నీపరిమళంఏ పూలచెట్టిస్తది

కడుపునిండా తిండిని కలగంటూ
ఖాళీ చేతులతో
రోజు మాసిన బట్టలతో
అటూ ఇటూ తిరిగే మనుషులున్నట్టే
సూటు బూటు వేసుకొని అద్దాల్లా మెరిసే
ఐడి కార్డ్ మనుషులు లేకపోలేదు.

విల్లాలు, అపార్ట్ మెంట్లు
ఒక్కోరికి ఒక్కో ఖరీదులో దర్శనమిస్తుంటే
మూడుబాటల కూడలిని
ఇంటిగా బతుకుతున్న కొందరికి
మెట్రో పిల్లర్లు, బ్రిడ్జీలు…

నాకు తెలుసు
కుంటువడ్డ బతుకులకు చెప్పులు తొడిగిన
బుద్ధిజీవివి నీవు…
చెదిరిపోయిన కళలకు రంగులద్దిన
ప్రేమ వాక్యానివి.

నీ ఒంటి పరిమళం
ఏ పూల చెట్టు ఇస్తది ?

హైదరాబాద్ అంటే
పార్టీలు, పబ్బులు
డిస్కోడాన్సులే అనుకుంటారు
చూడాల్సిన ఉస్మానియా యూనివర్సిటీ
అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్
స్టేట్ సెంట్రల్ లైబ్రరీల నిశ్శబ్దాన్ని మర్చిపోతారు.

ఎబిసి, షిఫ్టుల్లా
మూడు కాళ్ళ రిక్షా మొదలు
మీని మోటర్ల వరకు అన్నీ
నీ మీదగానే అయినా!
మెట్రో వేగంతో రూపం మార్చుకున్నావే కానీ
ఆత్మ అట్లనే ఉంది.

యిక్కడ మనుషులే కాదు!
ఆకాశంలో మేఘాలు కూడా…
నిన్నుచూసే నడక నేర్చినాయేమో, లేకపోతే
ట్రాఫిక్ జామయినట్టూ
సాయంత్రపు వేళ ట్యాంక్ బాండ్
చినుకులతో కలిసి
ప్రేమగీతం ఎలా పాడుతుందో చూడూ…

కవి, రచయిత. వికారాబాద్ జిల్లా,  దౌల్తాబాద్ మండలం, దేవర్ ఫసల్ వాద్ గ్రామంలో పుట్టారు. వర్తమాన సాామాజిక సంఘర్షణలు, ప్రజా సమస్యలపై కవిత్వం రాస్తున్నారు.

Leave a Reply