నా తపనలన్నింటినీ పోతపోస్తే నిలబడే హృదయమొక్కటేనా,
నన్ను మనిషిగా నిలబెట్టే ప్రాణం కూడానా?
ఏది నీది కాదు?
అగ్నిలా జ్వలిస్తున్న నాదన్న ప్రతి కదలికలో
అడుగులో
సవాళ్ళ సాగరంలో
యుధ్ధ నావలా కొనసాగుతన్న ఈ దివ్యాచరణలో
పొందిన గాయాల్లో నేర్చుకున్న పాఠాల్లో
నీ ప్రేమకు ప్రతిబింబం కాని చోటేది?
నీ తోడు అదనుగా లేని జాడేది
ఇది అరణ్యమే కావొచ్చు
కురిసే వెన్నెల స్రవించే నెత్తురు ఒక్కటే
ఇక్కడ
అంతం కాని అనంతం అంతా నాలో నిండి
నీ సమక్షంలో నేను పాలపుంతలా పరుచుకున్నపుడు
నీ పాదాలు పడ్డ చోటంతా నక్షత్ర ధూళి నవ్వుతుంది
ఆ అనంతాన్ని ముందుకు నడిపే
శక్తి నీవై
యుధ్ధం ఒక సుదీర్ఘ అవసరంగా
కొనసాగుతున్న ఈ కాలాన
సహచరీ,
ఈ సమస్తపు జ్ఞానపుష్పం
ఎవరు రేపు ముట్టుకుంటారో తెలియదు కానీ
వాళ్ళంతా నవీన మానవతని వారసత్వంగా
పొందుతారు
ఇక్కడే
నిన్నూ నన్ను తీర్చిదిద్దిన ఈ చెట్టు నీడల్లో…
నవీన మానవతని వారసత్వంగా