ఆగష్టు నెల మొదటి వారం.
నీలమ్మ వరి పొలంలో వంగి కలుపు తీస్తున్నది. పొద్దు పడమటికి వంగి పోయింది. పగలంతా కాసిన ఎండకు నీలమ్మ ముఖం వాడిపోయింది. చెమట కారికారి ఆమె జాకెట్టంతా ఉప్పు దేలింది. పైగా పొలంలో వంగి కలుపు తీయడంవలన ముఖమంతా వరి ఆకులకు గీరుకుపోయి మంట లేస్తున్నది. అసలే అది అందురు పొలం.
నీలమ్మ భర్త తిరుగుబోతు. నాట్లప్పుడు అటోసాలు ఇటోసాలు దున్ని నాట్లైతే పెట్టిండ్లు. నాలుగు సార్లు దున్నక పోవడంతో పొలంలో ‘తోడెంగ, ఒలిపిడి’ లాంటి గడ్డి విపరీతంగా మొలిచింది. ఎండకు పొలంలో నీళ్ళు కాగి చురుక్కుమని పిస్తున్నాయి. నీలమ్మ భర్త ఊరందరికీ కంటే. కనుక నీలమ్మ ఎవరిని బతిమిలాడినా పొలం కలుపుకు రానన్నారు. పైగా “ఊరుకు సెడువాకం సేసినోడు నీ మొగనికి సెప్పుకో – నీలమ్మ నీ మొగడు ఆపు సూసుకొని బలుపని బముసుతండు – నీ మీద మాకేమి కోతుకం లేదని” నీలమ్మ ముఖం మీదనే చెప్పేశారు.
నీలమ్మ ఎవరిని ఏమనలేదు, అట్లని ‘నాకేందని’ ఊకోలేదు. తనకు వీలైన కాడికి పొలంలో కలుపు పీకి పారేత్తనని నడుం కట్టింది. అంతకన్నా నీలమ్మ ఏం చేయగలదు? నిండా ఇరువై అయిదు ఏండ్లు నిండకుండానే పడరాని కష్టాలు పడ్డది. ఆమె ఆ కష్టాలకు దిమ్మెక్కిపోయింది. ఊఁఅనకుండా ఉప్పురాయి అనకుండా ఏదో వొక పని చేసుకపోవడమే అలవాటు చేసుకున్నది.
నీలమ్మ నడుమెత్తి నిట్టనిలువునా నిలుచుండి పొద్దు కేసి చూసింది. ఎసాలాల్ల’ దాటిపోయింది. పొలంకేసి చూసింది. ఎంత కలిసినా ఇంకా ఎకరం దాకా కలువ వల్సింది మిగిలే ఉన్నది.
కాలువ కింద కనుచూపు మేర దాకా వ్యాపించిన పక్క పొలాలల్లో కూలీలు కలుపులు తీస్తున్నారు. రంగు రంగుల చీరెలు – నవ్వులు, కేరింతలు, మధ్య మధ్య పాటలు…
దూరంగా రోడ్డు మీద బస్సాగింది. బస్సులో నుండి ఎవలెవలో దిగారు. బస్సులో నుంచి దిగి, మతిమరుపు రాజాలు ఆదరబాదరగా ఒడ్ల మీది నుండి పరుగెత్తుకొస్తున్నాడు.
నీలమ్మ ఆ తత్తరపాటుకు విస్తుపోయింది. రాజాలు నీలమ్మ పక్క నుండి పోతున్నాడు. “ఏందట్లా గావరపడి ఉరుకుతున్నవ్?” నీలమ్మ ఇంకా నిలబడే.
రాజాలు టక్కున ఆగిపోయి నెత్తి గోక్కున్నాడు… ఆకాశంలోకి చూశాడు. “ఎందుకురుకుతన్న…. ” పైకే అని “ఆఁ” అని మళ్లీ నడక సాగించాడు…
“ఓరి నీ మతిమరుపు గాలిపోను” నీలమ్మ వంగి రెండు తోడెంగ గడ్డి గంటలు పీకింది.
రాజాలు పెద్ద గొంతుతో ఏదో అరుస్తున్నాడు. పిచ్చివాడిలాగా చేతులు తిప్పుతున్నాడు. కలుపు తీస్తున్న ఆడకూలీలంత రాజాలు చుట్టూ చేరిపోయారు.
నీలమ్మ లేచి నిలబడింది.
ఆ తరువాత తత్తరపాటు కేకలు, ఏడుపులు – మిగతా పొలాలలోని వాళ్లు పరుగెత్తుకొచ్చారు…
నీలమ్మ ఒడ్డెక్కింది.
పొలాలల్లోని ‘కల్లాల గడ్డ మర్రి’ కిందికేసి వాళ్లంతా నడిచారు. ఆ గడ్డ నీలమ్మ నిలుచున్న దగ్గరికి కేవలం యాభై గజాలే.
గోలగోలగా మాట్లాడుతున్న మాటలు వినిపిస్తున్నాయి.
“ఓ నీ బాంచెన్ ఎల్లక్కా నా గుండె అవిసిపోయింది. నా తీర్గ గ బస్టాండు కాడ సాన మంది కుప్పయ్యిండ్లు – నెత్తురు. నా అన్నను ట్రాక్టర్ల నుంచి దుబ్బల పడేసిండ్లు – ఎవడో ఆడు – దున్నపోతు తీర్గున్నోడు – నీ బాంచెనాతే – మాతోటి పెట్టుకుంటే ఎవలకైన గీగతే పడదంట” – మొత్తుకున్నడు రాజాలు.
“వాళ్లింట్ల పీనుగులెల్ల గదరో కొడుకా! పెండ్లనక, సంసార సుకమనక నాత్రి పగలు గుడిసెల పొంట తిర్గితివి గదరా నా కొడుకా! ఆళ్ల సేతులకు జెట్టలు బుట్ట – ఆళ్ల కండ్లు పెట్టన పేలిపోను. ఆళ్ల నోట్లే” ఓ ముసలమ్మ ఎదురు బొచ్చె కొట్టుకుంటూ కింద కూలబడి ఏడుస్తోంది…
నీలమ్మ కేం అర్థం గాలేదు. కొన్ని మాటలు సగం సగం విన్పడుతున్నాయి.
ఇలాంటి ఏడుపులు నీలమ్మకు కొత్త కాదు. సడీ సప్పుడు లేకుంట తను పీకిన గడ్డి కుప్పేస్తోంది. బర్రెకు ఇంటికి గడ్డి తీసుకపోకపోతే అత్త తిట్టిన తిట్టు తిట్టకుండ తెల్లారేదాకా తిడుతుంది. అత్త యాదికొచ్చేసరికి ఆకలి గుర్తొచ్చింది. పొద్దున్నే పనంతా చేసి అందరికి తిండి పెట్టి తను తినాలని కంచంలో అన్నం వేసుకున్నది. భర్త ఇంకా ఇంటికి రాలేదు. వస్తే తల్లి అన్నం పెడుతుందిలే అనుకొని తింటున్నది.
బయట అడుగుల చప్పుడు.
నోటికాడ ముద్ద నోటికాడనే ఉన్నది. “సువ్వర్ ముండా ఉడుకు నీల్లేవే?” భర్త అరుపు.
“ఇంట్ల కూకుండి సాటుకు మేతంది. అది యాల్లకు తినక పోతెట్లరా? బక్కపడిపోదు. ఇంకో మొగన్ని… ” అత్త.
నీలమ్మ ముద్ద పళ్లెంలో పారేసింది. నీలమ్మ ఆకలి కాకుండా నడుముకు చుట్టుకున్న కొంగు విప్పుకున్నది.
కూలీలంతా గొనుగుతూ ఊరు పేరు లేకుండా తిడుతూ నీల పక్కనుండే రోడ్డు కేసి నడుస్తున్నారు.
“ఏమయ్యింది పెద్దవ్వా?” ఓ ముసలామెను నీలమ్మ అడిగింది.
“ఏ బట్టు ముండా కొడుకు, కొడుకు జాడ చెప్పి పున్నెం కట్టుకున్నడో? ఆళ్ల నాము నరుకకపోరు-” ఇందాకటి నడీడామె మెటికలిరిసింది.
తన భర్తనే వాళ్లు తిడుతున్నారని నీలమ్మకు అర్థమయ్యింది. ఇలాంటి తిట్లు గతంలో చాలాసార్లు విన్నది.
“నామం బొట్లు – గుల్లె పూజలు – తాగుబోతు ముండకొడుకులు మంది కొంపలు కాల్పుడు. ఎన్నేండ్లు బతుకుతరులే?” ఇంకొకరు.
మాట్లాడితే మరిన్ని తిట్లు వినవల్సి వస్తుందని నీలమ్మ మరింక మాట్లాడలేదు. కుప్పేసిన గడ్డి మోపుకట్టింది. కూలీలంతా పొలాల్లోనుంచి ఆదరబాదరగా వెళ్లిపోయారు. పని చాలించడానికి ఇంకా గంట ఉందేమో? ఒక్కదానికి మరింక పని చేయబుద్ధి కాలేదు.
నీలమ్మ గడ్డి మోపు నెత్తిమీదికి లేవక అటిటు సొలిగింది. అతి కష్టం మీద మోపు నెత్తి మీదికి ఎత్తుకున్నది. మోపు బరువుకు కాల్లు కుదురుగా పడటం లేదు. పడమటి దిక్కు మబ్బు కుదురుకుంటోంది. ఆకాశంలో పక్షులు ఎత్తుగా ఎగురుతూ పోతున్నాయి.
పొద్దంతా పెట పెటలాడిన ఎండ పోయి – బొయ్యిన గాలి తోలుతోంది. రోడ్డు పక్క గల పెద్ద కాలువలో గలగల నీళ్ళు పారుతున్నాయి.
కూలీలు కొందరు అప్పటికప్పుడు తాలూకా కేంద్రానికి ప్రయాణమయ్యారు. దూరంగా తాడిచెట్ల మధ్యలోని మర్రి చెట్టు కింద కల్లు మండువా దగ్గర కూడా ఇందాకటి లొల్లి లాంటిదే లేచింది. చూస్తుండగానే అక్కడి మనుషులు రోడ్డు మీద అటిటు పరుగెత్తుతున్నారు. మొత్తానికి అక్కడి వాతావరణంలో దుఃఖం, ఆదుర్దా నిండి పోయింది. ఒక్క నీలమ్మకే వాళ్ల బాధ తెలియదు. నీల్ల మడుగులో రాయి పడితే అలలు చెదిరినట్లుగా మనుషులు చెదిరిపోయారు. ఆ రాయేమిటి? నీలకు తెలియదు? ఎవరు చెప్పరు. నీల వాళ్ల శత్రువు భార్య – అట్లని నీలమ్మ భర్త దొరకాదు – ఉన్నవాడు కాదు. కాని లేని వాళ్లతో కలువక ఉన్నవాళ్ల ఏజంటుగా దొరల పార్టీలో తిరుగుతున్నాడు. భర్తకేం పోయేకాలమో? ఎవరితో తిరుగుతాడో కూడా నీలకు తెలియదు. ఆమెకు తెలిసిందల్లా భర్త తాగుబోతు – ఇష్టమొచ్చినట్లు తిడుతాడు – కొడుతాడు.
నీలకు కాలువలోని నీళ్లను చూసేసరికి దప్పయ్యింది. గడ్డిమోపు ఒడ్డు మీద పడేసి కాలువలోకి దిగింది. చల్లగా, హాయిగా నీల్లు – ముఖం, కాల్లు, చేతులు కడుక్కున్నది. అటిటు చూసి చుట్టుపక్కల మొగవాళ్లెవరు లేరని నిర్ధారించుకొని కొంగు నోట్లే కరిచి ఎండకు ఉప్పుదేలిన జాకెట్టు విడచి పిండుకున్నది. వెన్ను మీద నీళ్లు పోసుకున్నది. తడి జాకెట్టే తొడుక్కున్నది. కొంత హాయిగా, ప్రశాంతంగా తోచింది.
గాలం కర్రలు ఊపుకుంటూ మంగలి నారాయణ హడావిడిగా ఊరుకేసి పరుగెత్తుతున్నాడు.
“నారన్నా జెరంత మో పెత్తవా?” నీలమ్మ పిలిచింది. నారాయణ పోబోయినోడు ఆగి మోపు దగ్గరికి వచ్చాడు. “ఏందన్నా అందరు ఉరుకుతండ్లు ఏమయ్యింది?” నీల. “అయ్యో అక్కా నీకెరుకలేదా?” “నా కొడుకుతోడన్నా నా కెరిక లేదు… ” నారాయణ ముఖం నల్లబడిపోయింది. “లచ్చింరాజన్నను పోలీసోల్లు కాల్చేసిండ్లు… ” వంగిన నీల లేచి నిలుచున్నది… “ఏ లచ్చింరాజన్నను?”
నారాయణ ఆనవాలు చెప్పిండు.
నీల తల గిర్రున తిరిగింది. శోష వచ్చింది. మోపు మీద కూలబడిపోయింది. ఒంట్లో నెత్తురంతా ఇంకిపోయినట్లు మనిషి డీలా పడిపోయింది.
“ఏందక్కా అట్లయిపోతివి?” నారాయణ ఏదో మతికొచ్చి కాసేపు మౌనంగా నిలుచున్నాడు.
నీల తనకు తానే తేరుకున్నది. మరేం మాట్లాడకుండా నారాయణ సహాయంతో గడ్డి మోపు నెత్తిమీద కెత్తుకున్నది. నారాయణ పరుగెత్తాడు.
అడుగు వేసి తూలింది. తన చుట్టూ మొత్తం చిమ్మం చీకటి కమ్ముకున్నట్లుగా, కడుపులో ఎవరో చెయ్యి పెట్టి కలిచినట్లుగా – అగులు బుగులుగా ఉన్నది. ఎందుకో నీలకు దుఃఖం ముంచుకొచ్చింది.
నీల నడుస్తున్నది… మోపు కింద ఆమె ముఖంలో కన్నీల్లు కారుతున్నాయి. పెదవులు వనుకుతున్నాయి. ఎవరితోటి పంచుకోజాలని దుఃఖమది.
నీలమ్మకు ఎన్నెన్నో గుర్తుకొచ్చాయి. దారి సరిగాలేని చిన్న పల్లెటూరు. ఆ ఊళ్లో గుంపు చింతల కింద ఓ పెంకుటిల్లు – ఆ ఇంట్లో పాత చీరెలు తనే అంటేసుకొని కుట్టుకొని ఆ చీర కట్టుకొని పేద పేదగా అంతెత్తు ఆడమనిషి – ఒళ్లంతా ఉలిపిరి కాయలతో రాత్రింబవళ్లు మగ్గం ముందు కూర్చుండి ‘నాడె’ టకటక విసుగు విరామం లేకుండా ఆడించే పొట్టి మనిషి – అవ్వ, అయ్య తిడుతుండగా పుస్తకాలు ముందేసుకొని చదువుకునే చిరుగుల లాగు పిల్లవాడు. ఊహ తెలిసేటప్పటికి ‘అతనే తన భర్త’ అన్నారు…. ఏమయ్యిందో తనను అత్తగారింటినుండి తన తండ్రి హఠాత్తుగా ఎందుకు తీసుకవచ్చాడో? నీలకు ఎంత ఆలోచించినా గుర్తుకు రావడం లేదు. తనను తీసుకపోనచ్చిన తండ్రి, పొట్టి మనిషి మామను ఎడా పెడా తిట్టాడు. మామ అప్పటికే నేత బందు చేసిండు. పూట గడవడం కష్టమే అయినా తనకు మాత్రం తిండి పెట్టేవాళ్లు.
“నీ గూన కప్పటిల్లు సూసి నా బిడ్డను యియ్యలే – పొల్లగాడు నాలుగు అచ్చరం ముక్కలు సదువుతండని ఇచ్చిన – వాన్ని సదువు బందుచేసి బర్లకు, గొర్లకు తోల్తానంటే” తన తండ్రి కాండ్రకిచ్చి ఉమ్మేశాడు.
మామ ఏమనలేదు. అదే రాకడ తను మళ్లా ఆ అత్తగారింటికి వూరికి పోలేదు.
తను పెద్ద మనిషయ్యింది. ఆ తరువాత నాలుగు సంవత్సరాలకు కాబోలు తమ ఊళ్లో మూడు పానాదుల దగ్గర పంచాతు జరిగింది. పీపుల్స్ వార్ పార్టీ వాళ్లెవరో పంచాతుకు వస్తండ్లని ఊరు ఊరంతా భయపడ్డది.
పంచాదులో ఏమి జరిగిందో కూడా తనకు తెలియదు. ఎందుకు జరుగు తున్నదో అంతకన్న తెలియదు.
నీలను ఎవరో పంచాయితి దగ్గరకు పిలుచుకపోయారు.
మూడు పానాదుల దగ్గర మందిలో కూర్చున్న గుంగురెంటికల కోల ముఖ పాయన. అతని పక్క అప్పుడే మీసం కట్టు మొలుస్తున్న తన భర్త తలవంచుకొని కూర్చున్నాడు.
“నీ పేరేందమ్మా” గుంగురెంటికలాయన ఆప్యాయత నిండిన గొంతుతో… “నీల” తను ఎవరిని చూడకుండా తలవంచుకొని.
“చివరకు నీ ఇష్టాన్ని బట్టే నడుచుకోవడానికి ఇక్కడ జమకూడిన వాళ్లు అందరు ఒప్పుకున్నారు. నువ్వు యుక్త వయస్కురాలవు. కొంత వరకైనా ఆలోచించి నిర్ణయం తీసుకోగలవు. నీ బతుకు నువ్వే నిర్ణయించుకోవడం మంచిది. నీకు లక్ష్మింరాజంతో కాపురం చేయడం ఇష్టమేనా?”
అప్పుడర్థమయ్యింది. ఈ పంచాయతి తనగురించేనని. తనట్లా పంచాయితిలో కూర్చున్నందుకు కోపంగా, సిగ్గుగా ఉన్నది. తన ప్రమేయం లేకుండా జరుగుతున్న ఈ గొడవలకు తిక్కగా ఉన్నది.
ఆ మాట పూర్తి కాకముందే “లేదు” అని తను అక్కడినుండి బయటపడ్డది. ఈ మాట తనతో అన్పియ్యడానికి ఎన్నో రోజులనుండి తనవాళ్లు ఎంతో తంటాలు పడ్డారు.
నీలమ్మ బండ్ల బాట నుండి ఊరు దగ్గరికొచ్చింది. బాటకు రెండు పక్కలా ఈత పొదలు… పాదాలు ఇసుకలో కూరుకపోతున్నాయి. ఇంకా కళ్లనుండి నీళ్లు కారుతున్నాయి.
నీలమ్మ టక్కున ఆగిపోయి తల తిప్పి అటిటు చూసింది. సరిగ్గా ఇక్కడే – “నీలా’ పిలుపు.
నీల ఉలిక్కిపడింది. చుట్టూ ఎవరూ లేరు తను తప్ప… లోలోపల గుండె కొట్టుకుంటోంది.
పుండులాంటి చలికాలం. తను వరికల్లం దగ్గరికి సద్ది తీసుకపోయి మునిమాపు రాత్రి ఇంటికి తిరిగి వస్తోంది. పైన వెన్నెల ఇంట్లో పసిబిడ్డ – ఏడుస్తున్నడో ఏమో అని బిరబిర నడుస్తున్నది.
“నీలా…” ఇట్లాగే పిలుపు. తను తత్తరపడి అటిటు చూసింది.
ముగ్గురు మనుషులు తనకెదురుగా. బహుశా కుడిపక్క ఈత పొదల్లో నుండి ఆ పిలుపు వచ్చినట్లున్నది. దొంగల్లాగా ఉన్నారు.
“నేను నీలా… ” పైన కప్పుకున్న శద్దరు తీసేసి ఎదురుగా నిలుచున్నాడు. అతను విడాకులు తీసుకున్న భర్త లక్ష్మింరాజం.
తను గుర్తు పట్టింది. అప్పటికే అతని పేరు మీద రోజు చావుదెబ్బలు మొగనితో తింటున్నది.
“నా ఎంట దయ్యం తీర్గ ఎందుకు తిర్గుతున్నవ్ – ఆనాడే నీకు నాకు ఒడిసి పోయింది గదా! నన్ను గీన్నే బొండిగ పిసికి సంపరాదు నీ కండ్లు సల్లబడ్డయ్. నీ మూలకంగా సావదెబ్బలు తింటున్న” నీలమ్మ.
“నీలా నువ్వు నీ భర్త తీర్గనే ఉత్తగనే నా మీద కోపం పెంచుకుంటన్నవ్.”
“మా వూరే దొరికిందా! నామీద కసి తీసుకోవటానికి కాకపోతే మా వూరు సుట్టే ఎందుకు తిరుతన్నవ్? ఏడనన్న నీ దొంగ పనులు చేసుకబతుకలేవా?”
అతను నిర్మలంగా గలగల నవ్విండు.
“మేము దొంగలం కాదు నీలా! నువ్వు మాకిప్పుడు భర్త చేత దెబ్బలు తినే వేలమంది చెల్లెండ్లలో నువ్వొకదానివి. నీలా నీ భర్త నా మీద అనవసరంగా కసి పెంచుకొని తను మాతో కూడవల్సిన వాడు మా శత్రువుతో కూడిండు. ఆయనకు ఎట్ల చెప్పాలో తెలుస్తలేదు. నువ్వు మనిషివి. ఎవరికి ఆస్తివి కాదుగదా!” శాంతంగా చెప్పుకొచ్చాడు. ఇలాంటి మాటలు తను ఇదివరకు వినలేదు. ఆ గొంతులోని ఆర్ధత తనకు కొత్త.
పక్కనున్న వాళ్లు “ఔను సెల్లే” అన్నారు.
తను తల వంచుకున్నది. పెదిమలు వనికినయ్. అంతకన్నా తనను బాగా తిడితే బావుండును. తన తండ్రి దగ్గర నుండి కూడా ఇలాంటి మాటలు నీల విని ఎరుగదు. అది దుఃఖమో, కోపమో మరేదో తెలియలేదు. తన మాటకొక్కతన్ను తిన్నదే కాని, ఇట్లా కోపం తెచ్చుకోకుండా తనకు జవాబు చెప్పిన మగవాళ్లు లేరు.
“నన్ను చెడోనిగ సూడకు నీలా! నీ గురించి నాకు తెలుసు. ఆ రోజు పంచాయితిలో నీవు తీసుకున్న నిర్ణయం ఆలోచిస్తే చాలా కరక్టు. నన్ను నీ కట్టంలో మతికుంచుకో – నన్ను మతికుంచుకోవటమంటే – మేం దేని కోసం కొట్లాడుతున్నామో దాన్ని తెలజేసుకోవటం – కట్టాలను సహించి ఊకోవద్దు – కొట్లాడాల – నాకు నీ మీద గాని, నీ భర్త మీద గాని కోపం లేదు నీలా! వాళ్లందరికి వీలైతే చెప్పు – నేను గరీబోన్ని – నాకు గరీబోల్లంటే కోపం లేదని చెప్పు నీలా! సెలవు….”
వాళ్లు ఈత చెట్లల్లో కలిసిపోయారు. వెన్నెల వెలుగులో తను ఒంటరిగా. నీలకు అదంతా కళ్ల ముందు మెదిలి బరువుగా గాలి పీల్చింది. ఎడమ చేతితో కొంగు తీసుకొని కండ్లు తుడుచుకున్నది. అతను తన లోపలెక్కడో దీపం ముట్టించాడు. భార్యా భర్తల మొరటు సంబంధాన్ని వొదులుకున్నవాడు.
నీల ఒక్కొక్క ఇల్లే దాటుతూ నడుస్తోంది. ఊరు ఊరంతా నిశబ్దంగా ఉన్నది. ఎక్కడో గుడిసెలో చిన్న పిల్ల గుక్క పట్టి ఏడుస్తోంది.
పిల్లను సముదాయించడానికి నీర్సంగా తల్లి ఏదో గొనుగుతోంది.
నీలకు దుఃఖం స్థానే ఏదో బరువు మీద పడ్డట్టుగా ఉన్నది. అదేమిటో తెలియడం లేదు.
నీల తమ ఇంటి ముందటి మొండి గోడ లోపలికి జొరబడింది.
రెండేండ్ల కొడుకు శ్రీను తప్ప తప్ప అడుగులేస్తూ నీల కాళ్లకు చుట్టేశాడు. నీల గడ్డి మోపు కింద పడేసి కొడుకును ఎత్తుకొని గుండెల కదుముకున్నది.
నీల అత్త ఇంట్లో నుంచి బయటకొచ్చి కుడి చెయ్యి నుదురు కడ్డం పెట్టి సూర్యున్ని చూసి ముఖం ముటముట లాడిస్తూ- “పొలం కాన్నుంచి గింత పొద్గాలచ్చినవ్ – అగల పోరి ఆకిలూడిత్తె బెచ్చులకు బెచ్చులే లేసి నట్టున్నది సంసారం – మిండెడు మునిగి ముతమాయమై పోయిండనా?” చేతులారుస్తూ.
నీల ముఖం వెలవెలాపోయింది. ఇట్లాంటి మాట తనూహించలేదు.
నీల అత్త రంగమ్మ శంకిలి మనిషి. మొగుడు బతికుండగ మొగన్ని తిన్న తిండి పెయిన బట్టకుంట తిట్టి తిట్టి మనిషిని మూగ మొద్దును చేసింది. ఎప్పుడు అదినొచ్చే ఇది నొచ్చేనని వగలుపోతూ ఎదుటి మనిషిని తిట్లతో లొంగదీయడం అనే విద్యతో ఆమె జీవితమంతా కష్టపడకుండానే గడిచిపోయింది. రంగమ్మ తిట్లకు వశపడకనే మొగడు ఉరిబెట్టుక సచ్చిండు. ఆమె నోరిప్పిందంటే ఊరు ఊరంతా గజగజలాడవల్సిందే. మనిషిని ఎక్కడ దెబ్బ కొట్టాలో, మనిషి ఆయువు పట్లు ఎక్కడుంటాయో రంగమ్మకు బాగా తెలుసు.
“నా కొడుకును ఆడిపోసుకున్న లంజెలు – లంజె కొడుకులు గట్లనే మునిగి ముతమాయమైపోతరు. నెగలబుట్టని కోడిపిల్ల మంచం మూడుసుట్లని ఆడు బతికిండా? మందిని బతుకనిచ్చిండా? లేమిడి గొడ్డి కొడుకు, లేకి బుద్ధులు నా కొడుకు గీ జెట్ట ముండను ఏమంట కట్టుకున్నడో నా కొడుక్కు శని సుట్టుకున్నది. నా కొడుకు కండ్లనిండ నిదురబోలే – కడుపునిండ తినలే – గాయిగాయి తిరిగి…”
నీల మాట్లాడలేదు. మాట్లాడాలనే ఆసక్తి, రేషం ఏనాడో చచ్చిపోయినయ్. మాట్లాడ్లే అత్తకు తిట్లకు ఆ మాట ఆధారమౌతుంది.
“మాట్లాడవేందే బట్టులంజె” రంగమ్మ రొండి మీద చెయ్యి వేసుకొని నిట్ట నిలువుగా నిలుచుండి అడిగింది. తనకు తిట్టడానికి కొత్త విషయం కావాలి.
నీలకు సర్రున కోపమొచ్చింది. “నోరిప్పితే పురుగులు రాలుడేనాయే” నీల. “నీ నోట్లి పోశమ్మ కూసోను. నీ నోరు పడిపోను. ఊళ్లి లంజలంత నా నోరు మీదనే ఏడుతరు. మీ నోర్లు పడిపోయినయా? మూసుక పోయినయా? ఓసి బొడ్డికానా? నా నోరు మంచిది గాదే! కని నువ్వో – సమర్తయి ఆని దగ్గర పండి – ఆడు సాలక ఇడుపు కాయిదమిచ్చి నా కొడుకును తగులుకున్నవ్.”
“అత్తా!” నీల దాదాపుగా అరిచినట్లుగా అన్నది.
ఆ మాట పాతదే గాని నీలకు ఇప్పుడు భరించే శక్తి లేదు. ఆ కంఠంలోని తీవ్రతకు రంగమ్మ విస్తుపోయింది. కాని తను ఓడిపోదలుచుకోలేదు.
“ఏందే? లావు రేషపడన్నవ్? – మిండెన్నంటే పొడుసుకత్తందా?”
“ఇంకో మాటంటే-” నీల కండ్లు ఎరు పెక్కాయి. తల్లిని చూసి సంకలో కొడుకు దద్దరిల్లి ఏడవసాగిండు.
“కొడుతవానె లంజాకాన – తెగిన దానివి – ఆడు ఊరు ఊరంతా కుప్ప జేసి నా కొడుకు మీనికి ఉసిగొల్పుతే పెండ్లానివైన నీకు రేషం లేదు. ఆడు మాదిగి మన్నేల కుప్పేసి ఇంటిమీదికి లడాయికి దోలుతే కోపం రాలేదు.” రంగమ్మ కోపంతో ఊగిపోయింది.
నీల మరింక అక్కడ ఉండకుండా ఏడుస్తున్న కొడుకును నేలమీద పడేసి గడ్డిమోపు తెచ్చి బర్రె మట్టుకాడ పడేసింది. బర్రె మట్టు దగ్గర దుడ్డె నీల్ల కోసం గింజుకుంటోంది.
బాయి దగ్గరికి తీసుకవెళ్లి దుడ్డెకు నీళ్లు పెట్టింది. దుడ్డె నీల్ల బొక్కెన మీద విరుగబడి తాగింది.
శ్రీను వెక్కి వెక్కి ఏడుస్తూ తల్లి ఎటు తిరుగుతే అటే తల్లి వెంట తిరుగుతున్నాడు… కింద పడుతూ లేస్తున్నాడు.
“ఈ ఇంట్ల అందరు తినేటోల్లే – దుడ్డెకు నీల్లు పెట్టే దిక్కు లేదు. దిక్కు మల్లె ముండకొడుకు నన్నెందుకు కన్నడు, ఆడి పుటుక పుట్టే బదులు అడివిల మానై పుడితే మంచిది. మంచి మంచోల్లకు సావత్తదిగని నీలిముండకు సావురాదు.” చివరి మాటకు నీల గొంతు దుఃఖంతో పూడుకపోయింది.
“నీ తల్లి గారింట కాన్నుంచి తెచ్చి పెట్టినావే? లంజె నా ఇల్లు నా తిండి” అత్త బింకంగా అనుకుంటూ ఇంట్లోకి వెళ్లింది.
“నా తల్లిగారు మునిగి ముతమాయమై పోయిండ్లు – నాకే తల్లిగారుంటె గీ నరకంల గీ మాటలు పడుదునా” – నీల కొడుకును ఎత్తుకొని కన్నీళ్లు తుడిచింది. ముక్కు చీమిడి తుడిచింది. ఉచ్చ పోసుకొని శ్రీను చెడ్డంతా తడిగాను, మట్టి నిండి ఉన్నది.
పిల్లవాడు దుమ్మునిండి చీదర చీదరగా ఉన్నడు. పైగా ‘నషిమీరి’ పుండ్లు. ఒక్కగానొక్క కొడుకుకు తానంబోసి తయారుజేసే పుర్సత్ లేనందుకు ఆమె మనసు విలవిల లాడింది.
పిల్లవాడు పాలకోసం తడుముతున్నాడు. అంటే కాసంత బువ్వ తినిపియ్య లేదన్న మాట – పిల్లగాన్ని ఒళ్లో వేసుకొని వాకిట్లో కూర్చుండి – కొంగు కప్పి పాలిస్తోంది.
నీలకు మొదటిసారిగా తన బతుకు మీద రోత కలిగింది. ఈ బతుకు బతికేకంటే ఏ కాలువలనో బాయిలనో బండ గట్టుకొని పడి సచ్చింది మేలు. ఎవరిని ఉద్ధరించ బతుకుతున్నట్టు – ఊళ్లి కొట్లాటలన్ని తన బతుకు చుట్టు చుట్టుకుంటే – తనెక్కడికి పోయేది! ఊళ్లే గొడువలు తనకు అర్థం కావు. అందులోకి వెళ్లే తీరిక లేదు.
పాలు చీకుతూ చీకుతూనే కొడుకు నిదురలోకి జారుకున్నాడు. కొడుకు పెదిమలు తుడిచి – లేచి నిలబడి కొంగు భుజం మీదేసుకొని వెళ్లి పాత చీర తెచ్చి బీర పందిరి కింద నులకమంచంలో కొడుకును పడుకోబెట్టింది.
ఈగలు జిబ్బుజిబ్బుమని తిరుగుతున్నాయి. కొడుకు మీద చీర పేగు కప్పింది.
రంగమ్మ ఇంట్లో మూలుగుతోంది. కొడుకొచ్చే దాకా అట్లాగే ఆపసోపాలు పడి రాగానే ఉన్నయి లేనియి చెప్పడం – ఆ కొడుకు తనను తన్నడం – మామూలే. నీల పొడుగ్గా గాలి విడిచి కొంగు బొడ్లో దోపుకున్నది.
ఇల్లు దొంగలు దోసినట్టుగా ఉన్నది. శ్రీను చాట, సోల, రాళ్లు, రప్పలు, కట్టె సిలుక, కర్ర గంగెద్దు ఎక్కడియక్కడే పారేశాడు. ఒక్కొక్కటే తీసి పక్కకు పెట్టింది. వంట చెయ్యాలి. సందగదు తియ్యాలె – బర్రెకు కుడిది కలుపాలె – పొయిలకు కొట్టిన కట్టెలు లేవు – సెరిగిన బియ్యం లేవు – కూరేమి వండాలో తెలియదు. పప్పు మొగనికి సొర్రుడు పోదు..
ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఇంటి వెనుక కట్టెల మండె దగ్గర నిలుచున్నది. చేతిలోకి గొడ్డలి తీసుకున్నది. మొట్టును అడ్డం జరుపుదామని వంగేసరికే చీరమీద ‘మైల’ కనిపించింది. నీలకు చెప్పరాని దుఃఖం కలిగింది. అసలే మనుసు మొద్దు బారున్న సమయంలో ఇదొకటి – ఇప్పుడు అన్ని పనులట్లో బెట్టి జరూరుగ నీల్లు కాగ బెట్టుకొని స్నానం చేయాలే.
నీల్ల కుండ తను ముట్టుకోకూడదు – అత్తను బిలుత్తే అంకశండాలం కడిగిపోత్తది – మొండిగోడ మీదినుండి ఆవలింటికేసి నిక్కి చూసింది. చిక్కగా పాకిన బీర పందిరి కింద సావిత్రి బియ్యం కోడుతోంది. ‘సావిత్రక్కా’ అన్న పిలుపు నోటిదాకా వొచ్చింది. అత్త చూస్తే మళ్లీ అదో గొడువ ఇద్దరు కలిసి ఏవో గుస గుసలు పెడ్తండ్లని.
“సన్నీళ్లు పోసుకుంటే సత్తనా?” బాయి దగ్గరికి నడిచింది. బాయి ముట్టుకోవద్దు – అందుకైనా పిలువాలె.
“ఆఁ ఏవున్నది – దిక్కు లేనోల్లు ఏం జేత్తరు?”గబగబా బాయిలోకి చేద వేసి నాలుగు బొక్కెండ్ల నీల్లు నెత్తి మీద కుమ్మరిచ్చుకున్నది. అప్పుడు యాదొచ్చింది చీరె రయిక్ తెచ్చుకోలేదని – అత్తను పిలిచేది లేదు.
నీలమ్మ నీల్లు కారుతున్న ఒళ్లుతో ఇంట్లో కొచ్చేసరికి రంగమ్మ నోట మాట రాక దయ్యాన్ని చూసినట్లుగా గుడ్లు తేలేసి చూసింది.
“నీలీ – అన్నంత పని చేసినావే?” అన్నది. నీల ఆ మాటను ఖాతరు చెయ్యకుండా చీర జాకెట్టు అందుకున్నది.
“మిండెడు సచ్చిండని తలార సన్నీల్ల తానం జేసినావే రంకుముండా?” రంగమ్మ అదో విధమైన ఓటమి గొంతుతో.
“ఔ – మొదటి మొగడు సచ్చిండని” అన్నది.
ముసలి రంగమ్మ అహం తొలిసారిగా దెబ్బ తిన్నది. ఆమాట కోడలు అనగలదని ఊహించలేదు. మరింక రంగమ్మకు మాటలు రాలేదు. ఏడుపు వొచ్చింది. పెద్దగా శోకాలు పెట్టడం సాగించింది.
నీలకు తన విజయం మొదటిసారిగా తెలిసింది. తన బతుకులో మొదటిసారిగా శత్రువు ఇలాగా ఏడుస్తుండగా చూస్తున్నది.
పొడి బట్టలు కట్టుకొని తడి బట్టలు మూట కట్టి బాయికి దూరంగా ఓ కర్ర కింద పెట్టింది. గొడ్డలి తీసుకొని పొయ్యిల చెక్కల పగుల వేసింది – ఇంటెనుక పందిరి కింద పొయ్యి శుభ్రం చేసి మంట రాజేసింది – బుగెండి గిన్నెలో ఎసరు పడేసి బియ్యం చెరిగి గంజులో వేసింది… చీపురు తీసుకొని ఇల్లంతా ఊడ్చింది. తలగోల్లకొట్టుకొని – కూరేం వండాలా అని ఆలోచించింది.
కూరనార రుచిపచి అనకుండా ఏది పెడితే అదే తినే లేత ముఖం పిల్లవాడు లచ్చింరాజం కన్పించాడు. గొడ్డు కారం ఊదుకుంటూ తను తినలేకపోతే తల్లితో పోట్లాట పెట్టుకోవడం గుర్తొచ్చింది.
నీల ఇంటి బయట కొచ్చింది. అప్పటికి ఎండపొడ ఇండ్ల కప్పుల మీద పారాడుతోంది. గోడల నీడలు వాకిల్లను, బజార్లను కప్పేశాయి. దిగాలుపడ్డ మొఖాలతో, బురద చిల్లిన ఒళ్ళుతో వాడిపోయి వొడలిపోయి జనం ఇండ్లకు మళ్లుతున్నారు.
బండారు పోశాని ముసలవ్వ నడి బజాట్ల నిలబడి దారిన పొయ్యే వాళ్లనల్లా “ఏమయ్యిందని?” అడుగుతుంది.
ఎవలు సడీ సప్పుడు చెయ్యటం లేదు. ఆ ముసలమ్మకు జవాబు చెప్పడం లేదు.
“ఏం బుట్టిందర్రా – నోళ్లల్ల బెల్లంగడ్డలు బెట్టుకున్నరా! ముసలి ముండకు కూసంత సెవులేత్తే అరిగిపోతరా? కరిగిపోతరా? పొద్గాల ‘బంటకు’ కంకెడంత తిని పేయిండ్లు కొడుకులు! దినాలు మంచియి రాలే – తల్లి మనుసు ఆగదాయె – ఇంక రాకపోయిరి. ఔరా! నువ్వు దొమ్మటోల్ల సాంభయ్యవేనా? ఇంక రాక పెయిరి మా వోళ్లు” పోశాని.
“నేను ఎంబడోల్ల సత్తయ్యను పోశవ్వ” అన్నాడు నిలబడి. “నీ బాంచెన్ బిడ్డ – సచ్చి నీ కడుపున బుడుత.” “నీ కొడుకుల కడుపుల్నే పుట్టేవ్ తియ్యే.”
“అట్లనే కానియ్యి బిడ్డా! ఏం జరిగింది బిడ్డా అందరు మన్ను దిన్న మంజేరు గున్నల తీర్గ పోతండ్లు, నాకేందో అగులు బుగులు గున్నది బిడ్డా!”
“మంచి మంచోల్లు మన్నయిపోంగ దూదేకులమియ్య దుడ్డు బట్టిండట – ఇనేంజేత్తవే?” సత్తయ్య ఎడ్లనదిలించుకొని వెళ్లిపోయాడు…
“నీ కాడుగాల నువ్వు పోవడివి పిలడా? సామెత జెప్పి మరింత సావగొట్టి” ముసల్ది పుతుకులాడుకుంట ముందుకు నడువబోయింది. నీలకు ఆ సంగతి ముసలమ్మకు చెప్పాలనే ఉన్నది.
కాని అడుగు ముందుకు పడలేదు. నోరు పెకుల లేదు. ఏమని చెప్పుతుంది? అతని గురించి తనకేం తెలుసు?
ఎందుకో కళ్లల్లో చివ్వున నీరు. కొంగుతో తుడుచుకున్నది.
నర్సొక్కులగాలిగాడు “గుమ్మి కింద పంది కొక్కు ద్దుత్తెరి గుమ్మినిండ కందిపప్పు” అనుకుంటూ ఉరికొచ్చాడు. ఆ మాట అనడానికి ఎన్నితంటాలు పడినా నాలుక తిర్గడం లేదు. –
“నీ సంబురం పొడుగాను గాలిగా ఇగ ఆగురా?” పోశాని ఆగ బట్టింది. గాలిగాడు తను ఇందాక అనే ఆ మాట మరిచిపోయిండు.
“ఏమయ్యిందిర? సడకు పక్క కొట్లాటగిన అయ్యిందా? పోలీసోల్ల మోట రచ్చిందా? ఎందుకనో పిల్లి పట్టిన కోడి పిల్లల తీర్గయిపోయిండ్లు ఊళ్లెమంది.”
“కింది కొక్కు -” నెత్తి గోక్కుంటూ గాలిగాడు.
“నీ ఇంట్ల పీనెల్ల – ఎనుకడెవడో సెలిమకాడ పట్టేం మర్చిపోయి మీ అత్తగారిచ్చిన ‘అర్నంఆవు’ గీన్నే పోయిందంట ఉసికంతా గెలికిండంట – పెండ్లామచ్చి తన్ను తందునా? అన్నదంట – ఆఁతానే తందానా? అన్నడట-” పోసాని మూతులు పొడిచి “ఏమయ్యిందిరా?” అన్నది.
బిత్తరి చూపులు చూశాడు గాలిగాడు. నెత్తి గోక్కున్నాడు. “ఓ అదా! నచ్చలైటు లచ్చింరాజెంను పోలీసోల్లు సంపేసిండ్లట” గాలిగాడు.
“ఓర్ని నీ నోరు పడిపోను. నిచ్చమా? అవద్దమురా? ఎవడు జాడ సెప్పి పున్నెం కట్టుకున్నడురా?” పోశాని కంఠంలో వొనుకు. –
“నాకే మెరుక – మేకమరుక -” గాలిగాడు ఆ మాటనే పాటలాగా పాడుతూ పరుగెత్తాడు.
ముసల్ది నవనాడులు కుంగిపోయినట్లుగా చేతి కట్టె నేల మీద పడేసి బజాట్లో కూలబడిపోయింది. ముఖాన కొంగు బెట్టుకొని ఆ నిరు పేద ముసల్ది తన కొడుకే చనిపోయినట్లుగా – ఏడ్చింది. దాని మనుసులో లచ్చింరాజం పాడే పదం “కక్కడేర్గుడు బెట్టి లచ్చుమమ్మో” మెదిలింది. తమ ఇంట్లో మనిషిగా మెదిలిన సంగతులు గుర్తుకొచ్చాయి. నీలకు ముసల్దానికి లచ్చింరాజం చావుకు ఉన్న బాంధవ్యం తెలియదు. ఊరివాళ్లంతా అతని గురించి ఎందుకు కలవెల పడుతున్నారో తనకు తెలియదు. తను ఆ ప్రవాహంలో లేదు.
నీల బీరతీగల వెంట వెతికి మూడు బీరకాయలు తెంపింది. బీర పువ్వులు పసుపు పచ్చగా పసిపాప నవ్వుల్లా విచ్చుకుంటున్నాయి. ఇంటి వెనుక చింత చెట్టు.
మీదికి కవ్వర, కవ్వర మంటూ పక్షులు చేరుకుంటున్నాయి. మామూలు రోజుల్లోనైతే వీధిలో నడిచే మనుషుల మాటలే ఆ పక్షుల అరుపులను మించి విన్పించేవి. ఊర పిచ్చుకలు పిచ్చర పిచ్చరమంటూ అటు దునికి ఇటు దునికి చూరు కిందికి చేరుకుంటున్నాయి. ఇండ్ల కప్పుల మీద ఎండపొడ మటుమాయమైన లచ్చింరాజం ప్రశాంతమైన ముఖంలాగే నిష్క్రమిస్తోంది. దుఃఖంలా నల్లబారే ఊరు….
నీలకు అనంతకోటి మాటలు పోటెత్తాయి. ఆకాశంలో మేఘాలు కుదురుకుంటున్నాయి. ఆ బ్రాండి షాపు వెనుకాల అందంగా కత్తిరించిన చెమన్ అరమధ్య అయిదుగురు కూర్చుండి విస్కీ తాగుతున్నారు. వాళ్ల ముందు టేబిల్ మీద పడేసిన కోడి ఎముకలు చిందర వందరంగా పడి ఉన్నాయి…
అక్కడ కూర్చున్న అయిదుగురు ఇంచుమించు ముప్పయి సంవత్సరాల లోపు వాళ్లే. అంతా ఒకే కత్తు అయినా తలో రకంగా ఉన్నారు. టేబిల్కు ఆ పక్క ఈ పక్క ఇద్దరిద్దరు కూర్చున్నారు. ఎదురుగా కూర్చున్న తను హుందాగా ఠీవిగా ఉన్నాడు. అక్కడ కూర్చుండి తాగడం అతనికి చిరాకుగాను కోపంగాను ఉన్నది.
బ్రాండి షాపు కౌంటర్ మీద విసుగు నిండిన గొంతుతో పొడుగ్గా ఉన్నతను “వీళ్లు ఈ రాత్రంతా తాగేటట్టుగానే ఉన్నది.” పైకే అనుకుంటూ బ్రాండి షాపు ముందు మూడు మోటరు సైకిళ్లను దిగాలుగా చూశాడు – అతనికి ఈ కస్టమర్లు షాపులోకి రావడం కొత్తే.
రాత్రి పది దాటిపోయింది. పెట్రోలింగు కోసం వచ్చిన పోలీసులు రోడ్డు మీద నిలుచున్నారు.
అందులో ఒకడు వొచ్చి “ఈ సైకిల్ మోటార్లు ఎవలయని మా హెడ్ కాని స్టేబుల్ అడుగుతండు సార్” అన్నాడు.
“ఒకటి కామ్రేడ్ లచ్చింరాజంది… ” కౌంటర్ మీదాయన అసహనంగా.
పోలీసు డంగై పోయాడు. కర్ర లేపేవాడే – బ్రాండిషాపుకు దాసోహం అనని వాళ్లెవరు?
“లేకపోతే ఏందయ్యా బ్రాండి షాపులకెవలొస్తరు? తాగుబోతులు తప్ప. నీ దగ్గర టార్చున్నదా? వీధి లైటుల నంబర్లు చూసి మీ హెడ్డుకు చెప్పు పోరాదు” అన్నాడు కౌంటర్ మీది మనిషి.
పోలీస్ ఎగాదిగా చూసి మోటారు సైకిల్ల చుట్టూ తిరిగి నిలబడిన పోలీసుల దగ్గరికి పోయి ఏదో చెప్పాడు…
హెడ్ కానిస్టేబుల్ పోలీసు ఠీవితో “షాపు మూసేయవయ్యా” అన్నాడు కరుకుగా. “లోపల కూర్చున్న వాళ్లకు చెప్పరాదు” అన్నాడు కౌంటర్ వాలా, ఇందాకటి పోలీసొచ్చి నిలుచున్నాడు, మిగతావాళ్లు వెళ్లిపోయారు. కౌంటర్ మీది వ్యక్తి ఓ క్వార్టర్ బాటిల్ తీసి యిచ్చిండు.
లోపల నల్లగా కుదిమట్రంగా ఉన్నతను “మనం విలేజి లెవల్లకు ఆర్గనైజేషన్ తీసుకపోవాలా” అన్నాడు ఖాళీ ప్లేట్లో పునుకుతూ…
ఎడంపక్క కూర్చున్నతను. “నాకైతే సావుకచ్చింది” అన్నాడు తడబడుతూ అదే అదనని.
“వీనమ్మ అన్నీ బొక్కలే” ఇందాకటి నల్లటతను.
“మాంసపు ముద్దలుంటయనుకున్నవా?” ఇందాకా భయపడినతని పక్కతను… అందరూ నవ్వారు – ఎదుటి వ్యక్తి, భయపడిన వ్యక్తి తప్ప. ఎదురుగా కూర్చున్నతను మొక్కుబడిగా వాళ్లకోసమే కూర్చున్నట్లుగా కూర్చున్నాడు.
ఎదురుగా కూర్చున్నతను మెల్లగా లేచి షాపు బయటకొచ్చాడు. కౌంటర్ మీది వ్యక్తి హమ్మయ్య అనుకున్నాడు.
ఇందాక భయపడిన వ్యక్తి తూలుతూ అతని దగ్గరికొచ్చాడు.
“రావ్ సాబ్ మీ పొలాలు మల్ల నాట్లు బెట్టిచ్చినం…. వాడు సచ్చిండు. ఇన్ఫార్మర్ నని నేను చెప్పిన్నని, పట్టిచ్చిననని మా వూరోల్లు ఈపూట నామీది కొస్తరు-”
“నీకు అంత ధైర్యమున్నదని మీ వూరోల్లు నమ్ముతరనుకుంటున్నావా? పోనీ నీకు నువ్వైనా నమ్ముతున్నవా? ఖైర్.”
“నువ్వు నా కోసం రాలే – నా సేవలు జెయ్యలే – సచ్చినవాడు నీ పెండ్లాం మాజీ మొగుడు – అదీ నీ మంట – నువ్వు మా పొలిటికల్ పార్టీల జేరింది నీ బలానికే విన్నవా? మా కోసం కాదు తిరుగుబోతువు – పైసకు గొరగాని వానివి – ఇగో ఈ బ్రాండి షాపుల నా పక్కన కూర్చుండి తాగేదన్క ఎదిగినవ్ చాలదా?” అతను సైకిల్ మోటర్ స్టార్టు చేసిండు.
భయపడే అతను – దగ్గరికి పోయి “మీరు తలుచుకుంటే కొంతకాలం ఎక్కడికన్న … నన్ను పంపియ్యగలరు.”
అతను బలంగా నెట్టాడు. భయపడే అతను కిందబడిపోయాడు – తెల్లటి ఖద్దరు బట్టలు దుమ్ము కొట్టుకపోయాయి.
ఇందాకటి నల్లటి మనిషి వచ్చి లేపి “రావు సాబ్ కోపంలున్నడు. మనం రావుసాబ్ కోసం చేస్తిమా? దేశభక్తి ఉండిగని మనది ఆలిండియా పార్టీ – పాఁ నువ్వేం భయపడకు నేను నీ వెంటచ్చి మీ వూళ్లేదించి వస్త. పా – మబ్బులత్తన్నయి. వానో మన్నో” అన్నాడు అనునయంగా.
సైకిలు మోటర్ మీద వెనుక కూర్చున్నాడు – నల్లటతను కౌంటర్ మీదికి వెళ్లి ఆఫ్ బాటిల్ విస్కీ తెచ్చి చేతికిచ్చాడు.
సైకిలు మోటారు ఊళ్లో నుంచి వచ్చి నీలమ్మ ఇంటి ముందాగింది.
ఆ శబ్దానికి నీల ఉలిక్కిపడి లేచి తన భర్తె అయి ఉంటాడని తలుపు తీసింది. ఎదురుగా తన భర్త సత్యనారాయణ ఇంకెవరో తనకు తెలియని మనిషి – తన కేసి అదోలా చూస్తున్నాడు.
భర్త లోపలికొచ్చాడు. బైట సైకిల్ మోటారుమోత గాలిమోతలో అంతకంతకు దూరమయ్యింది.
సత్యనారాయణ సొలుగుతూ పొయ్యి మంచం మీద కూలబడ్డాడు. తెచ్చుకున్న సీసా మూత తీసి తాగుతూ కూర్చున్నాడు.
“ఆవల తాగింది సాలలేదా?” నీలమ్మ మంచంలో నుండి కొడుకును తీసి నేలమీద సా పేసి పడుకో బెట్టింది.
“అన్నం తింటవా?” నీల. సత్యనారాయణ తాగుతున్నాడు.
సత్యనారాయణ కండ్లు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. ముఖం ఉబ్బి ఉన్నది. లోపలెక్కడో దగాపడ్డ మంట – మరో పక్క శాశ్వత శత్రువు చనిపోయినందుకు సంతోషం – అతని అనుచరులు పగబడుతారేమోనని భయం.
నీల భర్త దుమ్ము కొట్టుకపోయిన బట్టలు, ఉబ్బిన మొఖం, ఎరుపెక్కిన కండ్లు చూస్తున్నది. కొత్తగా, వింతగా అసహ్యంగా ఉన్నాడు. ఈ మనిషితో తను ఇన్నేండ్లు కాపురం చేసింది… తన్నులు తిన్నది.
“నీ మాజీ మొగన్ని… సంపేసిండ్లే లంజెదాన” సత్యనారాయణ బొంగురుగా.
నీలకు చెప్పరానంత అసహ్యం కలిగింది. మాజీ మొగడు మాజీ మొగడు – అందరిది ఒక్కటే మాట – తల్లిది, కొడుకుది. నీల చివ్వున లేచిపొయ్యి కంచంలో అన్నం తెచ్చింది.
సత్యనారాయణ ఊగుతూ లేచి నిలబడి కంచం తీసి విసిరి కొట్టిండు… అది బొకబొకలాడింది. అన్నమంతా చెల్లాచెదురుగ పడిపోయింది. కూర నీల ముఖం మీద పడ్డది.
“నీకు దుఃఖంగున్నదా?” సత్యనారాయణ నీల చెయ్యిపట్టి మీదికి గుంజు కున్నాడు. భర్త కళ్లల్లో పశుకామం కాకుండా ఇంకేదో ఉన్నది. అదేమిటో తెలియడం లేదు.
“నువ్వు సత్తె ఏడవననుకుంటన్నవా?” నీలకు ఏం మాట్లాడాలో తోచలేదు. కోపంలో ఏదో అన్నది.
“లంజా…. ” సత్యనారాయణ నీల వెంట్రుకలు పట్టి వంచి పెడీ పెడీన వీపుల గుద్దిండు – జాకెట్టు సర్రున చింపిండు – తన్నిండు.
“పో – లంజా – నువ్వు నా పెండ్లానివి కాదు.” వెంట్రుకలు బట్టి బయటకు ఈడ్చిండు. పిల్లవాడు శ్రీను లేచి మొత్తుకున్నాడు.
“వీడు నాకు పుట్టలేదు.” సత్యనారాయణ పిల్లవాన్ని బయట పడేశాడు. తలుపులు బిగించుకొని తాగసాగిండు.
అత్త రంగమ్మ “లంజె కాన నా కొడుకునే మన్నవే? – నీకేం బుట్టిందే మార్నగాలం” అంటూ మంచాల నుంచి లేవకుండానే తిడుతున్నది.
నీల ఏడ్వలేదు… కొడుకు నెత్తుకొని బర్రె మట్టు దగ్గర కూర్చున్నది. పెదువు పగిలి నెత్తురు కారుతున్నది. వీపులో పొంగి పోయింది. చేతి మట్టల మీద పాత దెబ్బల మచ్చలున్నాయి.
పైన మబ్బులు కమ్మిన ఆకాశం – ఒళ్లో ఏడిచే కొడుకు – ఆ దెబ్బలు నీలను బాధించలేదు… కొడుకు నోట్లో రొమ్ము పెట్టింది. ఎక్కడో నీలకు మసగ్గా, సన్నగా ఉన్న దారంలాంటి బంధం తెగిపోయినట్లనిపించింది.
ఎప్పటినుంచి ఉరుముతున్నదో తెలియదు. కాని ఇప్పుడు తన మనసులో పిడుగులు పడుతున్నాయి. ఉండీ ఉండీ మెరుస్తున్నది. బర్రె తన దుడ్డేను నాకుతున్నది.
నీలకు ఎండా, వాన, చలి, చిన్నతనం, లేగదూడలా పరుగులు తీసిన రోజులు గుర్తొచ్చినయ్. తండ్రి బట్టల దుకాణం. మొదటి పెండ్లి, ఆ తరువాత సత్యనారాయణతో కాపురం – తను ఎక్కడ మొద్దుబారిపోయిందో గుర్తుకురాలేదు. భర్త చేత తన్నులు తినడం నీలకు ఇది ఎన్నోసారో? ఈసారి బయటకు గెంటేశాడు. సత్యనారాయణ మొదటి రాత్రి తలుపులు బిడాయించి తనను అడిగిన మాటకు బెదిరిపోయింది. ఎదురు తిరిగింది. సత్యనారాయణ మొదటి రాత్రే మీదబడి కొట్టిండు. అప్పుడు తనే బయటకు పరుగెత్తి పదహారు మైళ్లు ఆ చీకటి రాత్రి తల్లిగారింటికి పరుగెత్తింది. మరింక జన్మలో మొగోడనేవాని మొఖం చూడనను కున్నది. “కాపురం జేసినంక వాడే మారుతడని” తండ్రి మళ్లీ అత్తగారింటి కాడ దిగవిడిచి పోయాడు.
భర్త మారలేదు. తను తనకు తన మొదటి భర్తకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా నమ్మకుండా భర్త బయట భజనలు, పూజలు మొదలు పెట్టిండు. ఊరందరికి శత్రువైన మనిషి దొర పంచలో చేరిపోయాడు. రోజు రోజు దిగ జారాడు. దొరలు రైతుకూలీ సంఘాలను ఎదుర్కోవడానికి ‘దేశభక్తి’ పార్టీలో చేరారు. తన మొగడు ఆ పార్టీతో తిరుగసాగిండు. తన జీవితంలో ప్రవేశించిన వీళ్లిద్దరికి ఆస్తి తగాదా లేదు. మరెందుకు సత్యనారాయణ కసి పెంచుకున్నాడో తెలియదు.
తను మరింక తండ్రికి చెప్పుకోలేకపోయింది. రానురాను తండ్రి తనను పట్టించుకోవడమే మానేశాడు. అన్నలు వేర్లు పడిపోయి ఎవల బతుకు వాళ్లదయ్యింది. బట్టల దుకాణం పోయింది. తండ్రిని కొడుకులు చూడరు. తన తండ్రే పొట్ట గడవటం కోసం బట్టల మూటలు మోసుకొని ఊళ్ల వెంట తిర్గుతున్నాడు… అంతటితో తల్లిగారింటి బాంధవ్యము తెగిపోయింది. ఊళ్లో తన బాధలు వినేవాళ్లెవరన్నా ఉన్నారో లేదో కూడా తెలియదు. తను ఇల్లు కదిలి బయటకు పోలేదు. తన ఇష్టా ఇష్టాలతో ప్రమేయం లేకుండా అందరు తనను బాధ పెట్టారు. తన బతుకుతో ఆడుకున్నారు.
ఒళ్లో కొడుకు నిదురబోయాడు – వాడికి ఈ బాధలు తెలుస్తున్నాయా? ఎప్పుడో చిన్నప్పుడు చిందిమాదిగి వాళ్లు ఆడిన భాగోతంలో బాలనాగమ్మ మతికచ్చింది… మాయల పకీరు గుహలో కుక్క తీర్గ పడుంటది బాలనాగమ్మ – “నీలా మొగకుక్కవు కాదు. ఆడి కుక్కవు – పిరికెడు మెతుకులకోసం ఈ ఇంట్లో పడి ఉంటున్నావు. బైట దిక్కు లేదు. ఆ కుక్క బతుకు కూడా మరింక సాగేటట్లు లేదు.” బాలవద్దిరాజులాగా తన కొడుకు తనకు రవ్వంత సుఖం కలిగిస్తాడా? ఆ రెండు సంవత్సరాల నషిమీరు పుళ్ల కొడుకును గుండెల కదుముకున్నది. వెచ్చని కన్నీళ్లు కొడుకు ముఖం మీద పడుతుండగా ముద్దులాడింది. “నా కొడుకా బాలవద్దిరాజా!
నీయి లేతపాదాలు – నువ్వు పెరిగి పెద్ద గెప్పుడైతావ్? నీ తల్లి ఏడ కుక్కయి పోయిందో ఎప్పుడు తెలుసుకుంటవ్? ఏడేడు సముద్రాలు ఎప్పుడు దాటేవ్? అప్పటిదాకా నీ తల్లి బతుకుతే కదా! నాయిన్న నువ్వు దిక్కుమల్లె నీలమ్మ కొడుకువే గాని – బాలవద్దిరాజువు కాదు. నా తండ్రి బాలవద్ది రాజులను పకీరోల్లు బతుకనిస్తరా?”
ఉరుములు హెచ్చాయి… మరింక తనెక్కడికి పోగలదు? తను ఎవరి అంటు సొంటుకు బోయినా ఆళ్లకు ఆజన్మబాధలు సుట్టుకుంటాయ్. తన పుటేకే మంచిది గాదు. “దేవుని గుల్లె రాయిపడ నా అసొంటి దాన్ని కొంటబోడు. అయినె – తన బతుకును సూసుకోక గరీబోల్ల బతుకులు సూసిన అయినెను బతుకనిచ్చిండ్లా? లక్ష్మింరాజం మతికొచ్చేసరికి నీల మనుసు చెరువైపోయింది. అతని చావుకు తను దెబ్బలు తినడానికి లింకేమిటో అర్థం కావడం లేదు.
సన్నగా వర్షం ప్రారంభమయ్యింది. తనింక ఈ తన్నులు తినలేదు. ఎవలకు మాత్రం పనికిరాని తను బతుకుతెంత? బతుకకపోతే ఎంత? ఈ పసిగుడ్లో – వాన్ని నేను మనుండంగనే బుక్కెడంత బువ్వ దినిపిచ్చే దిక్కులేదు. నేను పోయినంక నా దినవారాలు గాకముందే ఇంకోదాన్ని తెచ్చుకుంటడు. నా మీద కోపాన్ని అత్త, భర్త పిల్లగాని మీద చూపెడతరు. నా అంశ ఈ భూమ్మీద బతుకద్దు.
నీల లేచి నిలబడింది. చీకట్లో నడుస్తోంది. దెబ్బలు తిని, జుట్టు ఊడిపోయి, బట్టలు చిరిగి నీల పిచ్చిదానిలాగున్నది. చేతుల్లో కొడుకు చలికి వనుకుతున్నాడు. మెరిసిన మెరుపులో కొడుకు అమాయకమైన ముఖం, నీల వాకిట్లో నుండి మొండిగోడ దాటి బజార్లో కొచ్చింది. నీల మెదడులో ఆలోచనలన్నీ ముదైపోయాయి.
చిమ్మం చీకటి – చిమ్మెట్ల రొద – ఉండీ ఉండీ గుడగుడలాడే ఆకాశం కాంతి విహీనమైన మెరుపులు, బలహీనంగా కురిసే సన్నటి తుంపర. నీల దక్షిణం వేపు నుండి ఉత్తరపు వేపుకు వడివడిగా నడుస్తోంది.
హన్మంతుని గుడి, రైతుల గూనిండ్లు, వడ్లధాతి, కమ్మరి కొలిమి గుడిసెల వరుస – చివరన ఎక్కడో కుక్కలు మొరుగుతున్నాయి. రాత్రి ఎంతయ్యిందో తెలియదు.
భుజం మీద ఎత్తుకున్న కొడుకుమీద కొంగు కప్పింది. తడిసిపోయి గజగజ వనుకుతున్నాడు. తల్లి భుజాన్ని బిగ్గరగా కరిచి పట్టుకున్నాడు. నీర్సంగా ఏడిచాడు.
నీల ఎవరైనా తనను అడ్డగిస్తారేమోనని గుడిసెల్లో నుండి వడివడిగా నడిచింది. గుడిసెలు ఆఖరైన చోట బండ్ల బాటకు ఆపక్క ఈ పక్క ‘నీల్లబొదరు’లో ఎత్తుగా పెరిగిన తుంగ మీద వాన చినుకులు శబ్దం చేస్తున్నాయి… అప్పుడప్పుడు ‘సప్పున’ గాలితెర వీస్తోంది. నీల్ల బొదరులో చిన్న కప్పలు తప్పెట్లు కొట్టినట్టుగా అరుస్తున్నాయి. ఎక్కడో ‘నీరు కట్టె పాము’ కప్పను మింగినట్లున్నది. కప్ప చిత్రంగా అరుస్తోంది. ఆ తుంగ దాటిన తరువాత పెద్ద కాలువ వొచ్చింది. ఆదారి సీదా గుట్టకేసి పోతుంది. కాలువ మీద మోరి – ఎడం కేసి నడుస్తోంది.
అట్లా కొంత దూరం నడిచింది. ‘ఊడుగు పొదల’ పక్క పెద్ద పరుపు బండ, పరుపు బండ నానుకొని ‘నక్కల బోరు’. నక్కలగుట్ట బోరు పై భాగంలో చిన్నయ్య పెద్దయ్య దేవుడి పందిరి.
నీలమ్మ ఊడుగు పొద పక్కనే పెద్దబండ సాటుకు కూర్చున్నది. మోకాళ్ల మీద కూర్చుండి కొడుకుకు పాలు పట్టింది. ఆఖరిసారిగా ముద్దులాడింది. ఒళ్లంతా తడిమి తడిమి చూసింది. ఎక్కడో తల్లి పేగు తిరుగబడుతోంది… ఏ ఆలోచనకు చోటివ్వకుండా లేచి నిలబడి గుట్ట బోరును – చీకట్లో పాములా మెలికలు తిరిగిన కనిపించని ఊరును చూసింది… కన్న తండ్రిని, కట్టుకున్నవాన్ని కసితీరా తిట్టింది… తనను మనిషిగా చూసిన మనిషి – తను నడిమందిలో అవమానపరచినా కూడా అది మనసులో ఉంచుకోని మనిషి లచ్చింరాజంకు సజల నేత్రాలతో మనుసులో మొక్కింది… కాలువ కేసి నడిచింది… నీల అనే ఇరువై అయిదేండ్ల స్త్రీ కోట్ల స్త్రీలలాగే తన బతుకు, తన కొడుకు బతుకు అంతటితో అంతం చేసుకోవాలని నడిచింది. నీటి కాలువలో పడి తనువు చాలించాలని నడిచింది.
చుట్టూ విస్తరించుకున్న పొలాల మధ్య ఎప్పుడో కట్టిన గుడి ఒకటున్నది. దాని చుట్టూ సీతాఫలముల చెట్లు, ఊడుగు చెట్లు పెరిగి అదో పచ్చటి ముద్దలాగున్నది – అక్కడ పాములుంటాయని ఎవరు పోరు. ‘కాముని భూతం’ అక్కడ మంటలు వేస్తుందని కూడా ప్రచారం. అలాంటి గుడి పాడుబడ్డ మెట్ల మీది నుంచి అయిదుగురు మనుషులు లేచారు.
కురచగా ఉన్న మధునయ్య కాయిదపు సుట్టల్ని వరుకు కాయిదంలో సుట్టుకొని ధోవతిలో చెక్కుకొని మళ్లీ ఏర్పడకుండా ధోవతి కట్టుకున్నాడు. పైనుండి యూరియా బస్తాలు అంటేసి కుట్టిన ‘కోలాటం’ వేసుకున్నాడు.
ఆఖరి వందనాలు తెలుపుకొని ఎటు వాళ్లటు లేచిపోయారు. ఊరి వాళ్లిద్దరు కొంచెం తిరుగుడు దారి మీద వెళ్లిపోయారు.
మధునయ్య చినుకులు ‘కోలాటం’ మీద పట్టర పట్టర పడుతుండగా బరుకు బరుకున శబ్దం చేస్తుండగా పొలాల గట్ల మీదినుండి కాలువ గట్టెక్కాడు. వడివడిగా నడుస్తున్నాడు.
ఎదురుగా చీకట్లో అడుగుల చప్పుడు. మధునయ్య హఠాత్తుగా ఆగిపోయి ఈ వేళప్పుడు ఎవరిక్కడున్నదని ఆలోచించాడు. నీడలాగా చీకట్లో ఆకారం వడివడిగా నడుస్తోంది… ఓ మెరుపు మెరిసింది. మధునయ్య ఆ మెరుపులో ఆ ఆకారం ఒక స్త్రీదని గుర్తించాడు.
ఆ ఆకారం కాలువకేసి పరుగెత్తుతోంది. కాలువలో చేతిలోది ఏదో విసరడానికి ప్రయత్నం చేసింది. మధునయ్య మరింక ఆలస్యం చేయకుండా పరుగెత్తి ఆ ఆకారం మీద కలెబడి చేతిలో అబ్బాయిని గుంజుకున్నాడు.
“నన్నిడువు. నన్ను బతుకనియ్యకు. నీకు పున్నెముంటది -నన్ను వొదులు.” ఆ ఆకారం పెనుగులాడింది.
మధునయ్య ఆ ఆకారాన్ని గట్టిగా పట్టుకున్నాడు.
ఆ ఆకారం కాళ్ళ మీద పడి ఏడుస్తోంది. మధునయ్య చేతుల్లో పిల్లవాడు ఏడుస్తున్నాడు. మళ్లీ మెరుపు మెరిసింది. ఈసారి మధునయ్య ఆ ఆకారాన్ని గుర్తించాడు.
“నువ్వా అక్కా!” మధునయ్య నీలమ్మ ఆకారాన్ని చూసి విస్తుపోయాడు. “నువ్విడువు తమ్మీ” నీల.
“అక్కా! సచ్చేం సాధిత్తవ్ – నా బొందిలో పానముండంగ మిమ్ముల సావనియ్య.” మధునయ్య బలవంతంగా నీల చేయి దొరకబుచ్చుకొని ఊళ్లోకి నడిపించాడు.
నీలమ్మ గింజుకుంటూ, ఏడుస్తూ పిచ్చిదానిలా మధునయ్య వెంట నడిచింది.
పందిరి కిందికి రాగానే “ఇగో నిన్నే పన్నవా? జెరంత దీపం ముట్టియ్యి” కేకేశాడు.
దీపం వెలిగింది – మధునయ్య భార్య, తల్లి పోశాని లేచొచ్చారు.
“గిప్పుడు ఏమడుగకుండ్లి- నీరయికె ఉంటే తెచ్చియ్యి” మధునయ్య. పోశాని కోడలును అడిగి ఎవరో తెలుసుకున్నది.
“అయ్యో నీలవ్వ తల్లి నువ్వా!” అన్నది.
నీల పోశాని మీదపడి వెక్కి వెక్కి ఏడ్చింది… కుమిలి కుమిలి ఏడ్చింది… పొర్లి పొర్లి ఏడ్చింది.
“నీలవ్వా! నీ బాంచెన్ బిడ్డా! కట్టాలకు అదులుతారు తల్లీ – పుట్టెడు దెబ్బలు దిన్న భూదేవరవు తల్లీ – అందరికి అన్నిటికి ఉదరున్నదిగనీ ఆడిదాని దుఃఖానికి ఉదరు లేదు నీలా!” పోశాని ఒళ్లంతా పునుకుతూ నీలమ్మను కడుపుల దాచుకున్నది. నీలమ్మ తను పుట్టిన దగ్గరి నుండి, పుట్టి బుద్దెరిగిన కాన్నుండి అలాంటి ఆదరణ ఎరుగదు.
“కట్టాలు మనందరి బతుకుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆటిని ఎదురించాలె నమ్మా… ” అన్నాడు మధునయ్య.
నీలకు లక్ష్మింరాజం అన్నమాట గుర్తొచ్చింది….
ఆ తరువాత మధునయ్య అతని భార్య వెంటరాగా నీలమ్మ మళ్లీ ఇంటి కొచ్చింది.
మధునయ్య జబర్దస్తీగా తలుపు తట్టాడు. తలుపు తెరుచుకున్నది.
సత్యనారాయణ కక్కుకొని నేలమీద అదే కక్కులో అసహ్యంగా పడున్నాడు. ఆ శబ్దానికి ముసలి రంగమ్మ లేచి వొచ్చింది.
“ఇగో అమాసచ్చిందని సంబుర పడకుండ్లి. ఇకనుంచి నీలవ్వ సెల్లెనేమన్నా అంటే పులుసులకు బొక్కలేకుంట ఊళ్లోలంత దంచుతరు. నీ దొరలే అత్తరో దాతలే అడ్డమత్తరో సూత్తం – ఏ ముసలి రంగమ్మా? ఈ ఊళ్లి పెండ్లాలను – మొగల్లు గొట్టే కాలం బోయింది – నీ కొడుక్కు చెప్పు… ” మధునయ్య.
ఆ లొల్లికి ఎన్నడూ ఆ ఇల్లు సొచ్చుకరాని ఊళ్లో వాళ్లంతా వచ్చారు. అందరు రెచ్చిపోయి తలా ఓ తిట్టు తిట్టారు.
“కాలో సెయ్యె ఇర్సి పారేత్త పీడబోతది – గవా యెవడొత్తడో సూత్తం.” ఎవడో… సత్యనారాయణను తన్నాడు.
తన చిన్నారి కొడుకును లక్ష్మింరాజంను చేస్తుంది. తను చేస్తే అవుతాడా. లక్ష్మింరాజం మనసు గురించి తనకు మాత్రమే తెలిసింది తన కొడుకుకు చెప్పుతుంది. అతని గురించి తనకేమి తెలుసు? తనకన్నా ఊళ్లోల్లందరికి లక్ష్మింరాజం ఎక్కువ తెలిసినట్టున్నది.
తను తెలుసుకోవాలె… తను తన గొడవల్లో పడి బావిలో కప్పలాగా ఇంతకాలం బతికింది. తను తెలుసుకోవాల్సింది ముఖ్యంగా లక్ష్మింరాజం గురించి… ఎంతో
ఉంది. అతను దేనికోసం కొట్లాడిండో దాని గురించి… దేనికోసం కొట్లాడిండు? ఊళ్లో వాళ్లందరి మంచి గురించి. కట్టాలను సహించి ఊరుకోవద్దు – కొట్లాడాలే – అంటే – ‘నీలా? నీ గురించి నువ్వే తెలుసుకోవాలె’. తండ్రి, భర్త – వీళ్లేనా? తనకేమయ్యింది బుద్ధి? తను నిలబడాలి – మొదట తనకోసం తను కొట్లాడాలె…
ఈ చివరి ఆలోచనకు నీల నరనరం పులకరించింది.
సత్యనారాయణ మత్తుగా కండ్లు విప్పిండు. అందర్ని చూసి ఉచ్చ బోసుకున్నడు. పరుగెత్తబోయి పడిపోయాడు. ఇందాకటోడు పిడి గుద్దులు గుద్దాడు. తాగింది మొత్తం దిగిపోయింది.
”జెర ఫెయిల భయముంచుకో – నిన్ను ఏదొరలు కాపాడలేరు.” మధునయ్య సత్యనారాయణ జబ్బపట్టి లేపి అన్నాడు. సత్యనారాయణ గజగజలాడిపోయాడు.
“సూడు సెల్లే ఇక నుంచి నువ్వు ఊళ్లే అందర్ల మనిషివి – ఈడు ఏ కతలు సేసినా ఊరందరికి తెలుస్తది – అప్పుడు సూసుకో.”
తిట్లు, దీవెనలు అయిపోయినయ్. ఎటువాళ్లటు పోయారు. మధునయ్య కూడా వెళ్లిపోయాడు.
గాలి తగ్గింది. వర్షం తగ్గి ఆకాశం తేటతెల్లమయ్యింది. ఆకాశం నిండా చుక్కలు….
నడిఝాము రాత్రి – చీకటి నిండిన రాత్రి – చిల్లం కల్లం అయిన ఇల్లు – తాగుబోతు, తిరుగుబోతు భర్త – నీల పందిరి కింద ఖిన్నురాలై కూర్చున్నది.
నెత్తురు చెరువులో నుండి మబ్బుల్లోకి మెరుపుతునకలా ఎవరో పైకి లేస్తున్నారు. ఆ ఆకారం నీలకు తెలియడం లేదు. ఆ ఆకారానికి కాళ్లు, తల, ముక్కు, చెవులు లేవు. మెరుపు తీగలాగున్నది.
“నన్ను చెడ్డ నిగ చూడకు నీలా! నన్ను నీ కట్టంలో మతికుంచుకో! నన్ను మతికుంచుకోవడమంటే – మేం దేనికోసం కొట్లాడుతున్నామో దాన్ని తెలజేసుకోవటం – కట్టాలను సహించి ఊకోవద్దు – కొట్లాడాలే – నాకు నీమీదగాని, నీ భర్తమీద గాని కోపం లేదు నీలా! నువ్వు ఒంటరి దానివి కాదు నీలా!”
ఆ మెరుపు తన ఒకప్పటి భర్త లక్ష్మింరాజంది కాదు. లక్ష్మింరాజం తనకు భర్త ఎప్పుడు కాదు. మరేమిటి? అతన్ని చంపేశారా? తన భర్తలాగా తనను ఎప్పుడూ హింసించలేదు.
తనలాంటి వాళ్లందరిలో నిరంతరం పారే నెత్తురు, కళ్లకు వెలుతురు. నీల పొడుగ్గా గాలి పీల్చింది.
నీలకు దెబ్బలు, తిట్లు గుర్తుకు రాలేదు. తను బతుకు మీద విసిగి గంటన్నర క్రితం చావుకు సిద్ధపడినది గుర్తుకు రాలేదు.
ఒడిలోని కొడుకును గుండెల కదుముకున్నది నీల.
ఈ రెండు సంవత్సరాల పసిగుడ్డును, తన నెత్తురు పంచుకొని తన కడుపు చించుకొని పుట్టిన తన కొడుకును తన తండ్రిలాంటివానిగా, తన భర్తలాగా తయారు చేయదు.
కన్నీరు తో కథ ముగిసింది.రాజన్నకు అభినందనలు