పర్యావరణంలో మార్పులు – మహిళలపై ప్రభావం

ఎండా కాలం ముందే వచ్చేసింది. కాలం కాని కాలంలో వానలు పడుతున్నాయి. చలిగాలులు అంతటా విస్తరిస్తున్నాయి. ఒక చోట వరదలు, మరో చోట ఎండలతో గందరగోళంగా ఉంది. వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పంజాబ్ లో పంటకోతల తర్వాత పెట్టిన మంటలు, ఢిల్లీ ప్రజలకు శ్వాస ఆడకుండా చేస్తున్నాయి.

మార్చి 8 సందర్భంగా ఈ విషయాలన్నీ మాట్లాడుకోవడం ఎందుకు? మహిళల హక్కుల గురించి మాట్లాడుకోవాలి కదా అని అనుకుంటున్నారా?

మనకు ఇష్టమున్నా లేకున్నా, మనం అవునన్నా కాదన్నా, పర్యావరణంలో ఈ మార్పులు వస్తున్నాయి, పర్యావరణంలో వస్తున్న ఈ మార్పులు మహిళల మీద అనేక ప్రతికూల ప్రభావాలను చూపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పర్యావరణ మార్పులు మహిళల ఆరోగ్యం మీదనే కాదు, ఉపాధి అవకాశాల మీద ప్రభావం చూపిస్తాయి. అసమానతలను కూడా పెంచుతాయి. అభివృద్దిని ఆటంకపరుస్తాయి. అందుకే పర్యావరణంలో, వాతావరణంలో మార్పులు ఇప్పుడు చర్చల్లోకి రావాలి. మహిళల సమస్యల గురించి మాట్లాడే ఎజెండాలో చేర్చాలి. అది మహిళలకు సంబంధించిన విషయాల్లో భాగం కావాలి.

అంతర్జాతీయ శ్రామికా మహిళా దినోత్సవం సందర్భంగా, మహిళల హక్కుల గురించే కాదు.. మహిళలు ఎదుర్కుంటున్న అనేక సమస్యలతో పాటు, పర్యావరణం గురించి కూడా మాట్లాడుకోవాల్సిన భౌతిక పరిస్థితిలో ఉన్నాం.

అభివృద్ధి పేరుతో జరుగుతున్న అడవుల ధ్వంసం, పారిశ్రామికీకరణ, సహజవనరుల విధ్వంసం, ప్రమాదకర స్థాయిలో పరిశ్రమలనుండి విడుదలవుతున్న హానికారక రసాయనాలు, వ్యవసాయంలో వాడుతున్న విచ్చలవిడి పురుగు మందులు, ఒకటేమిటి ఎన్నో, ఎన్నెన్నో ఈ రోజు మానవ మనుగడకు పెను సవాల్ ను విసురుతున్నాయి. మంచు పర్వాతాలు కరిగిపోతున్నాయి. సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. ఉష్టోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా అకాల వర్షాలు, వరదలు, కరువు కాటకాలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతున్నాయి. ఇప్పటికీ రైతు ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయలేని పరిస్థితి. వీటికి తోడు వాతావరణంలో వస్తున్న మార్పులతో రైతులు అనివార్యంగా వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితులు పెరుగుతున్నాయి.

పర్యావరణంలో వస్తున్న మార్పులతో ప్రతికూల ప్రభావాలు పెరిగిపోతున్నాయి. ఉష్టోగ్రతలు పెరిగి పంటల దిగుబడి తగ్గిపోతోంది. ఇలాంటి స్థితిలో నేటికీ వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకున్న మహిళలకు ఉపాధి కరువవుతుంది. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలకు కూడా గ్యారంటీ లేదు. ఇలాంటి స్థితిలో కుటుంబంలోని ఆర్థిక పరిస్థితులు మహిళల మీద అదనపు భారాన్ని మోపుతాయి. ఈ పరిస్థితులు మహిళలను ఒత్తిడికి గురిచేయడమే కాదు, సరైన ఆదాయాలు లేని పరిస్థితుల్లో మహిళలు సరైన ఆహారం తీసుకోవడం తీసుకునే పరిస్థితి ఉండదు. పోషకాహార లేమితో బాధపడుతున్నారు.
2022-23 ఎకనామిక్ సర్వే ప్రకారం దేశంలో ఇప్పటికీ 65 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. ఇందులో 47 జనాభా వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్నారు. ఇందులో గ్రామీణ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 27.7 శాతం. భూమికి దూరమయి, కూలీలుగా మారుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో, అనివార్యంగా ఉపాధి హామీ పనులకు కూలీలుగా వెళ్తున్నారు. ప్రభుత్వాలు ఏ క్షణం ఈ పధకాలు ఎత్తేసినా, మహిళలు రోడ్డున పడతారు.

విపరీతమైన ఎండల్లో వీరు చేస్తున్న శ్రమకి సరైన కూలీ డబ్బులు దక్కుతున్నాయా లేదా అనే చర్చ ఎంత ముఖ్యమో, ఎండలో వానలో వారు పడుతున్న శ్రమకు ఎలాంటి ఆనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నారనే చర్చ కూడా ముఖ్యం. భవిష్యత్ లో వీరు అనారోగ్యాల బారిన పడినా, వీరికి ఎలాంటి ఆర్థిక భరోసా అందించే పరిస్థితి లేదు.

మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా రాబోయే రోజుల్లో ఈ మాత్రం వ్యవసాయపు పనులు కూడా లేకపోతే, వారికి ఎలాంటి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించే పరిస్థితి లేదు. కరువు ప్రాంతాల్లో ఎంతటి దారుణ పరిస్థితులు ఉంటాయో అప్పుడప్పుడూ చూస్తూనే ఉన్నాం. కరువు కారణంగా వలసలు వెళ్తున్న కుటుంబాలున్నాయి, అలా వలస వెళ్లిన ప్రాంతాల్లో మహిళలకు భద్రమైన పరిస్థితులు లేని స్థితి ఉంటోంది. పిల్లల చదువులు అటకెక్కి పోతున్నాయి. గతంలోనే కడప లాంటి జిల్లాల్లో కరువు కారణంగా, అప్పుల పాలై తల్లిదండ్రులే కుటుంబంలోని ఆడపిల్లలను వ్యభిచార గృహాలకు అమ్మేసిన దారుణ సంఘటనలు చూసాం.

మహిళలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. అనివార్యంగా ఇది మహిళల మీద హింసకు కూడా దారితీస్తోంది. ఇప్పటికే నిర్వాసితులుగా మారిన కాలనీల్లో మహిళలు ఎదుర్కుంటున్న హింసను ప్రత్యక్షంగా చూస్తున్నాం.
మైనింగ్స్ పేరుతో, భారీ ప్రాజెక్టుల పేరుతో, రకరకాల సహజవనరుల తవ్వకాల పేరుతో అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను నిర్వాసితులను చేస్తున్నారు. వారికి ఎక్కడో కాలనీలు కట్టించి, అడవికి వారి భూమికి, పుట్టి పెరిగిన ఊరికి వారిని దూరం చేసి పంపిస్తున్న ధోరణులు పెరుగుతున్నాయి. ఈ రోజుకీ అడవిని కాపాడుతూ, సహజవనరులను సంరక్షిస్తూ, జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నది అక్కడి మహిళలే. ఆదివాసీ ప్రజలే. వీళ్లందరినీ ప్రకృతికి దూరం చేస్తున్నారు. వారి ప్రాథమిక హక్కును హరించి వేస్తున్నారు. జీవించేవారి హక్కును లాక్కుంటున్నారు.

సహజవనరులు, అడవుల విధ్వంసంతో ఆదివాసీలు, గ్రామీణ ప్రజలు రోడ్డున పడుతున్నారు. నిర్వాసితుల కాలనీల్లో వారిని తీసుకెళ్లి పడేస్తున్నారు. చేసుకునేందుకు పనులు లేక, మైదాన ప్రాంతాల్లో ఉండలేక వారు అనేక రకాల మానసిక, ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఆకస్మిక చావులకు గురవుతున్నారు. ఈ నిర్వాసితులను పలకరిస్తే ఎన్ని దీనగాధలో…

ప్రకృతిలోని వైవిధ్యం ధ్వంసమయ్యాక, ఆ వైవిధ్యాన్ని కాపాడుతున్న మహిళల జీవితాలు అస్తవ్యస్తంగా మారాక, ఆ అభివృద్ది నమూనాలు, వాటి పర్యవసానాలు, ప్రకృతి విధ్వంసాలు ఎంతటి భారీ నష్టాలను కలిగిస్తాయో మనం ఊహించను కూడా ఊహించలేము. ఇక్కడ కేవలం ఉపాధి, ఆదాయాలు, ఆరోగ్యాలు మాత్రమే కాదు, తరతరాలుగా భిన్న సాంస్కృతిక వారసత్వాలను కాపాడుతూ, కొనసాగిస్తూ వస్తున్న మహిళల అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారుతోంది.
చల్లని మంచుపర్వతాలు కరిగిపోతున్నాయి. కర్భన ఉద్గారాల వల్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ భారీ స్థాయిలో పెరిగిపోతోంది. వీటన్నిటితో సముద్రాలు ముందుకొచ్చి తీర ప్రాంతాలను ఆక్రమిస్తున్నాయి. 2040 నాటికి విశాఖపట్నంలో అయిదు శాతం, ముంబయిలో 10 శాతం తీర ప్రాంత భూభాగం సముద్రంలోని కలిసిపోతుందని అధ్యయనాలు చెప్తున్నాయి.

సముద్రమంటే పర్యాటకులు సందర్శించే అందమైన బీచ్ లే కాదు కదా? ఆ సముద్రాన్ని పెనవేసుకుని లక్షలాది మత్స్యకారుల కుటుంబాల జీవితాలు కూడా అల్లుకుని ఉంటాయి. చేపల వేట మీదే ఆధారపడి బతుకుతున్న మగవారి జీవితాలు, ఆ చేపలను మార్కెట్ లో అమ్మి అదే జీవనోపాధిగా, ఆదాయ వనరుగా బ్రతుకుతున్న మహిళల జీవితాలు కూడా ఉంటాయి.

వాతావరణంలో వస్తున్న మార్పులతో ఇప్పటికే మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. పైగా పరిశ్రమల వ్యర్థాలతో సముద్రపు నీటిలోని మత్స్య సంపద చనిపోతోంది. ఇవన్నీ మత్స్య కారుల కుటుంబాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించే విషయాలు. సముద్రం చుట్టూ తమ జీవితాలను అల్లుకున్న వీరు మైదాన ప్రాంతాల్లో ఇమడలేరు. వేరే పనులు చేయలేరు. వారి జీవితాలు అభద్రతలోకి నెట్టివేయబడతాయి. ఈ కుటుంబాల్లోని మహిళలకు ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉండవు.

ఈ మార్పులు మహిళలు, పిల్లలను బాధితులుగా మారుస్తున్నాయి. ఇది మన రాష్ట్రానికో, దేశానికో పరిమితమైన విషయం కాదు. ఇదిప్పుడు అంతర్జాతీయ సమస్య. ఒక్క అమెరికాలోనే ఏటా నలభై ఎనిమిది టన్నుల విషపూరిత రసాయనం గాలిలోకి విడుదలవుతోంది, దీని ఫలితంగా ఇప్పుడు ప్రతి ఆరుగురు మహిళల్లో ఒకరి రక్తంలో ప్రమాదకర రసాయనాలు అసురక్షిత స్థాయిలో ఉన్నాయని వివిధ పర్యావరణ పత్రికల రిపోర్టులు తెలియచేస్తున్నాయి. గర్భిణీ స్త్రీలు, శిశువులు, చిన్నపిల్లలు మరింత ప్రభావితమవుతున్నారు, ఇది పెరిగే పిల్లల అభివృద్దిని దెబ్బతీస్తుంది. ఒక్క ప్రినేటల్ మెర్క్యురీ ఎక్స్ పోజర్ కారణంగా సంవత్సరానికి సుమారు 6,30,000 మంది పిల్లలు ప్రమాదకర నాడీ సంబంధిత సమస్యతో జన్మిస్తున్నారని రిపోర్టులు చెప్తున్నాయి.

పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల వల్ల, గర్భిణీ స్త్రీలు అలసటకి గురవుతారని, కడుపులో బిడ్డను కాపాడుకోవడానికి వేడి నుండి రక్షించుకోవడానికి అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. పేద మహిళలకు ఇది మరింత ఒత్తిడికి గురిచేస్తుంది. పోషకాహార లేమితో బాధపడతారు. కొన్ని సార్లు అనివార్య అబార్షన్లు కూడా జరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి విపత్తుల కారణంగా వలస బాట పట్టిన వారిలో 80 శాతం మహిళలే అని ఐక్యరాజ్యసమితి అంచనా. ఈ విపత్తుల సమయంలో మహిళల మీద, ఆడపిల్లల మీద హింస మరింత పెరిగిందని కూడా ఐక్యరాజ్య సమితి చెప్తోంది. 2005 లో వచ్చిన కత్రినా తుఫాను తర్వాత జరిపిన ఒక అధ్యయనంలో, తీవ్రమైన తుఫాను నష్టం జరిగిన ప్రాంతాల్లో, మహిళలపై సన్నిహిత భాగస్వామి దాడులు 5-8 రెట్లు పెరిగాయని తేలింది.

తీవ్రమైన వాతావరణ మార్పుల కారణంగా, మహిళలకు ప్రమాదాలు బాగా పెరుగుతాయి, అవి అనేక విధాలుగా పెరుగుతాయి” అని కొలంబియా విశ్వవిద్యాలయంలోని గ్లోబల్ కన్సార్టియం ఆన్ క్లైమేట్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సిసిలియా సోరెన్సెన్, MD చెప్తున్న మాట. మన దేశంలోనూ కరోనా సమయంలో అనేక కుటుంబాల్లో మహిళల మీద హింస పెరిగిందని అనేక రిపోర్టులు మన ముందు కూడా ఉన్నాయి. విపత్తుల సమయంలో మహిళల పై జరిగే హింస మరింత తీవ్రమవుతోందని చెప్పేందుకు ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి?

పర్యావరణంలో వస్తున్న మార్పులు మహిళల ఆరోగ్య, ఆహారం, ఆదాయం లాంటి అనేక విషయాల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. భవిష్యత్ లో ఈ ప్రభావాలు మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉంది. పాలకులకు, పెట్టుబడిదారులకు పర్యావరణం విషయంలో చిత్తశుద్ది లేనట్టే, మహిళల హక్కుల అమలు విషయంలోనూ, వారి ఆరోగ్యం, ఆహారం, ఉపాధి అవకాశాల విషయంలోనూ చిత్తశుద్ది ఉండదనేది వాస్తవం.

అయితే ఆసక్తికర విషయమేంటంటే, మహిళలు ఉన్నత సామాజిక, రాజకీయ హోదా కలిగి ఉన్న దేశాల్లో, వారి దేశాలు 12% తక్కువ CO2 ఉద్గారాలను కలిగి ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 130 దేశాలపై జరిపిన ఒక అధ్యయనంలో, మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న దేశాలు అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలను ఆమోదించే అవకాశం ఎక్కువగా ఉన్నాయని తేలింది.

సమాన పనికి సమాన వేతనం, మెరుగైన పని పరిస్థితుల కోసం మొదలైన శ్రామిక మహిళా ఉద్యమాలు, ఇప్పుడు మరింత సంఘటితంగా స్వచ్ఛమైన గాలి కోసం, స్వచ్ఛమైన నీటి కోసం, సాగుభూముల్ని కాపాడుకోవడం కోసం, సహజ వనరుల్ని రక్షించుకోవడం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం, పచ్చదనం కోసం, తద్వారా ఉపాధి అవకాశాల కోసం, జీవించే హక్కు కోసం, ఆహార భద్రత కోసం, భవిష్యత్ తరాల మనుగడ కోసం కొత్త పోరాటాలు చేయాల్సి ఉంది. పర్యావరణ పరిరక్షణ ఉద్యమాల్లోనూ భాగస్వాములు కావాల్సి ఉంది.

సామాజిక కార్యకర్త. గాయని. బుర్రకథ కళాకారిణి. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఎం.ఏ (ఆర్థిక శాస్త్రం), ఎల్.ఎల్. బీ. చదివారు. ఆకాశవాణిలో పదేళ్ల పాటు casual announcer గా పని చేశారు. TV 9, Vanitha TV, 10TV ల్లో జర్నలిస్ట్ గా పనిచేశారు. యూనిసెఫ్, లాడ్లీ మీడియా అవార్డులతో పాటు, ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో ఉత్తమ జర్నలిస్ట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మిషన్ భగీరథ అవార్డు అందుకున్నారు. Center for Sustainable Agriculture లో Krishi TV (వ్యవసాయ) యూట్యూబ్ ఛానల్ నిర్వహించారు. ప్రసుతం Voice of the People పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. ఆరేళ్లుగా పిల్లల కోసం ' కథల ప్రపంచం ' పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నారు.

Leave a Reply