నీకు ఒక చిట్టి కథ చెప్పాలనుకున్నాను
ఒక పాప ఒక బాబు
అడవిలోకి వెళ్లారట
వెళ్లి అందరికీ శాంతిని తెచ్చిచ్చారట అంటూ
కానీ
నువ్వు నాకళ్లలో కళ్లు పెట్టి చూస్తావే
అప్పుడిక నీకు అబద్ధం చెప్పలేను
న్యాయం లేని చోట శాంతికెక్కడిది చోటు?
రక్తపు తడి ఆరని ఆకుల అడవి
బిడ్డల కన్నీళు కారుస్తోంది
భూమీ గుక్కపట్టి మూగబోయింది
వందేమాతర గీతానికి దేశం ఊగిపోతుంటే
ప్రజాస్వామ్యం గుండెలోకి
కొమ్ములు దించుతోంది కాషాయం
నేరస్థుడు ఉన్నతాసనం మీదనుంచి అజ్ఞాపిస్తునే ఉన్నాడు
న్యాయం ఉరికంబం ఎక్కుతూనే ఉంది
శాశ్వతమైనట్లు జీవితం, ఆత్మసంతృప్తి కలలు కంటూనే ఉంది
ఉక్కిరిబిక్కిరవుతోంది పౌరస్వేచ్ఛ, ఊపిరాడక
కానీ, నా కళ్లలోకి కళ్లు పెట్టి నువ్వు చూసినప్పుడు
చిన్నారులను సేద తీర్చుతూ కథలు చెప్పే భూమిని కలలు కంటాను
ఒరిగిపోయిన ఒక్కొక్క నక్షత్రం నుంచి
వేనవేల స్వరాలు మొలకెత్తిన అద్భుతమైన కాలం కోసం
వీధివీధినా పోరాడాలనుకుంటాను