నీడ

ప్రాణం మీద తీపి
అన్నీ ప్రాణాలొక్కటనుడే చేదు

రోగమొక్కటే ప్రాణాలు తీయదు
మనుషుల రోగగ్రస్త గుణాలే చేస్తాయా పని

మహమ్మారి సునామీలో కొట్టుకుపోతున్నరు మనుషులు
ఐనా, పెట్టుబడులు పోతున్నాయని కోపం

మనిషిని మనిషి తనలో భాగంగా చూడకనే
రాలిపోతున్న మనుషులెంత శాతమో లెక్కకడుతున్నరు

యుద్ధాలు ఉద్దేశపూర్వకంగానే చంపుతాయి మనుషుల్ని
రోగాలకు వేరే ఉద్దేశాలుండవు
ఆపితే ఆగుతయి, చంపితే చస్తయి
మనిషితనమే మందు

పచ్చగ బతికే లోకం భయం కొండచిలువ చుట్టుకుని
స్వచ్ఛంద నిర్బంధం
లెక్కలు కట్టి చేసే దుర్మార్గాల కర్మాగారాలు కొందరు
వాళ్ళకు మనుషుల చావులు లాభ,నష్టాలు

చల్లనిరేయి, చల్లని వెన్నెల, చల్లని సాదాసీదా మొక్కల వంటి బతుకులు
కాలం ఊయలలో యేండ్లుయేండ్లు గడిచి విజేతలుగా ఎదిగిన మనుషులు

పాటలెక్క గొంతు విప్పిన స్వేచ్ఛ
పతాకం లెక్క ఎగిరిన భవిష్యత్తు
వేలయేండ్లు మనిన చరిత్ర
ఇపుడు అవుతున్నదా కాలనాళిక…?

మనిషిలో ఆపదలందు ధైర్యం
మనిషిలో మృత్యువు ముందు బలం
మనిషిలో నిండైన మానవత్వం
కావాలె కద
కొంచెం
నిలబడాలి
చిన్నదీపం వెలిగించాలె
చీకట్లో

మనుషులందరు పోతే
ఒంటరిగా ఎవడు బతుకుతాడని
ఒంటరిగ బతుకుతాననే వాడు
మనిషెట్ల అవుతాడని

ఆలేరు, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా. విశ్రాంత ఉపాధ్యాయుడు, చ‌రిత్ర ప‌రిశోధ‌కుడు. పుస్తకాలు: మట్టి పొత్తిళ్ళు, మూలకం, రెండు దోసిళ్ళ కాలం(కవితా సంకలనాలు), పాడాలని(పాటలు), ఆలేటి కంపణం, ఠాకూర్ రాజారాం సింగ్ (చరిత్ర రచనలు), సాహిత్య వ్యాసాలు, కథలు, నాటికలు.

Leave a Reply