నేను గర్విస్తున్నాను
నా మాతృభూమి
భారద్దేశమైనందుకు,
కాని కోట్లాది పేదలకు
బుక్కెడు బువ్వ పెట్టలేనీ
బూర్జువా పాలకుల్ని జూసి
నేను సిగ్గుపడుతున్నాను.
నాదేశం
సర్వసత్తాకమైనందుకు,
నేను గర్వపడుతున్నాను.
కాని నా సత్తాను
పత్తాలేకుండజేసి
పరులపాల్జేస్తున్న
పాలకుల్ని జూసి
నేను సిగ్గుపడుతున్నాను.
నా దేశం ప్రజాస్వామ్యమైనందుకు
నేను గర్విస్తున్నాను,
కాని ప్రతిఫలనాలను
దొంగలపాల్జేస్తున్న
ద్రోహ పాలకుల్నిజూసి
నేను సిగ్గుపడుతున్నాను.
నాదేశం
గణతంత్ర రాజ్యమైనందుకు
నేను గర్విస్తున్నాను
కాని గణతంత్రాన్ని
కణం కణం కుతంత్రాల్తో
కుళ్ళబొడుస్తున్న కుట్ర పాలకుల్నిజూసి నేను
సిగ్గుపడుతున్నాను.
నా దేశం
లౌకిక రాజ్యమైనందుకు
నేను గర్విస్తున్నాను
కాని లౌకికత్వం కీలుక్కీలు
ఊడబెరికే విద్రోహ చర్యల్నిజూసి
నేను సిగ్గుపడుతున్నాను.
(భారత రాజ్యాంగ పీఠికకు తిలోదకాలిస్తున్న పాలక విధానాలకు
నిరసనగా…)