కాసేపు
మనసుపొరల మీద గప్పిన
మాస్కుల్ని తీసేద్దాం
మనుషులమౌదాం
రెక్కలు గట్టుకు
పక్షుల్లా ఎగిరి, దుర్భేద్యపు జైలుగోడల దాటి
జైలు ఊచలమీద తచ్చాడుదాం
మూలమూలల
ఘనీభవించిన దుఃఖాల్నీ
గుహాంతరాళల్లో
పెగులుకొచ్చే హాహాకారాల్నీ విందాం
విరిగిన పదాల్ని వాక్యాలజేద్దాం
మనమే ఒక వాక్యమౌదాం
చక్రాల బండికింద
శ్వాస చితికితేనేం
లోకంమీదకు చల్లే
కవితా సూర్యోదయాల్ని ఒడిసి పడదాం
తీరమెంత నియంతలా శాసించినా
అజేయమైన సముద్ర స్వరాలుగ మల్చి
తీరంమీద ఎగరేసే జెండాలకు సలాముచేద్దాం
అడవి మాదన్నందుకు
ఆకు ఆకు మీద స్వేచ్ఛాగీతం రాసినందుకు
నిరంతర గాయాల్నిమోసే
ఆదివాసీ గాధల్ని
అక్షరాలుగ మల్చి
ఆకాశంమీద అతికిద్దాం
బతుకే బహిరంగ జైలుగ మారినచోట
హక్కుల కోసం నినదించి నందుకు
చీకటి శిలాఫలకంమీద
వెలుగు అక్షరాల్ చెక్కినందుకు
జైలుగోడల మధ్య
చిక్కి శైథిల్యమయ్యే జీవితాల్ని తడుముదాం
జైలు గోడల చుట్టూ
ఆర్ద్ర సముద్రాల్ తచ్చాడుతున్నాయనీ
ఇంటా, బయటా చాటిచెప్పుదాం
మౌనమో, మాటో, పాటో
పక్షి పంజరం నుడి విడుదలయ్యేదాంక
రాపాడుతుందాం