నిరసన

పుస్తకాల్ని విసిరేశారు పిల్లలు
పాఠాలు చెప్పే పంతుళ్లు లేరని!
బట్టలన్నీ విప్పేసారు ఆడోళ్లు
రక్షకులే రాక్షసులుగా ఎగబడ్డారని!
పండించిన ధాన్యాన్ని పారబోశారు
శ్రమకి గిట్టుబాటు లేదన్న రైతులు!

మున్సిపాలిటీలో మురుగుతున్న చెత్త
చెత్తబతుకులు శుభ్రంచేసుకుందామని!
కలెక్టరాఫీస్ ముందు విసిరిన కళేబరాలు
గోనీతికెదురుగా బలిపశువుల ప్రదర్శన!
హాస్టల్లో అంటరానోడి ఆత్మహత్య
క్యాంపస్లో కులంపునాదిని కుదిపేద్దామని!
కన్న కొడుకుని చంపుకున్న కూలితండ్రి
కాల్చుకుతింటున్న భూస్వామ్మీద కోపంతో!

టీ కప్పులో తుపుక్కుమన్న ఉమ్ము
బానిస బాల్యం బరువు దించుకుందామని!
మొఖం మీదే పుసుక్కున నవ్వేసిన ఆమె
మోహుడి అహానికి అడ్డంగా నుంచుందామని!

చరిత్రంటే యుద్ధగాయాలే కాదులే
మనిషంటే బానిస గానాలు కాదులే
చీకటి చరిత్రకి సవాలైన చిరు నిరసనలెన్నోలే
మనిషి చిలికి చిలికి గాలివానలైన రోజులున్నాయిలే!

పెను తుఫానికి వంగిన గడ్డిమొక్క
నిలదొక్కుని మళ్ళీ నుంచుంటుందిలే!
బలిసినోడి ముందు అదిమిపట్టుకున్న
గొంతు అదునుచూసుకుని కూస్తుందిలే!

నిశ్శబ్దం బద్ధలైన శబ్దం
పై అంతస్తు కుప్పకూలిన క్షణం
అధికారం రద్దయిన యజమాని
కాలుకాలిన పిల్లయిన బడా బజార్
ఆదమరచిన స్వామికి నిద్రాభంగం
చిన్ని చిన్ని అక్షరాలే మహావాక్యాలై
నడుచుకొస్తున్న నిప్పుల కొలిమై!

ప్రత్యామ్నాయ సాహితీ, సాంస్కృతిక ఉద్యమాలపట్ల ఆసక్తి. తత్వశాస్త్ర అధ్యాపకుడు. "దళిత ఉద్యమం, వెలుగునీడలు" (వ్యాససంపుటి), "పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ అంబేద్కర్," థీయరిటికల్ అండర్ స్టాండింగ్ ఆఫ్ దళిత్ మూవుమెంట్" రచయిత. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తుంటాడు.

Leave a Reply