పల్లెల దుస్థితిని, ప్రపంచీకరణ ప్రభావాన్ని చిత్రించిన ఖండకావ్యం ‘పల్లెకన్నీరు పెడుతుందో’ గీతం

‘కవిని కదిలించడమంటే కాల౦ డొంకంతా కదిలించడమే’ అన్న మహకవి మాటలకు నిలువెత్తు కవితారూపం గోరటి వెంకన్న. వ్రాసిన ప్రతిపాటలోను సామాజికతను నింపుకుని కవితాత్మక తాత్త్విక వేదనను, జీవన సత్యాన్ని, ప్రకృతి ‌మార్మికతను వెదజల్లుతూ కాలం దారుల వెంట బైరాగిలా సంచరించే వాగ్గేయకారుడు వెంకన్న. మట్టిపొరలను సుతిమెత్తగా తొలగించుకుంటూ వచ్చే లేతమొక్కలా గోరటి పాట మొలకెత్తుతుంది. పల్లె పొత్తిళ్ళనుంచి ఎగిరొచ్చిన పసితనం అద్దుకున్న గోరటి పాట రాజ్యధిక్కారాన్ని నింపుకుని నల్లతుమ్మముల్లులా గుచ్చుకుంటుంది. తీవ్రమైన కరువుకు, వలసలకు నిలయమైన మహబూబ్ నగర్ జిల్లా తెలకపల్లి మండలం గౌరారం గ్రామంలో 1964 లో గోరటి వెంకన్న జన్మించాడు. నాన్న స్వరంలోని యక్షగాన పద్యసరళి, అలవోకగా అమ్మపాడిన మంగళహారతుల బాణీలు, చిన్నప్పటి పద్యనాటకాల లయరాగాలు, తాళగతులతో బాల్యంనుంచే పాటల ప్రవాహంలో ఈదులాడాడు. పల్లెతో విడదీయలేని గాఢానుబంధాన్ని ఏర్పరచుకున్నాడు. కాలం కరుగుతూ నగరం వైపు తరిమినా పల్లెమూలాలను మర్చిపోలేదు. చుక్కనీరు లేక ఎడారిగా మారిన చిన్నప్పటి దుందుభీ వాగును, శిథిలమవుతున్న తన గ్రామాన్ని చూసిన గోరటి గుండెల్లోంచి ఉప్పెనలా ఎగసిన దుఖ:గీతమే ‘పల్లె కన్నీరు పెడుతుందో’. కవి నివసించిన పల్లె కేంద్రంగా ఉద్భవించిన ఈ పాట ప్రతిపల్లె యధార్ధ దుస్థితికి నిదర్శనంగా నిలిచింది. తన గీత రచనాయానంలో ‘మ్యాగ్నం ఓపస్’ సాంగ్ గా అత్యంత ప్రజాదరణను పొందింది. పాటకు తనే కొత్త చిరునామా అయ్యాడు. కవికి శాశ్వతమైన కీర్తిని, ఉన్నతస్థాయిని అందించిన ఈ పాటలోని జీవన విధ్వంసాన్ని, ప్రపంచీకరణ ప్రభావాన్ని కవిలోని లోతైన, ఆవేదనను విందాం.

“పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
నా తల్లీ బందీ అయిపొతుందో కనిపించని కుట్రల” అనే

పల్లవిలోంచే గ్రామీణప్రాంతాలలోని విషాదమయ బతుకు చిత్రాన్ని దుఖ:స్వరంతో మనసు లోతుల్లోకి దిగిపోయేలా ఈ గేయం మొదలవుతుంది. ఇక అక్కడినుండి ఒక ప్రవాహ ఉధృతితో ఆగిపోని అలల చరణాలతో వృత్తికారుల బతుకు గోసను వినిపిస్తాడు కవి. ఊరుని ప్రధాన భూమికగా చేసుకుని ఊళ్లోని విభిన్న కులాల సంస్కృతిని, బతుకు పొరాటవెతలను కళ్ళముందు సాక్షాత్కరింపజేస్తుంది ఈ పాట. ఊరిలోని విభిన్న వృత్తికారుల సమూహనికి ప్రతీకగా ప్రాతినిథ్యం వహించేటట్లుగా ‘పల్లె కన్నీరు పెట్టడం’ అనే బలమైన అభివ్యక్తితో సుచించాడు. పల్లెను ‘తల్లి లాంటిదిగా’, ‘అమ్మ ఒడిలాగా’ భావించే గాఢానుబంధంలో వున్నవాళ్లం మనం. అటువంటి పల్లె ‘బందీ కావడానికి’, ‘కన్నీరు పెట్టడానికి’ వెనకవున్న కుట్రలను బట్టబయలు చేసిన శక్తివంతమైన గీతంగా ‘పల్లె కన్నీరు పెడుతుందో’ ప్రసిద్ధి పొందింది. అంతకు మించి కనిపించని కుట్రలలో ‘ప్రపంచీకరణ’ అనే ప్రధాన కుట్రను పసిగట్టి ప్రజలను హెచ్చరిస్తూ జాగృతం చేసింది ఈ గీతం.

ఈ పాట నేపథ్యం గురించి గోరటి వెంకన్న అనేక సంధర్భాలలో ఎన్నో విషయాలను వెల్లడించారు. పల్లె జీవనవైవిధ్యం, ప్రాకృతిక సౌందర్యం వెంకన్న పాటకు జీవనాడి. తను పుట్టిన ఊరు గౌరారం, చదువు సాగిన రఘుపతిపేట గ్రామాల్లోని వర్తమాన దృశ్యాల ఆధారంగా పాట పురుడు పోసుకుంది. తన ఆత్మీయ బాల్యమిత్రులతో ఏర్పడిన స్నేహ బంధాలు ఈ పాటకు ఊపిరిపోసాయి. ఊళ్లో ఉపాధికరువై బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చిన వారి మరణం కవి నవనాడులను కదిలించింది. నగర జీవితంలోని వ్యాపార ధోరణి, యాంత్రికత, కృత్రిమత్వం కవిని కల్లోలపరిచింది. దానికి తోడు తల్లిలాంటి పల్లెలో కాలుమోపితే కనిపించిన శిథిల దృశ్యాలు హృదయాన్ని బద్దలు చేసాయి. చిన్నప్పుడు ఈదులాడిన బావులు ఎండిపోయాయి. సప్తవర్ణాల దారాలతో రంగులద్దుకునే వీధులు తెల్లబోయాయి, మగ్గాల శాలలు కూలిపోయాయి. చిన్న చిన్న కులవృత్తులు, కుటీర పరిశ్రమలు కనుమరుగయ్యాయి. పట్టణాల సోకులు, నగరాల విషసంస్కృతి పల్లెలో వికృతంగా అలముకుంది. ప్రపంచీకరణ విషపు గాలులు ఇంతవేగంగా పల్లెల్ని ముంచెత్తడంతో కవి ఆత్మనాళాల్లోంచి ఈ పాట ఒక ఉప్పెనలా ఎగసివచ్చింది.

“కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను
కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను
పెద్దబాడిస మొద్దు బారినది
సాలెల మగ్గం సడుగులిరిగినవి.
చేతివృత్తుల చేతులిరిగిపాయే నా పల్లెల్లోనా
అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోనబాయే ఈ దేశం లోనా”…

భారతదేశం విభిన్న కులాలకు, మతాలకు, భాషలకు, సంప్రదాయాలకు నిలయం. దానికనుగుణంగానే పల్లె అనేక కులాలకు, ఉపకులాలకు, ఆశ్రితకులాలకు ఆవాసం. ప్రతి కులానికి ఒక వృత్తి ఉంటుంది. అదేవారికి జీవనోపాధిని అందిస్తుంది. వృత్తి పనుల ఆధారంగానే కులవ్యవస్థ రూపుదిద్దుకుంది. ఆయా వృత్తిద్వారా ఆర్ధికంగా ఎదిగిన కులాలు, ఆధిపత్యాలు, అధికారాలు అందిపుచ్చుకున్నాయి. కొన్ని కులాలు ఆర్ధికంగా బలోపేతం అయ్యాయి. మరికొన్ని కులాలు అధికారంతో అగ్రకులాలుగా చలామణిలోకివచ్చాయి. పల్లెల్లో కలలుగన్న గ్రామ స్వరాజ్యం కనుమరుగవుతున్న సందర్భ౦లో ఈగీతం సమస్త వృత్తుల సమకాలీన దుస్థితులను శక్తివంతంగా దృశ్యమానం చేస్తుంది. వాటిలో కొన్ని దృశ్యాలను పరామర్శిద్దా౦.

మట్టికుండలు చేసె కుమ్మరివాము, వ్యవసాయానికి గృహవసరాలకు పనికొచ్చే కుమ్మరి కొలిమి ఆరిపొయింది. నాగల్లు, ఎడ్లబండ్లు, ఇంటినిర్మాణాలు చేసే వడ్రంగుల పెద్దబాడిస పనిలేక మొద్దుబారిపొయింది. చేనేతకార్మికులకు పనిలేక సరైన ధర, గిరాకి లేక మగ్గాలు మూలబడ్డాయి. చాకలి ఉపాధిలేక కనుమరుగయ్యాడు. రెడిమెడ్ ఫ్యాషన్ దుస్తుల వల్ల మేరోళ్ల కత్తెర సిలుమెక్కిపోయింది. చైన్నై, బొంబాయి మిషన్ నగలొచ్చి కంసాలి జీవితం వన్నెతగ్గింది. ఫర్నిచరు పనులకోసం పట్నాలకు వలసెళ్లిపోయారు. మాదిగలొద్ది, మేదరిడప్పు, పూసలోళ్లు, దాసరివాళ్లు, యాచకులు, బుడగజంగాలు మొదలైన బహుజనుల వృత్తులు, సబ్బండవర్ణాల బతుకులు ఎంతగా చితికిపోయాయే విషాదకరంగా ఆలపిస్తాడు గోరటివెంకన్న.

ఈపాటలో వృత్తులు, బతుకులే కాదు ప్రకృతి వనరులు, పర్యావరణమూ దోపిడికి గురయింది, దారుణంగా ధ్వంసమయింది అని కవి వాపోతాడు. ప్రకృతిలోని సంపదను, సహజవనరులను కొన్ని అధికారశక్తులు తమకనుగుణంగా ఎలా మలచుకున్నాయో వివరిస్తాడు కవి.

“మడుగులన్ని అడుగంటి పోయినవి
బావులు సావుకు దగ్గరయ్యినవి
వాగులు వంకలు ఎండిపోయినవి
చాకలి పొయ్యిలు కూలిపోయినవి
పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసీన దొరలది
మరి పేద రైతుల బావులెందుకెండే నా పల్లెల్లోనా”…

మడుగులు, బావులు, వాగులు అడుగంటిపోవడానికి, ఎండిపోవడానికి ప్రకృతిగతమైన కారణాలున్నాయి. దాంతోపాటు గ్రామాల్లోని పరిస్థితులను మార్చడానికి అవకాశముండే స్థానిక పాలనాధికారుల స్వార్ధం, అవినీతి వల్ల కూడా ఈ దుస్థితి దాపురించింది. గ్రామాలలో ఉండే రాజకీయ విభేదాలు కూడా ప్రజల సంక్షోభానికి మరో బలమైన కారణమని చెప్పవచ్చు. గోరటివెంకన్న ఈపాటలోని చరణాలను కాలక్రమానుసారంగా వచ్చిన పరిణామాలకు అనుగుణంగా తన అభిప్రాయాలను, భావవ్యక్తీకరణ మార్చుకుంటూ వచ్చాడు. నిరుపేద రైతుకూలీ బాధలను, భూమి ఉండికూడా కడుపు నింపుకోలేని రైతు నిస్సహాయత, నీళ్లులేక సాగుబడిలేని భూస్వాముల స్థితిగతులను చూసాడు. అందుకే ‘బలిసినదొరలది’ ‘సిరులున్నాదొరలది’ అనే పదాలను తొలగించి ‘పొద్దంతాపనిచేసే పెద్దబోరుకూడా ఎండిపోయిందని’ అని చరణ౦లో మార్పులు చేసాడు.

“పరకచేపలకు గాలాలేసే తురకల పోరలు యాడికి పోయిరి
లారీలల్ల క్లీనర్లయ్యిరా, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా
తల్లీ దూదు సేమియాకు దూరమయ్యినారా సాయిబుల పోరలు
ఆ బేకరి కేఫులో ఆకలితీరిందా ఆ పట్టణాలలో”

ఈపాటలో కవి బాల్య జీవన అనుభవాలు నిక్షిప్తమైవున్నాయి. అనుక్షణం బాల్యంలోని ఙ్ఞాపకాలు బరువెక్కుతూ కవిహృదయాన్ని కలతపరుస్తాయి. కాలంకరుగుతున్న కొద్దీ అనేకానేక విషయాలు ఒక చైతన్యస్రవంతిలా తనను చుట్టుముట్టినాయి. చెరువుల్లో పరక చేపల్నిపట్టుకున్న అనుభవంతో ముడిపడిన బాల్యస్నేహితులు గుర్తుకువస్తారు. ఆ సాయిబు మిత్రులు నేడు ఎంత దుర్భరంగా బతుకుపోరాటం చేస్తున్నారో కదా అని అంతర్లీనంగా దుఖ:పుమడుగులోకి దూకుతాడు. ఈ సోపతిగాళ్ల తలంపుతోనే ఆగిపోడు కవి. చిన్నప్పటి నుండి తనను ప్రభావితంచేసిన వాయిద్యాలు, కళలు, సాంస్కృతిక విశేషాల వైభవాన్ని తలచుకుంటూ జీరస్వరంతో సన్నటి దుఖ:పుతీగై మనలో వేదనల్ని పలికిస్తాడు. ‘పాతరేయబడిన మేదరిడప్పు’, ‘నిండమునిగిన తొండంబొక్కెన’, గుడ్డిదాసరిపూసలోళ్లు, చెదలుపట్టిన హార్మోనియంపెట్టె, యక్షగానము నేర్పేపంతులు, యాచకులు, బుడెగజంగాలు, హరిశ్చంద్ర పద్యనాటకాలు, రచ్చబండ సుద్దులు, బతుకమ్మ కోలాటపాటలు, భజనకీర్తనలు, భైరాగి కిన్నెర తత్త్వాలు మొదలైనవన్నింటిని తలచుకుంటాడు. గోరటి వెంకన్న తలచుకుంటున్నవన్నీ వారివొక్కరివేకాదు. కవి ఙ్ఞాపకాల తలపోతలన్ని సాముహికమైనవి. పల్లెగర్భంలోంచి మొలకెత్తిన ప్రతిమనిషి అనుభూతి స్పందనలకు ప్రతీకగా భావించవచ్చు. నాగరికత పేరుతో మనజీవన వ్యవహారశైలిలో వస్తున్న మార్పులపై, మన మౌలిక మూలాలు కదిలిపోతున్న అనివార్యస్థితిని కూడ ఈ గీతంలో చూడవచ్చు.

ఈ పాటను మరొక బలమైన కోణంలోంచి కూడా అర్ధం చేసుకోవచ్చు. పాటలోని గ్రామీణ జీవన అవసరాలు, సాంస్కృతిక పరిణామాలు మానవ క్రమ వికాస చరిత్రల్లోంచి చూసినప్పుడు అవి సహజమైన పరిణామాలుగా అంగీకరిచవచ్చు. కాని తొంభయవ దశకంలో వచ్చిన ప్రపంచీకరణ విధానాలు, సరళీకృత ఆర్ధిక ప్రణాళికలు, సామ్రాజ్యవాద ధోరణుల ప్రభావం ఒక్కసారిగా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. అభివృద్ధి పేరుతో అన్ని వ్యవస్థలు పెను మార్పులకులోనయ్యాయి. పల్లెలో జరిగిన విధ్వంసం వర్ణించలేనిది. మనుషులే కాదు పల్లెలన్నీ మూటగట్టుకుని నగరాలకు వలసబాటపట్టినయి. మిగిలిన పల్లెలు కృత్రిమమైన నాగరికత ముసుగేసుకున్నాయి. సాంస్కృతిక పరాయికరణకు గురయ్యాయి. పల్లె ఆనవాళ్ళు వెతుక్కోవాల్సి వచ్చింది.

“ఈదులన్ని వట్టి మొద్దులయ్యినవి
ఈతకల్లు బంగారమయ్యినది
మందు కలిపిన కల్లును దాగిన
మంది కండ్ల నిండూసులయ్యినవి
చల్లని బీరు విస్కిలెవడు పంపే నా పల్లెల్లోకి
బుస్సున పొంగే పెప్సికోల వచ్చే నా పల్లెల్లోకి

……………

అరె స్టార్ టీవీ సకిలిస్తా ఉన్నదమ్మో నా పల్లెల్లోనా
సామ్రాజ్య వాద విషమెక్కుతున్నదమ్మో మెల్లంగా పల్లెకు

……………

అరె బహుళ జాతి కంపని మాయల్లోనా మా అన్నల్లారా
భారత పల్లెలు నలిగి పోయి కుమిలె ఓ అయ్యల్లారా”…

పై చరణాలతో ఈ పాట సామాజిక, రాజకీయ, ఆర్ధిక చైతన్యాన్ని నింపుకుని ఉన్నతమైన స్థాయిని అందుకుంది. సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా, ప్రపంచీకరణ విధానాలను ప్రతిఘటిస్తూ తీవ్రవిమర్శలతో ఆలోచనాత్మకతతో, అనుభూతి తీవ్రతతో కోట్లాది హృదయాలను కదిలించిన సంచలనాత్మక పాటగా స్థిరపడింది. ప్రపంచీకరణ విస్తరణలో నియంతృత్వంగా వ్యవహరించిన పాలకుల అధికారం కోల్పోయేలా ప్రభావాన్ని చూపించిన పాటగా స్థానం దక్కించుకుంది. స్థానిక మూలాల్లోంచి పుట్టిన ఈ పాట స్థానిక సామ్రాజ్యవాద శక్తుల నిర్మూలనలో ధిక్కార ప్రేరణ గీతంగా నిలబడింది.

ఇటీవల గోరటి వెంకన్న ప్రతిష్టత్మాకమైన “కబీర్ సమ్మాన్” జాతీయ పురస్కారాన్ని అందుకోబోతున్న సందర్భంగా ఈ పాట గురించి మాట్లాడుతూ “ఈ పాట నా ఆత్మ. ఇరవైనాలుగేళ్లక్రితం అది రాయకుంటే ఆత్మహత్యే శరణ్యం అనుకుంనేటంతటి దైన్యంలో ఎగసిన పలవరింత. గ్లోబలైజేషన్, సరళీకరణ, ఇవన్ని అర్ధమై రాసిందికాదు. సూచనప్రాయంగా వాటిగురించి అవగాహన ఉన్నా అది రాసినప్పుడు నా కళ్ళల్లో మెరిసిన నా ఊరు, నేను చదివిన రఘుపతిపేట, వెయ్యిమగ్గాల శిథిలత్వం, ప్రాణమిత్రుల ఎడబాటు, పరిసరాలల్లో ఆవరించిన ఎడారిదృశ్యం, ఏనాడూ నా ఊరిలో ఎవరితో ఇసుమెత్తు విభేదం లేని సామరస్యపూర్వక జీవితం, కష్టాలు, కన్నీళ్లు, ఆనందాలు, అనుబంధాలు కలబోసుకుని బ్రతికిన పల్లె యాదికొచ్చి అల్లుకొన్న పాట అది. ఉద్యోగ బదీలీలవల్ల ఊరికి దూరం కావల్సిన పరిస్థితుల వల్ల నాలో తన్నుకుని వచ్చిన గేయం అది. అనివార్యమని అనుకున్నా, ఆధిపత్యంతో లాభాపేక్ష సామ్రాజ్యవాదం విదిల్చిన ఇనుప రెక్కల వీరంగానికి అల్లాడిన పల్లె దృశ్యానికి పల్లవి కట్టాను. వృత్తులే కులానికి కారణమైతే ప్రపంచంలో అనేక దేశాలలో ఇలాంటి వృత్తులు చేసేవారియెడ వివక్షత లేదు. వృత్తిచితికింది. కులం అతికింది. ఇది భారతీయ సమాజతరాల ప్రత్యేక అమానుష్య విధానమే వివక్షగానీ, వృత్తులు చేయడం వల్లకాదు. వృత్తులున్న గ్రామాలకంటే వృత్తులు లేని నగరాలల్లో కులవివక్ష అధికమనేది ఏ దళితుణ్ణి అడిగిన చెప్తారు. అయినా గ్లోబలైజేషన్ వల్ల కొన్ని వృత్తులకు అధిక రాబడి కూడా వచ్చింది. భూస్వామ్య సంకెళ్ళను తెంచుకున్నాయి. దాన్ని అంగీకరించవచ్చు. ఇది అప్పటి నా అవగాహన.” అని తెలుపుతూ మరిన్ని ఆలోచనలు, చర్చలు చేయడానికి దారిని ఏర్పరిచినాడు. (ఆంధ్రజ్యోతి వివిధ – 16. 03. 2020- ఇంటర్వ్యూ -పసునూరి రవీందర్)

ఇంతటి చారిత్రక పరిణామాలను నింపుకున్న ఈ పాట 2002 లో డా. ఎల్. శ్రీనాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘కుబుస౦’ సినిమాలో కీలకమైన గీతంగా వినిపిస్తుంది. ఈ పాటలోని చివరి చరణాలు ఈ చిత్రంకోసం ప్రత్యేకంగా రాసినవి కావడం గమనార్హం. వృత్తులు కోల్పోయి, ఉపాధి కరువైనవారికోసం ప్రత్యామ్నాయం లేకపోవడాన్ని చూసి దు:ఖిస్తూ ప్రశ్నిస్తూ శాస్త్రవేత్తల్ని, బుద్ధి జీవుల్ని ఆలోచింపచేసిన గీతం. ప్రతిమనిషిని తన పల్లె ముంగిట్లోకి తీసుకెళ్లి మరచిపోయిన బాల్యాన్ని గుర్తుచేస్తూ పసివాడిగా మార్చిన ‘పల్లె కన్నీరు పెడుతుందో.’ ఒక వశీకరణ గీత౦.

పల్లె కన్నీరు పెడుతుందో…
-గోరటి వెంకన్న

పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల

కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను
కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను
పెద్దబాడిస మొద్దు బారినది
సాలెల మగ్గం సడుగులిరిగినవి.
చేతివృత్తుల చేతులిరిగిపాయే నా పల్లెల్లోనా
అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోనబాయే ఈ దేశం లోనా

మడుగులన్ని అడుగంటి పోయినవి
బావులు సావుకు దగ్గరయ్యినవి
వాగులు వంకలు ఎండిపోయినవి
చాకలి పొయ్యిలు కూలిపోయినవి
పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసీన దొరలది
మరి పేద రైతుల బావులెందుకెండే నా పల్లెల్లోనా

ఈదులన్ని వట్టి మొద్దులయ్యినవి
ఈతకల్లు బంగారమయ్యినది
మందుకలిపిన కల్లును దాగిన
మంది కండ్ల నిండూసులయ్యినవి
చల్లని బీరు విస్కిలెవడు పంపే నా పల్లెల్లోకి
బుస్సున పొంగే పెప్సికోల వచ్చే నా పల్లెల్లోకి

పరకచేపలకు గాలాలేసే తురకల పోరలు యాడికి పోయిరి
లారీలల్ల క్లీనర్లయ్యిరా, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా
తల్లీ దూదు సేమియాకు దూరమయ్యినారా సాయిబుల పోరలు
ఆ బేకరి కేఫులో ఆకలితీరిందా ఆ పట్టణాలలో

అరకల పనికి ఆకలిదీరక గడమనగలకు గాసమెల్లక
ఫర్నీచరు పనులెదుక్కుంటూ పట్నంపోయర విశ్వ కర్మలూ
ఆసామూలంతా కూసూనేటీ వడ్రంగుల వాకిలి
నేడు పొక్కిలి లేసి దు: ఖిస్తున్నదిరో నా పల్లెల్లోనా

మేరోళ్ళ చేతుల కత్తెర మూలపోయి సిలువెక్కిపోయినది
చుట్టుడురెక్కల బనీన్లు బోయినవి కోడెలాగులు జాడకేలేదు
రెడీమేడు ఫ్యాషన్ దుస్తులొచ్చెనంటా నా పల్లె పొలిమేరకు
ఆ కుట్టు మిషన్ల చప్పుడాగినాదా నా పల్లెల్లోనా

నానా కెంపుతెల్లలు జెల్లలు
పరులకు తెలియని మరుగు భాషతోబేరం జేసే
కంసలి వీధులు వన్నె తగ్గినవి చిన్నబోయినవి
చెన్నై బాంబె కంపని నగలొచ్చి మన స్వర్ణకారుల,
అరె చెర్నకోలలై తరుముతున్నయీరా మనపల్లెలనుంచీ.

మాదిగ లొద్ది నోరు తెరచినది, తంగెడు చెక్క భంగపడ్డది
తొండం బొక్కెన నిండమునిగినది, ఆరె రంపె పదునారిపోయినది
పాత రేకు వలె మోతలు మోగేటి ప్లాస్టిక్కు డప్పులు
నా మేదరి డప్పును పాతరేసె కదరా? నాపల్లెల్లోనా.

కుంకుమ దాసరి బుక్కమీదగూడ కంపెనీ రక్కసి కన్నుబడ్డది
పూసలోల్ల తాలాము కప్పలు, కాశీల కలసి ఖతమౌతున్నవి
బొట్టు బిళ్ళలూ నొసటికొచ్చెగదరా నా పల్లెలజూడా
మన గుడ్డి దాసరీ బతుకులాగమాయే ఈ పల్లెల్లోనా

ఇల్లు కట్టుకొనె ఇటుకల రాయితో, సెలకల చల్లె ఎరువుకుళ్లుతో
ఎద్దు బండి ఉన్నోనికి సేతిలో ఏడాదంతా పని దొరికేది
టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో, నా డొంక దారిని
నా ఎద్దు బండి గిల్లెగిరిపడ్డదమ్మో నా పల్లెల్లోనా.

తొలకరి జల్లుకు తడిసిన నేల
మట్టిపరిమళాలేమైపాయెరా
వానపాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకతలేవూ
పత్తిమందుల గత్తర వాసనరా ఈ పంట పొలాల
ఆ మిత్తికి దెచ్చిన అప్పే కత్తాయే నా రైతు కుతికెపై

హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులార్మోనియం చెదలు పట్టినది
యక్షగానము నేర్పేపంతులు ఉప్పరి పనిలో తట్టపట్టినడు.
యాచకులు, నా బుడగా జంగాలూ, ఈ పల్లెల నిడిచీ
దేవా హరిహరా ఓ
ఆ పాతబట్టల మూటలమ్ముతుండ్రా తమ పొట్టకూటికై

పిండోలెన్నల రాలుచుండగ రచ్చబండపై కూసొని ఊరే
ఎనకటి సుద్దులు ఎతలూ కతలూ యాదిజేసుకొని బాధలె మరిచిరి
బుక్కనోటిలో బడ్డదంటే నేడు మన పల్లెల్లోనా
అయ్యో ఒక్కడు రాతిరి బయటకెళ్ళడమ్మో ఇది ఏమి చిత్రమో

బతుకమ్మా కోలాటపాటలు భజన కీర్తనల మద్దెల మోతలు
బైరాగుల కిన్నెర తత్వమ్ములు కనుమరుగాయెర నా పల్లెల్లో
అరె స్టార్ టీవీ సకిలిస్తా ఉన్నదమ్మో నా పల్లెల్లోనా
సామ్రాజ్య వాద విషమెక్కుతున్నదమ్మో మెల్లంగా పల్లెకు

వృత్తులు కూలే ఉపాధి పోయే, ప్రత్యామ్నాయం లేకనె పోయె
కూలిన బ్రతుకులు నిలుపుటకైనా కుటీర పరిశ్రమలైనా పెట్టరు.
అరె బహుళ జాతి కంపని మాయల్లోనా మా అన్నల్లారా
భారత పల్లెలు నలిగి పోయి కుమిలే ఓ అయ్యల్లారా…

జ‌న‌నం: న‌ల్ల‌గొండ‌. 'ఆధునిక క‌విత్వంలో అస్తిత్వ వేద‌న‌', 'అంతర్ముఖీన క‌విత్వం' అనే అంశాల‌పై ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ ప‌రిశోధ‌న చేశారు. ప్రాథ‌మిక త‌ర‌గ‌తి నుండి డిగ్రీ స్థాయి తెలుగు పాఠ్య పుస్త‌కాల రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క‌మైన స‌భ్యుడిగా, ర‌చ‌యిత‌గా, సంపాద‌కుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అనేక కవితలు, సమీక్షలు, ముందుమాటలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. పలు పురస్కరాలు అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 'జీవ‌న లిపి'(క‌విత్వం), 'స‌మ‌న్వ‌య‌'(సాహిత్య వ్యాసాలు) ర‌చ‌న‌ల‌తో పాటు వివిధ గ్రంథాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

6 thoughts on “పల్లెల దుస్థితిని, ప్రపంచీకరణ ప్రభావాన్ని చిత్రించిన ఖండకావ్యం ‘పల్లెకన్నీరు పెడుతుందో’ గీతం

  1. సార్ నమస్తే …. నా పేరు కృష్ణా చారి 9959404989
    ప్రపంచీకరణ మాయలో తన సంపదను , వైభవాన్ని కోల్పోయిన పల్లె కన్నీటి తడిని … పాట లోని ఆర్ద్రతను ఓ పాఠంగా మలిచి… మా మదిలో కలకాలం నిలిచేలా పాట పాఠాన్ని అందించిన రఘు సార్ గారికి
    …. ,🙏

  2. నమస్కారం సర్..

    ప్రపంచీకరణ ప్రభావం,సామాజిక,రాజకీయ పరిస్థితుల ప్రభావం ఇత్యాది అంశాల ప్రస్తావనతో బలంగా నడిచింది సార్ వ్యాసం..అద్భుతమైన విశ్లేషణ సర్…ధన్యవాదాలు..

  3. “మట్టికుండలు, కుమ్మరివాము, వ్యవసాయానికి గృహవసరాలకు పనికొచ్చే కుమ్మరి కొలిమి, నాగల్లు, ఎడ్లబండ్లు, ఇంటినిర్మాణాలు చేసే వడ్రంగుల మొదలైన ఉత్పత్తి కులాల నుండే నాగరికత నిర్మాణం జరిగింది నేడు అవి కనుమరుగై ఆయా వృత్తుల వారు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని చాలా బాగా చెప్పారు సార్…….💐💐👌

  4. చిన్ననాడు చూసిన పల్లె ఒకవైపు, ప్రపంచీకరణ ప్రభావంతో కళ తప్పిపోయిన పల్లె ఒకవైపు కనిపించాయి సర్.అందరినీ చైతన్యం వైపుకు నడిపించే గోరేటి వెంకన్న ఆవేదనను అందరి ఆవేదనగా
    అందించారు సర్. పల్లెల్లోని ఆనాటి పరస్పర ఆధార వృత్తి జీవనం, ఆశ్రీత సాంస్కృతిక కళా వృత్తి సంస్కృతి ఒక్కసారి కళ్ళముందు సాక్షాత్కరించాయి సర్.
    మళ్లీ మా చిన్నప్పటి పల్లెలోకి పంపించారు.
    ధన్యవాదాలు సర్.

  5. ప్రపంచీకరణ వల్ల పల్లె ఎలా కళ తప్పిపోయిందో వివిధ అంశాల ద్వారా చాలా చక్కగా వివరించారు 👍🏽👏🏽💐

  6. యూనివర్సిటీలో ఉన్నరోజుల్లో ఈ పాట, సినిమా.చిత్రీకరణ సంబంధించిన అంశాలను వింటూ వచ్చాను. సినిమా తీసిన వాళ్ళు హాస్టల్ లో ఉన్నవాళ్ళు కాబట్టి ఒక ఎదురుచూపు ఉండేది. సినిమా పక్కన పెడితే ఈ పాట ప్రతొరోజు వినడం, పల్లె కన్నీటి తడిని గుండెలో నింపుకోడం జరిగేది. ఇప్పుడిలా కూలంకషంగా ఈ పాటకు వివరణ ఇవ్వడం మరోసారి పల్లెతల్లిని చూసి వచ్చినట్లయ్యింది సర్. ఆ ఆవేదన తీరనిది, వాస్తవాన్ని కళ్ళకు గట్టారు, ధన్యవాదాలు సర్

Leave a Reply