పతాక సన్నివేశం…

కుట్రలేవో జరుగుతున్నాయి
కుటిల రచనలేవో
అడ్డూ అదుపూ లేకుండా
పథకం ప్రకారం సాగిపోతూనే ఉన్నాయి
అధికార ఆగడాలు నెత్తుటి నీడల్లో సేదతీరుతూనే వున్నాయి

తుపాకి శబ్దంలో
కలిసిపోయిన పక్షుల పాటలు!
అందరి గొంతులు మూకుమ్మడిగా
మూగపోయాయేమో…
సన్నని జీరతప్ప మాట పెగలటం లేదు
ఎలుగెత్తిన వెలుగు పాటేదో
రెక్కలు విరుచుకుని
నేల మీద పడిన టపటప శబ్దం

ఎక్కడ చూసినా
పేలిపోయిన మనిషి కపాలాలు!
మాటలకు బదులు
విషం చిమ్ముతున్న జాతి జాడ్యం!
నోరు తెరుచుకు కూర్చున్న
పచ్చి నెత్తురు తాగే
నిగనిగలాడే కత్తులు!
ఆకు పచ్చని తోరణాల్లాంటి హృదయాల్లో ఇమడలేని
మొండి మనసు గోడలు!
ఈ సన్నివేశమే కదా
నా గొంతులో లుంగలు చుట్టుకు పోతున్నది!

ఇటువైపు జీవితాల్ని
నెత్తుటి బిందెలకు ఎత్తుకుంటూ
నీలి రంగు నీడలను మోస్తున్న చిన్న బతుకులు!
పేదరికానికి అంట్లు కడుతూ పచ్చనోట్లను మొలకెత్తిస్తున్న
లెక్క తేలని ఆస్తుల చిట్టాలు!
ఎవరికెవరూ అంతు చిక్కని దేహాలను మోస్తున్న బతుకు కావడి
లెక్కకు తూగనంటూ మొరాయిస్తోంది!
పువ్వులు పూసే కాలం
ఆకులు రాల్చుకుంటోంది

***

తొక్కిపెట్టబడ్డ అస్తిత్వ పోరాటమిప్పుడు
అనంత ప్రవాహమైంది

శిరోచ్ఛేదనమేదో జరిగే ఉంటుంది…

నివాసం విజయవాడ. కవయిత్రి, అధ్యాపకురాలు, జర్నలిస్టు. 2015 నుంచి కవిత్వం రాస్తున్నారు. 2019 లో ' ఏడవ రుతువు' కవితా సంపుటి వచ్చింది.

Leave a Reply