పర్వతం నిశ్చలంగా నిలబడి
నదిలోకి తొంగి చూస్తుంది
నది మెలమెల్లగా, దూరందూరంగా ప్రవహిస్తుంది
పర్వత హృదయాన్ని మోస్తూ
ఆకాశ నీలంతో కలిసిపోయిన
నీలిమతో నది ప్రవహిస్తుంది
నదీ, అప్పుడే నువు వెళ్ళిపోయావా?
దిగులుతో పర్వతం వెనక్కి చూస్తుంది
నది తన పక్కనే మెల్లగా ప్రవహించడాన్ని చూస్తుంది
అది అంతే ప్రియతమా
నది వెళ్ళిపోతుంది, కానీ
అది ఎప్పటికీ నిలిచివుంటుంది
ప్రతీ రోజూ పర్వతం
నీటిలో తన నీడని చూస్తూ వుంటుంది
ఆకాశపు నీలిమనీ, పర్వతపు నీలిమనీ,
స్వచ్ఛమైన నీలిమనీ చూస్తూ
-వు టు టాన్, వియత్నాం కవి (అనువాదం: సుధా కిరణ్)
నదీ, పర్వతమూ, నక్షత్రాలూ
నది ఎక్కడ మొదలౌతుంది?
అట్టడుగునుంచి నీటివూట ఉబికే చోట
పర్వతం పైనుంచి జలపాతం జారిపడే చోట
నేలనీ, బండరాళ్ళనీ, రెల్లుగడ్డినీ
ప్రేమతో హత్తుకొన్న ప్రవాహం ప్రయాణం మొదలుపెట్టే చోట
రెండు తీరాలు మొదలయ్యే చోట,
బహుశా, జీవితం ఒక కలని ప్రేమించడం ప్రారంభించిన చోట…
***
నది ఎలా ప్రవహిస్తుంది?
కొండలనీ, అడవులనీ, మైదానాలనీ దాటుకుంటూ
లోతు తెలియని రహస్యాల మొసళ్ళని మోసుకుంటూ
నీటివూటల జ్ఞాపకాలని నిశ్శబ్దంగా, నెమ్మదిగా నెమరువేసుకుంటూ
వడివడిగా హోరెత్తే గొంతులతో పరుగులు పెడుతూ
అప్పుడప్పుడూ కృశించి, నీటిచెలిమల చెలిమి కోసం పరితపిస్తూ
ఎపుడెపుడో కురిసిపోయే వాన మబ్బుల ఎదురుచూపులలో నీరై కరిగిపోతూ
మబ్బు చినుకుల పూలచుక్కలతో పులకరిస్తూ
మట్టి రంగులని నిలువెల్లా పులుముకొని
పెనువృక్షాల్ని పెకలిస్తూ, గడ్డి పరకల తలలు నిమురుతూ
కలిసి కదిలినా కరిగిపోని ఇసుక రేణువులని తడిగా తాకుతూ
నీడలు సైతం కనిపించని కటిక చీకటిలో కొన్నిరాత్రులు
గలగలా పారే వెన్నెల నక్షత్రాల వెలుగులలో మరికొన్ని రాత్రులు
వంపులు తిరిగి బారులు తీరిన కొండల నీడలలో
భూమికీ ఆకాశానికీ పచ్చటి నిచ్చెన వేసిన గుబురు అడవి చెట్ల గుసగుసలలో
కలల కడలి గమ్యాన్ని వెదుకుతూ,
బహుశా, తనని తాను తెలుసుకొంటూ …
***
నది ఎప్పుడు గాయపడుతుంది?
నిప్పులవానలో పర్వతశిఖరం విరిగిపడినప్పుడు
విలపించే నక్షత్రాలు
ఒకటొక్కటిగా చుట్టుముట్టిన చీకటి కోరలలో చిక్కుకున్నప్పుడు
వేకువ జాము వొకటి
ఒడ్డు చేరనివ్వని క్రూరమైన మొసలి పాలబడినప్పుడు
తగలబడే అడవి చెట్ల ఆకులు
కన్నీటి చుక్కలవలే జారి పడినప్పుడు
పూల రెక్కల పరిమళం మీద
కాలిపోయిన కమురు వాసన కమ్ముకున్నప్పుడు
నదిలోకి తొంగిచూసే పర్వత శిఖరం
ఒంటరి క్షతగాత్రి చివరి క్షణాల కలయై
దుఃఖపుచీకటిలోకి కుంగి కూలిపోయినప్పుడు
బహుశా, నీటి ఊటని ఊబి కబళించినప్పుడు
నది నెత్తురయి ఓడి గాయపడుతుంది.
-సుధా కిరణ్