మూలం: మౌమితా ఆలం (Congratulations! Your Silence Has Won)
అతి పెద్ద విస్పోటనంతో ఉన్నట్లుండి, అప్పటికప్పుడు ప్రళయం వచ్చిందంటావా?
లేదు
అది మెల్లిగా వండబడింది
అచ్చం వైద్య పరిశోధన చేసినట్లుగా… అంతే మెల్లిగా శుభ్రం కూడా చేయబడింది.
చరిత్ర సమస్తమూ తుడిచివేయబడింది.
పురుషులు రాక్షసులుగా తయారు కాబడ్డారు.
కూల్చేసిన సమాధులు భూమికి సమతలంగా సరిచేయబడ్డాయి.
కనిపించే దృశ్యాలన్నీ అదృశ్యంగా మార్చబడ్డాయి.
గుజరాత్ లో మత విద్వేష గొడవల్లో ధ్వంసం అయిన సూఫీ కవి వాలీ ధకానీ సమాధి ఉన్న వీధి కూడా ధ్వంసం కాబడి సమంగా చేయబడింది.
అత్యంత కిరాతకమైన రేపిస్టులు కూడా సంస్కారులుగా సత్కరించబడ్డారు.
నిత్యం నేను నా కలల్లో మంటల్లో తగలబడిపోతున్న దేహాలతో విలవిల్లాడుతూ ఉండే మనుషుల్ని చూస్తాను.
గ్యాస్ చాంబర్స్ వైపు వాళ్ళు ఎలా తరమబడ్డారని అడుగుతాను.
అంతే కాదు, వాళ్ళ స్త్రీలను అత్యాచారాలు చేసిన వాళ్లేం పాటలు పాడారని కూడా వాకబు చేస్తాను
అప్పుడు కాలిన దేహాలతో వాళ్ళు వెంటనే ఏం చెప్పారంటే, లేదు మేము పాటలేం వినలేదు
మేం విన్నదంతా ఇంతన్యాయం చూస్తున్న మా పొరుగువాళ్ళ నిశబ్దం మాత్రమే
వొట్టి చావు నిశబ్దం… వెంటాడి, వేటాడే నిశ్శబ్దమే మాకు వినిపించింది.
మరి ఆ నిశ్శబ్దం, ఇప్పుడు బస్సుల్లో, టీవీలున్న గదుల్లో, వార్తా పత్రికల్లో, వంటగదుల్లో, పార్ల మెంటుల్లో వినిపిస్తున్నట్లు చాలా పెద్ద శబ్దంతో ఉందా అని నేను ధైర్యం చేసి అడగలేక పోయాను.
కాలి మసిబొగ్గైన శవాల వాసన ఒక అంటువ్యాధి లాంటిది.
నా చర్మం నుంచి కూడా కాలిన శవాల వాసన వస్తోంది
అభినందనలు మీకూ,
మీ చెవిటితనం లాంటి నిశబ్దానికి
నిజంగా మీరే గెలిచారు