ఒక వైపు బయట నుండి సంఘసంస్కరణ ఉద్యమం, మరొక వైపు లోపలి నుండి చైతన్యవంత మవుతున్న ఆది హిందువుల ఆత్మగౌరవ ఉద్యమం సంప్రదాయ విశ్వాసాలతో, నిర్మాణాలతో తలపడుతూ విస్తరిస్తూ వున్నసామాజిక చారిత్రక సందర్భంలో దళిత జనజీవన వేదనల వ్యక్తీకరణ మాధ్యమంగా తెలుగు సాహిత్యం ఒక ఆయుధంగా పదునెక్కుతూ వచ్చింది. అయితే అదంతా ప్రధానంగా కవిత్వం. గురజాడ, మంగిపూడి వంటి సవర్ణులైనా, కుసుమధర్మన్న, గొల్లపూడి శామ్యుల్ వంటి దళితులైనా వ్రాసింది కవిత్వమే. కవిత్వం భావోద్వేగాల వ్యక్తీకరణ. వర్ణన ద్వారా సమస్య స్వరూప స్వభావాలను పాఠకుల అనుభవానికి తీసుకురావటం దాని లక్షణం. సమస్యను వాస్తవ సామాజిక మానవ జీవిత సంబంధాలలో భాగంగా భిన్న కోణాలనుండి ప్రదర్శించగలిగినవి కథ, నవల వంటి వచన సాహిత్య ప్రక్రియలు. మాలపల్లి, హరిజనాభ్యుదయం వంటి నవలలు ఆ పని ఎట్లా చేశాయో ఇంతకుముందు చూసాం. ఈ నేపథ్యంలో తెలుగు కథ దళిత జీవితాన్ని ప్రతి ఫలించిన తీరును పరిశీలించటం ఆసక్తికరంగా ఉంటుంది.
తెలుగులో ఆధునిక కథ సంస్కరణోద్యమంతో పాటే రూపు తీసుకొంటూ వచ్చింది. తొలితెలుగు కథకులుగా చర్చలోకి వచ్చిన 20 వ శతాబ్ది తొలిదశకపు రచయితలు బండారు అచ్చమాంబ అయినా గురజాడ అప్పారావు అయినా స్త్రీ సమస్య ప్రధానంగా కథలు వ్రాసినవారే. రెండవ దశకంలో కానీ దళిత జీవిత్త పార్శ్వాల ప్రస్తావన కథలలో భాగం కాలేదు. ప్రస్తుతానికి 1927 జులై 16 నాటి గోల్కొండ పత్రికలో అచ్చయిన ‘యౌవనభ్రాంతి’ కథ అందుకు మొదటిది. కటంగూరి నరసింహారెడ్డి కథారచయిత. నిజానికి ఇది చదువు లలో, ఆటపాటలలో మేటి అనిపించుకొంటూ, హైకోర్టు న్యాయాధిపతి రావు బహదూర్ ముత్తయ్యగారి అభిమానం పొంది,అప్పటికే అతని కూతురు నళిని పట్ల ఆకర్షితుడై, ఆ విషయం చెప్పక ముందే ఆమెకు మరి ఒకరితో వివాహం కావటంవల్ల విఫల మనోరథుడు అయిన సుదర్శనుడు అనే యువకుడి కథ. ఇతని కులం ఏమిటన్నసూచన కూడా ఏమీ లేదు. ఇంతవరకైతే ఇది ఒక పక్వానికి రాని ప్రేమ కథ.వ్యక్తం కాకుండానే విఫలమైన ప్రేమ కథ. అయితే ఆ హైకోర్టు న్యాయాధిపతి, రావు బహదూర్ ముత్తయ్య గురించిన పరిచయంలో ఆ నాటి కుల సామాజిక వాస్తవికత ప్రతిఫలిస్తున్నది కనుక ఈ సందర్భంలో అది ప్రస్తావించవలసిన కథ అవుతున్నది.
ముత్తయ్య హైకోర్టు న్యాయాధిపతి పదవిలో ఉన్నందున, రావుబహదూర్ బిరుదుతో బ్రిటిష్ పాలకులు గౌరవించిన వాడు కావటం వలన అతని నిమ్నజాతి గురించి ఎవరూ పైకి మాట్లాడటం లేదు కానీ ఉత్తమ హిందూ కుటుంబాలు దరికి రానియ్యకపోవటం వలన బ్రహ్మసమాజంలో చేరాడని, ఆ సమాజం నుండే విద్యావంతురాలైన ఒక యువతిని పెళ్ళాడి ముగ్గురు బిడ్డల తండ్రి అయ్యాడని, మూడవ బిడ్డ పుట్టాక భార్య వ్యాధిగ్రస్థురాలై మరణించిందని ఆ పరిచయ సారాంశం. ఈ కథ వ్రాయబడిన సంవత్సరమే అంబేద్కర్ అస్పృశ్యతా వ్యతిరేక ఉద్యమం ప్రారంభించాడు. హైద్రాబాద్ లో భాగ్యరెడ్డివర్మ ఆది ఆంధ్రుల అభ్యుదయానికి అంకితమై ఉన్నాడు. శుచీ శుభ్రత, చదువు సంస్కారం,ఆర్ధిక అధికార ప్రాభవం వంటివి ఎన్ని సాధించినా దళితులు సవర్ణులతో సమాన గౌరవ ప్రపత్తులు పొందే అవకాశం లేక పోవటం ఒక సామాజిక విషాదంగా అనుభవంలోకి వస్తున్న సందర్భం నుండి హిందూ వర్ణ వ్యవస్థలో ఉపాంతీకరణకు గురవుతున్న వాళ్ళు ఆత్మగౌరవ స్పృహతో వెతుక్కొనే ప్రత్యామ్నాయం అయితే బ్రహ్మసమాజం లేదా మతాంతరీకరణ. ఆ క్రమంలోనే బాగ్యరెడ్డివర్మ బ్రహ్మసమాజం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఈ సమకాలీన పరిణామాల ప్రతిఫలనమే ఈ కథలో ముత్తయ్య పాత్ర పరిచయంలో కనబడుతుంది. అతనిని హైకోర్టు జడ్జీ గా చెప్పటంలో అంతకు ముందు సంవత్సరమే లాయర్ గా వృత్తిజీవితం ప్రారం భించిన అంబేద్కర్ స్ఫూర్తి కూడా ఉండవచ్చు. అందరికీ న్యాయం చెప్పగల స్థాయికి ఎదిగిన మనిషికి దక్కని సామాజిక న్యాయం గురించి కేంద్రంలోకి తెచ్చి ఆలోచింప చేయటం కూడా లక్ష్యం అయివుండాలి. ఏమైనప్పటికీ సాటిమనిషిగా సామాజిక గుర్తింపుకు నోచుకోని ముత్తయ్య మనసుకు కలిగిన నొప్పికి లేపనం బ్రహ్మసమాజం అయింది. జాతిమత కుల వివక్షను వ్యతిరేకించే హిందూ మత సంస్కరణ ఉద్యమం బ్రహ్మసమాజం. ఆ మేరకు అది పురోగమన లక్షణం కలది. స్త్రీవిద్య కు, వివాహ సంస్కరణలకు కూడా అందులో స్థానం ఉంది. ఆ కారణంగానే ముత్తయ్య వంటి విద్యాధిక దళిత యువత బ్రహ్మసామాజికులు అవుతున్న సమకాలీన సామాజిక స్థితిని ఈ కథ సూచించింది.
దళిత సమస్యను ప్రస్తావించిన ‘యౌవన భ్రాంతి’ కథ వచ్చిన గోల్కొండ పత్రికలోనే ఆ తరువాత ఆరునెలలకు అచ్చయిన ‘నేరేడు పండ్లకంటు’ ( 15 ఫిబ్రవరి 1928) మరొకటి. కథ రచయిత శ్రీనివాసులు యానాం ప్రాంతపు ఆదిమాంధ్ర విద్యార్థి. భార్యాభర్తల సంవాద రూపంలో నడిచే ఈ కథలోనూ వస్తువు ప్రత్యక్షంగా దళిత జీవితం కాదు. దళితులపట్ల, అస్పృశ్యత పట్ల చదువుకున్న మధ్యతరగతి బ్రాహ్మణవర్గం వైఖరిని చర్చకు పెట్టిన కథ ఇది. సందర్భం బజారులో నేరేడు పండ్లు అమ్ముకొంటున్న ఆడమనిషిని పిలిచి ఒక ఇల్లాలు పండ్లు కొనాలనుకొనటం. మాల స్త్రీ దగ్గర పండ్లు కొనటం చూస్తే ఎవరైనా ఆక్షేపిస్తారంటూ భర్త అభ్యంతర పెట్టటం, దానిని నిరాకరిస్తూ ఆమె వాదన చేయటం – ఇదీ కథ. ఈ క్రమంలో రచయిత భార్యముఖంగా దళితులపట్ల నాగరికులు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని విమర్శకు పెట్టాడు.పరాయి ప్రాంతాలలో చదువుకొని నాగరికులైన ఆది ఆంధ్రులతో స్నేహం చేసి కలిసి పోయినట్లు ఉదారులవలె ,సంస్కర్తల వలే ప్రవర్తించేవారి మనోబుద్ధులు యధా పూర్వకంగానే ఉన్నాయని స్వస్థానాలలో, మరీ ముఖ్యంగా పేదవర్గాల పట్ల అస్పృశ్యతను పాటించటమే పరువు ప్రతిష్టలుగా భావించే స్థితిలోనే ఉన్న భర్త పాత్ర ప్రవృత్తి ద్వారా సూచించాడు రచయిత. రకరకాల పనులమీద పరాయి ప్రాంతాలకు వెళ్లివచ్చే పురుషుల అస్పృశ్యనిరాకరణ అవసరార్ధంగానో అవకాశవాదంగానో ఆచరించబడుతున్న తీరును గుర్తించిన రచయిత ఈ కథలో దానిని విమర్శకు పెట్టటానికి పుస్తకాలు చదివి ప్రపంచ జ్ఞానం అలవరచుకొంటున్న గృహిణి పాత్రను ఉపయోగించు కున్నాడు. వాళ్ళవి లౌకిక విషయ లౌల్యాలతో ఇంకా కలుషితంకాని మనోబుద్ధులు. కనుకనే భార్య ‘ఒక ఆదిమాంధ్రుడు ఇచ్చిన సిల్కు కండువా, గొడుగు, పట్టెకోటు బహుమతిగా పుచ్చుకొన్నప్పుడు లేని అంటు మాల స్త్రీ వద్ద కొనే నేరేడు పండ్ల కు ఎక్కడినుండి వస్తుంది’ అని అడగగలిగింది. అటువంటి ప్రశ్నలకు జవాబిచ్చే మొహంలేని మనుషుల అల్పత్వాన్ని ఈ కథలో ఎత్తి చూపాడు రచయిత. ( ఎన్. యాకయ్య – గోలకొండ పత్రిక – సాహిత్య ,సాంస్కృతిక చైతన్యం ,పిహెచ్ డి సిద్ధాంత గ్రంధం,2018, అముద్రితం)
1932లో గృహలక్ష్మి పత్రికలో దళిత జీవిత కథలు రెండు లభిస్తున్నాయి. కనుమర్తి రామకోటయ్య చౌదరి వ్రాసిన ‘అంటరాని బాలిక’ ఒక కథ(మార్చ్). అనువాదకథ అని ఉంది. మూల రచయిత ఎవరో తెలియదు. రూప అంటరాని బాలిక. ఇంగ్లిష్ చదువు చదివిన యువకుడు తమ ఇంటి పనులకు వచ్చిపోయే ఆమె పట్ల తల్లి, పినతల్లి ప్రవర్తించే తీరుకు నొచ్చుకొంటుంటాడు. ఆమె పట్ల అతనిలో ఒక సానుభూతి, స్నేహం ఏర్పడతాయి. అందువల్లనే ఆమె తండ్రి జబ్బు పడ్డప్పుడు స్వచ్ఛందంగా ఆదుకొంటాడు. ఆ కృతజ్ఞతతోనే రూప ఊళ్ళో కలరా వ్యాపించినప్పుడు, ఆ వ్యాధి బారినపడిన అతని తల్లికి, ఆ తరువాత అతనికి సేవలు చేసి వాళ్ళ ప్రాణాలను కాపాడుతుంది. చివరికి తానే ఆ వ్యాధికి గురై మరణిస్తుంది. ఈ విధమైన ముగింపు సవర్ణులు తమపట్ల ఎంత శత్రు వైఖరిని అవలంబించినా దళితులు మాత్రం తమ సేవాధర్మం పాటిస్తూ ఉండవలసినదే అని సూచిస్తుందా లేక కృతజ్ఞతా భావం మూర్తీభవించిన దళిత వ్యక్తిత్వ నిరూపణమా అని ఆలోచించాలి. ఈ మొత్తం క్రమంలో రూపకు, ఆ యువకుడికి మధ్య ఆకర్షణ, అనురాగం ఏవో వినిమయం జరుగుతున్నట్లు కథనంలో సూచనలు ఉన్నాయి. ఆమె బతికిఉంటే వాళ్ళ పెళ్లి ఒక సమస్య అవుతుందని రచయిత ఆ పాత్రను చంపేశాడా అన్న ఒక ప్రశ్న కలగక మానదు.
గృహలక్ష్మి పత్రికలోని మరొక కథ యీరమ్మ ( నవంబర్ ). రచయిత ఆరవ వెంకటస్వామి. అప్పటికి గాంధీ ట్రావెన్కోర్ లో వైకోమ్ దేవాలయం చుట్టుపక్కల వీధులలోకి దళితుల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రారంభం అయిన సత్యాగ్రహ ఉద్యమానికి మద్దతు ప్రకటించి తాను స్వయంగా వెళ్లి ఈ ఉద్యమాన్ని నడిపే స్థానిక నాయకులను కలిసి, దానిని వ్యతిరేకించే సనాతనులతో చర్చలు చేసి వచ్చాడు(1925). ట్రావెన్కోర్ ప్రభుత్వం 1926లో గుడి చుట్టుపక్కల వీధులలో నడవటానికి దళితులను అనుమతిస్తూ చట్టం చేస్తే అభినందించి గాంధీ మిగిలిన పౌర ప్రజా సమూహాలతో సమంగా దళితులకు దేవాలయాలలో, అన్ని ప్రభుత్వ సంస్థలలో ప్రవేశం కల్పించే చర్యలు తీసుకోవలసిందిగా సూచించాడు. ఈ నేపథ్యంలో వచ్చిన కథ ఇది.
మాల వెంకన్న కూతురు యీరమ్మ. చెప్పుల జత చేసి కొవ్వూరులో అమ్ముకొస్తేనే వాళ్లకు బతుకు. ఆ పిల్లకు వారంరోజులుగా జ్వరం. వైద్యుడు ఆ వూళ్ళో పూజారి గవరయ్య ఒక్కడే. ఇంటికి వెళ్తే అతని భార్య, గుడి దగ్గరకు వెళితే పూజారీ మాలవాడిని చూసి, మాట్లాడి మైలపడ్డామని ఛీత్కరించుకున్నారే తప్ప అతని కష్టం పట్టించుకోలేదు. పూజారి మాట పట్టుకొని బిడ్డ మందుకని రాత్రి 8 గంటలకు ఆయన ఇంటికి వెళ్ళిన వెంకన్నకు ఎదురైనవి తిట్లూ తిరస్కారాలే. గాంధీవల్లనే మాలవాళ్ళు ఇట్లా తెగబడి వూళ్ళలోకి, ఇళ్ల మీదకు వస్తున్నారని విసుక్కొంటూ పూజారి గవరయ్య మాట్లాడిన మాటలకు ప్రత్యక్ష సాక్షి సెలవులకు ఇంటికివచ్చిన ఎదురింటి వారి అబ్బాయి రామారావు. వెంకన్న పక్షాన గవరయ్య తో మాట్లాడకుండా ఉండలేకపోయాడు. అస్పృశ్యత నేరమనిచెప్పి ఆ విషయంలో గాంధీ తత్వాన్ని విప్పిచెప్పి వెంకన్న కూతురికి మందిచ్చి ప్రాణాలు నిలపమని అతనిని వేడుకొనటంలో వైకోమ్ సత్యాగ్రహ విజయం ఇచ్చిన ప్రేరణ, గాంధీ స్ఫూర్తి ప్రధానమై ఉంటాయి. అహంకరించిన గవరయ్య మందివ్వ నిరాకరిస్తే వెంకన్నకు బాసటగా నిలబడి జ్వరపడిన ఆపిల్లకు మందులు తెచ్చి,వేయించి స్పృహ వచ్చేవరకు తోడుగా ఉండి, కోలుకునేందుకు అవసరమైన ఖర్చుల నిమిత్తం డబ్బు ఇచ్చి రావటంలో ఆ యువకుడి మానవీయత కీలకమైంది. ఈ విధమైన మానవీయతను మేల్కొల్పగలిగే శక్తి గాంధీ అస్పృశ్య నిరాకరణ ఉద్యమ తాత్వికతే అన్న సూచన అంతర్వాహిని.
1932లోనే భాగ్యరెడ్డి వర్మ ‘అజ్ఞాతవాసి’ అన్న మారుపేరుతో వ్రాసిన ‘వెట్టి మాదిగ కథ’ భాగ్యనగర్ పత్రికలో వచ్చింది. వెట్టి మాదిగల బతుకులోని హింస, దారిద్య్రం ఎంత భయంకరమైనవో చూపించి అందుకు మూలమైన పోలీస్ పటేల్ వ్యవస్థ వైపు పాఠకుల చూపును మళ్లించిన కథ ఇది.
1932 లోనే అస్పృశ్యులు ఇతర మైనారిటీ వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాల ప్రతిపాదనను నిరసిస్తూ గాంధీ ఎర్రవాడ జైలు నుండి సత్యాగ్రహం ప్రారంభించి, పూనా ఒడంబడిక తో దానిని నిల్వరించటం జరిగాక అస్పృశ్యత నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోవలసిన అవసరాన్ని గుర్తించాడు. ఆ క్రమంలోనే హరిజనసేవక్ సంఘ్ ఏర్పడింది. హరిజన్ అనే పత్రిక ప్రారంభించబడింది. అంటరానిజాతిని హరిజనులు అని వ్యవహరించటం కూడా అప్పుడే మొదలైంది. 1933 నుండి గాంధీ అస్పృశ్యతకు వ్యతిరేక ప్రచారంతో దేశమంతా పర్యటించాడు. ఈ దేశీయ రాజకీయ సందర్భం నుండి 1934 లో వచ్చిన కథ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వ్రాసిన ‘ఇలాంటి తవ్వాయి వస్తే’. ఎనభై ఏళ్ల నాటి వెలనాటి బ్రాహ్మణ అగ్రహారంలో రెండు మంచినీటి చెరువులలో చిన్నది మాదిగలదీ పెద్దది మిగిలిన అన్ని కులాలవాళ్ళది కాగా కుష్ఠురోగపు లచ్చిగాడు పడి చావటంవల్ల చిన్నచెరువు నీళ్లు వదిలేయాల్సి వచ్చి మంచినీళ్లకు పెద్దచెరువుతప్ప దిక్కులేని పరిస్థితిలో మాదిగలు పెద్దకులాలవారిని బతిమిలాడి, భంగపడి, సంఘర్షించి, తెగించి తమ సమస్యను పరిష్కరించుకొన్న తీరు ఈ కథకు విషయం. మాదిగలు చెరువుదగ్గర పడిగాపులు పడి చెరువుదగ్గరకు వచ్చిపోయే సవర్ణులు ఎవరైనా దయతలచి పోసినప్పుడు కుండలో బిందెలో నింపుకొని పోవటం ఒక దశ. చెరువునుండి నీళ్లు ముంచి మాదిగల బిందెలు నింపటంలో అటు సవర్ణులు, అట్లా పోయించుకొనటంలో ఇటు మాదిగలు విసిగిపోయిన దశలో ఉభయపక్షాల మధ్య చర్చలు. మాదిగలు చెరువులో దిగి నీళ్లు తీసుకుపోవటానికి అంగీకరించని వూరు ముందుకు తెచ్చిన ప్రతిపాదన- మళ్ళీ చిన్నచెరువు నిండేవరకు మాదిగల బిందెలలో నీళ్లు పోయటానికి నలుగురు మనుషులను పెట్టేటట్లు , వాళ్లకు జీతం మాదిగలు ఇచ్చుకొనేటట్లు.. ఊరంతా ఉచితంగా పొందే నీటికి తామెందుకు డబ్బు చెల్లించాలన్న ప్రశ్న మాదిగలు వేయటంతో ఏర్పడిన ప్రతిష్టంభన ను తొలగించి సమస్యను పరిష్కరించుకొనటం అంటే తాము తురకమతం తీసుకొని అయినా సరే చెరువులోకి దిగే హక్కును దక్కించుకొనటమే అన్న అవగాహన వాళ్లలో కలగటం కథలో క్లైమాక్స్. ‘మాదిగ విస్సిగాడు’ ఇస్మాయిల్ అయి తురకలతో కలిసి చెరువులో దూకటమూ, అతనితోపాటు మాదిగలందరూ సవర్ణ హిందూ మత దురహంకారం పై నిరసనగా చెరువులో దూకటం అసలైన యాక్షన్.
ఈవిధమైన కథా క్రమం వెనుక అప్పటికి ఏడేళ్లకు పూర్వం 1927 మార్చ్ 20 న అంబేద్కర్ నాయకత్వంలో వేలమంది దళితులు చెరువునీటి హక్కును అమలుచేయటానికి మహద్ లో తీసుకొన్న ఆచరణ ప్రణాళిక స్ఫూర్తి కాదనలేనిది.ఈ పరిష్కారం దిశగా కథను నడిపే క్రమంలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అంబేద్కర్ పేరు చెప్పకుండానే అతని స్ఫూర్తిని ఎంత సహేతుకంగా కొనసాగించాడో అంతే సహేతుకంగా కాంగ్రెస్ పేరుచెప్పి మరీ చిత్త శుద్ధి లేని దాని హరిజనాభ్యుదయ కారక్రమాల తీరును విమర్శకు పెట్టాడు. పూనా ఒడంబడిక తరువాత కాంగ్రెస్ చేపట్టిన హరిజనాభ్యుదయవిధానాల బోలుతనాన్ని సమకాలంలోనే శ్రీపాద గుర్తించగలగటం విశేషం. మంచినీటి చెరువు సమస్యలో ఏర్పడిన ప్రతిష్టంభన ను తొలగించటంలో కాంగ్రెస్ ఏమైనా తోడ్పడగలుగుతుందేమో అన్న ఆశతో మాదిగల పక్షాన క్రైస్తవ పంతులు చేసిన ప్రయత్నాల వైఫల్యం లో దానిని నిరూపించాడు. తాలూకా కాంగ్రెస్ సంఘాధ్యక్షుడు అయినా హరిజన సేవక్ సంఘాధ్యక్షుడైనా ‘సొంతచెరువు ఎండిపోయి, కనీసం పర్ల నుయ్యి అయినా లేక తాగటానికి మంచినీటి చుక్కల్లేని హరిజన సోదరుల’పట్ల మాటల్లో అంతులేని సానుభూతిని కురిపించారే కానీ ఆవగింజంత అయినా ఆచరణ గురించి ఆలోచించకపోవటాన్నే చూపిస్తుంది ఈ కథ. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకొంటే గానీ మాదిగల మంచినీటి సమస్య గురించి ఆలోచనలేని కాంగ్రెస్ స్వభావాన్ని, సారంలో అఖండ హిందూ సమాజపు సంప్రదాయ అంతరాల యధాతథస్థితి కొనసాగింపు, ఎన్నికల రాజకీయాలు తప్ప హరిజనుల సమస్యే పట్టని హరిజన సేవక్ సంఘ్ దాటవేత వైఖరిని నిశిత విమర్శకు గురిచేశాడు రచయిత. దళితుల స్వీయ చైతన్యం, కార్యాచరణ మాత్రమే వివక్ష నుండి, అస్పృశ్యత నుండి వాళ్ళను విముక్తం చేయగలవని స్పష్టంగా చెప్పటం ఈ కథ ప్రత్యేకత.
‘అలాంటి తవ్వాయి వస్తే కథ నుండి కొలకలూరి ఇనాక్ ఊరబావి కథను కలుపుకొని దళితులు ప్రజలందరికీ చెందిన నీటివనరులలో తమవంతువాటాను పొందటానికి పన్నిన వ్యూహాలు, వేసిన ఎత్తుగడలు సాధించిన విజయాలు వస్తువుగా వచ్చిన కథలను మహద్ సత్యాగ్రహ నేపథ్యంలో ప్రత్యేకంగా అధ్యయనం చేయటం అవసరం.
ఈ దశకంలో దళిత సమస్యను వస్తువుగా చేసుకొని మహిళలు కూడా కథారచన చేయటం ఒక విశేషం. గొట్టుముక్కల మంగాయమ్మ వ్రాసిన ‘అయ్యో పాపం!!!’ కథ( మార్చ్, 1935,దళితకథలు 3,సంపాదకుడు డా. కె. లక్ష్మీనారాయణ 1999) వాటిలో మొదటిది. కథా ప్రారంభంలో రచయిత్రి ఉటంకించిన “ శునిచైన శ్వపాకేచ పండితాః సమదర్శినా” అన్న గీతావాక్యం “విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని” అని ప్రారంభం అయ్యే శ్లోకంలో రెండవ పాదం.( అధ్యాయం 5, కర్మ సన్యాస యోగం, 18 వ శ్లోకం) విద్యా వినయాలుగల బ్రాహ్మణుల యందు, ఆవు యందు, ఏనుగు యందు, కుక్కయందు, చండాలుని యందుకూడా సమదృష్టి గలవాళ్లే పండితులు అని దాని సారాంశం. బ్రాహ్మణులను ఆదరించి, ఆవును పూజించి , ఏనుగును గౌరవించే సంస్కృతిలో కుక్క , ఛండాలుడు ఎప్పుడూ చీత్కారానికి, వెలికి గురిఅవుతుండటం ఒక నిష్ఠుర వాస్తవం. కనుక ఈ సమదృష్టి అనేది ఒక పెద్ద అబద్ధం. పండితుల దృష్టిలో కుక్క, చండాలుడు మాత్రమే సమంగా తిరస్కారానికి గురవుతున్న జీవులు అవుతున్న ఆ సామాజిక స్థితిపట్ల క్రోధ వ్యక్తీకరణకు మంగాయమ్మ ఎన్నుకొన్న పద్ధతి శ్లోకంలో మొదటి పాదాన్ని వదిలి రెండవ పాదాన్ని మాత్రమే ఉటంకించటం. అసలు కథ ఇక ఆ నిష్ఠుర లోకవాస్తవ నిరూపణమే. ఒక హరిజన యువతి ‘అస్పృశ్యతా పాపము’ నకు సంబంధించి అమలులో ఉన్న ఆచారాలు హరిజనులకు ఎంత అవమానకరంగా ఉన్నాయో సోదాహరణంగా చెప్తున్నట్లుగా సాగే కథ ఇది. ఎండాకాలంలో బాటసారుల దాహార్తి తీర్చి పుణ్యం కట్టుకొనాలని నిమ్మరసం కలిపిన మజ్జిగ బానలతో ఏర్పాటు చేయబడిన చలివేంద్రం లోకి కాలినడక ప్రయాణంలో నోరెండిపోయిన హరిజన దంపతులకు ప్రవేశమే నిరాకరించబడింది. వూళ్ళో దారిన బోయే వాళ్ళ దాహం తీర్చి, ఆకలి తీర్చి పుణ్యం మూటకట్టుకోనలనుకొనే స్త్రీల ఇంటి మెట్లయినా ఎక్కడానికి వాళ్ళు నిరోధించబడ్డారు. మాల వాళ్లకు దాహమిస్తే మైలపడి పోతామనుకొనే బ్రాహ్మణుల పుణ్యచింతన ఎంత అర్ధరహితమైనదో చెప్పకనే చెప్తుంది ఈ కథ. మాలవాళ్ళకు మంచినీళ్లయినా ఇయ్యని మాయాసంఘం గుట్టు విప్పిన ఈ కథలో దాహార్తులైన ఆ దంపతులకు ఒక ముస్లిం మంచి నీళ్ళిచ్చికాపాడిన వైనాన్ని చెప్పటంద్వారా హిందూ బ్రాహ్మణీయ సమాజం అస్పృశ్యతా పాపం చేత ఎంతగా మానవత్వాన్ని కోల్పోయి నిర్జీవం అవుతున్నదో కూడా రచయిత్రి సూచించినట్లయింది.
చుండూరి రమాదేవి వ్రాసిన ధర్మతల్లి కథ (1938, పైదే పుస్తకం) కష్టంలో, ఆదుకోవలసిన స్థితిలో ఉన్న మాలలకు బ్రాహ్మణ అగ్రహారాలు, వీధులు తలుపులు మూసేసిన అమానుషత్వాన్ని చిత్రించింది. కలరా వచ్చిన అన్నకు పూజారి పాపయ్య గారిని అడిగి మందు తీసుకురావాలని బ్రాహ్మణ వీధిలోకి ప్రవేశించిన మాలపిల్లను చూచి మండిపడి మడినీళ్ళు తెచ్చుకొంటున్న వితంతువు బిందెడు నీళ్లు పారబోసిన ఘటన వర్ణవివక్ష రూపాన్ని, అది మాలలకు కలిగిస్తున్న అవమానాన్ని, గాయాన్ని సూచించటానికి ఉద్దేశించబడింది. ఆ స్త్రీ మాలపిల్లను మీదిమీదికి వస్తున్నావంటూ తిడుతూ ‘మాయదారి స్వరాజ్యం వచ్చిందని మండిపోతున్నావేం’ అని అంటుంది. ఇలాంటి వాక్యం శ్రీపాద వారి ‘ఇలాంటి తవ్వాయి వస్తే’ కథలోనూ కనబడుతుంది. 1938 నాటికి స్వరాజ్యం రాలేదు.కానీ స్వరాజ్యం రావటానికి ఆటంకంగా ఉన్న అస్పృశ్యత ను తొలగించాలన్న అవగాహన కలిగి కాంగ్రెస్ ప్రత్యేక విధానాలు , సంస్థలు ఏర్పరచి ప్రచారకార్యక్రమాలు, దేవాలయ ప్రవేశాది సంస్కరణలకు ముందుపడ్డది. మిగిలిన పౌరులతో హరిజనులకు సమానత్వాన్ని, సమాన అవకాశాలను వాగ్దానం చేసే ఈ విధమైన కాంగ్రెస్ పని తీరు పట్ల, దాని లక్ష్యం అయిన స్వరాజ్యం పట్ల అగ్ర కుల సంప్రదాయ వర్గం యొక్క అసంతృప్తికి, అసహనానికి వ్యక్తీ కరణలు ఆ వాక్యాలు. ఈ అసహనం గాంధీని దూషించేవరకూ కూడా పోయింది.
హరిజన దేవాలయ ప్రవేశం అనే కొత్త కార్యక్రమం చేపట్టి కాంగ్రెస్ సర్వ సాంకర్యం చేయ సమకట్టిందని వాపోయినవాళ్లున్నారు. ‘అస్పృశ్యతా నివారణము – అనర్ధ దాయకం’ అంటూ సంస్కరణ పరాయణులది అల్లరి అని (మండ చైనా వెంకయ్య ), కాంగ్రెస్ కు మత నియమాలు లేవని సంస్కరణలు అంటూ సనాతనులను కష్టపెడుతున్నదని ( పెద్దిభొట్ల వీరయ్య), కాంగ్రెస్ ను, గాంధీ వంటి జాతీయ నాయకులను నిరసిస్తూ వ్రాసారు (అభినవ సరస్వతి). 1933 నాటికే ప్రారంభమైన ఈ వైఖరిని గమనించి దానిపట్ల ఒక విమర్శనాత్మక జ్ఞానాన్ని స్త్రీలకు అందుబాటులోకి తీసుకొని రావటం కోసం కనుపర్తి వరలక్ష్మమ్మవ్రాసిన కథలు ఏమైనా ఉన్నాయేమో తెలియదు కానీ ఆమె గృహలక్ష్మి పత్రికలో క్రమం తప్పకుండా వ్రాసే ‘శారదలేఖలు’ శీర్షికను మాత్రం తక్షణం వాడుకొన్నది. శారద కల్పలత అనే స్నేహితురాలికి వ్రాసే ఉత్తరాలలో ఒకటి (1933, జనవరి ) అంటరానితనం ఉండరాదని అన్నందుకు గాంధీని దూషిస్తూ కల్పలత వ్రాసిన ఉత్తరానికి జవాబు. కల్పలత అవగాహన ను సరిచేస్తూ అస్పృశ్యతను నిరసిస్తూ, పంచముల దేవాలయ ప్రవేశాన్ని సమర్ధిస్తూ సంస్కరణల ఆవశ్యకతను నొక్కి వక్కాణిస్తూ వ్రాసిన ఉత్తరం అది. ఈ విధంగా ఆ నాటి కాంగ్రెస్ దళిత రాజకీయాలపై అటు సనాతనుల వ్యతిరేకత, ఇటు వరలక్ష్మమ్మ వంటి జాతీయవాదుల సానుకూలత, శ్రీపాద వంటి వారి విమర్శ కూడా 30 వదశకపు వ్యాసాలలో, కథలలో నమోదు కావటం గమనించవచ్చు.
1934 – 1938 మధ్యకాలంలో కథలు వ్రాసిన తాడినాగమ్మ దళిత రచయిత్రి అయినప్పటికీ ప్రత్యేకం దళిత జీవిత సమస్యలు వస్తువుగా ఆమె వ్రాసిన కథలు ఏమీ లేవు. కానీ ఆడవాళ్ళ సాహిత్యవస్తువు పరిమితమైన కుటుంబజీవితమే అన్నలోక రూఢిని అధిగమించి అంతర్జాతీయ రాజకీయార్థిక పరిణామాల నేపథ్యంలో కథలు వ్రాసిన మేధావంతురాలైన రచయిత్రి ఆమె. అలాంటప్పుడు ఆమె దళిత జీవిత దృక్పథం ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరమైన విషయమే అవుతుంది. జాతుల మధ్య వైరుధ్య సంబంధంలో వ్రాసిన ‘ప్రేమ సమస్య’ కథలో అది కొంతవరకు సూచితమైంది. ఇందులో నాయకుడు జర్మన్. నాయిక యూదు. కథ మొదటి ప్రపంచ యుద్ధ వాతావరణంలో ప్రారంభమై హిట్లర్ పాలనలో కొనసాగుతుంది. హిట్లర్ జర్మన్ జాత్యహంకారం యూదు జాతి ద్వేషంగా ప్రకటితమైన చారిత్రక సందర్భాన్ని వారిద్దరి మధ్య ఎడబాటుకు కారణం గా చూపిస్తూ అభివృద్ధి చేసిన ఇతివృత్తం గల కథ ఇది.
ఈ కథలో నాజీ హింసను గురించి చెప్తూ తాడి నాగమ్మ “నరకమనునది యెచ్చటనో లేదు. యూదులకు జర్మనీ దేశము నరకము.నీగ్రోలకు అమెరికా దేశము నరకము. భారతీయులకు దక్షిణాఫ్రికా నరకము.” అని చెప్తూ “మాలలకు హిందూదేశమే నరకము.” అని కూడా అన్నది.ఆ మాటలలోని తీవ్ర స్వరం దళితులు ఎదుర్కొంటున్న వివక్ష, అది చేసే గాయాల గురించిన పూర్తి స్థాయి ఎరుక వల్ల వచ్చినదే. స్వయంగా దళితురాలు. దళితులకే ప్రత్యేకంగా నిర్వహించే లేబర్ స్కూల్ ఉపాధ్యాయిని. ప్రపంచ పరిణామాలనే అంత నిశితంగా పరిశీలిస్తున్నది. వ్యాఖ్యానిస్తున్నది. ఇక ఆమెకు భారతదేశంలోని కులవ్యవస్థ గురించి ఆ మాత్రం అభిప్రాయం ఏర్పడి ఉండటంలో ఆశర్యం ఏమీలేదు. ఈ దృక్పథం నుండి ఆమె పూర్తిస్థాయి కథ వ్రాయగలిగితే ఎన్ని జీవిత పార్శ్వాలపై వెలుగులు ప్రసరించి ఉండేవో మరి !?
1920 ల నుండి అంటు దోషం మానాలంటూ ఉద్యమిస్తూ, ఉద్యమ ఆశయాలకు అనుగుణంగా సాహిత్య సృజన చేస్తూ వచ్చిన కుసుమ ధర్మన్న, జాలా రంగస్వామి కథలు, నవలలు వ్రాసినవాళ్ళే. హరిజనులకు ,సవర్ణులకు మధ్య సంఘర్షణ వస్తువుగా కుసుమధర్మన్న ఆరు కథలు వ్రాసాడు. అవి : 1. మండోదరి – దండోరా 2. మాధవశాస్త్రి – మాదిగ సుబ్బయ్య 3. పల్లమ్మ పడవ ప్రయాణం 4. మాల పోలయ్య – మడుగులో బాపనయ్య 5. ముత్తమ్మ ముడుపు 6. పండిత గోష్ఠి – వీరభద్ర పాకయాజి. అట్లాగే ఆయన మాలకాకి అనే నవల కూడా వ్రాసాడు.( కుసుమధర్మన్నకవి రచనలు – దళిత దృక్పథం, మద్దుకూరి సూర్యనారాయణ , ఎంఫిల్ పరిశోధనా వ్యాసం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2001). అయితే ఇవి అలభ్యాలు. వీటి ప్రచురణ వివరాలు కూడా తెలియరావడం లేదు. కుసుమ ధర్మన్న సాహిత్య కృషి 1930 లలో విస్తృతంగా జరిగింది కనుక ఈ కథలు, నవల 30 వదశకపు రచనలు అనుకొనటానికి ఎక్కువ వీలుంది. ఆయన 1946లో మరణించాడు కనుక అది పరిధిగా పెట్టుకొని 1945లోగా వచ్చిన రచనలు అని కూడా అనుకోవచ్చు.
జాలా రంగస్వామి వ్రాసిన రైతుపిల్ల నవల (జాలా రంగస్వామి రైతుపిల్ల నవల – ఒక పరిశీలన – గూటం లక్ష్మణరావు ఎంఫిల్ పరిశోధనా వ్యాసం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2001) రచన ప్రచురణ కాలం కూడా తెలియరావడం లేదు. మాల పాలేరుకు, పెద్దరైతు కూతురికి మధ్య ప్రేమ,పెళ్లి ఇందులోని వస్తువు. రైతు ఆస్తిని తన శ్రమతో అభివృద్ధిచేసి శ్రద్ధ తో కాపాడే పాలేర్లకు, రైతులకు మధ్య ఉండే సంబంధాలు కులాంతర వివాహానికి కూడా ఆమోదాన్ని సంపాదించిపెడతాయని చెప్తుంది ఈ నవల.
ఈ కథలు, నవలలు లభిస్తే, వాటి రచనాకాలాలు తెలిస్తే మరింత నిర్దిష్టంగా ఏ సామాజిక ఆర్ధిక దళితరాజకీయాలలో భాగంగా అవి వచ్చాయో, చారిత్రక గతిక్రమంలో తెలుగు కథకు, నవలకు కుసుమధర్మన్న, జాలా రంగస్వామి కొత్త వస్తువును ఎలా సమకూర్చారో, దళిత అభివ్యక్తి విశేషాలను ఎలా చేర్చారో అధ్యయనం చేయటానికి, అంచనావేయటానికి వీలవుతుంది.