నన్ను పాలించే వాడికి నా జీవితం తెలిసిన రోజు
పిల్లలందరూ ఒకే బడిలో చదివిన రోజు
నా తిండి మీద వేరే వాళ్ళ పెత్తనం పోయిన రోజు
జనరల్ స్థానాల్లో దళితులు నిలబడినరోజు
అమ్ముడుపోని ప్రజాప్రతినిధులు ఉన్న రోజు
గెలిచినోడు పార్టీ మారడన్న నమ్మకం కుదిరిన రోజు
భావోద్వేగం బాలెట్ బాక్స్ మీద పనిచెయ్యని రోజు
టేంపర్ కాని EVMలు వచ్చిన రోజు
పనిచేయకపోతే వెనక్కి పిలవగలిగే రోజు
పనికిమాలిన వాళ్ళు పక్కకి పోయిన రోజు
సిరా అంటిన వాళ్లు రక్తంలో మునగని రోజు
శిలా ఫలకాలపై కులం కనబడని రోజు
నాకు నచ్చిన రాజకీయాలు నేను మాట్లాడగలిగిన రోజు
తప్పుడు కేసుల తక్కెట్లో నన్ను తూయని రోజు
మా ఇంటి ఆడ మనిషి ధైర్యంగా నామినేషన్ వేసిన రోజు
ఆవిడ కుర్చీలో ఆవిడే కూర్చునే రోజు
తెలివైన వాడు దోచుకొని రోజు
తిరగబడితే తల తెగిపడని రోజు
అలాంటి రోజులు ఉంటే చెప్పండి
నేనూ.. ఓటేస్తా..
అందరికంటే ముందు నేనే ఓటేస్తా.