతటి ఆధిపత్యం! ఎంతటి దురహంకారం! ఎంతటి దురభిమానం. ఇంకా చెప్పనలవి గాని పాపాల పుట్టలు. ప్రపంచీకరణ కంటే ఆంధ్రీకరణమే తెలంగాణ సమాజాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఎంతో మంది తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకున్నదని అంటూ… “పాటే ప్రాణమైన చెల్లిరా/దేహం పదిహేడు ముక్కలైన తల్లిరా/ఉద్యమాలలో విరిసిన ఎర్రెర్రని మల్లెరా/తెలంగాణ తల్లి సిగలో విరిసిన జాబిల్లిరా” అని గాజోజు కలం వలపోసింది. సీమాంధ్ర వలస పెత్తనాన్ని ఎదిరించిన బెల్లి లలితను పదిహేడు ముక్కలు చేయడాన్ని ధిక్కరించింది. ఒక్కొక్క ముక్కను ఒక్కొక్క చోట పడవేసిన వలసాంధ్ర పెత్తనం, ఇక్కడి బతుకులను ఎలా ఛిన్నాభిన్నం చేసిందో కళ్ళకు కట్టిందీ పాట.

గాజోజు రాసి, పాడిన ఏ పాటను తడిమినా, పాటలోని ప్రతి అక్షరం సామాన్య జనం పక్షమే. ప్రతి పదం తెలంగాణ పల్లె బతుకు గానమే. నిండుగా తెలంగాణ గోసను తలపోసిన పాటలే. ఆయన ఏది రాసినా, ఏది పాడినా తెలంగాణ సమాజం కోసమే. జయశంకర్ సార్ చెప్పినట్టుగా తెలంగాణ స్వరాష్ట్ర ఫలాలు అన్ని వర్గాల వారికి అందించాలన్న ఆకాంక్షే. జయశంకర్ సారే ఈయన వేలు పట్టి నడిపిస్తున్నాడా అన్నట్టుగా గాజోజు నడత ఉంటున్నది. నల్లమల అడవుల్లోని చెంచులు అనారోగ్యం పాలైనప్పుడు, రచయితల బృందం సందర్శనకు వెళ్ళింది. యురేనియం నిక్షేపాల కోసం అన్వేషణ, తవ్వకాలు చేపట్టడానికి జాతీయ ప్రభుత్వం పూనుకున్నప్పుడు నల్లమల అల్లకల్లోలమైంది. ఆదివాసీ వ్యతిరేక విధానాలు, ప్రజాకవుల గుండెల్లో కల్లోలాన్ని రేపాయి. మానవ జీవితానికి మూలం అడవి. అరణ్యం నుంచే నాగరికతలు పురుడోసుకున్న సంగతి తెలిసిందే. అట్లాంటి అడవి తల్లిని ఇప్పుడు పొట్టన పెట్టుకునే ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలి. ఎప్పటికప్పుడు బుద్ధి జీవులుగా వాటిని ఎండగట్టాలి. చెంచుపెంటలను తరలించాలనే మల్టీనేషన్ కంపెనీల కుట్రలను, కుయత్నాలను తిప్పికొట్టాలిని కవి గాయకునిగా కలత చెందిన గాజోజు,  అడవి బిడ్డల కన్నీళ్లను కలంలోకి ఒంపుకున్నాడిలా… “తల్లీ ఓ నల్లమల మూగజీవుల కోవెల/గాయాలతో నీ తనువే విలవిలా/మరుభూమిగా నీ అడవే వెలవెల” అడవి తల్లిని ఆగం చేసే పన్నాగాలు. అడవి బిడ్డలను అంతమొందించే కుతంత్రాలు. నిలువెల్లా స్వార్థం నిండిన వ్యాపారస్తుడు, నిట్టనిలువునా అటవి తనువును చీల్చాలని చూస్తున్నాడు. చెంచు పెంటలను కూల్చాలని వస్తున్నాడు. అడవి బిడ్డలకు అక్షరాలు ఆసరాగా నిలవాల్సిన తరణమిది. కవులు, కళాకారులు, మేథావులు అమాయకులైన ఆదివాసీలకు అండగా నిలువాల్సిన బాధ్యతను చెబుతున్నది.

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు నిరాటంకంగా జరుగుతున్నప్పుడు తెరవే ఆధ్వర్యంలో కలాలు రైతు భరోసా గీతాన్ని ఆలపించాయి. అంతే కాకుండా జాతీయ ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక  నల్ల చట్టాలను చేసినప్పుడు హలాలకు కలాలు మద్దతు నిలిచాయి. రైతు వ్యతిరేక విధానాలను ధిక్కరించిన కవుల గుంపుకు నాయకుడు గాజోజు. భావసారుప్యం కలిగిన సాహిత్య సంస్థలు, ప్రజాసంఘాలను సమావేశపరిచి, ఉద్యమానికి సమాయత్తం చేసిన ఉద్యమశీలి నాగభూషణం. “ఏటికేతం బెట్టి/ఎయి పుట్లు పండించి/ఎన్నడూ మెతుకెరుగరన్నా/నేను గంజిలో మెతుకెరుగరన్నా” రైతుల కష్టాలు కళ్ళకు కట్టించిన జానపద గేయమిది. పొద్దస్తమానం శ్రమ చేసినా, బుక్కెడు బువ్వకు నోచుకోని రైతుల దుర్భర స్థితిని వివరించిన గేయం. అప్పుసప్పు చేసి ఆరుగాలం కష్టించినా, అన్నదాతలకు ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. ఆ రైతుల గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆ తరుణంలో ప్రజాకవి గాయకుడిగా గాజోజు “అన్నా ఓ రైతన్న/మా అన్నదాతవు నువ్వన్న/నువ్వు లేక మెతుకే లేదన్న/మా బతుకు బువ్వ నువ్వే కదన్నా” అని కర్షకుని కష్టాన్ని పాటకట్టించాడు. బురదలో నుంచి బువ్వను తీసే వ్యక్తి.  పళ్లెంలోకి తెల్లని మల్లె పువ్వుల్లాంటి మెతుకులను ధారవోసే శక్తి. అన్నదాతల రేయిబవళ్ల కష్టార్జితం వల్లనే అందరికీ ఐదు వేళ్ళు నోట్లోకి వెళుతున్నాయి. అట్లాంటి అన్నదాతలు నేడు “అన్నమో రామచంద్రా!” అని అఘోరిస్తున్నారు. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంతటి దైన్యస్థితిలో ఉన్న సైరికులకు అక్షరాలు సైనికులై ఆసరాగా నిలవాల్సిన అవసరమున్నది. ఎద్దేడ్సిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదంటారు. ప్రభుత్వాలు రైతులకి గిట్టుబాటు ధరను కల్పించాలి. కనీస మద్దతు ధరను చట్టబద్ధతం చేయాలి. అందాక కవి గాయక, మేథావులు విశ్రమించకూడదు.

17వ శతాబ్దంలో పదకవితా పితామహుడు అన్నమయ్య చూచించిన మార్గాన్ని నేటికీ అనుసరించకపోవడం అమానవీయమే కదా!. “బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే పర బ్రహ్మమొక్కటే/మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే/చండాలుడుండేటి సరిభూమి ఒకటే” అన్నాడు. కాలం కదిలిపోతున్నది. కానీ మనిషిలోనే మంచి మార్పు రావడం లేదు. ఆటవిక లక్షణాలను అందిపుచ్చుకొని మూఢత్వం పెరిగిపోతున్నది. ప్రేమ పక్షుల రెక్కలు విరుస్తున్న క్రౌర్యాన్ని కవిగా నాగభూషణం నిరసించాడు. గాయకునిగా గాజోజు గళమెత్తాడు. రోజు రోజుకీ కుల మతోన్మాదంతో పెట్రేగిపోతున్న మూఢత్వాన్ని ఎలా ధిక్కరించాడో ఈ పాటను పరిశీలిద్దాం. “పరువు పరువు అంటు ప్రాణాలు తీస్తున్న పాపాత్ముల పట్టి ఆపేది ఎవరు?/కులము మతము అంటూ మానవత్వాన్ని మంటగలిపే ఆట ఆగేది ఎపుడు?/నెత్తుటి మడుగుల్లో నేల రాలుతున్న కొత్త పావురాల జంటలు/కళ్ళు మూసుకున్న కాలము సోయి లేనిదీ సమాజము” కన్నవాళ్లే కసాయి వాళ్లై కన్న పేగులను కడతేరుస్తున్న ఆటవిక చర్యలను, అకృత్యాలను ప్రశ్నించాడు. తోబుట్టువులే మమకారాన్ని మానవత్వాన్ని మరిచి, పరువు హత్యలకు పాల్పడుతున్న దుర్మార్గాన్ని ఎండగట్టాడు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కాలరాస్తున్న కర్కషత్వాన్ని నిలదీశాడు. సమ సమాజ నిర్మాణానికి కుల మతాంతర వివాహాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చాడు. నాగభూషణం తన కొడుక్కి కులాంతర వివాహమే చేసి, ఆచరణవాదిగా నిలిచాడు.

ఆడమగల మధ్యన అంతరాలు లేని సమాజం కోసం, అంతులేని పోరాటాలు చేసి, అమితశక్తిని నిరూపించుకున్న అతివా లోకం కోసం, ఉవిద శక్తులకు మరింత ఊతమివ్వడానికి, కవి గాజోజు నాగభూషణం రాసిన కలిగితురాయిలాంటి మరోపాట “నువ్వే నువ్వే నువ్వే నువ్వే/నువ్వే నువ్వే నువ్వే నువ్వే/అంతటా నువ్వే అన్నిటా నువ్వే/అవని అంతా నువ్వే ఆకాశమంతా నువ్వే” ఈ జగతి నిండా నిండిన వెలుగులు, మానవ జీవితాల్లో చిందిన నవ్వులు మగువ ప్రసాదించినవే అంటాడు. ఆమెను సంసార నావను ఆవలి తీరం చేర్చే సరంగుతో పోల్చాడు. సకలాధిపత్యాలను తెంచేసిన సమరశీలిగా శ్లాఘించారు. కాని “యత్ర నార్యంతు పూజ్యంతే, తత్ర రమంతే సర్వదేవతాః” అనేది ఆర్యోక్తి. ఇది ఆచరణలో అధః పాతాళంలోనే ఎందుకు ఉండి పోయిందో బుద్ధి జీవులు ఆలోచించాలి.

“మరణం నా చివరి చరణం కాదు. మౌనం నా చితాభస్మం కాదు” అని ఎలుగెత్తి చాటిన అభ్యుదయ కవి అలిశెట్టి ప్రభాకర్. అలిశెట్టి వ్యక్తిత్వం, కవిత్వం, సామాజిక చింతనను అంతా ఈ పాటలో బంధించాడు గాజోజు. ప్రజాకవి ప్రభాకర్ ను ఆవాహన చేసుకున్న నాగభూషణం, ఆయనను భూమిపైకి మళ్లీ రావాలని ఎలా కోరుతున్నాడో చూద్దాం. “నీ కోసం చూస్తున్న, మళ్లీ నిను పిలుస్తున్న/జగిత్యాల జైత్రయాత్రలో ఎగిసిన పోరు కెరటమా/గాయపడిన జీవితాలను సేద తీర్చు కవిత్వమా” అంటూ… ఆకలి కేకల్లో మెరిసే ఆయుధమై రావాలని ఆకాంక్షించాడు. రాజముద్ర రక్షా కవచం రాబందుల రక్షిస్తుంటే; ఆయుధాన్ని అధ్యయనం చేసి, వీరుడితో కరచాలనం చేయడానికి, ప్రవహించే నెత్తుటి నది ఒడ్డున కదన శక్తులను కదిలించడానికి, ప్రభాకరుడు మరల ఉదయించాలని అభిలషించాడు కవి. ఇలాగే మహాకవి శ్రీశ్రీ స్మృతిలో కూడా ఒక గొప్ప గీతాన్ని రచించాడు గాజోజు. ప్రజా యుద్ధనౌక గద్దన్న మరణించినపుడు, ఆయన పార్థివ దేహాన్ని తెరవే సభ్యులతో దర్శించిన నాగభూషణం నివాళి గీతాన్ని ఆలపించాడు. “తూటాను తనువులోన మోసినా/ నువ్వు పాటమ్మ చేతిని విడువా లేదన్నా/నిర్బంధాలెన్ని చుట్టుముట్టినా/నిప్పుల ఉప్పెనవై ఉప్పొంగినావా” అంటూ, భూమికోసం, భుక్తి కోసం గజ్జెకట్టి గంతులేసిన ప్రజావాగ్గేయకారుడు గద్దన్న పోరాట జీవితాన్ని పాటలో బొమ్మ కట్టించాడు.

గాజోజు నాగభూషణం ఉద్యోగ విరమణాన్ని పురస్కరించుకొని, తన జీవితాన్ని యాజ్జేసుకుంటూ, పొగిలి పొగిలి దుఃఖిస్తూ, ప్రేరణదాయకమైన జీవన గీతం ఆలపించాడు. “ఎక్కడో పుట్టాను ఏ గాలికో పెరిగాను/పగల సెగల పాము పడగల నీడలో నేనెదిగాను/గాయపడిన జ్ఞాపకాలతో చివరి మజిలీ చేరాను/… నిత్యం నిప్పుల గుండాలలో అమ్మతో నేనడిచాను/నీతి లేని లోక రీతిని రోసి కసిగా ఎగిసాను/… మాటని నిలిపే బాటలోన కరిగి కాలిన అమ్మ జీవితం/అమ్మదీసిన శోకమే నాలో శ్లోకంగా పల్లవించి/వర్గ సంబంధం చూపిన మార్గం నా జీవన పథమై/నడిచిన ఆ నాలుగు అడుగులే నను వెలిగించిన దీపాలు/అలిశెట్టి అడుగుజాడలో అక్షరాల సాళ్లు వోసుకొని/అభ్యుదయపు విలువలే నా ప్రాణలయలని నమ్మి/అంతరాల జాడేలేని లోకాన్ని కలగంటూ/ఊపిరి ఉన్నంత దాకా ఉద్యమాల జెండౌతాను” ప్రతిజ్ఞ చేశాడు.తాను ఎన్నో సమస్యల సుడిగుండాలను దాటుకొని, ఎలా అగ్నిపూలు పూయించాడో, ఆ మార్గాన్ని ఈ పాటలో తేటతెల్లం చేశాడు. ప్రకృతికవి జయరాజు రాసిన ప్రేరణ గీతంలో ఎవరి జీవితాన్ని వారే ఎంతో అద్భుతంగా మలచుకోవచ్చంటాడు. “శిలా నీవే! శిల్పీ నీవే! శిల్పీ నీవే! సృష్ఠలోి/నిన్ను నువ్వు మలుచుకుంటు నిలిచిపో చరితలో/పుడమిలో అణువణువు నీదె పరవశిుంచుట నేర్చుకో/జీవితం ఇక మరలిరాదు సార్థకం చేసుకో!” ఈ గీతంలో గాజోజు నాగభూషణం జీవన గమననాన్ని చూడవచ్చు. తనకు తాను చక్కగా మలుచుకున్న జీవితం. ఎందరికో ప్రేరణగా నిలిచిన జీవితం. జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి, మార్గం చూపిన జీవనం.

కవి, రచయిత, గాయకుడు, ఉద్యమకారుడు, ఉపాధ్యాయుడు, బాలసాహితీ సృజనకారుడు, ఎన్నీల ముచ్చట్లు గుంపు సహచరుడు, పలు సంస్థలు ప్రజాసంఘాలతో కలిసి పని చేసిన సంయోజకుడు, తెరవే నాయకుడు, అన్నింటికీ మించి మంచి సోపతి గాజోజు నాగభూషణం. ఆయనది బాధితులకు బాసటాగా నిలబడాలనే తత్త్వం. సోపతులను ఆపతి సంపతికి ఆదుకోవాలనే మనస్తత్త్వం. మనసున్న మారాజు. ఆయనతో దోస్తానాకు వయసుతో నిమిత్తం లేదు. ఎవరికి ఆపద కలిగినా నేనున్నానంటూ, ముందు నిలబడే వ్యక్తిత్వం. మలిదశ తెలంగాణ ఉద్యమకాలం నుండి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాల్లో ఆయనతోనే కలిసి నడిచిన కొన్ని అనుభవాలను, జ్ఞాపకాలను ఈ వ్యాసంలో పొందుపరచే ప్రయత్నం చేశాను. ఆయన పాటలో అర్థశ్లేషలు, శబ్దశ్లేషలు, ధ్వని, వ్యంగ్యం, వ్యాజస్తుతి, స్తుతినింద అనే డొంక తిరుగుడు వ్యవహారాలు ఉండవు. ఆయన పాట సూటిగా శ్రోత గుండెను తాకుతుంది. ఆబాలగోపాలాన్ని అలరిస్తుంది. ప్రజా వ్యతిరేక పాలసీలను పసిగడుతుంది. బాధితులకు బాసటగా నిలబడుతుంది. ఇది ప్రజా సాహిత్యానికి ఉండే లక్షణం. ఇంక జన సాహిత్యం వెల్లివిరియాలని కోరుకుంటున్నాను. ఈ పాటలన్నింటినీ ఏర్చి, కూర్చి, ఒక పుస్తక రూపంలో చేర్చాలని, అలాగే దృశ్య శ్రవణ రూపాన్ని సంతరించుకోవాలని అశిస్తున్నాను.

ఉద్యోగ విరమణ శుభ సందర్భంగా గాజోజు నాగభూషణం గారికి హృదయ పూర్వకమైన శుభాకాంక్షలు. మీ శేష జీవితం తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక రంగాలను మరింత సంపద్వంతం చేస్తుందని విశ్వసిస్తున్నాను.

స్వగ్రామం మద్దికుంట, కరీంనగర్ జిల్లా. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ(తెలుగు సాహిత్యం). అచ్చయిన తొలి రచన: "మన జాతికే వెలుగంట(క‌విత‌). రచనా ప్రక్రియలు: పద్యం, వచన కవిత్వం , వ్యాసం, పాట, కథ, నానీలు. ముద్రితాలు: 1."మేలుకొలుపు"వచన కవితాసంపుటి, 2. చదువులమ్మ శతకం, 3.పల్లె నానీలు, 4."ఎర్రగాలు వచన కవిత్వం. 5."ఆరుద్ర పురుగు"వచన కవిత్వం. సంపాదకత్వం: 1."నల్లాలం పూలు(బడి పిల్లల కవిత్వం) 2."సోపతి" ఎన్నీల ముచ్చట్లు ఐదేండ్ల పండుగ. 3."ఎన్నీల ముచ్చట్లు"కవితా గాన సంకలనాలు -10. ప్ర‌స్తుతం తెలుగు భాషోపాధ్యాయుడిగా ప‌నిచేస్తున్నారు.

Leave a Reply