అడవీ! రా
నీవూ, నేనూ ఒక్కటే
రా!
నన్ను ఆలింగనం చేసుకోనీయ్
నీ అడుగులో నా అడుగు వేయనీయ్
నీ ఆత్మలో నా ఆత్మని కలవనీయ్
నీలో వికసించే ప్రతిదీ నాలో నిత్యం పుష్పించనీయ్
నీలో నిండిన శిఖరాల్నీ, లోయల్నీ, అలల్నీ, కలల్నీ
నన్నూ అధిరోహించనీయ్
నన్నూ ఆవహించనీయ్
నీలో నిండిన రోదనల్నీ, శోధనల్నీ, మార్మికతల్నీ
నన్నూ అవగాహన చేసుకోనీయ్
అడవీ! రా
నీ జీవితం మళ్ళీ విప్పు
తిరగబడినందుకు
శత్రువు నీ శరీరం పై అణువణువునా వదిలిన
గాయాల్ని చూపించు
నీ గాయాల్ని తాకి నన్నూ పునీతం కానీయ్
అడవీ! రా
నీవూ, నేనూ ఒక్క చోటే కలుసుకుంటాం
ఇక్కడ నా పూర్వీకులు నాటిన నెత్తుటి జాడలున్నాయ్
అక్కడ నా పూర్వీకులు ఒదిలిన వెచ్చని స్వప్నాలున్నాయ్.
నీ విముక్తి కోసం నీలోకి చొచ్చుకొచ్చిన బాటలున్నాయ్
నీ అస్తిత్వం కోసం నా తరఫున చేసిన యుద్ధాలున్నాయ్
అడవీ! నీ దేహం నా దు:ఖం
అడవీ! నీ విముక్తి నా స్వప్నం
అడవీ! నేనూ నువ్వూ ఒక్కటే!
నేను నీలో మార్మోగే గాయాల్ని విన్నాను
నేను నీలో సుడులు తిరిగే వెదురుల దిగులు రావాల్ని విన్నాను
నేను నీలో వేటగాడి మాటుల్ని చూశాను
విల్లునుంచి దూసుకొచ్చే శరాల లక్ష్యాన్ని చదివాను
పటాలాల పదఘట్టనల్ని విన్నాను
ధ్వంసమైన ఆదివాసీ జీవితాల్ని చూశాను
ఛిద్రమైన చిరునవ్వుని చూశాను
గాఢమైన తుపాకీ మందు వాసనలని
నీతో పాటు నేనూ ఆఘ్రాణించాను
యిక్కడి దట్టమైన లతల్నించి
సుదూర ప్రాంతాల దాకా వీడని బంధాల్ని దర్శించాను
సుదీర్ఘ యుద్ధ వ్యూహాల్ని నీతోపాటే అధ్యయనం చేశాను
పర్వతాల మీద నుంచి దూకే జలపాతాల్లో
ప్రతిధ్వనిస్తున్న విషాద జన గానాల్లో ఆగ్రహాన్ని విన్నాను
నీ ప్రతి అడుగులోనూ వినిపించే సెలయేర్ల దిగులు చప్పుళ్లలో
మండుతున్న గుండెల మోతను విన్నాను
నీలోని ప్రతీ చెట్టు మొదళ్ళల్లోనూ యింకిన స్వేచ్ఛా కాంక్షను వీక్షించాను
ప్రతీ వసంతంలోనూ నీవు లయబద్ధంగా వేసే అడుగుల్లో
ధ్వనించే ఏకాంత విషాదాల్లోని ఎదురు చూపుల్ని విన్నాను
గుంపులు గుంపులుగా ఎగిరే పక్షుల రెక్కల మీద
నీ ప్రతి స్పర్శా ఆనవాలులోనూ స్వేచ్ఛా కాంక్షను తాకి చూసాను
అడవీ! రా
ఈసారి మనం ఓడిపోం!
నీవూ, నేనూ వేసే ప్రతి అడుగులోనూ
మైదానాల విముక్తిని దర్శిస్తున్నాను
ఈ నేల రక్షణ కోసం
పెనవేసుకుపోయిన మన చేతులు
సరికొత్త యుద్ధ రంగాన్ని సృష్టిస్తాయి.
నీ స్వప్నాలు, నా జీవితం
యుద్ధంగా మారడాన్ని మన ప్రజలు చూస్తారు
వీరుల పునరుత్థానాన్నీ,
మన నేలని మనం తిరిగి స్వంతం చేసుకోవడాన్ని
ఈ ప్రపంచం కచ్చితంగా చూస్తుంది
మన కలయికతో నైఋతి ఋతుపవనాలు
మహోగ్ర పెను తుఫానులు గా మారడాన్ని
విడివడే సంకెళ్ళు కచ్చితంగా చూస్తాయ్!
- వేణు
(మళయాలం)
- అనువాదం: గోదావరి