అరమరికలు తెలిసిన నువ్వు మరని కనిపెట్టావు కదా
అది నిన్ను అమా౦తం మింగేసింది
ముందొచ్చిన కరచాలనం కంటే
వెనకొచ్చిన స్మయిలీలు ముద్దొస్తాయి
నేల వాలిన నీడలు గోడెక్కి కూచున్నాయి
గోడ తల బాదుకోవడానికి బాగా పనికొస్తుంది
తలకొక గోడ చొప్పున నింగీ నేలా గోడలే
రెండు మూడు తలకాయలున్నవాళ్ళకి
నాలుగైదు గోడలు కూడా వున్నాయి
ఆ గోడమీద నుంచి ఈ గోడ మీదికి తొంగిచూడచ్చు
బట్, కండిషన్స్ అప్లయిడ్
ఏ భాషలో మాట్లాడుకోవాలో గోడే నీకు చెబుతుంది
గుమ్మరించిన ఇమేజీల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవడంలో పడి
స్వంతంగా స్పందించడం మర్చిపోతావు
ఏది తోచినా తోచకపోయినా రోజుకింత చొప్పున ముక్కు చీది
గోడకి రాయచ్చు
ఇంకొకరి గోడమీద అవే మరకల్ని చదువుకోవచ్చు
ఈ మరలు అరమరలు లేని రోజుల్లో కూడా గోడలు౦డేవి
అవి విప్లవ నినాదాలు చేసేవి
అప్పుడప్పుడు ఎవడో దుర్మార్గుడు వాటిని కిళ్ళీ మరకలతోనే , మూత్రంతోనో
ఖరాబు చేసేవాడు
గోడలు కూల్చితే తప్ప అసమానతలు పోవు
-అనుకునే రోజులు కొన్ని వుండేవి
మొత్తానికి మంచో చెడో గోడ కి ఒక స్వభావం వుండేది
గోడల్ని జయించాలనే కోరిక వుండేది
శత్రువు ముఖం స్పష్టంగా కనిపించేది
ఈ గోడలదారి వేరు
ఇవి మరుగుజ్జు నీడల్ని మోస్తున్న గోడలు
ఇక్కడ హతుడివి హంతకుడివి నువ్వే
మర నిన్ను పదే పదే మ్యారిటల్ రేప్ చేస్తుంది
కాపురానికి అత్యాచారానికి తేడా తెలియని నువ్వు
కేవలం అలవాట్ల అంధకారం వల్ల దానికి లొంగిపోతావు
అలా లొంగిపొమ్మని చాలామందికి రిక్వెస్టులు కూడా పెడతావు
లొంగడం చాత కాని వాళ్ళకి కోచింగ్ కూడా ఇస్తావు
ఎంత గుట్టుగా బతుకుతున్నా సరే
గంటకో వైరస్ కన్నుకొడుతూనే వుంటుంది
ఖ౦గారు పడి ఇంకో విండోలోకి పారిపోతావు
లేదా అంతులేని పెనుగులాటలో అలిసిపోతావు
వైరస్ తో యుద్ధానికి కొత్త కొత్త సాఫ్ట్ వేర్లను పంపిస్తావు
అది డజన్ల కొద్ది చిల్లర దొంగల్లాంటి కుకీస్ ని వదిలిపోతుంది
నా పాదాల చె౦త నీకింక చోటు లేదు
అని డిస్క్ లోంచి హెచ్చరికలు వస్తూ వుంటాయి
ఏం చేయాలో తోచక జీవితాన్ని ఒకసారి ఫార్మెట్ చేస్తావు
అప్పుడు మొత్తంగా ఖాళీ అయిపోతావు
ఎంత తల బాదుకున్నా సరే పాస్ వర్డ్ గుర్తురాదు.