“ప్రయాణం మళ్లీ అసమాప్తమేనా, బహుశా గమ్యం ఏదైనా మీకు భయమే కాబోలు, హడావిడి పడతారెందుకు, వెనక్కి విరిచిన చేతులకు సంకెళ్లు సరే, మరి నా లోపల తిరిగే రంగుల పక్షులకో…
***
ఇది నిర్భంధాల కాలం! ప్రకటించని అత్యైక పరిస్థితి కొనసాగుతున్న చారిత్రక దశ! పైన ఉదహరించిన కవి వాక్కులు 2006 నాటివి! అంటే అప్పటి నుంచీ ఇప్పటిదాకా జరుగుతున్నది ఉచ్ఛ స్థాయికి చేరిన నిర్బంధాల పరిణామాల క్రమం. ఒక మానవీయ సమాజానికి గుర్తు గా, కాలంతో పాటు, ప్రతిదీ సరళీకరించబడాలి! ఈ విలువని అందుకోవడంలో ఇటు ప్రజాస్వామిక వ్యవస్థ, అటు సమాజం విఫలం అయినప్పుడు ప్రజా రాజకీయ తాత్వికతకు ఆధారమైన స్వేఛ్ఛాజీవితాన్ని సాధించుకోవడానికి కొన్ని సమూహాలు ప్రయత్నిస్తాయి. పోరాటం చేస్తాయి. సమూల మార్పుకు అవసరమైన ప్రత్యామ్నాయ రాజకీయ ఆచరణను ప్రకటిస్తాయి. మార్పు అడ్డుకునే శక్తలకూ, మార్పుకోరుకునే శక్తులకూ మధ్య ఘర్షణకు చాలా తీవ్రస్థాయికి చేరిందనడానికి గుర్తు గా పాలకవర్గాలు జనంమ్మీద ముఖ్యంగా ప్రత్యామ్నాయాల కోసం పోరాడే జనం మీద బలప్రయోగాలు ప్రారంభిస్తారు.
కానీ జనం ఆకాంక్షలను తమ విలువల్లో భాగం చేసుకొని తమదైన రాజకీయ పంధా లో నడిచే కవులూ కళాకారులు వివిధ సృజనాత్మకత పద్ధతులతో రాజ్యాన్ని నిలదీయడం కద్దు ! ఈ ధిక్కారం ఖైదును కూడా ఖాతరు చేయని మానసిక స్థితిని పతాక స్థాయికి తీసుకెళుతుంది.
డెబ్బై ఆరు వసంతాల వయసును మీదేసుకున్న స్వతంత్ర భారతంలో ఇంకా స్వేఛ్ఛ కోసం గింజుకుంటూ ఉన్నాం. స్వేఛ్ఛ దాని స్వఛ్ఛమైన రూపంలో ప్రజల సామూహిక ఆకాంక్ష లలో బహిర్గతమౌతూ ఉంటుంది.
ఉన్నవాళ్ళకు అపరిమితంగా ఉంది స్వేఛ్ఛ! భూములు హరించే స్వేఛ్ఛ, దోపిడీ చేసుకునే స్వేఛ్ఛ! ప్రకృతి వనరులను ధ్వంసం చేసే స్వేఛ్ఛ! అరణ్యాలను నరికే స్వేఛ్ఛ! ప్రజాస్వామ్యాన్ని అడుగడుగూ ఖూనీ చేసే స్వేఛ్ఛ. ఈ పరిణామాలపై పలు కళా రూపాల్లో కవులూ కళాకారులు తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు.
మీరు మొత్తం వ్యవస్థని మార్చే గొప్ప లక్ష్యం లో భాగాస్వామిగా ఉండనక్కరలేదు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కుల హననం గురించి మాట్లాడినా చాలు ఖైదు మిమ్మల్ని పవకరించవచ్చు. ఏ అర్ధరాత్రో, అపరాత్రో పోలీసులు మీ ఇంటి తలుపుతట్టి మిమ్మల్ని ఏ కారణం చూపకుండా లాక్కెళ్ళిపోవచ్చు. ‘నేరస్థుడు కూడా పౌరుడే,అతనికీ హక్కులున్నాయి’ అనే మౌలిక ప్రజాస్వామిక సూత్రం బుట్టదాఖలై చాలా రోజులైంది. ప్రజాస్వామ్యం ఆధారంగా గెలిచి దాన్నే గేలి చేస్తున్న ప్రభుత్వాల ముందు ప్రాథమిక హక్కుల గురించి ఏకరువు పెట్టడం ఏం ఫలితాలనిస్తుంది?
సరే, నిర్భంధం గురించి,ఖైదు గురించి అది హరించే స్వేఛ్ఛ గురించి చాలా బలమైన కవిత్వం చదివి ఉంటాం. శిక్షల విషయంలో అమానవీయతని గురించి లెక్కకు మించి కవిత్వం వచ్చి ఉంటుంది కానీ ఇందులో విప్లవ రాజకీయ నాయకుల నుంచి వచ్చిన కవిత్వం గురించి చెప్పుకోవడం చాలా ప్రత్యేకమైంది, రూపసారాల్లో చాలా భిన్నత్వాన్ని ప్రదర్శించిన ఇలాంటి కవిత్వం తెలుగు లో కూడా వచ్చింది. అయితే చాలా తక్కువ మంది ఈ కవిత్వం గురించి పట్టించుకున్నారు. ఇందులో వివి ది ప్రముఖంగా వినిపించే పేరు కానీ, పి. మోహన్ పేరు అంతగా వినిపించదు.
పి. మోహన్ “కిటికీపిట్ట” పేరుతో గొప్ప కవిత్వం తెచ్చాడు, 2006 లో! అప్పటి నుండి ఇప్పటి దాకా ఇంత వైవిధ్య భరితమైన ఖైదు కవిత్వం ఎవరూ రాయలేదు. ఖైదు ను మానవజాతి తనకు తాను సృష్టించుకున్న నరకం. రాజకీయ ఖైదీల విషయంలో అది ఇంకా ప్రస్ఫుటంగా కనిపించే వాస్తవం! అయితే చాలా మంది రాజకీయ ఖైదీలు తోటి ఖైదీల గురించి పట్టించుకోవడమే కాదు వారిలో గొప్ప పరివర్తనకు కారణమైన ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఖైదులో ఖైదీలకు ఉన్న హక్కుల మీద చెరశాలలో ఉద్యమాలు లేవదీయడం రాజకీయ విప్లవ ఖైదీలకు పరిపాటి.
పి.మోహన్ కవిత్వం కూడా మానవత్వాన్నీ, బలమైన స్వేఛ్ఛాకాంక్షనీ వెలిబుచ్చడమే కాకుండా, దీనీకీ కారణమైన జైలులో లోపల ఉన్న పోలీసులను శత్రువులుగా చూడకుండా, వాళ్ళ కరకు ప్రవర్తన వైయుక్తికం కాదనీ, వ్యవస్థీకృతమైనదనీ చెప్పడం ఈ కవిత్వం లో కనిపించే గొప్ప లక్షణం.
నిజానికి మోహన్ చాలా భయంకరమైన జైలు జీవితం గడిపాడు. కర్కశమైన పోలీస్ హింస ని అనుభవించాడు. ఆ చీకటి లోంచి, ఆ భయంకర అనుభవం లోంచి వచ్చిన ఈ కవిత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే!
ఈ అనుభవం ఇచ్చిన షాక్ నుంచి మోహన్ ఇంకా తేరుకున్నట్టు లేదు. అతడు ఈ కవిత్వం దగ్గరే ఆగిపోయి అటు కవిత్వం రాయడం ఆపివేశాడు. ఇటు విప్లవాచరణని చాలించివేశాడు. నిజానికి ఈ కవి కవిత్వం రాయడానికి అవసరమైన జీవితకాల ఉద్వేగాన్నంతా ఈ కిటికీ పిట్ట కోసం వెచ్చించాడా అనిపిస్తుంది.
ఈ ఖైదు ఒక రకంగా ఓ కవిని చంపేసింది. అతడిని విప్లవ ఉద్వేగాల నుంచి దూరం చేసింది. ఇది బలప్రయోగం ద్వారానే జరిగింది. ఈ బలప్రయోగం ఎంత నరకాన్ని సృష్టిస్తుందో ఇందులో చాలా కవితల్లో మనకు కనబడుతుంది. నిజాలు రాబట్టడానికి పోలీసులు వాడే అన్ని పద్ధతులను ఇతని పై ప్రయోగించారు. చాలా సున్నిత మనస్కుడైన ఒక కవి నిజానికి ఒక సామాజిక “ప్రొడక్ట్”! ఉన్నత సమాజాన్ని కాంక్షిస్తూ, దోపిడీ పీడనలు లేని సమాజం కోసం పోరాటం చేసే ప్రజారాశుల సాహిత్యావసరాలను తీర్చే మేధోరంగంలో పనిచేసే వ్యక్తులు అరుదుగానే ఉంటారు. కవి కథకుడు అయిన మోహన్ బాగా సాహిత్యాభినివేశం ఉన్న వాడు. అనువాదకుడు. ప్రపంచం చిత్రకళ మీద మంచి అవగాహన ఉన్నవాడు. చిత్రకారుడు కూడా! ఇంత వర్సటైల్ వ్యక్తులకు ఈ రాజ్యం ఇచ్చిన గౌరవం ఖైదు.
ఇతడు ఖైదు ముగిసాక బయటి సమాజంతో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నాడు. అనువాదాలు మాత్రమే చేసుకుంటూ ఉన్నాడు. చిత్రకళ మీద ప్రేమ ఉన్నవాడు కాబట్టి ఆ రవివర్మ చిత్రకళా జీవితంమ్మీద ఒక నవల రాశాడు. తను వీటన్నింటికీ మించి గొప్ప కవి. కిటికీ పిట్ట ఒక అరుదైన కవిత్వ సంపుటి. ఖైదు లోపల అతడు అనుభవించిన క్రూరమైన హింసకు వ్యతిరేకంగా రాసిన కవిత్వం నిస్సందేహంగా ఉన్నతమైన స్థాయికి చెందింది. ఈ కవిత్వంలో వైయుక్తిక అనుభవానికి సంబంధించిందే అయినా మొత్తంగా ఈ కవిత్వాన్ని అసమసమాజ దాష్టికాలకి వ్యతిరేకంగా చేసిన ఆగ్రహ ప్రకటన!
ఈ క్రింది వాక్యాలు పైన చెప్పిన వాటికి సాక్ష్యంగా ఇస్తున్న
“హింస పాలబడిన పురాశరీరాన్ని
నిలువెత్తుగోడల మధ్య పడదోసి కూడా
తలుపుల భద్రత కోసమో
తలుపుల్లో దాగిన బతుకు భద్రత కోసమో
తాళం పైన తాళమేసుకునే
సంశయాత్మల వికిచిత్సకు
విరగబడి నవ్వుతూన్న”