నీ కాంతి నిద్రించడానికి వీల్లేదు

నీ కాంతి నిద్రించడానికి వీల్లేదు
ఎల్లకాలం శవాసనంలో నిద్రించడానికి వీల్లేదు
మట్టి లోపల ఎముకలపై మిగలడానికి వీల్లేదు
మౌనంలో కూరుకుపోవడానికి
శూన్యంలో శూన్యంగా మారడానికి
మంటల్లో కాలి బూడిదవ్వడానికి ఏమాత్రం వీల్లేదు

నీ కాంతి ప్రవహించాలి
మంచుకొండల్లోంచి నీ కాంతి ప్రవహించాలి
రైతు నాగలి వెంబడి నడిచి పదునెక్కాలి
ముగింపు లేని చూపులో నక్షత్రాల భాషలో
నీ కాంతి నిండిపోవాలి
అనేక రాత్రులు అనేక పగళ్ళు అనేక కాలాలు ప్రవహించాలి
నియంతలు నివ్వెరపోయేలా ప్రవహించాలి
సూర్యచంద్రుల కాంతి సరిపోదు
కనిపించీ కనిపించని గ్రహాల కాంతి సరిపోదు
చాలీ చాలని రొట్టె ముక్కల కాంతి సరిపోదు
జలపాతంలా కురవాలి
మహాశూన్యాన్ని ఓడించే శబ్దాల కాంతి కురవాలి
మారణహోమాన్ని ఓడించే నీ కాంతిని చూడటానికి
ఎల్లప్పుడూ
నీ కవిత్వ పాదాల చివరంచున
నే నిలబడే ఉంటాను.

అంకితం :
Gulfisha Fatima, Indian Poet & Activist
Nour Allasy, Palestinian Poet & Journalist

  1. Missing Tribe

కొండను
కోటానుకోట్ల ముక్కలుగా చేసి
పొడి చేసి
గాలిలోకి తరలించి
మిస్సింగ్ అంటారేమిటి?

చెరువుల్లో నదుల్లో వల వేసి
చేపలకు ఉరేసి
మీ పొట్ట నింపుకున్నాక
మిస్సింగ్ అంటారేమిటి?

వేర్లనూ చెట్లనూ
వేరు వేరు తెగలుగా చేసి
నక్షత్రానికో చెట్టును వేలాడదీసి
మిస్సింగ్ అంటారేమిటి?

విత్తనాలను పసిగట్టి
యాసిడ్ పోసి
భూమిని నాశనం చేసి
మిస్సింగ్ అంటారేమిటి?
••

హఠాత్తుగా మాయం కావడం కాదు
ఇక్కడ మిస్సింగ్ అంటే..
హత్యకాబడటం.

3.

నువ్వు – నేను

శవాలను పూడ్చడానికి
గొయ్యి తొవ్వాల్సిన పని లేదు
ఆ పని బాంబులు చేశాయి

పూడ్చడానికి
పిల్లలను శవాలుగా మార్చే పని లేదు
ఆ పని బాంబులు చేశాయి

పూడ్చబడ్డ శవాలపై
పక్షులు వాలే పని లేదు
ఆ పనీ బాంబులే చేశాయి

మనుషులపై బాంబులు పడ్డప్పుడు
మౌనంగా ఉన్నావు
శవాలపై బాంబులు పడ్డప్పుడూ
మౌనంగానే ఉన్నావు

“అసలు
ఎవరి మీద బాంబులు పడితే
నువ్వు మౌనం వదులుతావు?”
అని అడగాలని బయలుదేరాను

హృదయం కోల్పోయిన నువ్వు
ప్రాణం కూడా కోల్పోయావని తెలిసింది

నీకిప్పుడు
బాగా నిద్రపోవడమే ఏకైన పని
నేను
మరిన్ని బాంబుల శబ్దాలను భరించాలి
మరికొన్ని శవాలను మోసుకెళ్లాలి

నువ్వు – మౌనంలోంచి మౌనంలోకి
నేను – స్మశానం నుండి మరో స్మశానంలోకి.

పుట్టిన ఊరు వింజమూరు, నల్లగొండ జిల్లా. కవి, సామాజిక కార్యకర్త. ఎనిమిదో తరగతి నుంచే కవిత్వం రాస్తున్నాడు. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం ప్రాచ్య కళాశాల(నల్లకుంట, హైదరాబాద్)లో డిగ్రీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎం.ఎ తెలుగు లిట్ పూర్తి చేసాడు. ప్రస్తుతం జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. ప్రవృత్తి ఫోటోగ్రఫీ.

Leave a Reply