(మరణశిక్షకు వ్యతిరేకంగా టాల్ స్టాయ్ రాసిన సుప్రసిద్ధ వ్యాసంలో నుంచి కొన్ని భాగాలు.)
‘ఏడుగురికి మరణ శిక్ష – పీటర్స్ బర్గ్ లో ఇద్దరికి, మాస్కోలో ఒక్కరికి, పెంజా, రీగా లలో ఇద్దరిద్దరికి మరణ శిక్షలు.. నలుగురి ఉరితీత – ఖెర్సన్ లో ఇద్దరినీ, విల్నాలో ఒకరినీ, ఒడెస్సాలో మరొకరినీ ఉరి తీశారు.’
ప్రతిరోజూ, ప్రతి పత్రికలో ఇవే వార్తలు. కొన్ని వారాలో, కొన్ని నెలలో, ఒక సంవత్సర కాలం పాటో కాదు. ఏళ్ళ తరబడి ఇవే వార్తలు! ఇది జరుగుతున్నది రష్యాలో. ప్రతీ నేరస్తుడినీ జనాలు జాలితో చూసే రష్యాలో, చట్టం మరణశిక్షని ఇటీవలి దాకా ఒక న్యాయమైన శిక్షగా గుర్తించనే గుర్తించని రష్యాలోనే ఇప్పుడీ ఈ శిక్షలు అమలు జరుగుతున్నాయి. పశ్చిమ యూరప్ దేశస్తులతో మాట్లాడేటప్పుడు ఈ విషయం పట్ల నేనెంత గర్వంగా వుండేవాడినో నాకింకా గుర్తుంది. కానీ, ఇప్పుడు రెండు, మూడేళ్ళుగా మరణ శిక్షలు అమలవుతూ ఉన్నాయి. మరణశిక్షలు, మరణ శిక్షలు నిరంతరాయంగా అమలు జరుగుతూనే ఉన్నాయి.
నేను ఇవ్వాళ్టి పత్రికని చూస్తున్నాను.
ఈ రోజు, మే నెల 9 వ తేదీ. ఒక ఘోరం జరిగింది. ఈ రోజు పత్రికలో కొన్ని వాక్యాలు, ‘ఈరోజు ఖెర్సన్ లోని స్ట్రెల్ బిట్స్కీ క్షేత్రంలో ఇరవై మంది రైతులని ఉరితీశారు. ఎలిజబెత్ గ్రాడ్ జిల్లాలోని ఒక భూస్వామి ఎస్టేట్ ని దోచుకోవాలనే ఉద్దేశ్యంతో మూకగా దాడిచేసిన ఇరవై మంది రైతులని ఉరి తీశారు.
(పత్రికలు తర్వాత ఇరవై మందిని ఉరి తీశారనే ఆ వార్తను సవరించుకున్నాయి. ఆ పొరపాటు దొర్లినందుకు నేను సంతోషిస్తున్నాను. మొదట పేర్కొన్న సంఖ్య ఇరవై మంది కంటే ఎనిమిది మంది తక్కువగా చనిపోయినందుకు సంతోషిస్తున్నాను. అంతేకాదు, ఏంటో కాలంగా నన్ను వేధిస్తున్న భావాలని ఇలా కాగితం మీద పెట్టేలా ఆ సంఖ్య ప్రేరేపించినందుకు కూడా సంతోషిస్తున్నాను. అందుకని, ఇరవైమంది అనే సంఖ్యకి బదులు పన్నెండు మంది అనే సంఖ్యని మార్చడం తప్ప మిగతాదంతా నేను యథాతథంగా ఉంచుతున్నాను. ఎందుకంటే, చనిపోయిన పన్నెండు మందికి సంబంధించినది మాత్రమే కాదు. మరణశిక్ష పాలబడి హత్యకు గురైన వేలాది మందికి సంబంధించిన విషయం కూడా – ఎల్. టాల్ స్టాయ్).
పన్నెండు మంది. ఎవరి శ్రమమీద ఆధారపడి మనం జీవిస్తున్నామో, ఎవరినైతే మనం పతనం చేశామో, మన శక్తియుక్తులన్నిటినీ ఉపయోగించి ఇప్పటికీ, ఇంకా పతనం చేస్తూ ఉన్నామో, వోడ్కా విష పానీయం నుండి, మనమే విశ్వసించని దారుణమైన అబద్ధపు మత విశ్వాసాల దాకా ఎవరి మీదనైతే బలవంతంగా రుద్దుతున్నామో, ఆ జనాలలో పన్నెండు మంది, పన్నెండు మంది గొంతులకి ఉరితాడు బిగించి చంపేశాము. తినడానికి తిండి, తొడుక్కోవడానికి బట్టలు, ఉండడానికి ఇళ్ళు ఎవరు కల్పించారో వాళ్ళని ఉరితీసి చంపేశారు. ఎవరైతే వాళ్ళని దిగజార్చారో, దిగజార్చుతూ ఉన్నారో వాళ్ళే ఆ పన్నెండుమందిని ఉరితీసి చంపేశారు. ఎవరిమీద ఆధారపడి యావత్తు రష్యన్ జీవితంలోని సరళత్వం, కఠోర పరిశ్రమ, కరుణాగుణం మనుగడ సాగిస్తుందో ఆ జనాలలో పన్నెండుమంది తండ్రులని, పన్నెండు మంది భర్తలని, పన్నెండు మంది బిడ్డలని పట్టుకుని, బంధించి, సంకెళ్ళు వేశారు. తమ గొంతుల చుట్టూ బిగిసే ఉరి తాళ్ళని వాళ్ళు పట్టుకోకుండా, చేతులని వెనక్కి కట్టేసి ఉరికొయ్యల దగ్గరకి నడిపిస్తున్నారు. ఉరిశిక్షకు గురి కాబోయే రైతులని పోలిన అనేకమంది ఆ నిస్సహాయులతో పాటు నడుస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు సాయుధులై, సిపాయి దుస్తుల్ని ధరించి వున్నారు. వాళ్ళ కాళ్ళకి మంచి బూట్లు వున్నాయి, చేతుల్లో తుపాకులున్నాయి. పొడవాటి జుట్టు, పట్టు ఉత్తరీయం, బంగారు, వెండి జరీ పోగులున్న అంగవస్త్రం ధరించి చేతులలో శిలువను పట్టుకున్న ఒక మనిషి వాళ్ళతో పక్కన నడుస్తున్నాడు. ఆ ఊరేగింపు అక్కడితో ఆగింది. ఈ వ్యవహారాన్నంతటినీ పర్యవేక్షిస్తున్న వ్యక్తి ఏదో చెబుతాడు. గుమస్తా ఒక కాగితాన్ని చదువుతాడు. చదవడం అయిపోయాక, చనిపోబోయేవాళ్ళతో ఆ పొడవాటి జుట్టు మనిషి దేవుడి గురించీ, ఏసు క్రీస్తు గురించీ ఏవో నాలుగు మాటలు చెబుతాడు. (సంక్లిష్టమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలంటే, ఒక్క మనిషి చాలడు గనక తలారులు చాలా మంది ఉంటారు). పొడవాటి జుట్టు మనిషి మాట్లాడడం ముగిసిన వెంటనే, తలారులు నీళ్లలో సబ్బుని కరిగిస్తారు. ఉరితాళ్ళు మెడలకు గట్టిగా బిగుసుకోవడానికే వాటిని సబ్బు నీళ్ళలో నానబెడతారు. ఆ తర్వాత, సంకెళ్లు వేసి చేతులు వెనక్కి కట్టేసిన మనుషుల తలల చుట్టూ ముసుగు వేసే వస్త్రాన్ని కప్పుతారు. ఉరికంబం దగ్గరకు వాళ్ళని తీసుకువెళ్ళి, వాళ్ళ గొంతుల చుట్టూ ఉరితాడు బిగిస్తారు.
ఆ తర్వాత ఒక్కొక్కరి కాళ్ళ కింద బల్లలని నెట్టివేస్తారు. వేలాడుతున్న ఆ మనుషుల బరువుతో అకస్మాత్తుగా వాళ్ళ గొంతుల చుట్టూ ఉరితాళ్ళు బిగుసుకుంటాయి. వాళ్ళు బాధాకరంగా చనిపోతారు. ఒక క్షణం క్రితం సజీవంగా వున్న ఆ మనుషులు తాళ్ళకి వేలాడే విగతజీవులుగా మారిపోతారు. ముందు మెల్లమెల్లగా కదిలి, ఆ తర్వాత నిశ్చల కళేబరాలుగా నిలిచిపోతారు.
ఉన్నత వర్గాలకు చెందిన విజ్ఞులు, ప్రాజ్ఞులైన మనుషులు ఈ తంతును జాగ్రత్తగా, పధకబద్ధంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తారు. ఇవన్నీ వేకువజామున రహస్యంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తారు. వాటిని ఎవరూ చూడకుండా నిర్వహించాలన్నదే వాళ్ళ ఉద్దేశ్యం. ఈ పని చేసేవాళ్ళు ఎవ్వరూ దీనికి తమ బాధ్యత లేదని భావించేలా, అన్యాయమైన ఈ చర్యలకు బాధ్యతలని ముక్కలు ముక్కలుగా విడగొడతారు. ఉన్నతవర్గాల వాళ్ళు తాము స్వయంగా ఆమోదించి, రూపొందించిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం దురదృష్టవంతులనీ, అత్యంత దిగజారిన మనుషులనీ ఎంచుకొని, వాళ్ళతో పని నడిపించి, మళ్ళీ ఆ పని చేసేవాళ్ళని అసహ్యించుకుంటున్నట్టు నటిస్తూ ఉంటారు. ఇంత పథక బద్ధంగా దీనిని నిర్వహిస్తున్నప్పటికీ, ఈ మరణశిక్ష తీర్పులని ప్రకటించేది సైనిక ట్రిబ్యునళ్ళు కాగా, వాటిని అమలు జరిపేది మాత్రం పౌర యంత్రాంగం. అసంతుష్టులు, వంచితులు, భష్టులు, అసహ్యానికి గురయ్యే మనుషులతోటి ఈ తంతును అమలు జరుపుతారు. గట్టిగా బిగుసుకునేలా తాళ్ళని సబ్బు నీళ్ళలో నానబెట్టడం, ఆ తర్వాత తమ మానవ గుణాలనీ, ఆత్మలనీ మర్చిపోయి, జరిగినదంతా త్వరగా, పూర్తిగా మర్చిపోయేలా ఇదే విజ్ఞులైన కులీనవర్గం ఏర్పాటు చేసిన మద్యం విషయాన్ని పూటుగా పట్టించడమే వాళ్ళ పని. తర్వాత ఒక వైద్యుడు వస్తాడు, ఆ కళేబరాలని పరీక్షిస్తాడు. కార్యక్రమం సజావుగా జరిగిపోయిందనీ, పన్నెండు మందీ నిశ్చయంగా చనిపోయారనీ అధికారులకు నివేదిస్తాడు. ఆ తర్వాత, బాధాకరమే అయినా, అనివార్యమైన బాధ్యతని నిర్వర్తించామనే ఆలోచనతో అధికారులు తమ తమ పనులలోకి వెళ్ళిపోతారు. చల్లబడిపోయిన ఆ మృతదేహాలని ఇక కిందికి దించి, వాటిని ఖననం చేస్తారు.
ఇదొక ఘోరం!
ఇది ఒక్కసారి జరిగేది కాదు. రష్యాలోని అత్యుత్తమ వర్గానికి చెందిన ఈ పన్నెండు మంది దారితప్పిన, దురదృష్ట వంతుల విషయంలో జరిగింది మాత్రమే కాదు. సంవత్సరాలుగా దారి తప్పిన ఇటువంటి వందలు, వేలాది మంది విషయంలో ఇలాగే జరుగుతూ వుంది. ఈ ఘోరాన్ని నడిపించే వాళ్ళే ఆ జనాలని దారి తప్పేలా చేశారు.
ఈ దారుణం ఒక్కటి మాత్రమే కాదు. కారాగారాలలో, కోటలలో, నిర్బంధ శిబిరాలన్నిటిలో ఇదే సాకుతో, ఇంతే కౄరత్వంతో చిత్రహింసలు, హింస మరెన్నో అమలు జరుగుతూ ఉన్నాయి.
ఇది భయంకరమైనది. అంతకంటే భయంకరమైన విషయం – ఇవి ఘర్షణలు, యుద్ధాలు, దొంగతనాల వంటి వాటిలో జరిగేటట్లు హేతుబద్ధ ఆలోచననను వెనక్కి నెట్టి ఉద్వేగంలోనో, ఆవేశంలోనే జరిగేవి కావు. హేతుబద్ధంగా, ఉద్వేగాన్ని కప్పిపెట్టే కొలమానాలతో చేస్తున్న చర్యలివి. అందుకనే, ఈ చర్యలు అత్యంత భయంకరమైనవి. ఈ చర్యలు భయంకరమైనవి. న్యాయమూర్తి నుంచి తలారి దాకా వీటిని అమలు జరిపే మనుషులు, ఈ పని చేయాలని కోరుకోరు. మనిషి మీద మనిషి పెత్తనం, నియంతృత్వ పాలన మనుషుల హృదయాలను ఎంత నాశనం చేస్తుందో ఈ చర్యలు అత్యంత స్పష్టంగా రుజువు చేస్తున్నాయి. ఆ కారణం రీత్యా ఈ చర్యలు భయంకరమైనవి…
ఈ ఘోరాలు సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నాయి. ఎవరి ఉత్తర్వుల ప్రకారం ఇవన్నీ జరుగుతున్నాయో, ఎవరైతే వీటిని నివారించగలరో వాళ్ళు, వీటన్నింటికీ ముఖ్య బాధ్యులు అయిన వాళ్ళు మాత్రం ఈ చర్యలు ఉపయోగకరమైనవనీ, తప్పనిసరిగా ఇలాంటివి అవసరమనీ నమ్ముతూ ఉంటారు. ఇలాంటి చర్యలకు నియమాలను రూపొందిస్తూ వుంటారు. లేదంటే ఫిన్లాండు జాతీయులు తమకు నచ్చిన విధంగా కాకుండా కొంతమంది రష్యన్ వ్యక్తులు కోరుకున్న విధంగా జీవించేలా ఎలా వత్తిడి చేయాలో ఉపన్యాసాలను తయారు చేస్తూ వుంటారు. లేదంటే, అసంబధ్ధపు ఉత్తర్వులు, ‘హుస్సార్ రెజిమెంట్ లో మగవాళ్ళ అంగీలకు (జాకెట్లకు), చేతుల అంచులు, కాలర్ అన్నీ జాకెట్ రంగులోనే ఉండాలి, పొడవాటి ఉన్ని కోట్లు వేసుకునే అర్హత ఉన్నవాళ్ళు వాటిని వేసుకున్నప్పుడు ఆ కోటు చేతి అంచుల దగ్గర దారాలు ఉన్నిని కప్పివేసే విధంగా ఉండకూడదు’ వగైరా ఉత్తర్వులను జారీ చేస్తారు..
రష్యాలో ఇప్పుడు జరుగుతున్నదంతా అందరి సంక్షేమం పేరు మీద, రష్యా ప్రజల శాంతి, భద్రతల పేరు మీద జరుగుతూ వుంది. ఇదే నిజమైతే, రష్యాలో నివసిస్తున్న నాకోసం కూడా ఇదంతా జరుగుతూ ఉంది. అంటే, మనిషి తాను జన్మించిన భూమిని ఉపయోగించుకునే అత్యంత సహజమైన మానవ హక్కుని నిరాకరించిన పేదరికం నా కోసమే కొనసాగుతున్నది. ఐదు లక్షలమంది రైతు బిడ్డలని రైతు జీవితం నుంచి బలవంతంగా దూరం చేసి సైనిక దుస్తులు తొడిగి, మనుషులను చంపడాన్ని నేర్పించడం నాకోసమే జరుగుతూ వుంది. నిజమైన క్రైస్తవాన్ని కప్పిపెట్టి, వక్రీకరించడమే ప్రధాన బాధ్యతగా పనిచేసే అబద్ధపు పూజారితనం నాకోసమే కొనసాగుతూ వుంది. మనుషులని ఒక చోటు నుంచి మరొక చోటుకు తరలించే రవాణా, ఆకలితో మాడిపోయే లక్షలాదిమంది కార్మికుల వలసలు నాకోసమే కొనసాగుతూ ఉన్నాయి. కోటగోడల మధ్య, కిక్కిరిసిపోయిన చెరసాలలలో విష జ్వరాలు, స్కర్వీ వ్యాధి వగైరాలతో లక్షలాది మంది చనిపోతున్నది నాకోసమే. ఖైదీలు, ఉరితీయబడిన మనుషులు, ప్రవాసంలోకి పారిపోయిన వాళ్ళ తల్లులు, తండ్రులు, భార్యల కడగండ్లు, కన్నీళ్ళు నాకోసమే. ఇంతమంది గూఢచారులు, లంచగొండితనం ఇవన్నీ నా కోసమే. ఇన్ని ఖననాలు, వందలాది మంది కాల్చివేతలు అన్నీ నా కోసమే. ఉరితీసే తలారుల ఘోరమైన పని నా కోసమే జరుగుతూ ఉంది. మొదట్లో తలారులు దొరకడమే కష్టంగా ఉండేది, ఇప్పుడు వాళ్ళు తమ పనిని ఇక ఎంతమాత్రమూ అసహ్యించుకోవడం లేదు. ఇదంతా నా కోసమే జరుగుతూ ఉంది. ఆడవాళ్ళనీ, పిల్లలనీ, రైతులనీ ఉరి తీసే ఉరికంబాలు, గొంతు చుట్టూ బిగుసుకునేలా నీళ్లలో నానబెట్టిన ఉరి తాళ్ళూ నాకోసమే పనిచేస్తున్నాయి. మనిషిని సాటి మనిషి ద్వేషించే శత్రుత్వం నాకోసమే చెలరేగుతూ వుంది.
నాకోసమే ఇదంతా జరుగుతూ ఉందంటే, ఈ దారుణాలలో నేను భాగస్వామిగా ఉన్నానంటే వింతగా వుంది. విశాలమైన నాగది, నా విందు భోజనం, నేను ధరించిన వస్త్రాలు, నా విశ్రాంతి సమయం, వీటన్నింటికీ – వీటిని నానుంచి లాగేసుకోవాలని ప్రయత్నించేవాళ్ళని నిర్మూలించే దారుణమైన నేరాలకీ అవినాభావమైన సంబంధమేదో ఉందని నిస్సందేహంగా నాకనిపిస్తున్నది. ప్రభుత్వ చర్యల భయమే లేకుంటే, ఈ గూడులేని, తిరస్కృత జనం నా సౌకర్యాలన్నిటినీ నానుంచి తీసేసుకుంటారని నాకు తెలుసు. ఈ జనం అందరూ ప్రభుత్వ చర్యల పర్యవసానంగా ఉద్భవించిన జనమే. అయినా, నేను అనుభవిస్తున్న శాంతి ప్రభుత్వం అమలుజరుపుతున్న దారుణాలు పునాదిమీద ఆధారపడిందేననే అభిప్రాయం నాకు కలుగుతున్నది.
ఈ విషయాన్ని గుర్తించాక నేనిక దీనిని భరించలేను. దుస్సహమైన ఈ స్థితి నుంచి నన్ను నేను విముక్తి చేసుకోవాలి!
నేను ఈ విధంగా జీవించలేను! ఈ విధంగా జీవితాన్ని కొనసాగించడం నాకింక సాధ్యం కాదు!
అందుకే నేనీ మాటలు రాస్తున్నాను. రష్యాలోపలా, ఇతర దేశాలలోనూ నా శక్తి మేరకు ఈ వ్యాసాన్ని నేను ప్రచారంలోకి తెస్తాను. రెండు విషయాలలో ఏదైనా జరగవచ్చు. ఈ అమానుష చర్యలు ఆగడమో, లేదా వీటితో నా సంబంధం తొలగిపోయి, నన్ను జైలులో నిర్బంధించడమో జరగాలి. నన్ను జైలులో నిర్బంధిస్తే, ఈ దారుణాలు నాకోసం జరగడం లేదని నాకు స్పష్టంగా తెలుస్తుంది. లేదంటే, ఆ పన్నెండు మందిని చంపినట్టు, నా తలపై ముసుగు వస్త్రాన్ని కప్పి, కాళ్ళ కింద బల్లని తన్ని వేస్తే, నా బరువుకు నా ముసలి గొంతు చుట్టూ తడి తాడు బిగుసుకుని చనిపోవడం జరుగుతుంది. అది అంతకంటే మేలైన విషయం (అంతకంటే ఆనందం నాకు వేరేలేదు)…
వ్యాసం గురించి కొంచెం
1908 ఆగస్టు 28 టాల్ స్టాయ్ కి ఎనభై ఏళ్ళు నిండబోతున్నాయి. ఆనాడది ఒక సంరంభం. ఎటువంటి వేడుకలు, ఉత్సవాలు జరపవద్దని టాల్ స్టాయ్ ప్రత్యేకంగా వారించాడు. 1908 ప్రారంభం నుండే టాల్ స్టాయ్ ఎనభైయవ పుట్టినరోజు వేడుకలని ఎలా జరపాలా అని విస్తృతమైన చర్చలు మొదలయ్యాయి. రైతాంగం, భూ పంపకాలు, మరణశిక్ష, జైళ్ళలో నిర్బంధం వంటి విషయాలలో టాల్ స్టాయ్ వైఖరిని ప్రగతిశీల శక్తులు సానుకూలంగా చూశాయి. అది జార్ ప్రభుత్వానికి కొరుకుడు పడలేదు. టాల్ స్టాయ్ పుట్టిన రోజు వేడుకల విషయంలో శాంతి భద్రతలు కాపాడాలని 1908 మార్చిలో హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత నెలలలో టాల్ స్టాయ్ పుట్టినరోజు వేడుకల్ని నిషేధిస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. పత్రికలు టాల్ స్టాయ్ గురించి పలు కథనాలు ప్రచురించాయి. పుట్టిన రోజు వేడుకలు ఎలా జరిపితే బాగుంటుందా అని సర్వేలు, ఇంటర్వ్యూలు నిర్వహించాయి.
‘ఆయన చెప్పులు కుట్టినప్పుడు, తాను నవలలు రాసివుండాల్సిందని అన్నారు. ఆయన నవలలు రాసినప్పుడు, తాను చెప్పులు కుట్టివుండాల్సిందని అన్నారు. మాంసాహారంతో ఉపవాస నియమాలని ఉల్లంఘిస్తున్నాడా అని ఆయన వంటగదిపై నిఘా వేశారు… తన రచనలు, నడవడిక, ఆలోచనలు అన్నిటినీ టోకున, చిల్లర ధరలకీ కొనివేశారు.. తన ఎనభైయవ పుట్టిన రోజు వచ్చేసరికి ఆ ఉత్సవాలని ఎందుకు జరపాలి, ఎలా జరపాలా అని చర్చించడం మొదలు పెట్టారు’, అని క్యాడెట్ ల పత్రిక (రెచ్ )లో ఒకరు రాశారు (మార్చి 2008).
ఈ చర్చలలో వివాదాలు రేగాయి. ఎనభైయవ జన్మదినం సందర్బంగా తన గౌరవార్ధం టాల్ స్టాయ్ ని జైలులో నిర్బంధించాలని ఎ ఎం బోడియాన్స్కీ అనే ఒక మాజీ భూస్వామి పత్రికలలో ఒక బహిరంగ లేఖ రాశాడు. ‘అందమైన, వాస్తవమైన, దుర్గంధ భరితమైన, ఆకలికీ, చలికీ బందీలను వదిలివేసే బందిఖానాలో నిర్బంధిస్తే అంతకు మించిన ఆనందం ఉండబోద’ని టాల్ స్టాయ్ తనకి వ్యక్తిగతంగా సమాధానమిచ్చాడు.
ఈ నేపథ్యంలోనే టాల్ స్టాయ్ పై వ్యాసాన్ని రాసాడు. ఈ వ్యాసం సంచలనాన్ని రేకెత్తించింది. ఈ వ్యాసంలోని భాగాలను ప్రచురించిన పత్రికలకు రష్యాలో జరిమానా విధించారు. అయినా ఇది రహస్యంగా అచ్చయి ప్రచారంలోకి వెళ్ళింది. విదేశాలలో పత్రికలు కూడా ఈ వ్యాసాన్ని ప్రచురించాయి. న్యూయార్క్ టైమ్స్ పత్రిక జూలై 19, 2008 న ఈ వ్యాసాన్ని ప్రచురించింది.
రష్యన్ విప్లవానికి డ్రస్ రిహార్సల్ గా లెనిన్ వర్ణించిన మొదటి రష్యన్ విప్లవ కాలంలో రైతాంగ తిరుగుబాటు, దాని అణచివేతలో అమలు జరిగిన హింసాకాండ ఈ వ్యాసానికి అసలు నేపథ్యంగా చెప్పుకోవచ్చు.
రష్యన్ విప్లవానికి దర్పణంగా అభివర్ణించిన లెనిన్ , టాల్ స్టాయ్ గురించి తన వ్యాసాలలో వివరంగా చర్చించాడు. “పెట్టుబడిదారీ వ్యవస్థ మీద ఆయన అవిశ్రాంతంగా సాగించిన నిందారోపణలు అత్యంత ప్రగాఢమైన అనుభూతితోనూ, తీవ్రమైన ఆగ్రహంతోనూ కూడుకొన్నవి. గ్రామీణ జీవితపు “మూలస్తంభాల” న్నిటినీ నాశనం చేసి మునుపెన్నడూ ఎరగనంతటి వినాశనాన్నీ, పేదరికాన్నీ, పస్తులనూ, కిరాతకత్వాన్నీ, పడుపువృత్తినీ, సిఫిలిస్ వ్యాధినీ, ఇంకా ఆదిమ సంచయన యుగం”తో వచ్చే సకల వినాశనాలను సర్వ శక్తివంతమైన “శ్రీమాన్ కూపన్ గారు” పెంపొందించిన అత్యాధునిక కొల్లదారీ పద్ధతులను రష్యన్ గడ్డపైకి తెచ్చి నాటడంతో వందరెట్లు తీవ్రమైన సకల వినాశనాలను తనవెంట కొనితెస్తూ ఎక్కడో నగరాలనుండో, విదేశాల నుండో వస్తున్న కనిపించని, అర్ధం చేసుకోలేని, కొత్త శతృవు రాకతో పితృస్వామిక రైతులో కలిగిన భయాన్నంతటినీ ఆ నిందారోపణలు వెల్లడి చేస్తాయి.” – లియో టాల్ స్టాయ్ వ్యాసం, లెనిన్.
“పాలకవర్గాల మీద టాల్ స్టాయ్ చేసిన అభియోగం ఎంతో శక్తితోటి, నిజాయితీతో కూడుకున్నది. ఆధునిక సమాజాన్ని నిలబెట్టే చర్చీ, న్యాయస్థానాలూ, మిలిటరిజము, “చట్టబద్ధమైన వివాహము, బూర్జువా శాస్త్ర విజ్ఞానమూ అనే సంస్థలన్నింటి లోపలి బూటకత్వాన్ని ఆయన పూర్తి స్పష్టతతో బట్టబయలు చేశాడు. … ఎవరి దృక్పథాన్ని లియోటాల్ స్టాయ్ బోదనలు ప్రతిబింబించినట్టు? ఆయన నోటిద్వారా మాట్లాడింది ఎవరంటే, ఆధునిక జీవితపు యజమానులని అప్పటికే యేవగించుకొంటూ, అయితే వాళ్ళతో తెలివి తేటలతో కూడిన, సుసంగతమైన, కొరతలు లేని, రాజీ- లేని పోరాటం చేసే స్థితికి ఇంకా చేరుకోకుండా వున్న అసంఖ్యాకమైన రష్యన్ ప్రజాబాహుళ్యం.” – టాల్ స్టాయ్ కార్మికవర్గ పోరాటం వ్యాసం, లెనిన్.
మరణ శిక్షల పట్ల టాల్ స్టాయ్ వ్యతిరేకతకీ, తీవ్రమైన నైతిక ఆగ్రహానికీ ఈ వ్యాసం ఒక ఉదాహరణ. ఈ వ్యాసంపై రష్యాలో పెద్ద దుమారం చెలరేగింది. టాల్ స్టాయ్ ని దూషిస్తూ అనేక ఉత్తరాలు వచ్చాయి. ఇప్పటి భాషలో వీటిని ట్రోలింగ్ గా చెప్పుకోవచ్చునేమో. 2008 జూలై, ఆగస్టు నెలలలో టాల్ స్టాయ్ ఇంటికి దాదాపు ఇరవై ఉత్తరాలు చేరాయి. ‘రష్యన్ మాత’ పేరుతో వచ్చిన ఒక ఉత్తరంతో పాటు (ఉరి) తాడు ముక్కను కూడా పంపారు. ఆగస్టు 26, 2008 తేదీతో వచ్చిన ఉత్తరంలో, ‘నీ ఉత్తరానికి జవాబు. ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా నువ్వే ఆ పని చేసుకోవచ్చు. అది తేలిక. ఈ పని చేయడం ద్వారా నువ్వు మన దేశానికీ, మన యువతరానికి మేలు చేసినవాడవౌతావు’ అని రాశారు. తిరగబడిన రైతాంగం హింసాత్మక చర్యలను పేర్కొంటూ, టాల్ స్టాయ్ వాటికి మద్దతు తెలుపుతున్నాడంటూ నిందించారు. అయితే టాల్ స్టాయ్ కు మద్దతుగా కూడా అనేక ఉత్తరాలు వచ్చాయి.
ప్రస్తుతం మనం చూస్తున్న రాజకీయ పరిస్తితుల్ని, అరాచక రాజ్యహింసని, వీటికి బలైపోతున్న సామాన్య ప్రజల ప్రాణాల్ని, వాటి చివరి కదలికల కొసల్ని గుర్తు చేస్తున్నట్టు వుంది. చివరికి ఇదంతా నా కోసమే, మన మధ్యనే .. Thanks to Kiran
varthmana sandrbhaniki saripoyinatlugaa unna chaaritraka vyasam. kiran gaariki dhnyavaadaalu
అభినందనలు. ప్రస్తుత పరిస్తికి అద్ధం పట్టుతుంది