ఆకాశానికి పూచిన నెలవంకలు
నేల జార్చిన వెండి పోగులకు చేసిన
దువాలు
నన్ను అల్లుకున్న సమాజానికి
నిత్యం పంచే ఓ స్వాప్నికను నేను
నాలుగు గోడలమధ్య
ఉదయించిన
అమావాస్య గోళాలు దాటుకుని
ఇప్పుడిప్పుడే కదా
నిండు పూర్ణిమల మిలమిలలు
మదిలో లిఖించుకుంటున్నాను
నలుపును పరిచిన పరదాలు జరుపుకుని
అవిభాజ్య ఆచ్ఛాదనతోనైనా
వెలుతురు ప్రపంచంలో అడుగిడి
ఇప్పుడిప్పుడే కదా
కళ్ళు నులుముకుంటున్నాను
సమూహంలోని ఆనుభవిక
ఒంటరితనపు వెతలకు భాష అద్దుతూ
ఇప్పుడే కదా
సమూహాన్నవుతున్నాను
ఇప్పుడిప్పుడే కదా
సామూహిక గొంతుకనవుతున్నాను
నింగిని కమ్మిన మబ్బులు
భూమిని చేరే గమ్యం నా మెదడు నిక్షిప్తించాలి
ఆ పక్కనే
అర్థచంద్రుడిలా విరుచుకు పడిన
హరివిల్లును అందుకునే
ప్రయాస నా చేతులకివ్వాలి
భగభగల భానుడి ప్రతాపాలనూ అలసిసొలసేలా వీక్షించాలి
అంతేనా
సమస్త భూమండలానికి నా అక్షర
నగిషీలు దిద్దాలి
ఇంకా అమావాస్యల్లోనే చిక్కిన నా అక్కాచెల్లెళ్ళకు
పిల్ల కాలువ ప్రవాహంలో తనను తాను
చూసుకుని మురుస్తున్న చందమామను చూపాలి
చిన్నవే
కలలు
చాలా ఎక్కువసార్లు
మాకు తీరనివి
నేను విద్యార్థినిని
చదువుతాను రాస్తాను
హిజాబ్
ధరిస్తాను – ధరించను
నిర్ణయం నాదే
రాజకీయ మైదానంలో
మీరు బరిలో దిగిన ప్రతిసారీ
నేనెందుకు బంతిని కావాలి
ఓటు బ్యాంకుగా
ఉగ్రవాదిగా
కరుడు కట్టిన నేరస్తునిగా
బిడ్డలు పోగొట్టుకున్న తల్లిగా
ఆవారాగా
అనుమానితగా
అవమానితగా
నేనే ఎందుకు ప్రతీకను అవ్వాలి?
గాయం కొత్త కాదు
దాడి కొత్త కాదు
ద్వేషం కొత్త కాదు
హక్కుల హననమూ కొత్త కాదు
సమ్మెట పోట్ల ప్రకాశం నాది
రాటు దేలిన విశ్వాసం నాది
ప్రేమ నా కులం
మానవత్వం నా మతం
భిన్నత్వంలో ఏకత్వ చెట్టుకు
పూచిన కుసుమం నేను
భారతీయత నా అస్తిత్వం
శాంతం నా చిరునామా
సహనం నా మారుపేరు
- 24. 02. 2022